“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

10, ఫిబ్రవరి 2020, సోమవారం

సంగీతయోగం - 2 (కామయాగము జేసె కలికి...)

T.P.చక్రపాణి గారు ఆలపించిన అన్నమయ్య శృంగారకీర్తన ఇది. దీనిని స్వరపరచినది కూడా చక్రపాణి గారే. రాగం:--కనకాంగి (మొదటి మేళకర్త రాగం). ఈ విషయం కూడా ఆయనే చెప్పారు.
--------------------------------------
పల్లవి
కామయాగము జేసె కలికి తన
ప్రేమమే దేవతా ప్రీతిగాను

చరణం - 1
పొలుపలర సురత తాంబూల రసపానంబు
నళినాక్షి సోమపానంబు గాను
కలకలంబుల మంచి గళరవంబుల మోత
తలకొన్న వేదమంత్రములు గాను

చరణం - 2
పడతి తన విరహతాపమున బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్ని గాను
ఒడబడిక సమరతుల నుదయించిన చెమట
దడియుటే యవబృధంబు గాను

చరణం - 3
దనర కుచముల రుచులు దంతాక్షత క్రీడ
నునుపైన పశుబంధనంబు గాను
యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబు గాను

కామయాగము జేసె కలికి తన
ప్రేమమే దేవతా ప్రీతిగాను
-------------------------------------------
ఒక యాగంలో ఇవన్నీ విధిగా ఉంటాయి - సోమపానము, వేదమంత్రములు, హోమాగ్ని, అవబృధస్నానము, పశుబంధనము, దివ్యభోగము (పూర్ణాహుతి). ఆయా యాగాలను బట్టి ఇంకా కొన్ని ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

రతిక్రీడను ఒక యాగంతో పోల్చి 'కామయాగం' అంటూ అన్నమాచార్యులు తన సహజశైలిలో ఈ కృతిని రచించారు. స్థూలదృష్టికి ఇది ఇద్దరు స్త్రీపురుషుల మధ్యన జరిగే రతిక్రీడగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికకోణంలో అయితే జీవబ్రహ్మైక్య సంయోగంగా భాసిస్తుంది.

అన్నమాచార్యులు 500 సంవత్సరాల క్రిందటివారు. ఆయన కాలానికి తంత్రం బాగా ప్రచారంలో ఉన్నది. అది వైష్ణవంలోనూ ప్రవేశించింది. అసలే వారికి, వైరాగ్యం అంటే పడదు. ఎందుకంటే అది శైవుల సొత్తు. వైష్ణవులకు రాగమూ, సరాగమూ, శరణాగతీ, భక్తీ, ప్రేమా, వైభోగములే పరమావధులు. కనుకనే ఇవన్నీ ఈ కీర్తనలో పొంగిపొర్లుతూ మనకు కనిపిస్తాయి.

రతిలోనూ ఆధ్యాత్మికం ఉంటుంది. ఆధ్యాత్మికం కూడా ఒక విధమైన రతియే. అందుకే రతికి మరో పేరు సంయోగం అయింది. అంటే, సరియైన యోగం అన్నమాట. యోగమంటేనే కలయిక అని అర్ధం. ఇక సంయోగం అంటే చక్కని, పరిపూర్ణమైన కలయిక అని అర్ధం. అది రెండు శరీరాలు కలిస్తే జరగదు. రెండు మనసులు కలిస్తే, రెండు ఆత్మలు కలిస్తేనే అది జరుగుతుంది. లోకంలో ఎక్కడచూచినా శరీరాలే కలుస్తాయి గాని మనసులు ఆత్మలు ఎక్కడో తప్ప కలవవు. అందుకే లోకులకు బూతే తెలుస్తుంది గాని, శృంగారం తెలీదు. శృంగారయోగం అసలే అర్ధం కాదు.

