నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, ఆగస్టు 2020, సోమవారం

'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది




మా 'పంచవటి పబ్లికేషన్స్' నుంచి 'యోగ యాజ్ఞవల్క్యము' అనబడే ఇంకొక మహత్తరమైన యోగశాస్త్రగ్రంధమును ప్రచురిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది.

యాజ్ఞవల్క్యఋషి మహాతపస్సంపన్నుడు, ద్రష్ట, శాపానుగ్రహ సమర్థత కలిగిన అతిప్రాచీన వైదికఋషులలో ఒకరు. ఈయన బుద్ధునికంటే దాదాపు 400 సంవత్సరములు ముందటివాడని భావిస్తున్నారు. శుక్లయజుర్వేదము, శతపథబ్రాహ్మణము, బృహదారణ్యకోపనిషత్తు వంటి అనేక చోట్ల ఈయన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉపనిషత్తులలో చెప్పబడిన అద్వైతభావనను అతిప్రాచీనకాలంలో ఈయనే మొదటిసారిగా లోకానికి బోధించినట్లు భావిస్తున్నారు. వైదికసంప్రదాయములను, యోగమార్గముతో మేళవించే ప్రయత్నాన్ని మొదటగా ఈయన చేశారు. ఈయనకు గార్గీ వాచక్నవి, మైత్రేయి అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరూ కూడా మహాసాధ్వులు. భర్తవలెనే తపస్సంపన్నులు. అంత ప్రాచీనకాలంలో కూడా బ్రహ్మవాదినులైన స్త్రీలు శాస్త్రాధ్యయనము మరియు తపస్సులను చేసేవారని, పండితసభలలో, ఋషిసభలలో కూర్చుని గహనములైన వేదాంతసిద్ధాంతములను ఋషులతో తర్కబద్ధంగా వాదించేవారని మనకు వీరి చరిత్రల వల్ల తెలుస్తున్నది.

ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు.


ఈ ప్రాచీనగ్రంథములోని భావములను, విధానములను, తరువాతి కాలమునకు చెందిన యోగోపనిషత్తులు, హఠయోగప్రదీపిక, ఘేరండసంహిత మొదలైన ఇతరగ్రంథములు స్వీకరించాయి. గాయత్రీమహామంత్రముతోను, ఓంకారము తోను చేయబడే వైదికప్రాణాయామము, అశ్వినీదేవతలు చెప్పిన మర్మస్థాన ప్రత్యాహారము, అగస్త్యమహర్షి ప్రణీతమైన ప్రత్యాహారము, సగుణ నిర్గుణ ధ్యానములు ఈ గ్రంథముయొక్క ప్రత్యేకతలు.


వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.


యధావిధిగా ఈ గ్రంధం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

read more " 'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది "

29, ఆగస్టు 2020, శనివారం

సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది


వరుసగా ప్రింట్ అవుతున్న నా పుస్తకాల పరంపరలో భాగంగా ఈరోజున  గోరక్షనాథులు రచించిన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' ప్రింట్ పుస్తకాన్ని, హైదరాబాద్ లోని మా ఇంటినుంచి నిరాడంబరంగా విడుదల చేశాము.

ఈ పుస్తకం కూడా యధావిధిగా google play books నుంచి లభిస్తుంది.

read more " సిద్ధసిద్ధాంత పద్ధతి ప్రింట్ పుస్తకం విడుదలైంది "

14, ఆగస్టు 2020, శుక్రవారం

'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం

10-8-2020 శనివారం ఉదయం 11. 30 కి ఒక ఫోనొచ్చింది.

'నమస్తే అండి సత్యనారాయణ శర్మగారేనా?' అడిగిందొక మహిళాస్వరం.

