“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

18, జులై 2019, గురువారం

కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం)

మళ్ళీ ఒక వారం పాటు కలబురిగిలో నివాసం ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతిరోజూ మా అమ్మాయినడిగి తన స్కూటర్ తీసుకుని, బుద్ధవిహార్ దర్శనం, అక్కడి ధ్యానమందిరంలో కూచుని ధ్యానం చెయ్యడం, లైబ్రరీలో కూచుని బౌద్ధగ్రంధాల అధ్యయనం చెయ్యడం యధావిధిగా జరిగింది. ఇవి తప్ప ఆ ఊరిలో ఇంకేమీ నేను చూడలేదు.

ఊరికి ఏడు కి.మీ దూరంలో విశాలమైన పొలాల మధ్యన నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న కొండగుట్ట పైన ఉన్న బుద్ధవిహార్ చాలా పెద్ద పాలరాతి కట్టడం. చెట్లూ తోటలతో విశాలంగా ఉంటుంది. దానిలో ఒక మూలన ఉంటుంది ఈ లైబ్రరీ భవనం. ఇవన్నీ కట్టడానికి, మెయిన్ రోడ్డు నుంచి రెండు కి.మీ పొడవున పొలాలలోకి పక్కా సిమెంట్ రోడ్డు వెయ్యడానికి, ఎన్ని వందల కోట్లు ఖర్చయ్యాయో నాకైతే తెలీదు.

ఈ లైబ్రరీ చాలా పెద్ద భవనం. ఒక్కొక్క బీరువాలో కొన్నివందల పుస్తకాలు అక్కడ ఉన్నాయి. వాటిల్లో పాళీ మూలగ్రంధాలే గాక, నవీన కాలపు యూరోపియన్ అమెరికన్ స్కాలర్లు వ్రాసినవీ, టిబెటన్ లామాలు వ్రాసినవీ చాలామంచి ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. మన ఫేవరేట్ టాపిక్ అయిన తాంత్రికబౌద్ధం మీద మంచి పుస్తకాలు చాలా కన్పించాయి అక్కడ.

నేనక్కడికి వెళ్ళిన రోజున సాయంత్రం నాలుగైంది. మబ్బులు పట్టి వర్షం పడుతోంది. అంత పెద్ద ప్రాంగణంలో లైబ్రరీ ఎక్కడో అర్ధం కాలేదు. లైబ్రరీకోసం వెతుక్కుంటూ వెళ్లి, "ఈ బిల్డింగ్ లో లైబ్రరీ ఎక్కడా?" అని, ఒక్కడినే తిరుగుతుంటే, ఒక మూలనున్న గదిలోనుంచి శవాకారంతో ఉన్న ఒక స్త్రీమూర్తి బయటకు వచ్చి నన్ను అనుమానంగా చూచింది. ఆమె చంకలో ఒక రెండేళ్ళ పిల్లాడు ఈసురోమంటూ కూచుని చూస్తున్నాడు. మాల్ నూట్రిషన్ కు ప్రతిబింబాలుగా ఉన్నారు వాళ్ళిద్దరూ.

'లైబ్రరీ ఎల్లి ఇద్ది?' అడిగా కన్నడంలో.

'అల్లి. ఆ మూలదల్లి' అందా అమ్మాయి. అంటూ ఆ మూలడోర్ వైపు దారి తీసింది. అనుసరించా.

ఆ తలుపు తీసి విశాలమైన కారిడార్ లాగా ఉన్న ఒక పెద్ద హాల్లోకి అడుగు పెట్టింది ఆమె. ఆ హాలంతా లైట్లు లేకుండా చీకటిగా ఉంది. గోడలకు ఆనించి పెద్ద పెద్ద బీరువాలూ, వాటిల్లో వందలాది గ్రంధాలూ కనిపిస్తున్నాయి. ఆమె, ఆమెకు తోడుగా పిల్లాడు, నేను తప్ప అంత పెద్ద చీకటి హాల్లో ఎవరూ లేరు. అసలు, ఊరికి దాదాపు ఏడు కి.మీ.దూరంలో ఆ కొండమీద ఉన్న ఆ లైబ్రరీకి నాలాంటి పిచ్చోడు తప్ప ఇంకెవరూ రానట్లు నాకనిపించింది.

ఆమెకు తోడుగా కనీసం ఒక పిల్లాడున్నాడు. నాకు తోడు ఎవరూ లేరు.