ఇంతకు ముందే చెప్పినట్లు, అన్నమాచార్యుల వారి కృతులు దాదాపు 15.000 ప్రస్తుతం మనకు లభిస్తుండగా, వాటిల్లో ఆధ్యాత్మికాలు 4,000 అనుకుంటే, తక్కినవన్నీ శృంగారకీర్తనలే. కాలగర్భంలో కలసిపోయిన మిగతా 20,000 కృతులను తలచుకుంటే మన దౌర్భాగ్యానికి మనకే సిగ్గు కలుగుతుంది. మన సాంస్కృతికసంపద అంటే మనకసలు విలువ తెలుసా అని ప్రశ్నించుకుంటే, 'తెలీదు' అనే జవాబు వస్తుంది.

ఇంతకు మునుపు చక్రపాణిగారు చెప్పినట్లుగా - మనకన్నీ సోకాల్డ్ ఆధ్యాత్మిక కీర్తనలే ప్రచారంలో ఉన్నాయి. ఎందుకంటే, శృంగారకీర్తనల అర్ధాలు తెలుసుకుంటే, మర్యాదస్తులు వాటిని చీదరించుకునే ప్రమాదం 'ఘట్టిగా' ఉంది మరి ! మళ్ళీ అదే మర్యాదస్తులు దొంగతనంగా వీటిని చదువుతారు. చలంగారి పుస్తకాలు దిండు క్రింద ఉంచుకుని అమ్మలక్కలు చదివినట్లు ! అది వేరే సంగతి అనుకోండి !

లోతుగా చూస్తే, మనిషి జీవితం మొత్తం బూతుమయమే. 'అబ్బే. అది లేదులే' అని మనల్ని మనం మోసగించుకుంటూ హిపోక్రిటిక్ బ్రతుకులు బ్రతకడమే మనం చేసేపని. బూతెక్కడ లేదు? వెంకటేశ్వర సుప్రభాతంలో లేదా? వెంకటేశ్వర గద్యంలో లేదా? జయదేవుని అష్టపదులలో లేదా?  లలితా సహస్రనామాలలో లేదా? పురాణాలలో లేదా? అన్ని మతాల గ్రంధాలలోనూ బూతుంది. అన్ని చోట్లా ఉంది. కానీ అప్పటికాలం వారికి అది బూతు కాదు.

నన్నడిగితే ప్రపంచంలో ఒకే ఒక్క బూతుమాట ఉంది అంటాను. అదేంటంటే 'బూతు' అన్న పదమే ! అదే పెద్ద బూతుమాట. దాన్ని మించిన బూతుమాట ఇంకేమీ లేదు. అసలు బూతు అన్నమాటే పెద్ద ట్రాష్ ! సరిగ్గా చూస్తె బూతు అనేది ఎక్కడా లేనేలేదు.

శృంగారభావన వేరు, బూతు వేరు. మొదటిదానిలో సౌకుమార్యమూ, లాలిత్యమూ, సౌందర్యమూ ఉంటే, రెండోదానిలో మోటుదనమూ, చౌకబారుతనమూ, నేలబాటు పోకడా, అసహ్యమైన ధోరణీ ఉంటాయి. సృష్టిలో శృంగారం ఉంది. బూతు మన మనసులో ఉంది. అంతే తేడా !

శృంగారం లేనిదే సృష్టి లేదని అందరికీ తెలిసిన విషయమే ! దానిని అసహ్యించుకోవడమే అతిపెద్ద తప్పు. ఏ అసహ్యమూ లేకుండా దానిని accept చెయ్యడమూ, దానివల్ల కలిగే guilt ను అధిగమించడమే తంత్రసాదనలో మొదటిమెట్టు.

