జిల్లెళ్ళమూడిలో ఒకాయన నాకీ కధను చెప్పాడు.
'అమ్మ బ్రతికున్న పాతరోజులలో, అంటే, దాదాపు 1950 ప్రాంతాలలో ఈ సంఘటన జరిగింది.
వరంగల్ దగ్గర ఒక ఊర్లో ఒక ముసలాయన ఉండేవాడు. అతను చాలా పెద్ద జ్యోతిష్కుడు. అతనికి ఒక మనవడు పుట్టాడు. ఆ మనవడిని చూచి ఈ ముసలాయన ఏడుస్తూ ఉండేవాడు. ఎందుకంటే, ఆ పిల్లవాడి జాతకంలో అల్పాయుశ్షు యోగం ఉందని ఆ ముసలాయనకి అర్ధమైంది. అంటే, ఆ పిల్లవాడు చిన్నతనంలోనే చనిపోతాడు.
ముసలాయన పెద్ద జ్యోతిష్కుడే గాని, విధిని మార్చే శక్తి ఆయనకి లేదు. ఊరకే జరగబోయేది చెప్పగలడు అంతే' అన్నాడు నాకీ కధను చెబుతున్నాయన.
వింటున్న నాకు యధావిధిగా నవ్వొచ్చింది.
అలాంటి వాడికి జ్యోతిష్యం ఎందుకు? ఏడవడానికా? చాలామంది జ్యోతిష్కులు ఇలాగే మిడిమిడి జ్ఞానంతో ఉంటారు. జ్యోతిష్కునికి ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతూ 'గ్రహయజన పటుశ్చ' అనే ఒక లక్షణాన్ని చెబుతాడు వరాహమిహిరుడు. అంటే, 'గ్రహములను శాంతింపజేసే ప్రక్రియలు తెలిసినవాడై ఉండాలి' అంటాడు. గ్రహములను శాంతింపజెయ్యడం అంటే, జపాలు హోమాలు చెయ్యడం కాదు. డైరెక్ట్ గా కర్మను మార్చడమే. ఇది చెయ్యలేనివాడు 'జ్యోతిష్కుడు' అనే పేరుకు తగడు. ప్రామాణిక గ్రంధాలలో ప్రాచీనులు ఇచ్చిన ఇటువంటి నిర్వచనాలతో నేటి జ్యోతిష్కులలో ఎవ్వరూ సరిపోరు. అందుకే 'నేను జ్యోతిష్కుడిని' అని చెప్పుకునే అర్హత నేటికాలంలో ఎవరికీ లేదని నా అభిప్రాయం.
నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉండగా, ఆయన కధను కంటిన్యూ చేశాడు.
'ముసలాయన ఇలా ఏడుస్తూ ఉండగా, ఒక కోయవాడు అతనికి కనిపించి అతని జాతకం చూసి 'నువ్వు ఒక మహా పుణ్యక్షేత్రంలో పోతావు. అప్పుడు నీ మనవడు బ్రతుకుతాడు. నువ్వొక పని చెయ్యి. బాపట్ల దగ్గర జిల్లెళ్ళమూడి అని ఒక ఊరుంది. అక్కడ ఒక అమ్మగారున్నారు. ఆమె తలుచుకుంటే నీ మనవడికి ఆయుస్సు పొయ్యగలదు. వెళ్లి ఆమె కాళ్ళమీద పడు' అని చెప్పాడు.
నాకు చచ్చే నవ్వొచ్చింది మళ్ళీ.
'అంత కొమ్ములు తిరిగిన ముసలి జ్యోతిష్కుడు, ఒక కోయవాడికి తన జాతకం అసలెందుకు చూపించుకున్నాడు? తన మీద తనకే డౌటా?' అన్న అనుమానం వచ్చింది నాకు.
ఇలాంటి అనుమానాలకు ఎవరిదగ్గరా సమాధానాలు ఉండవు గనుక మౌనంగా కధను వింటున్నాను.
'ఈ మీదట ఆ ముసలాయన రైళ్ళూ బస్సులూ మారి రెండోరోజుకి జిల్లెళ్ళమూడి వచ్చి చేరుకున్నాడు. అమ్మకు తన కధంతా చెప్పాడు. అంతా మౌనంగా విన్న అమ్మ, గంధం లేపనం చేసి ఆ పిల్లవాడిని తన ఒళ్లో పడుకోబెట్టుకుని తన చేతులతో ఆ గంధాన్ని పిల్లవాడి ఒళ్లంతా పూసింది. అంతేకాదు, అప్పట్లో అర్ధరాత్రీ అపరాత్రీ అనకుండా ఎవరొచ్చినా అమ్మే స్వయంగా వంట చేసి పెట్టేది. అదే విధంగా ఆ ముసలాయనకు ఆయన వెంట వచ్చిన మూడేళ్ళ మనవడికి కూడా వడ్డించింది.'
