“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 6 (గుడ్ బై ఆరోవిల్ - ప్రస్తుతానికి)

తెల్లవారు ఝామునుంచీ రకరకాల పక్షుల కిలకిలారావాలు వినిపించడం మొదలుపెట్టాయి. మెలకువ వచ్చేసింది. కానీ వెంటనే ధ్యానంలోకి జారిపోయి లేవకుండా అలాగే పడుకొని ఉన్నాను. ఎన్నో ఏళ్ళ సాధనతో నేనీ స్థితిని సాధించాను. దాదాపు రెండుగంటల తర్వాత తెల్లవారింది.

లేచి ఫ్రెష్ అయ్యి, సూట్ కేస్ సర్దేశాను. బయటకొచ్చి చూస్తే, తన రూమ్ లో వజ్రాసనంలో కూచుని శిష్యురాలు ధ్యానంలో కనిపించింది. డిస్టర్బ్ చెయ్యకుండా కాసేపు నా రూంలో వెయిట్ చేశాను. కాసేపటి తర్వాత తను లేచి గుమ్మంలోకి వచ్చి 'టిఫిన్ కి వెళదామా?' అని అడిగింది.

'నాకాకలి కావడం లేదు. నువ్వు చెయ్యి. నేను బయలుదేరుతున్నాను' అన్నాను.

'సరే. నేను ఈరోజు కూడా ఇక్కడే ఉంటాను' అందామె.

'ఓకే. బై' అంటూ నా సూట్ కేస్ తీసుకుని బయటకొచ్చేశాను.

కొంచం దూరం నడచి సోలార్ కిచెన్ సెంటర్ కి వచ్చాను. ఆ అడవిలో అదొక లాండ్ మార్క్ సెంటర్. నాలుగు రోడ్ల కూడలి. దానిపేరు సోలార్ కిచెన్ సెంటర్. అక్కడ చాలామంది తెల్లవాళ్ళు బస్సుకోసం వేచి చూస్తున్నారు. అక్కడ కాసేపు వెయిట్ చేశాను. ఇంతలో ఆరోవిల్ షటిల్ మినీ బస్సొచ్చింది. కానీ అప్పటికే అక్కడ ఉన్న తెల్లవాళ్ళకే అది సరిపోలేదు. వాళ్ళే కిక్కిరిసి ఎక్కారు. నేను ఆగిపోయాను.

అక్కడున్న సెక్యూరిటీ అతన్ని 'టాక్సీ ఏదన్నా దొరుకుతుందా బయటపడటానికి?' అంటూ అడిగాను. ఇక్కడకు రెండు కి.మీ దూరంలో UTS Travels అని ఒక ట్రావెల్ వాళ్ళున్నారు. అక్కడదాకా మీరు నడచి వెళితే, అక్కడ టాక్సీ దొరుకుతుంది. అన్నాడు. సూట్ కేస్ లాక్కుంటూ వెళ్ళడం ఎందుకని నెట్లో వాళ్ళ నంబర్ చూసి రింగ్ చేశాను. అయిదు నిముషాలలో వెర్నా కారు వచ్చి నా ముందాగింది. ఎక్కి కూచుని, 'పాండిచేరి బస్టాండ్ కి పోనియ్ తంబీ' అన్నా. ఇరవై నిముషాలలో కారు బస్టాండ్ లో ఉంది. సింపుల్ గా Rs 500/- తీసుకున్నాడు.

బస్టాండ్ బయట మంచి హోటళ్ళున్నాయి. ఒకదాంట్లో టిఫిన్ తిని, బస్టాండ్ లో కెళ్ళాను. "నాన్ స్టాప్ చెన్నై" అని అరుస్తున్నాడు డ్రైవర్. ఎక్కి కూచున్నా. నాతోబాటు ఒక 25 మంది మాత్రమే ఉన్నారు బస్సులో. టికెట్ Rs 150/-. మూడుగంటల ప్రయాణంతో బస్సు కోయంబేడు బస్టాండ్ కి చేరుకుంది. దారిలో ఒకచోట ఆగి యధావిధిగా Kumbakonam Degree Coffee త్రాగాము. చాలా బాగుంది. బస్సులో ఉన్నప్పుడే మిత్రుడు రవికి ఫోన్ చేసి సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో ఒక ఏసీ బెర్త్ ఈక్యూ లో రిలీజ్ చేయించాను. తను ఏవేవో పనుల్లో ఉండికూడా, చెన్నైలోని తన కౌంటర్ పార్ట్ ఆఫీసర్ తొ మాట్లాడి, పని చేయించి నాకు బెర్త్ నంబర్ చెప్పాడు. ఆ విధంగా రిజర్వేషన్ పని కూడా అయింది.

బస్సులోనే, మూర్తిగారికి ఫోన్ చేసి, 'థాంక్స్' చెప్పాను.

'అప్పుడే వెళ్ళిపోతున్నారా?' అని ఆయన కొంచం నొచ్చుకున్నారు.

"మళ్ళీ వస్తాను. ఈ సారి పెద్ద గుంపుతో వస్తానని" చెప్పాను.

"అయితే, సమ్మర్లో రండి. రష్ తక్కువగా ఉంటుంది. ఏర్పాట్లు చేస్తాను. మరి ఎండలూ ఎక్కువగానే ఉంటాయి. పరవాలేదా"' అని ఆయన అడిగాడు.

