దిశ దారుణహత్య మిగిల్చిన గాయాల గురించి, మన సమాజపు డొల్లతనం గురించి కొంత మాట్లాడుకుందాం.
1. పబ్లిక్ మతిమరుపు
ఏడేళ్ళ క్రితం నిర్భయ హత్య డిల్లీలో జరిగింది. జనమంతా గోలగోల చేశారు. సోషల్ మీడియా వెల్లువైంది. కేండిల్ ప్రదర్శనలూ, టీవీల్లో అరుచుకోవదాలూ, రోడ్లేక్కి నినాదాలు ఇవ్వడాలూ, మేధావుల మేసేజిలూ, మౌన నివాళులూ, 'చెల్లీ మమ్మల్ని క్షమించు, మళ్ళీ ఇది జరగనివ్వం' అన్న ప్రతిజ్నలూ అన్నీ జరిగాయి. కానీ ఏడేళ్ళ తర్వాత మళ్ళీ అదే జరిగింది. అయితే ఈ సారి డిల్లీ కాదు, హైదరాబాదులో జరిగింది. ఈ మధ్యలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. కొన్ని బయటకొచ్చాయి. కొన్ని రాలేదు. డబ్బూ పలుకుబడీ ఉన్నవాళ్ళు కొన్నింటిని బయటకు రానివ్వలేదు. అంతే తేడా !
మరి మనం ఏం నేర్చుకున్నట్లు? ఎవరో అన్నట్లు - 'పబ్లిక్ మెమరీ చాలా చిన్నది. ఈ రోజు జరిగినది రేపటికి గుర్తుండదు' అన్న విషయం నిజమేనేమో? మనకు ప్రతిదీ న్యూసే. దిశ ఇంకో రెండు రోజులకు పాతబడి పోతుంది. మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ మనకు కావాలి, సోషల్ మీడియాలో మళ్ళీ కాసేపు అల్లరి చెయ్యడానికి. అంతేగాని ఒక నిర్మాణాత్మక ఆచరణ మనలో లేదు. ఇదే మన సమాజపు ప్రధానమైన లోపం.
నిర్భయ సంఘటన నుంచి నేర్చుకోవాల్సినంత పూర్తి స్థాయిలో మనం పాఠం నేర్చుకోలేదనేది సారాంశం ! పాలకులు మాటలు చెప్పినంత ధాటిగా చేతలు చెయ్యడం లేదనేది వాస్తవం. పౌరులు ఇష్టానుసారం తయారయ్యారనేది ఇంకొక వాస్తవం !
నిర్భయ సంఘటన నుంచి నేర్చుకోవాల్సినంత పూర్తి స్థాయిలో మనం పాఠం నేర్చుకోలేదనేది సారాంశం ! పాలకులు మాటలు చెప్పినంత ధాటిగా చేతలు చెయ్యడం లేదనేది వాస్తవం. పౌరులు ఇష్టానుసారం తయారయ్యారనేది ఇంకొక వాస్తవం !
2. న్యాయశాస్త్రం నిజంగా సత్వరన్యాయాన్ని అందిస్తోందా?
నిర్భయ కేసు జరిగి ఏడేళ్ళు అయింది. కానీ నిందితులకు ఇప్పటికీ ఉరి పడలేదు. ఎందుకని? తాబేలు కంటే నిదానంగా నడిచే మన న్యాయ వ్యవస్థ కొంతవరకు కారణం కాదా? నేను 30 ఏళ్ళ క్రితం 'లా' చేశాను. న్యాయశాస్త్రం చదివేటప్పుడే అందులో చాలా విషయాలు నాకు నచ్చలేదు. అందులో ఇది ఒకటి. తీవ్రమైన నేరాలలో మన లీగల్ ప్రాసెస్ నత్తనడక నడుస్తుంది. క్రింది కొర్టు నుంచి సుప్రీం కొర్టు వరకు కేసు వెళ్లేసరికి ఆ నేరస్తులలో చాలామంది చనిపోతారు. కేసు నీరుగారిపోతుంది. ఈ లోపల పబ్లిక్ దానిని మర్చిపోతారు. మళ్ళీనేమో - 'న్యాయాన్ని ఆలస్యం చేస్తే, అన్యాయం చేసినట్లే' అనే సామెతలు మాత్రం బాగా చెబుతారు.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా, ఎప్పుడో బ్రిటిషు వాడు ఏర్పాటు చేసి పోయిన చట్టాలను మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎందుకని మార్చుకోలేక పోతున్నాం? ఇలాంటి కేసుల్లో ఒక వారం రోజులలోపు ఎందుకని శిక్షలు అమలు చెయ్యలేకపోతున్నాం? ఇలా తాత్సారం చేస్తూ కేసులను నీరుగారుస్తూ ఉంటె, మనకు నిజంగా సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఉన్నట్లా లేనట్లా? మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు? వారి చిత్తశుద్ధిని శంకించాలా వద్దా? మళ్ళీ న్యాయవ్యవస్థలో ఎందఱో కొమ్ములు తిరిగిన మేధావులు ? దానికొక మంత్రిత్వ శాఖ ? ఏంటో ఇదంతా !