'ముసలాయన తృప్తిగా భోజనం చేశాడు. చివరి ముద్ద తింటూ 'అమ్మా! నేను పోయె చోటు మహా పుణ్యక్షేత్రం అయి ఉంటుందని నా జాతకం చెబుతున్నది. ఇప్పుడు నీ పాదాల వైపు చూస్తుంటే, ఆక్కడ నాకు మంచుకొండలు కన్పిస్తున్నాయి. శివుడూ పార్వతీ కన్పిస్తున్నారు. అదుగో కైలాసం ! నేను పోతున్నాను. నా మనవడిది నీదే బాధ్యత' అంటూ అమ్మ పాదాల మీద ఒరిగిపోయి అక్కడే చనిపోయాడు. ఈ దృశ్యం చూచిన నాన్నగారు మహా కంగారు పడిపోయారు.
'ఎవరో ముక్కూ ముఖం తెలియని ముసలాయన వచ్చి భోజనం చేస్తూ చేస్తూ ఒరిగిపోయి నట్టింట్లో చనిపోయాడు. పక్కనే ఒక మూడేళ్ళ పిల్లవాడు. ఎక్కడనుంచి వచ్చారో, వాళ్ళ ఊరేమిటో తెలియదు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఏమీ లేవు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నాన్నగారు దిక్కుతోచక అమ్మ వైపు చూచారు.అమ్మ యధాప్రకారం చిరునవ్వుతో అదంతా చూస్తూ ఉంది.
అప్పుడా మూడేళ్ళ పిల్లాడు వాళ్ళ అడ్రసు, ఫోన్ నంబరు మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అదొక విచిత్రం ! మూడేళ్ళ పిల్లవాడు అవన్నీ చెప్పడం ఎలా సాధ్యం? ఆ అబ్బాయి చెప్పిన ప్రకారం బాపట్ల నుంచి ఫోన్ చేయిస్తే, అబ్బాయి తండ్రి వరంగల్ దగ్గర పల్లెటూరి నుంచి ఆఘమేఘాల మీద మర్నాటికి జిల్లెల్లమూడి వచ్చాడు. ఆయన వచ్చేదాకా ఆ శవం అమ్మా వాళ్ళింట్లోనే ఉంది. మూడోరోజున ముసలాయన అంత్యక్రియలు జిల్లెళ్ళమూడిలోనే జరిగాయి. ఈ విధంగా ఆ పిల్లాడికి అమ్మ ఆయుస్సు పోసింది. అతని అల్పాయుస్సు గండం గడిచింది. అతను నిక్షేపంగా ఆ తర్వాత చాలా ఏళ్ళు బ్రతికాడు.
ఇలాంటి సంఘటనలు అమ్మ జీవితంలో కోకొల్లలుగా జరిగాయి' అంటూ ఒకాయన నాకీ కధను చెప్పాడు.
అంటే, సాంప్రదాయబద్ధంగా జ్యోతిష్యం నేర్చుకున్నవాడి కంటే, కోయజ్యోతిష్కుడు ఘనుడన్న మాట అనిపించింది నాకు. లేదా, ముసలాయన జ్యోతిష్యాన్ని సరిగా నేర్చుకుని ఉండడు. ముసలితనం వచ్చినంత మాత్రాన అన్నీ రావు. చాలాసార్లు నీరసం తప్ప ఇంకేమీ రాదు ముసలివారికి.
మనిషి జీవితంలో చేసిన అనేక తప్పులను, చీకటి దాచిపెడుతుంది. అలాగే, తెల్లవెంట్రుకలు కూడా దాచిపెట్టగలవు. జుట్టు తెల్లబడి, గడ్డం పెంచి, పంచె కడితే చాలా తప్పులు వాటి చాటున కొట్టుకుపోతాయి. ఇవి జ్ఞానానికి సూచికలు కావు. నిజమైన జ్ఞానం వీటిలో ఉండదు. కానీ లోకం వీటిని చూచి మోసపోతూ ఉంటుంది. లోకమంతా వేషం చుట్టూనే కదా తిరుగుతోంది ! అలాగే, వయసు కూడా జ్ఞానానికి సూచిక కాదు.
ఈ సంఘటనలో, అమ్మ హోమాలు చెయ్యలేదు. జపాలు చెయ్యమని చెప్పలేదు. రెమెడీలూ సూచించలేదు. డైరెక్ట్ గా ఆ పిల్లవాడి దోషాన్ని తన చేతితో తీసేసింది. డైరెక్ట్ గా వాడి కర్మను మార్చేసింది. జాతకాన్ని మార్చడం అంటే అది ! నిజమైన మహనీయులు సంకల్పమాత్రంతో జాతకాన్ని మార్చగలరు. లేదా అమ్మ చేసినట్లు చిన్న చిన్న పనులతో చెయ్యగలరు. అది ఎలా చెయ్యాలి ఎందుకలా చెయ్యాలనేది వాళ్ళ ఇష్టం. ఆ లోతుపాతులు మనకర్ధం కావు. వాటి వెనుక మనకర్ధం కాని కర్మసూత్రాలుంటాయి.
ఏదేమైనా, మనుషులందరూ అమ్మను ఈతిబాధల కోసం మాత్రమే బాగా వాడుకున్నారని నాకర్ధమైంది. కానీ, అమ్మ చెప్పిన తత్వాన్ని మాత్రం ఎవరూ పట్టుకున్నట్లు నాకనిపించలేదు.
అలాంటి వారిని ఒక్కరినైనా నా జన్మలో చూస్తాననీ, చూడగలననీ నాకంటూ నమ్మకమైతే కలగడం లేదు మరి !