'ఎండలు నాకు బాగానే పడతాయి. గుంటూరులో 50 డిగ్రీలు చూసినవాణ్ని. ఆఫ్రికాలో కూడా హాయిగా ఉండగలను' అని ఆయనతో నవ్వుతూ చెప్పాను.

'అయితే సమ్మర్లో ప్లాన్ చేసుకోండి' అన్నారాయన.

సరేనని చెప్పాను.

కోయంబేడు బస్టాండులో దిగేసరికి ఎదురుగా నా చెన్నై శిష్యుడు సునీల్ నవ్వుతూ కనిపించాడు. అరగంట ముందే వచ్చి నాకోసం వెయిట్ చేస్తున్నాడు. తన కార్లో మంచి హోటల్ కెళ్ళి చక్కటి తమిళ్ భోజనం చేసి, అదే కార్లో సెంట్రల్ స్టేషన్ కు చేరుకున్నాం. కాసేపు ఏవేవో మాట్లాడుకుంటూ గడిపి, మళ్ళీ ఒక కాఫీ త్రాగి, చెన్నై - హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. TTE గుంటూరు వాడే. ఎదురొచ్చి, 'నమస్తే సార్ ! వస్తున్నారా!' అని అడిగాడు. అవునంటూ నా బెర్త్ నంబర్ చెప్పాను. 'హైదరాబాదులో ఎందుకు సార్? గుంటూర్ రండి మాకు బాస్ గా' అన్నాడు. నవ్వేసి ట్రెయిన్ ఎక్కి, సునీల్ కి బై చెప్పాను. ట్రెయిన్ కదిలింది.

బెర్త్ లో రిలాక్స్ గా పడుకున్న నాలో 1982 నుంచీ అరవిందుల యోగంతో నా పరిచయం, దానిని సమన్వయం చేసుకుంటూ శ్రీ రామకృష్ణుల భక్తునిగా నా సాధన ఎలా సాగింది, ఏయే మార్గాలలో నడచింది, ఎలా మార్పులకు లోనౌతూ వచ్చింది, దారిలో ఏయే అనుభవాలు కలిగాయి అదంతా  సినిమా రీలులాగా తిరిగింది. కొన్ని జన్మలు వెనక్కు వెళ్లి మళ్ళీ ఈ జన్మకు వచ్చినట్టు అనిపించింది. అలా రెండు గంటలు గడిచిపోయాయి.

'అరవిందుల యోగమార్గం చాలాచాలా కష్టమైనది. దానితో పోల్చుకుంటే, మామూలు ఇతర సాంప్రదాయ యోగాలు చాలా తేలిక. కానీ అవే నూటికి కోటికి ఒక్కరు కూడా సాధించలేరు. ఇక అరవిందుల యోగాన్ని సాధించాలంటే ఏ పదికోట్లమందిలో ఒక్కడు చెయ్యగలడో, అది కూడా చెయ్యలేడో? అంత కష్టమైన మార్గం అది. కానీ చివరకు ఎవరైనా దానిలో అడుగుపెట్టవలసిందే. అది ప్రకృతి నియమం. ఆ స్థాయికి చేరాలంటే ఎన్ని వేల జన్మలు ఎత్తాలో ఈ పిచ్చిజనం? ఎంత విచిత్రమైనది ఈ సృష్టి? ఈ భూమిమీద జరుగుతున్న లీల ఎంత విచిత్రమైనది? అసలు దీని గమ్యం ఏమిటి? ఎందుకిదంతా?' ఇలా ఆలోచిస్తూ పడుకున్నాను.

గూడూరులో భోజనం వచ్చింది. తినేసి పడుకున్నాను. ఉదయం 5 కల్లా సికింద్రాబాద్ స్టేషన్లో మెలకువ వచ్చింది. లేచి స్టేషన్ బయటకొచ్చి, ఆటో ఎక్కి 5.30 కల్లా ఇంటికి చేరిపోయాను.

ఆరోవిల్ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది. మినిమం సౌకర్యాలతో, అలాంటి అడవిలో బ్రతకడం నిజమైన సాధకులకు ఎంతో నచ్చుతుంది. అది సాధనకు బాగా అనువైన వాతావరణం. అయితే, మనల్ని సరిగా అర్ధం చేసుకుని, సరిగా మనతో ఉండే మనుషులతో మనం వెళ్ళాలి. లేకపోతే ఉపయోగం లేదు.

మళ్ళీ కొద్ది నెలలలో - నాతో బాగా సింక్ అయ్యే ఇన్నర్ సర్కిల్ శిష్యులతో కలసి మళ్ళీ పాండిచేరి వెళ్ళాలి. ఆరోవిల్ లో ఒక వారం ఉండి, మౌనసాధన చెయ్యాలి. ఇంకా ఉన్నతస్తరాలకు నా సాధనను తీసుకువెళ్ళాలి - అని నిశ్చయించుకున్నాను. ఇదే విషయాన్ని నా శిష్యబృందంతొ చెప్పాను. అందరూ ముక్తకంఠంతో 'ఓకే' అన్నారు.

(అయిపోయింది)