ఈ ఉపోద్ఘాతంతో, ఈ కృతి అర్ధాన్ని చదువుకుందాం. అసహ్యించుకోకండి మరి ! ఇది వ్రాసినది పదకవితా పితామహుడైన అన్నమాచార్యులవారనీ, అత్యున్నతమైన వేదాంతాన్ని నింపుకున్న ఆధ్యాత్మికకీర్తనలు దాదాపు 5000 (ప్రస్తుతం దొరుకుతున్నవి ఇన్నే, గతించిపోయినవి ఇంకెన్నో) వ్రాసినది కూడా ఈయనేననీ బాగా గుర్తుంచుకుని మరీ చదవండి !

పల్లవిలో అన్నమాచార్యులు ఇలా అన్నారు.
|| కామయాగము జేసె కలికి తన - ప్రేమమే దేవతా ప్రీతిగాను ||

రతిక్రీడను ఒక యాగంగా భావించి చేసింది ప్రియురాలు. ఇక్కడ కలికి అంటే, లక్ష్మీదేవి అని అర్ధం. వెంకటేశ్వరునితో తన సంభోగాన్ని ఒక యాగంగా ఆమె భావించింది. తంత్రసాదనలో కూడా ఇదే Concept ఉంటుంది. తంత్రం ప్రకారం సంభోగం తప్పుకాదు, చీదరించుకోవలసిన ఒక చెడ్డపని కాదు. అతి ఒక సాధనామార్గం. పరమేశ్వరీ పరమేశ్వరుల సంభోగం నుంచే ఈ సమస్తసృష్టీ ఉద్భవించింది. ఇదే క్రీడ మన స్థాయిలో కూడా జరుగుతుంది. దానిని సక్రమమైన దృష్టితో చూచే విధానం, దానిని ఒక సాధనగా మలచుకునే విధానం మనకు తెలియాలి. అప్పుడదే యాగమౌతుంది, యోగమౌతుంది, తంత్రమౌతుంది, అతీతసిద్ధిని అలవోకగా కలిగిస్తుంది. అయితే అది పావుగంటలో అరగంటలో అయిపోయే అసహ్యమైన తంతు కాదు. తాంత్రికసంభోగాన్ని ప్రయత్నించిన ప్రేమికులు శివరాత్రి జాగారం చెయ్యడం తప్పనిసరి అవుతుంది. వారు శుద్ధవైష్ణవులైనా సరే !

తన ప్రేమనే దేవతాప్రీతి కొరకు సమర్పించింది కలికి - అంటారు ఆచార్యులు. ప్రేమలేని సంభోగం శవసంభోగసమమే. సంభోగానికి పునాది ప్రేమ. అది లేని సంభోగం ఒక జుగుప్సాకరమైన మొక్కుబడి. సంభోగాన్ని ప్రేమతో కలిపి ఒక దివ్యసాధనగా చెయ్యగలిగితే అది ఆనందపు అవధులు చూపిస్తుంది. సమాధిలో ఏ ఆనందం మనకు ప్రాప్తిస్తుందో తాంత్రికసంభోగంలో కూడా అదే దక్కుతుంది. అందుకే తాంత్రికసంభోగాన్ని ఒక్కసారి రుచి చూచిన ఏ జంట కూడా మామూలు సంభోగం వైపు ఇకపైన కన్నెత్తి చూడను కూడా చూడరు.

తాంత్రిక సంభోగక్రియ ముందు చాలా తతంగం ఉంటుంది. దానిని నేటి సెక్సాలజిస్టులు 'ఫోర్ ప్లే' అంటున్నారు. కానీ తాంత్రిక ఫోర్ ప్లే అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది అందరికీ తెలిసిన మొక్కుబడి ప్రక్రియ కాదు. అది రసికాగ్రేసరులకే తెలిసిన ఒక మనోజ్ఞప్రపంచం. అందులో ముందుగా జరిగే అనేక కార్యక్రమాలలో 'తాంబూలసేవనం' అనే ప్రక్రియ కూడా ఒకటి. దానిని, వైదికయాగంలో చేసే సోమపానంతో పోల్చారు ఆచార్యులు. ఈ 'తాంబూలసేవనం' అనే ప్రక్రియలోనే అధరచుంబనం, సుధామధుపానం వంటి ఇతరక్రియలన్నీ అంతర్భాగాలుగా వస్తాయి. ఇది యాగంలో జరిగే సోమపానంతో సమానమట !