'అవును' అన్నా ముక్తసరిగా. ఆడవాళ్ళ ఫోనంటేనే నాకు భయమూ, చిరాకూ రెండూ ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే, వారిలో విషయం ఉండకపోగా అనవసరమైన నస మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే చిరాకు కలిగిస్తుంది. సోది చెప్పకుండా సూటిగా విషయం మాట్లాడే ఆడవాళ్లను చాలా తక్కువమందిని ఇప్పటిదాకా చూచాను. ఆఫ్ కోర్స్ ! వాళ్ళ అవసరం ఉన్నపుడు మాత్రం చాలా సూటిగానే మాట్లాడతారనుకోండి. అది వేరే విషయం !

'నా పేరు హేమలత. ఫలానా వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేశారు' అంది.

'అలాగా. చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు?' అడిగా.

'నేనొక సమస్యలో ఉన్నాను. ప్రశ్న చూస్తారని అడగడానికి ఫోన్ చేశా' అన్నదామె.

రిఫర్ చేసినాయన నా క్లోజ్ ఫ్రెండ్ కనుక వెంటనే ఎదురుగా ఉన్న లాప్ టాప్ తెరిచి ప్రశ్నచక్రం వేశా. తులాలగ్నం అయింది. చంద్రుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని సూటిగా చూస్తున్నాడు.

'మీ వివాహజీవితం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

'నిజమే. అదే నా సమస్య' అందామె.

సప్తమాధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నవిషయాన్ని, సుఖస్థానంలో శని ఉన్న విషయాన్ని గమనిస్తూ 'మీ ఆయనకు మీకూ గొడవలు. మీకు సంసారసుఖం లేదు' అన్నాను.

'నిజమే. కానీ ఆ గొడవలు ఎందుకో చెబితే మీరు ఆశ్చర్యపోతారు' అందామె.

అంటే, మామూలు సమస్య కాదన్నమాట. అంతగా చెప్పలేని సమస్యలేముంటాయా? అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచించాను.

భర్తను సూచించే కుజునినుండి అతని మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉఛ్చరాహువు శుక్రుడు ఉండటాన్ని గమనించాను. ఈ యోగం ప్రకారం వివాహేతర సంబంధాన్ని మొగుడే ప్రోత్సహిస్తూ ఉండాలి. కానీ ఈ విషయాన్ని ఎలా అడగడం? బాగోదేమో అని సంశయిస్తూ ఉండగా -'తన స్నేహితులతో బెడ్ పంచుకోమని మా ఆయన పోరు పెడుతున్నాడు. ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు' అందామె.

'ఓరి దేవుడో?' అని తెగ ఆశ్చర్యమేసింది. వాళ్ళాయన వృత్తి ఏంటా అని గమనించాను. కుజుని నుండి దశమంలో ఉఛ్చకేతువు గురువు ఉన్నారు. గురువు వక్రీస్తూ వృశ్చికంలోకి పోతున్నాడు. శని వక్రీస్తూ ధనుస్సులోకి వచ్చి కేతువును కలుస్తున్నాడు. దశమాన్ని ఉఛ్చరాహువు శుక్రుడు చూస్తున్నారు. అంటే, పైకి నీతులు చెబుతూ లోలోపల అనైతికపు పనులు చేసే రంగమన్నమాట. అదేమై ఉంటుంది? రాహుశుక్రులు సహజతృతీయమైన మిధునంలో ఉంటూ సినిమా ఫీల్డ్ ని సూచిస్తున్నారు.

'మీ ఆయనది సినిమా ఫీల్డా?' అడిగాను.

'అవును. మా ఆయన ఫలానా' అని చెప్పిందామె.

నాకు మతిపోయినంత పనైంది.

'ఎందుకలా?' అడిగాను ఆమెనోటినుంచి విందామని.

'బిజినెస్ ప్రొమోషన్ కోసం, కొత్త కొత్త సినిమా ఛాన్సులకోసం, తన ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది నిర్మాతల దగ్గర పడుకోమని గొడవ చేస్తున్నాడు. భరించలేక విడాకులు కోరుతున్నాను' అందామె.

