“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

30, జూన్ 2020, మంగళవారం

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం - జ్యోతిష్య పరిశీలన

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అని ఆత్రేయగారనుకుంటా వ్రాసింది. కానీ అది నిజం కాకపోవచ్చు. పోయినంత మాత్రాన అందరూ మంచోళ్ళు కారు. ఉన్నంతమాత్రాన చెడ్డవాళ్లూ కారు. అసలు ఉండటానికీ/పోవడానికి మంచితనానికి/చెడ్డదనానికీ  సంబంధం లేదుగాక లేదు. ఆయుస్సు ఉంటే ఉంటారు లేకపోతే పోతారు. సరే ఈ గోలంతా ఎందుకుగాని, సుశాంత్ సింగ్ జాతకం చూద్దాం.

ఇతను 21-1-1986 న పాట్నాలో పుట్టాడు. జాతకాన్ని ప్రక్కనే చూడవచ్చు. జనన సమయం రాత్రి 2. 15 అంటున్నారు. అలా అయితే వృశ్చికలగ్నం అవుతుంది. జైమినిమహర్షి ఇచ్చిన సూత్రం ప్రకారం తృతీయంలో పాపగ్రహాలున్నా, తృతీయానికి పాపగ్రహసంబంధం ఉన్నా, ఆత్మహత్యగాని బలవన్మరణం గాని జరుగుతుంది. ఎందుకంటే తృతీయం ఆయుస్థానం గనుక, పాపగ్రహసంబంధం వల్ల ఆయుష్షు దెబ్బతింటుంది.

ఇతని జాతకంలో చంద్రుడు నవమాధిపతిగా ఉఛ్చస్థితిలో ఉన్నాడు. పైగా పౌర్ణమికి దగ్గరగా వెళుతున్నాడు. కనుక ఇతనిది చాలా మంచి మనసని, సున్నితమైన మనసని అనిపిస్తున్నది. అయితే, ఇదే యోగం వల్ల, ఉద్రేకంలో తొందరపాటు పనులు చేసే స్వభావం కూడా ఉందని తెలుస్తున్నది.

లగ్నంలో శని ఉండటం ఈ లగ్నానికి మంచిది కాదు. శని చాలాబలమైన దృష్టితో చంద్రుడిని చూస్తున్నాడు. ఈ యోగం వల్ల తేలికగా డిప్రెషన్ లో పడటం, దురదృష్టం వెంటాడటం జరుగుతుంది.

ఇతని జాతకంలో ఆయుర్భావమైన తృతీయం బాగా దెబ్బ తిన్నది. కారణం? నీచగురువు, దశమాధిపతి అయిన సూర్యుడు శత్రుస్థానంలో ఉండటం, అందమైన అమ్మాయిలకు సినిమా స్టార్లకు కారకుడైన శుక్రుడు తీవ్రఅస్తంగతుడై ఉండటం కారణాలు. వెరసి ఈ ముగ్గురూ పాపగ్రహాలే అయ్యారు. వారి మీద శత్రుస్థానంలో చాలా కోపంగా ఉన్న శనిదృష్టి ఉన్నది. కనుక తృతీయం బాగా చెడిపోయింది.  అంటే,ఆయుష్షు దెబ్బ తిన్నది. కనుకనే 34 ఏళ్లకే బలవంతంగా చనిపోయాడు. 

'మందమాందిభ్యాం జలోద్భన్దనాదిభిః' - 'లగ్నంనుంచి గాని, కారకాంశనుంచి గాని, తృతీయంలో, శని, మాంది ఉంటే నీటిలో మునిగిగాని, ఉరితోగాని మరణిస్తాడు' - అన్న జైమినిమహర్షి సూత్రం మళ్ళీ నిజమైంది. ఈ జాతకంలో తృతీయంలో శనిమాందులు లేరు, కానీ శని యొక్క బలమైన చెడుదృష్టి తృతీయం మీద ఉన్నది. ఇంతకు ముందు జియా ఖాన్ జాతకం లోను, రంగనాధ్ జాతకం లోను, ఉదయ్ కిరణ్ జాతకం లోను ఈ యోగాలను చర్చించాను. కావలసినవారు పాతపోస్టులు చూడండి.

పంచమాధిపతి గురువు ప్రేమవ్యవహారాలకు సూచకుడు. విక్రమస్థానంలో ఇతని నీచస్థితి మంచిది కాదు. దశమాధిపతి అయిన రవితో, శుక్రుని అస్తంగత్వంతో కలసి, వృత్తిపరంగా పరిచయమైన అందగత్తెలతో ప్రేమజీవితం విఫలం అవుతుందని ఇది సూచిస్తుంది.

లగ్నాధిపతి కుజుడు ద్వాదశంలో శుక్రుని సూచిస్తున్న కేతువుతో కలసి ఉండటం వల్ల, సినిమా స్టార్స్ తో రొమాన్స్ దెబ్బతిని, హఠాత్ చెడుసంఘటనలకు దారి తీస్తుందని సూచన ఉంది. కుజుడు శుక్రస్థానంలో ఉండటం, అది ద్వాదశస్థానం  అవ్వడం గమనించాలి.

నిలకడ లేని మనసు

అసలే కోతి, ఆపైన కల్లుత్రాగింది, ఆపైన ఇంకేదో అయింది అన్నట్లు, అసలే ఉఛ్చచంద్రుడు, దానిమీద దోషి అయిన శనిదృష్టి, మకరం నుంచి నీచగురువు దృష్టి పడ్డాయి. దానితో బాటు రవిదృష్టి, అస్తంగతుడైన శుక్రుని దృష్టి పడ్డాయి. ద్వాదశం నుంచి కుజుని అష్టమ దృష్టి పడింది. దానితోబాటు కేతువు దృష్టి పడింది. చంద్రుని మీద ఇన్ని దృష్టులు ఉండటం, అతని మనసును ఊపిపారేస్తుంది. చాలా అల్లకల్లోలానికి గురి చేస్తుంది. ఇతను ఖచ్చితంగా డిప్రెషన్ లో పడ్డాడు.     