దానిని - పొలుపలర సురత తాంబూల రసపానంబు - నళినాక్షి సోమపానంబు గాను - అంటూ వర్ణించారు ఆచార్యులవారు.

'సురత తాంబూల రసపానంబు' అంటే రతి సమయంలో చేసే తాంబూలరస సేవనమన్నమాట. పొలుపు, అలర అంటూ రెండుపదాలు ప్రయోగించారు ఇక్కడ. పొలుపు అంటే సొంపు, తీరు, కుదురు అని తెలుగు నిఘంటువు చెబుతోంది.

అంటే, తీరుగా, కుదురుగా, చక్కగా తాంబూలాన్ని సేవించడం అని అర్ధం. అందులో జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు. కర్పూరం, ఏలకులు, కలగలిసి ఉంటాయి గనుక నోటికి సుగంధాన్నివ్వడమే గాక కామోద్దీపనాన్ని కలిగిస్తాయి ఈ దినుసులన్నీ.

యోగ తంత్రసాంప్రదాయంలో - కాకిముద్ర పట్టి చేసే శీతలీ ప్రాణాయామ క్రియలో నోటిలో స్రవించే లాలాజలాన్ని మ్రింగడం అని తాంబూల సేవనానికి గల మార్మికార్ధం.

ఈ తాంబూల సేవనాన్ని నేను వివరించబోవడం లేదు. కామశాస్త్రం ప్రకారం, ఇది అనేకరకాలుగా ఉంటుంది. దీనిలో అనేక పద్ధతులు సులువులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ వ్రాశానంటే 'మర్యాదస్తులు' అసహ్యించుకునే ప్రమాదం ఉంది.

'తాంబూలసేవనం' అనే పదానికి గల తాన్త్రికార్ధాన్ని తెలుసుకోవాలనుకునేవారు నా పుస్తకం 'శ్రీ లలితా సహస్రనామ రహస్యార్ధ ప్రదీపిక' లో, "తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా" అన్న నామానికి నేను వ్రాసిన వివరణ చదవండి.

కలకలంబుల మంచి గళరవంబుల మోత
తలకొన్న వేదమంత్రములు గాను

అని మొదటి చరణాన్ని పూరిస్తారు అన్నమాచార్యులవారు.

అంటే, ప్రియుడు పెట్టే చక్కిలిగింతలకు, నాడీస్థానాలను తాకుతూ చేసే ప్రేరేపణలకు కిలకిలా నవ్వడం, కూజితం (కోకిల వలె 'కూ' అంటూ కూయడం) మొదలైన రకరకాలైన శబ్దాలను చెయ్యడం ఇవన్నీ వేదమంత్రములన్నారు ఆ రసికాగ్రేసర చక్రవర్తి.

తంత్రసాధనాక్రమంలో యోగి దేహం లోలోపల వినిపించే దశవిధనాదాలకు, రతీసమయంలో వెలువడే ఈ కూజితధ్వనులు ప్రతీకలు. ఈ ధ్వనులు చేసే సమయంలో స్త్రీ శరీరంలో కలిగే పులకింతలే, ధ్యానతన్మయత్వంలో అంతరికనాదాలు వినే సమయంలో యోగి దేహంలో కూడా కలుగుతాయి. రెంటికీ చాలా సామ్యం ఉన్నది.

పడతి తన విరహతాపమున బుట్టిన యగ్ని
అడరి దరికొన్న హోమాగ్ని గాను

అంటూ రెండవ పాదాన్ని ప్రారంభించారు ఆచార్యులవారు.