'ఆ పనికోసం కాల్ గాళ్స్  చాలామంది ఉంటారు. పెళ్ళాన్ని పడుకోబెట్టాల్సిన పనేముంది?' అడిగాను.

'కాల్ గాళ్స్ వాళ్లకూ తెలుసు. మా ఆయన వాళ్లకు చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ కంటే అందంగా పుట్టడం నా ఖర్మ' అందామె.

'మంచిపని, గో ఎహెడ్. మీకు సపోర్ట్ గా పేరెంట్స్ లేరా?' అన్నాను.

'మా నాన్న ఒక ఉన్నతాధికారి. కానీ రెండేళ్లక్రితం చనిపోయారు. అంతేకాదు అప్పటినుంచీ మా మామగారు మా అమ్మను వేధిస్తున్నాడు' అన్నదామె.

నా తల గిర్రున తిరిగింది.

'నేను విన్నది నిజమేనా?' అని అనుమానంగా మళ్ళీ చార్ట్ లోకి తలదూర్చాను.

కుజునినుంచి దశమాధిపతి గురువు, ఈమె భర్త తండ్రిని, అంటే మామగారిని సూచిస్తాడు. శుక్రునినుంచి నాలుగో అధిపతి బుధుడు ఈమె తల్లిని సూచిస్తాడు. గురువు వక్రించి వృశ్చికంలోకి వచ్చి, కోణదృష్టితో బుధుడిని చూస్తున్నాడు. గురువు మీద రాహుశుక్రుల దృష్టి ఉంటూ ఆమె చెబుతున్నది నిజమే అని సూచిస్తున్నది.

'బాబోయ్!' అనుకున్నా.

'మీ మామగారు మీ అమ్మకు వరసకు అన్నయ్య అవుతాడు కదమ్మా?' అడిగాను.

'అవునండి. అమ్మ ఆయనతో అదే అంటే, 'ఈ ఫీల్డ్ లో అలాంటి  వరసలేవీ ఉండవు. మీ అమ్మాయిని మావాడు చెప్పినట్లు వినమను. నువ్వు నేను చెప్పినట్లు విను' అని ఫోర్స్ చేస్తున్నాడు' అందామె.

'మరి మీరేం అనుకుంటున్నారు' అడిగాను.

'ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేశాను. అమ్మ దగ్గర ఉంటున్నాను. మంచి లాయర్ దగ్గర డైవోర్స్ కి కేస్ ఫైల్ చేశాను. గెలుస్తామా? ఎన్నాళ్ళు పడుతుంది?' అడిగింది.

దశలు గమనించాను. ప్రస్తుతం కేతువు - రాహువు - రవి నడుస్తోంది. ఇప్పుడు పని జరగదు. భవిష్యత్ దశలను గమనిస్తూ "2021 జనవరి - మార్చి మధ్యలో మీ పని జరుగుతుంది, నువ్వు కేసు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. పోరాడు." అని చెప్పాను.

'థాంక్స్' అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.

నాలో ఆలోచనా తరంగాలు మొదలయ్యాయి.

'ఇలాంటి మొగుళ్ళు, ఇలాంటి మామలు కూడా ఉంటారా? ఏమో? భార్యే అలా చెబుతున్నపుడు నమ్మకుండా ఎలా ఉండగలం? అందులోనూ సినిమా ఫీల్డ్ లో ఉన్నంత రొచ్చు ఇంకెక్కడా ఉండదన్నది అందరికీ తెలిసినదే, నిజమే కావచ్చు' అనుకున్నా.

'ఈ భూమ్మీద మనం బ్రతికేది నాలుగురోజులు. ఇక్కడ మన బ్రతుకే శాశ్వతం కాదు. అందులో డబ్బనేది అసలే శాశ్వతం కాదు. వీటికోసం ఇంత దిగజారాలా? పైగా ప్రతిరోజూ కరోనాతో ఎంతోమంది పోతున్నారని వింటున్నాం. మనకు తెలిసినవాళ్ళే చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత ఛండాలమా?' అనిపించింది.

