నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, డిసెంబర్ 2019, శనివారం

ఈ న్యాయం మిగతా వారికి వద్దా??

దిశ విషయంలో న్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు. బాగానే ఉంది. కానీ, ఇక్కడ కూడా మానవ హక్కుల కమిషన్ వారు, మహిళా సంఘాలు, నిందితుల తల్లిదండ్రులు 'ఇది అన్యాయం' అంటూ గోల చేస్తున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు లేదని పోలీసువారితో వారి వాదన !

ఈ ఉదంతం అంతా ఇంకొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

1. ఇది న్యాయమైతే, ఇదే న్యాయం మిగతా చోట్ల జరగవద్దా?

దిశ ఉదంతం జరిగినప్పుడే ఇలాంటివి ఇంకొన్ని జరిగాయి. అంతకు చాలాముందే, నిర్భయ ఉదంతమూ, ఉన్నావ్ ఉదంతమూ జరిగాయి. ఊరూపేరూ లేనివి ఇంకా చాలా జరిగాయి. అక్కడి బాధిత అమ్మాయిల తల్లిదండ్రులు -'మాకూ ఇదే న్యాయం కావాలి' అని నినదిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగింది నిజంగా న్యాయం అయితే, మరి మిగతావాళ్ళకు కూడా ఇదే న్యాయం అమలు చెయ్యాలి కదా ! అన్నిచోట్లా దీనిని అమలు చెయ్యలేని పరిస్థితి ఉంటె, ఈ కేసులో జరిగినది మాత్రమే న్యాయం ఎలా అవుతుంది?

వేరే కేసుల్లోని పోలీసు అధికారులు వేరేగా ఆలోచించారని అంటున్నారు. ఉదాహరణకు నిర్భయ హత్య కేసును విచారించిన పోలీసు అధికారి 'మేము ఎన్కౌంటర్ దిశగా ఆలోచించలేదు. లీగల్ గా ముందుకు వెళ్లాం' అని అన్నారు. నిజానికి ఎన్కౌంటర్ అనేది ముందుగా ప్లాన్ చేసి చేసేది కాదు. లీగల్ గా చూస్తె, అలా చేసే హక్కు పోలీసులకు లేదు. నిందితులు ఎదురు తిరిగి ఎటాక్ చేశారు గనుక సెల్ఫ్ డిఫెన్స్ కోసం వారిని షూట్ చేయవలసి వచ్చింది అనే వారు చెబుతారు. దానికి తగినట్లే అక్కడి పరిస్థితులు కూడా కనిపిస్తాయి.

నిజానికి, పోలీసు అధికారుల చేతిలో ఏమీ లేదు. అంతా రాజకీయ నిర్ణయమే. నాయకులు ఏది చెబితే అది పోలీసులు చెయ్యవలసి వస్తుంది. కనుక అంతా ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటుంది అనేది వాస్తవం. నిర్భయ కేసులో అక్కడి ముఖ్యమంత్రి అలా డిసైడ్ చేశారు గనుక అలా జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఇలా నిర్ణయించారు గనుక ఇలా జరిగింది. అలాంటప్పుడు, న్యాయం అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుందా? ఉండవచ్చా? న్యాయం చట్టం అనేవి అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉండవా? ఒకే దేశం ఒకే చట్టం అనేది ఇదేనా? అనేది ఒక ప్రశ్న.

2. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం కరెక్టేనా?

ఈ ఎన్కౌంటర్ పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అందరూ 'శెభాష్ పోలీస్' అంటున్నారు. కానీ కొందరు మాత్రం, 'ఇలా చెయ్యకూడదు. లీగల్ గా వెళ్ళడమే కరెక్ట్' అంటున్నారు. వారిది కూడా కరెక్ట్ వాదనే. న్యాయశాస్త్రం ప్రకారం వారు కరెక్టే. కానీ, న్యాయశాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళితే, ఎన్నేల్లకూ న్యాయం జరగని పరిస్థితి దేశంలో ఉంది. మరి అలాంటప్పుడు న్యాయం జరిగినా జరగకపోయినా ఆ మార్గంలోనే వెళ్ళాలి అనడం ఎంతవరకూ కరెక్ట్? అనేదానికి జవాబు లేదు. 'చట్టం న్యాయాన్ని చెయ్యనపుడు మనమే చెయ్యాలి. కోర్టులలో న్యాయం జరగడం లేదు గనుక కొర్టు బయట మేము న్యాయాన్ని అమలు చేస్తాం' అనే వాదనకూడా మానవత్వ పరంగా చూస్తె కరెక్టే. కానీ, లీగల్ గా కరెక్ట్ కాదు. మళ్ళీ, అధికారులు ఆ పని చేస్తే, ఒప్పు. అదే, ప్రజలు ఆ పనిని చేస్తే, అది తప్పు. అప్పుడు వాళ్ళను నక్సలైట్లంటారు. చట్టం మీద ప్రజలకు విశ్వాసం పోయె పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతవరకూ వచ్చేదాకా న్యాయవ్యవస్థ ఏం చేస్తోంది?