ఓపలేని తాపంతో ప్రియురాలి ఒళ్ళు వేడెక్కడం అనేది హోమగుండంలో అగ్నిని రగల్చడంతో పోల్చబడింది. దేహం ఒక హోమగుండం. దానిలో కామాగ్నినీ రగల్చవచ్చు, హోమాగ్నినీ రగల్చవచ్చు. తాన్త్రికులకు రెండూ ఒకటే అవుతాయి. ముందు కామాగ్నిని రగిలించి దాన్నే హోమాగ్నిగా మారుస్తారు వారు. అంతరికసాధనాక్రమంలో దేహంలో జ్వలించే అత్యంతవేడిమి 'యోగాగ్ని' అనబడుతుంది. సాధనా సమయంలో శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల వరకూ పెరగడం మామూలుగా జరుగుతుంది. దీనినే యోగాగ్ని అంటారు. హోమాగ్ని, యోగాగ్ని, కామాగ్ని, ప్రణయాగ్ని ఇవన్నీ తంత్రసాధనలో సమానార్ధకాలుగా భావించబడతాయి.

ఒడబడిక సమరతుల నుదయించిన చెమట
దడియుటే యవబృధంబు గాను

అవబృధస్నానం అంటే, యాగక్రమంలో దీక్షాసమాప్తి సమయంలో చేసే స్నానం. తంత్రపరంగా చూస్తే, సమరతి వల్ల ఉదయించిన చెమటలో ఇరువురి దేహాలూ తడిసి ముద్దైపోవడం, హోమవిది సమయంలో చేసే అవబృధస్నానంతో పోల్చబడింది. యోగసాధనా సమయంలో కుంభకక్రియ యొక్క ప్రధమావస్థలో విపరీతమైన చెమట పుట్టి ఒళ్ళంతా తడుస్తుంది. ఈ చెమటా, రతి సమయంలో పుట్టే చెమటా, హోమస్నాన సమయంలో ఒళ్లంతా తడవడమూ మూడూ ఒక్కటిగానే కనిపించాయి ఆచార్యులవారి రసికాగ్రేసర దృష్టికి.

ఇక్కడ, 'సమరతి' అనే ఒక పదాన్ని ఉపయోగించారాయన. దీనిలో ఎంతో లోతైన సెక్సాలజీ దాగి ఉంది. సమరతి అంటే - ఇద్దరికీ ఒకేసారి క్లైమాక్స్ కలగడం. ప్రపంచంలోని కోట్లాది జంటలలో ఈ 'సమరతి' అనేది అతి కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. అదేంటో నేను మీకు వివరించాలంటే ఇప్పుడు హేవలాక్ ఎల్లిస్ నీ, మాస్టర్స్ అండ్ జాన్సంస్ నీ మీకు వివరించాలి. అదంతా నేను వ్రాయనక్కరలేదు. ఓపికుంటే నెట్లో వెదుక్కోండి. మీకే అర్ధమౌతుంది. సారాంశం మాత్రం నేను చెబుతాను.

స్త్రీకి మల్టిపుల్ ఆర్గాజమ్స్ కలిగే వరకూ తన స్కలనాన్ని నిగ్రహించుకుంటూ రతిని కొనసాగించే శక్తి పురుషునిలో ఉండాలి. కామశాస్త్రంలో పండిపోయి ఉంటే తప్ప, ఈ శక్తి పురుషులలో ఎవరికీ ఉండదు. అందుకే ఒక స్త్రీని పరిపూర్ణంగా తృప్తిపరచడం అనేది, ఆ కళలో సరియైన ట్రెయినింగ్ తీసుకుని సిద్దంకాకపోతే, ఏ పురుషుని వల్లా జరిగేపని కాదని కామశాస్త్రం అంటుంది. నవీనకాలపు సెక్సాలజీ పరిశోధనలు కూడా దీనినే నిరూపిస్తున్నాయి. స్త్రీలలో 95 శాతం మందికి Orgasm అంటే అసలేంటో తెలీదనీ, అదేంటో తెలీకుండానే స్త్రీలు నలుగురైదుగురు పిల్లల్ని కంటూ ఉంటారనీ, నవీనకాలపు సెక్సాలజిస్ట్ లు అంటున్నారు. దీనికి బాధ్యత వహించవలసింది పురుషులే !