ఈ జాతకంలో చెడు యోగాలు
  • బాగా దెబ్బ తిన్న తృతీయం.
  • ఆయుస్థానంలో నీచగురువు స్థితి.
  • శుక్రుని అస్తంగత్వం
  • ఆత్మకారకుడైన బుధుని పాపార్గళం. 
  • ఉఛ్చచంద్రుని మీద శనిదృష్టి, మకరం నుంచి మూడు గ్రహాల దృష్టులు.
  • ద్వాదశంలో కేతు కుజులు.

దశలు

జూన్ 14 న ఇతను చనిపోయాడు. ఆ రోజున ఇతనికి రాహు - చంద్ర - శుక్రదశ నడిచింది. రాహువు లగ్నాధిపతి అయిన కుజుడిని సూచిస్తూ ఆరవఇంట్లో శత్రుస్థానంలో ఉన్నాడు. అంటే, తనకు తానే శత్రువు అవుతాడని లేదా రాక్షసుల్లాంటి భయంకరమైన శత్రువులుంటారని సూచన ఉన్నది. కుజరాహుసంయోగం రాక్షసత్వమే. చంద్రుని బలహీన డోలాయమాన పరిస్థితిని పైన వివరించాను. అదీగాక చంద్రుడు మారకస్థానంలో ఉన్నాడు. బలమైన నవమాధిపతిగా అధికారంలో ఉన్న బలమైన పెద్దవారిని సూచిస్తున్నాడు. లగ్నాత్ సప్తమంలో ఉండటం వారితో విరోధాన్ని సూచిస్తుంది. 

రాహుచంద్రులు కలిస్తే గ్రహణం అవుతుంది. దీనిని పిశాచగ్రస్తయోగమంటారు. అంటే, మనస్సు బాగా చెదిరిపోతుంది. పిచ్చిపిచ్చిగా ఉంటుంది. ఏం చేస్తున్నారో వారికే తెలియదు. బాగా కృంగిపోతారు.

ఇతనికి శుక్రుడు పూర్తిగా అస్తంగతుడైనాడు. శుక్రునితో కలసి ఉన్న సూర్యుడు వృత్తిస్థానానికి అధిపతిగా సినిమాఫీల్డ్ ను సూచిస్తున్నాడు. అంతేగాక పెద్దవారికి, అధికారంలో ఉన్నవారికి రవి సూచకుడు. తృతీయం కమ్యూనికేషన్ కు సూచిక గనుక నీచగురువు అక్కడే ఉన్నాడు గనుక, వారితో వచ్చిన మాటతేడాలను రవి సూచిస్తున్నాడు. శుక్రుడేమో అమ్మాయిల గొడవలను సూచిస్తున్నాడు.

సినిమాఫీల్డ్ లో ఉండే లుకలుకలు తెలియనివారెవరు? వాటిలో పడి ఎంతోమంది కళాకారులు ప్రాణాలు కోల్పోయారు. అదొక భయంకరమైన రొచ్చుగుంట. అందులోనూ బాలీవుడ్ అంతా మాఫియా కనుసన్నలలో నడుస్తుంది. వారిమాటలు వినకపోయినా, డబ్బుదగ్గర తేడాలు వచ్చినా ఏదైనా జరుగవచ్చు. ప్రాణాలంటే మాఫియాకు పెద్ద లెక్క కాదు.

ఇతను స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్నాడని, ఇతనికి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయని, భ్రమలకు గురౌతున్నాడని మహేష్ భట్ అన్నాడని రియా చక్రవర్తి చెప్పిందట. పర్వీన్ బాబీ కూడా ఇలాగే చేసేదని, "ఆమెను త్వరగా వదిలించుకో లేకపోతే నువ్వూ అయిపోతావ్" అని ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి అనబడే యూజీ తనతో చెప్పాడని మహేష్ భట్ అన్నాడు. యూజీ సలహా విని పర్వీన్ బాబీని మహేష్ భట్ వదిలించుకోవడమూ, ఆ తర్వాత డిప్రెషన్ కు గురైన ఆమె డ్రగ్స్ కి, త్రాగుడుకి అలవాటు పడి అనుమానాస్పద పరిస్థితులలో చనిపోవడమూ పాతతరంవారికి తెలిసినకధే. అయితే, పర్వీన్ బాబీకి, సుశాంత్ సింగ్ కీ పోలికలున్నట్లు కనిపిస్తుంది.

ఇతని మరణం వెనుక బాలీవుడ్ లోని కొన్ని పెద్ద తలకాయలున్నాయని అంటున్నారు. వాళ్లింకా బ్రతికే ఉన్నారు. అందుకని, మన పాలసీ ప్రకారం అప్పుడే వాళ్ళ జాతకాలు చూడటం మంచిది కాదు. మరికొన్నాళ్ళాగుదాం !

ఏదేమైనా, సెన్సిటివ్ జాతకాలలో 33 వ ఏడు గండకాలం అంటారు. ఇతనిది సెన్సిటివ్ జాతకమే. సుశాంత్ సింగ్ ఆకారం అబ్బాయిది గానీ, ఇతని మనసు అమ్మాయికంటే సున్నితమైనది. ఇతను కూడా అదే వయసులో చనిపోవడం చూస్తుంటే, కొన్ని కొన్ని నమ్మకాలు నిజమేనేమో అనిపిస్తుంది.

ఇది సహజమరణం కాదన్నది వాస్తవం.