స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా, ఎప్పుడో బ్రిటిషు వాడు ఏర్పాటు చేసి పోయిన చట్టాలను మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎందుకని మార్చుకోలేక పోతున్నాం? ఇలాంటి కేసుల్లో ఒక వారం రోజులలోపు ఎందుకని శిక్షలు అమలు చెయ్యలేకపోతున్నాం? ఇలా తాత్సారం చేస్తూ కేసులను నీరుగారుస్తూ ఉంటె, మనకు నిజంగా సమస్యలు పరిష్కారం చెయ్యాలని ఉన్నట్లా లేనట్లా? మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్లు? వారి చిత్తశుద్ధిని శంకించాలా వద్దా? మళ్ళీ న్యాయవ్యవస్థలో ఎందఱో కొమ్ములు తిరిగిన మేధావులు ? దానికొక మంత్రిత్వ శాఖ ? ఏంటో ఇదంతా !
3. న్యాయాన్ని ప్రభావితం చేస్తున్న ఇతర అంశాలు.
మన దేశంలో ఆర్టికల్ 14 అందరినీ సమానంగా చూడమని అంటోందని అంటారు గాని, మళ్ళీ దానికి తొంభై ఆరు వెసులుబాట్లున్నాయి. ప్రతిదానికీ ఒక రిలాక్సేషన్, ప్రతి క్లాజుకీ పది సబ్ క్లాజులున్నాయి. కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి, పలుకుబడిని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క న్యాయం మన దేశంలో అమలవుతూ ఉంటుంది. న్యాయం ఇచ్చే అంతిమతీర్పులో ఈ అంశాలు ఉండకపోవచ్చు గాని, న్యాయవ్యవస్థలోని అనేకమంది ఈ అంశాలద్వారా ప్రభావితులై పోతూ, అంతిమ తీర్పును ఇన్ డైరెక్ట్ గా ప్రభావితం గావిస్తారు. న్యాయమూర్తులలో కూడా పార్టీలకు, కులాలకు, వర్గాలకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిపరులు ఉన్నారంటే మన న్యాయవ్యవస్థ ఏ తీరులో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రజల వైపునుంచి సరైన వత్తిడీ లేదు. పాలకులలో నిజాయితీ లేదు. పోలీసులేమో ప్రజల్ని భయపెట్టేలా తయారయ్యారు. ఇలాంటి వ్యవస్థలో న్యాయం ఎలా జరుగుతుంది?
