నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, జనవరి 2020, మంగళవారం

ప్రయత్నం

పక్క జీవిని తింటూ
తను హాయిగా బ్రతకాలని
ప్రతి జీవీ ప్రయత్నం

నక్కజిత్తులు వేస్తూ
నాటకాలాడటం
సగటుజీవి ప్రయత్నం

పోతానని తెలిసినా
పోకుండా ఉండాలని
ప్రతి ప్రాణీ ప్రయత్నం

మోతబరువు మోస్తున్నా
మోజు తీరకపోవడం
సంసారి ప్రయత్నం

వద్దనుకునేదానిలోనే
వయసంతా బ్రతకడం
సన్యాసి ప్రయత్నం

తప్పని తెలిసినా
తప్పించుకోలేక తారట్లాడటం
మనిషి ప్రయత్నం

ఎప్పటినుంచో కోరుకున్నది
ఎదురుగా ఉన్నా అందుకోలేని
అసమర్ధుని ప్రయత్నం

చెయ్యలేనని తెలిసినా
చేద్దామనుకోవడం
ఆశాజీవి ప్రయత్నం

అరగదని తెలిసినా
ఆబగా తినబోవడం
అతితెలివి ప్రయత్నం

తను చెయ్యలేనిది
ఇతరులకు చెప్పబోవడం
బోధకుని ప్రయత్నం

సాధ్యం కాదని తెలిసినా
సాధించాలని చూడటం
సాధకుని ప్రయత్నం

లేవలేరని తెలిసినా
నిద్ర లేపబోవడం
గురువు ప్రయత్నం

నిండైన మనిషికోసం
నిత్యం చేస్తున్న
ప్రకృతి ప్రయత్నం

గుండెల్లో తనకు
గుడికట్టేవాడి కోసం
దైవం ప్రయత్నం