మనకనిపిస్తే ఏముపయోగం? వాళ్ళకనిపించాలి కదా? వాళ్లకు అవే ముఖ్యంగా కన్పిస్తున్నాయి మరి ! మనమేం చెయ్యగలం? ఈ ప్రపంచంలో ఎవరు చెబితే ఎవరు వింటారు గనుక? ఎవరి ఖర్మ వారిది. అంతే.

ఆలోచన ఆపి నా పనిలో నేను పడ్డాను.

కథకంచికి మనం మన పనిలోకి.

(వ్యక్తిగతకారణాల రీత్యా పేర్లు, కధనం మార్చడం జరిగింది. కధనం మారినా, కధ నిజమైనదే !)

read more " 'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం "

7, ఆగస్టు 2020, శుక్రవారం

గాయకులు - సంఖ్యాశాస్త్రం

ఈ లోకంలో ప్రతిమనిషీ ప్రక్కమనిషికంటే విభిన్నుడే. అలాగే ప్రతిజాతకమూ ప్రక్కవారి జాతకం కంటే తేడాగానే ఉంటుంది. కానీ ఒకే రంగంలో ఉన్నవారి జాతకాలలో కొన్నికొన్ని పోలికలుంటాయి. అవి జ్యోతిష్యపరంగానూ కనిపిస్తాయి. అలాగే,  సంఖ్యాశాస్త్రపరంగానూ కనిపిస్తాయి.  నిజానికి,అంకెలన్నీ గ్రహాలే. కనుక సంఖ్యాశాస్త్రం కూడా జ్యోతిషశాస్త్రంలో భాగమే.

గాయకులకు శని మరియు రాహుకేతువులతో గట్టిసంబంధం ఉంటుంది. ఎందుకంటే,  సంగీతం నేర్చుకోవాలంటే చాలా గట్టి పట్టుదల ఉండాలి. అలాగే క్రొత్త క్రొత్త ప్రయోగాలు చెయ్యాలంటే కూడా రాహుకేతువులు సంబంధం ఉండాలి. ఒక వ్యక్తి జీవితంలో రాహువు ప్రభావం లేనిదే అతనికి ఆటా, పాటా, మాటా ఏవీ రావు. కనుక వీరందరికీ 2,,4,8, అంకెలతో  ఖచ్చితమైన సంబంధం ఉంటుంది. నా పద్ధతిలో రాహువును 2 అనీ, కేతువును 4 అనీ భావిస్తాము. పుస్తకాలలో మీరు చూచే సంఖ్యాశాస్త్రానికీ నా విధానం తేడాగా ఉంటుంది. గమనించండి.

ఇప్పుడు ప్రసిద్ధగాయకులు పుట్టినతేదీలను  పరిశీలిద్దాం.

ఈ తేదీలలో శతాబ్దపు సంఖ్యను  లెక్కించవలసిన పనిలేదు. ఎందుకంటే 1900 నుంచి 1999 మధ్యలో పుట్టినవారికి 19 అనేది అందరికీ ఉంటుంది గనుక. అలాగే  ఆ తర్వాత పుట్టినవారికి 20 అనేది అందరికీ కామన్ గా ఉంటుంది గనుక ఆ సంఖ్యలను  పట్టించుకోవలసిన పనిలేదు.

K L Saigal
Born 11-4-1904
2-4-4
రాహువు - కేతువు - కేతువు. పుట్టిన తేదీ 2 అయింది. నెల 4 అయింది. సంవత్సరం కూడా నాలుగే.

సైగల్ మంచి గాయకుడే అయినా త్రాగుడుకు అలవాటుపడి జీవితాన్ని విషాదాంతం చేసుకున్నాడు. రాహుకేతువుల ప్రభావం ఆయనమీద అలా పనిచేసింది. 