ఇకపోతే, యోగ-తంత్ర సాంప్రదాయంలో చూస్తే, ఇడా పింగళానాడులలో సమంగా ప్రాణసంచారం చేయిస్తూ కుండలినీ జాగృతిని సాధించడమే 'సమరతి' అనే మాటకు కల యోగార్ధం.  

దనర కుచముల రుచులు దంతాక్షత క్రీడ
నునుపైన పశుబంధనంబు గాను

ప్రియురాలి స్తనములను సుతారంగా కొరకడం అనే ప్రక్రియను 'కుచముల రుచులు దంతాక్షతక్రీడ' అనే పదంతో సూచిస్తూ, దానిని యాగసమయంలో చేసే 'నిరూఢ పశుబంధం' అనే ప్రక్రియతో పోల్చారు. అన్ని యాగాలలో ఉండకపోయినా, కొన్నికొన్ని యాగాలలో జంతుబలి ఉంటుంది. ఆ సమయంలో మెల్లిగా దానిని నిమురుతూ బుజ్జగించి యాగస్థలానికి తీసుకొచ్చి ఒక త్రాటితో ఆ పశువును గట్టిగా కట్టివెయ్యడం, ఆ తదుపరి దానిని బలివ్వడం జరుగుతాయి. 'తన పండ్లతో ప్రియురాలిని సుతారంగా కొరకడం' అనే రతిక్రీడా ప్రక్రియతో యాగసమయంలో జరిగే పశుబంధాన్ని పోల్చారు అన్నమాచార్యులవారు. 'నునుపైన' అనే పదప్రయోగంతో మెల్లిగా సుతారంగా నిమరడం, బుజ్జగించడం అనే ప్రక్రియ సూచింపబడింది.

యెనసి శ్రీవేంకటేశ్వరుని పొందు
ఘనమైన దివ్యభోగంబు గాను

వేంకటేశ్వరుడు ఇక్కడ రెండు పాత్రలలో కనిపిస్తాడు. ఒకటి - ప్రియుడు. రెండు - భగవంతుడు. లక్ష్మీదేవికి ఆయన రెండూ అయ్యాడు. అదే ఆమె అదృష్టం. భగవంతుని తన ప్రియునిగా భావించి సేవించడం, ఆరాధించడం, ధ్యానించడం - 'మధురభావం' అనబడుతుంది. ఇది భక్తిమార్గంలో అత్యున్నతమైన స్థాయి. గోపికలకు తప్ప ఇంతవరకూ ఇంకెవ్వరికీ దక్కని స్థాయి ఇది.

అదేవిధంగా, హోమం చివరలో పూర్ణాహుతి జరుగుతుంది. అంటే, హోమసామగ్రి మొత్తాన్నీ హోమాగ్నిలో వెయ్యడం చేస్తారు. అంతరికసాధనలో అయితే, తన సర్వస్వాన్నీ భగవంతునికి అర్పించడం, తన అహంకారాన్ని బలివ్వడం అనే ప్రక్రియే ఇది. దీనిని సర్వార్పణక్రియ అంటారు. దీనినే 'దివ్యభోగం' అని ఆచార్యులవారన్నారు. అది మామూలుగా అందరికీ తెలిసిన భోగం కాదు. దివ్యభోగం. అంటే Divine Bliss అన్నమాట. మామూలు బ్లిస్సే తెలీనివారికి ఇక డివైన్ బ్లిస్ ఎలా తెలుస్తుంది?