ఆటవిక సమాజాలలో ఉండే న్యాయం అమలు చేసే పరిస్థితి ఒక ప్రజాస్వామ్య దేశంలో రావలసిన దుస్థితి ఏమిటి?

3. మీడియా పాత్ర

దిశ ఉదంతం హైదరాబాద్ లో జరిగింది గనుక, మీడియా కవరేజి బాగా వచ్చింది గనుక, దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది గనుక, ఈ విషయం ఇలా ముగిసింది. మరి, ఇలాంటివే మరికొన్ని సంఘటనలు, చాలాచోట్ల జరిగాయి. అవి పల్లెల్లో, చిన్న టౌన్స్ లో జరిగాయి. వాటికి ఇంత మీడియా కవరేజి రాలేదు. నేరాలుగా చూస్తె, అన్నీ ఒకటే. మరి వాటికి ఇంత కవరేజి ఎందుకు లేదు? ఇంత రియాక్షన్ ఎందుకు రాలేదు? ఇలాంటి ముగింపు ఎందుకు రాలేదు?

అంటే, దేశవ్యాప్తంగా గోల జరిగితేగాని న్యాయం జరగదా మన దేశంలో? అలా జరిగేది న్యాయం ఎలా అవుతుంది? దేశ వ్యాప్తంగా గోల జరిగినా కూడా నిర్భయ, ఉన్నావ్ ఘటనలలో ఎందుకు ఈనాటికీ న్యాయం జరగడం లేదు? నేరస్తులకున్న రాజకీయ అండదండలే కారణమా?

4. రాజకీయ అండదండలు

ఉన్నావ్ ఘటనలో బాధితురాలు చనిపోయింది. ఆమెను వెంటాడి వెంటాడి పెట్రోల్ పోసి సజీవదహనం చేసి మరీ చంపారు. ఆమె బ్రతికుంటే ప్రమాదం గనుక అలా చంపేశారు. ఆమె ప్రత్యర్ధులు, నేరం చేసినవాళ్ళు, రాజకీయంగా బలవంతులు గనుక చివరకు బాదితురాలినే లేకుండా చేశారు.

దిశ కేసులో కూడా, ఆ నలుగురు ఏ రాజకీయ అండా లేనివాళ్ళు గనుక ఎన్కౌంటర్ పాలబడ్డారు. వాళ్ళకే అండదండలు ఉంటె, ఏమయ్యేది? దిశ బ్రతికుంటే, వాళ్లకు గుర్తుపట్టి, వాళ్ళమీద పోరాటం చేసుంటే ఏమయ్యేది? ఉన్నావ్ ఘటన మళ్ళీ ఇక్కడ కూడా జరిగేది కాదా? అంటే, రాజకీయ పలుకుబడి ఒక్కటే ఈ దేశంలో సర్వస్వమా? అదుంటే, ఏమైనా చెయ్యవచ్చా? ఇక్కడ జరిగింది నిజంగా న్యాయమేనా? లేక, రాజకీయ సమీకరణాల ఫలితమా? ఆయేషా బేగం కేసు ఇంతవరకూ ఎందుకు తేలడం లేదు? మన దేశంలో నిజంగా న్యాయం ఉందా? లేక భ్రమిస్తున్నామా?

బాధితులకు ఒక చెక్కు, ఒక ఉద్యోగం ఇస్తే సరిపోతుందా? ఇది ఆటవిక న్యాయం కాదా? మన న్యాయవ్యవస్థా, రాజకీయవ్యవస్థా ఎటు పోతున్నాయి అసలు?

ఇన్ని గందరగోళాల మధ్యన ఏది సత్యం ఏదసత్యం అనే విచికిత్స ఎప్పటికీ తేలడం లేదు మన దేశంలో.

It happens only in India అంటే ఇదేనేమో?