మాట్లాడకుండా నిలబడి ఉన్న నన్ను చూస్తూ, రిజిస్టర్ ను ముందుకు తోసింది ఆమె. తన టేబుల్ దగ్గర ఉన్న లైటు వెలిగేటట్లు ఏదో స్విచ్ వేసింది. అంత పెద్ద చీకటి హాల్లో ఒక లైట్ మాత్రమే వెలిగి, అక్కడి భయానక వాతావరణాన్ని ఇంకా ఎక్కువ చేసింది. ఆ బుక్కులో నా పేరు వ్రాస్తూ పేజీలు  తిప్పి చూచాను. పన్నెండేళ్ళు అయింది ఆ లైబ్రరీ కట్టి. కనీసం రోజుకు ఒక్కడు కూడా వచ్చి ఆ పుస్తకాల ముఖం చూడటం లేదు. నా పేరు, వివరాలు అందులో వ్రాసి, బీరువాల వైపు నడిచాను. వాటిల్లో నుంచి నాక్కావలసిన పుస్తకాలు ఎంచుకుని ఆమెకు దూరంగా ఉన్న ఒక టేబిల్ దగ్గర కూచుని చదవడం సాగించాను.

పుస్తకం తెరిచానో లేదో కరెంట్ పోయింది. అంత పెద్ద భవనంలో ఆ చీకటి హాల్లో నేనూ ఆ దయ్యం లాంటి ఆమె, ఆమె దయ్యం పిల్లాడు, బయటేమో వర్షం, చదవబోతున్నది తంత్రం గురించి. "మంచి స్కేరీగా ఉందిరా బాబూ సెట్టింగ్" అనిపించింది. ఒక కిటికీ తెరిచి, దాని దగ్గరకు కుర్చీ లాక్కుని కూచుని ఆ గుడ్డి వెలుతురులోనే చదవడం మొదలుపెట్టాను.

మధ్యలో తలెత్తి దూరంగా తన టేబుల్ దగ్గర కూచున్న ఆమె వైపు చూచాను. ఆ చీకట్లో, పిల్లాడితో కూచుని వింతగా నావైపు చూస్తోంది ఆమె. "ఈ చీకట్లో ఈ వర్షంలో వీడెవడ్రా బాబూ, వచ్చి కూచుని ఈ పుస్తకాలు గుడ్డి వెలుతురులో చదువుతున్నాడు?' అన్నట్లుగా.

అదేమీ పట్టించుకోకుండా నా అధ్యయనం సాగించాను. రెండు గంటల తర్వాత ఇంకా చదువుతూ ఉంటే, ఏదో అలికిడి అయినట్లు అయితే, తల తిప్పి చూచాను. ఎప్పుడొచ్చిందో ఆమె సైలెంట్ గా వచ్చి నా వెనుకే నిలబడి ఉంది. అదేదో పాత తెలుగు సినిమాలో దయ్యం సీను గుర్తొచ్చింది.

'టైం ఆయిత్తు. హోగబేకు' అంది అదే దయ్యం గొంతుతో, భావరహితంగా ఉన్న ముఖంతో చూస్తూ.

'సరే' అంటూ లేచి, పుస్తకాలు యధావిధిగా బీరువాలో ఉంచి, రిజిస్టర్ లో డిటైల్స్ వ్రాసి బయటకు వచ్చి చూస్తే, వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలోనే తడుస్తూ ఆ చిన్న కొండ క్రిందకు దిగి నా స్కూటర్ దగ్గరకు వచ్చాను. వర్షం ఇంకా ఆగలేదు. అక్కడ కొంచం సేపు వేచి చూచి, వర్షం తగ్గాక, చదివిన విషయాలు నెమరు వేసుకుంటూ, ఇంటికి బయల్దేరాను.

ఇంటికొచ్చాక అనుమానం వచ్చింది. అసలా లైబ్రరీ ఉందా? లేక నా భ్రమా? ఆమె మనిషేనా? లేక దయ్యమా? ఏమీ అర్ధం కాలేదు. "రేపు మళ్ళీ వెళ్లి చూడాలి. అవన్నీ అక్కడే ఉంటే, నిజమని అర్ధం లేకపోతే ఆమె ఖచ్చితంగా దయ్యమే" అనుకున్నాను.

"నా పిచ్చిగానీ, బుద్దిస్ట్ టెంపుల్ లో దయ్యం ఎందుకుంటుంది?" అని మళ్ళీ అనుమానం వచ్చింది. అంతలోనే - "ఎందుకు కాకూడదు. అది బుద్ధిష్ట్ దయ్యం కావచ్చుగా" అని వచ్చిన నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.

"రేపు చూద్దాంలే" అనుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.

(ఇంకా ఉంది)