వేంకటేశ్వరుని పొందటం అంటే, 'తను విడిగా ఉన్నాను' అన్న భావన నశించి, భగవంతునిలో తాను ఐక్యం అయిపోవడం, 'ఇద్దరు' అన్న ద్వైతభావన పూర్తిగా నశించి 'తానే నేను - నేనే తాను' అన్న అద్వైతసిద్ధి కలగడం దివ్యభోగం అవుతుంది. ఇదే పూర్ణాహుతి. ఇదే అద్వైతసిద్ధి. ఇదే సమాధిస్థితి.

అయితే, దీని ఛాయ మామూలు రతిలో కూడా కనపడుతుంది. ఎప్పుడు? ఇద్దరూ కామశాస్త్రంలో ఆరితేరినవాళ్ళు అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. లేకుంటే ఏదో క్షణికమైన త్రిల్ కలుగుతుంది. అంతే ! అది కూడా స్త్రీకి కలగదు. ప్రకృతి ఆమె దేహాన్ని అలా తయారుచేసింది. ఇదే అందరికీ తెలిసిన సెక్స్. కానీ అసలైన సంభోగం ఇదికాదు. దురదృష్టవశాత్తూ ఈ క్షుద్రమైన క్షణికమైన త్రిల్ కోసమే ప్రపంచమంతా వెంపర్లాడుతూ ఉంటుంది. ఇదే సర్వస్వం అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటుంది.

అసలైనది తెలీకపోతే నకిలీదే ఏదో గొప్పగా అనిపిస్తుంది మరి !

కామశాస్త్రం బాగా తెలిసి చేస్తే, కలిగే Orgasmic bliss నే యాగంలో చివరిలో జరిగే దివ్యభోగం (పూర్ణాహుతి) తో పోల్చారు ఆచార్యులవారు.

ఈ మూడు చరణాలలోనూ ఆయన వర్ణించిన ప్రక్రియ అంతా - మోటు మనుషులకు మోటు సెక్స్ గా అనిపిస్తుంది, రసికాగ్రేసరులకేమో ఆనందపు అంచులు చూపించే మనోజ్ఞమైన శృంగారంగా తోస్తుంది. ఇక ఆధ్యాత్మిక లోకపు అవధులు చూచినవారికి మాత్రం, జీవుడిని దైవంలో లీనం గావించే మహత్తరమైన తాంత్రికసాధనాప్రక్రియ గోచరిస్తుంది.

'యద్భావం తద్భవతి' అన్నట్లు ఎవరెవరి భావనను బట్టి వారికి కనిపించే విషయం ఉంటుంది మరి !

మీకేం కనిపిస్తోందో మీరే నిర్ణయించుకోండి. దానినిబట్టి మీస్థాయి మీకే అర్ధమౌతుంది. ఆచార్యులవారి శృంగారకీర్తనలన్నీ అద్దాల వంటివి. మన ముఖం దరిద్రంగా ఉంటె, అద్దంలో దరిద్రమైన ముఖమే కనిపిస్తుంది. మనం శుభ్రంగా ఉంటె, అద్దంలో శుభ్రమైన ముఖమే కనిపిస్తుంది. తప్పు అద్దానిది కాదు. మన శరీరానిది.

ఈ అద్దంలో మీ ముఖం ఎలా కనిపిస్తోంది?

ఈ కీర్తనను చక్రపాణిగారు పాడుతున్నపుడు నాకు తన్మయత్వంతో అప్రయత్న ధ్యానస్థితి కలిగింది. మరి మీకేం కలుగుతోంది? కామోద్రేకం కలిగితే మీది పశువుస్థాయి, అసహ్యం కలిగితే చెత్తమైండ్ కలిగి ఉన్న సగటుమనిషి స్థాయి, మనోజ్ఞమైన ఫీలింగ్ కలిగితే మీది రసికస్థాయి. ధ్యానతన్మయత్వం కలిగితే మీది దేవతాస్థాయి.

మీదే స్థాయో ఇప్పుడు మీకే తెలుస్తోంది కదూ???