4. పసలేని ఉద్యమాలు
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన జనమంతా రోడ్లేక్కి రెండ్రోజుల పాటు గోలగోల చేస్తారు. ఆ తర్వాత అందరూ దానిని మర్చిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ ధోరణి చాలా ఎక్కువ. అక్కడన్నీ మొక్కుబడిగా చేస్తున్నట్లు కనిపిస్తుంది గాని ఒక ఉద్యమంలో ఉండవలసిన ఆవేశం, ఆ ఆవేశాన్ని చివరివరకూ కొనసాగించడాలు కనిపించవు. కాని, తెలంగాణాలో పరిస్థితి అలా ఉండదు. ఇది ఉద్యమాల గడ్డ గనుక, ఇక్కడి ప్రజలలో కమిట్ మెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇష్యూ పట్టుకుంటే దాని అంతు తెల్చందే నిద్రపోరు. తెలంగాణలో నాకు నచ్చిన అనేక అంశాలలో ఇది ఒక ప్రధానమైన అంశం. దిశ ఇష్యూ లో కూడా, ఆంధ్రాలో చేసిన కేండిల్ లైట్ ప్రదర్శనలన్నీ విద్యార్ధుల చేత కాలేజీ వాళ్ళు చేయించిన మొక్కుబడి ప్రదర్శనల లాగా ఉన్నాయి. చాలామంది విద్యార్ధినీ విద్యార్ధులు కెమేరాకు పోజిచ్చినట్లో, మొక్కుబడిగా చేస్తున్నట్లో, కొందరైతే ముసిముసిగా నవ్వుకుంటూ కనిపించారు. కానీ శంషాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర హైదరాబాద్ పౌరులు చేసిన అలజడి చాలా భిన్నంగా ఆవేశపూరితంగా ఉంది. ఉద్యమం అంటే అలా ఉండాలిగాని, ఎవరి కాలేజీలో వాళ్ళు కేండిల్ ప్రదర్శనలు, ఆడిటోరియం లోపల తలుపులేసుకుని చెప్పుకునే ఉపన్యాసాల వల్ల ఉపయోగం శూన్యం. ఒక ఉద్యమం వల్ల ఆ ఇష్యూ పరిష్కారం కావాలి గాని, కంటితుడుపు చర్యలవల్ల ఏమాత్రమూ ఉపయోగం ఉండదు. కానీ మన సొసైటీ కంటితుడుపు చర్యలకే బాగా అలవాటు పడింది గాని నిర్మాణాత్మక విధానాలకు కాదు.
5. మద్యం అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? వేరే మార్గాలు లేవా?
మద్యం అనేది సమాజంలో నేరాలకు మూలకారణం అనే విషయం పోలీసులకు తెలుసు. న్యాయమూర్తులకూ తెలుసు. మేధావులకూ తెలుసు. రాజకీయ నాయకులకూ తెలుసు. కానీ ఎవరూ మద్యనిషేధం దిశగా కృషి చెయ్యరు. కంటితుడుపు వాగ్దానాలు చేస్తారు గాని అమలు చెయ్యరు. పేదల కిస్తున్న రాయితీలన్నీ మళ్ళీ మద్యంషాపుల ద్వారా ప్రభుత్వానికే చేరుతాయన్నది వాస్తవం. ఈ రాక్షసిని ప్రభుత్వాలే పోషిస్తూ ఉంటె నేరాలు ఎలా అదుపులోకి వస్తాయి?
దిశ హంతకులందరూ త్రాగి ఉన్నారని, ఆమె చేత కూడా బలవంతంగా త్రాగించారనీ వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు దీనికేం సమాధానం చెబుతాయి? ఎక్కడ చూచినా వైన్ షాపులు, లిక్కర్ షాపులు తామరతంపరగా కనిపిస్తున్నాయి. మంచినీళ్ళ బాటిల్ దొరకడం లేదు గాని సారాయి మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతోంది? పైగా, హైవే మీద సారాయి ధారాళంగా దొరుకుతుంది. చాలామంది లారీ డ్రైవర్లు త్రాగి లారీలు నడుపుతారనేది చేదువాస్తవం. రాత్రిళ్ళు ఒకచోట లారీ ఆపవలసి వస్తే, ఆ దగ్గరలో సారాయి కొట్లూ, పాడుకొంపలూ ఉండే చోటనే వాళ్ళు లారీలు ఆపి కొన్ని గంటలు ఉంటారనేది అందరికీ తెలిసిన నిజం. అన్నీ తెలిసి కూడా పోలీసులూ ఇతర అధికారులూ చోద్యం చూస్తూ ఉంటారు. ఎవరి మామూళ్ళు వారికి అందుతూ ఉంటాయి. ఈ విషయాలు అందరికీ తెలుసు. అన్నీ తెలిసి మరి ఇవేమి ప్రభుత్వాలు? వీళ్ళేమి ప్రజాప్రతినిధులు? ఎందుకని మద్యాన్ని నిషేధించకూడదు? ఎందుకని పోలీసు వ్యవస్థలో మామూళ్ళు లేకుండా చెయ్యకూడదు? సమాజ శ్రేయస్సు కంటే మద్యం ఎక్కువా? మామూళ్ళు ఎక్కువా?
(ఇంకా ఉంది)