Kishore Kumar
Born 4-8-1929
4-8-2
కేతువు - శని - రాహువు
పుట్టినరోజు 4 అయింది.

అమరగాయకుడైన ఇతని జీవితం కూడా బాధామయమే. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా శాంతిలేకుండానే ఈయన చనిపోయాడు.

Died 13-10-1987
4-1-6 = 2
చనిపోయిన రోజు రూట్ నంబర్ కూడా 4 అవడం గమనించాలి.

Mohammad Rafi
Born 24-12-1924
24-12-24

ఇదొక రిథమ్. ఈయన పుట్టినతేదీలోనే ఒక రిథమ్ ఉండటం చూడవచ్చు. 2,4 అంకెలు మళ్ళీ మళ్ళీ వస్తూ రాహుకేతువుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

Died 31-7-1980
4-7-8
4,8 అంకెలను కేతు, శనుల ప్రభావాన్ని గమనించండి.

Mukesh Madhur
Born 22-7-1923
22-7-23

2 అంకె మూడుసార్లు రావడాన్ని పుట్టిన తేదీ రూట్ నంబర్ 4 అవడాన్ని గమనించండి.


Manna Dey
Born 1-5-1919
1-5-1

ఈయన మీద ఈ గ్రహాల ప్రభావం లేదు. కనుకనే కొన్నాళ్ల తర్వాత సినీరంగానికి దూరమయ్యాడు.

Talat Mahamood
Born 24-2-1924
24-2-24

ఇక్కడ కూడా 2,4 అంకెల ప్రభావాన్ని చూడవచ్చు. ఈయన జననతేదీలో కూడా రిథమ్ ఉన్నది. కొన్నేళ్లు బాగా వెలిగిన ఈయన సినీరంగానికి దూరమై ఘజల్ సింగర్ గా మిగిలాడు.

Bhupender singh
Born 6-2-1940
6-2-4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.

Jagjith singh
Born 8-2-1941
8-2-41
2,4,8 అంకెల ప్రభావం గమనించండి.

Died 10-10-2011
1-1-2 = 4
రాహుకేతువుల ప్రభావం స్పష్టం.


Lata Mangeshkar 
Born 28-9-1929
28-9-29

ఈమె పుట్టిన తేదీలో కూడా రిథమ్ ఉన్నది. 2,8 అంకెల ప్రాబల్యత రాహువు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నది.

Nukala China Satyanarayana
Born 4-8-1923
4-8-5
8
2,4,8 అంకెల ప్రభావం కనిపిస్తోంది. పుట్టినతేదీ 4 అయింది.


Died 11-7-2013
2-7-4
4
మళ్ళీ 2,4 అంకెలు వచ్చాయి. చనిపోయిన తేదీ రూట్ నంబర్ 2 అయింది. మొత్తం తేదీ రూట్ నంబర్ 4 అయింది.

Ghantasala Venkateswara Rao
Born 4-12-1922
4-12-22
2,4 అంకెల సీక్వెన్స్ ను గమనించండి.
పుట్టిన తేదీ మళ్ళీ 4 అయింది.

Died 11-2-1974
2-2-74
2-2-2
ఈ తేదీకూడా మళ్ళీ 2,4 అంకెల పరిధిలోనే ఉన్నది. 

P.Susheela
Born 13-11-1935
4-2-8
అవే అంకెలు మళ్ళీ కనిపిస్తూ రాహు, కేతు, శనుల ప్రభావాన్ని సూచిస్తున్నాయి.

గాయకులు చాలామంది పుట్టిన తేదీ 4  గాని, 13 గాని, 22 గాని, 31 గాని అవుతూ రూట్ నంబర్ 4 అవుతుంది. వారి జననతేదీలో ఉండే మిగతా అంకెల వల్ల వారి జీవితంలో ఆయా మిగతాగ్రహాల పాత్ర ఉంటుంది.

సామాన్యంగా గాయకుల జీవితాలు విషాదాంతం అవుతాయి. కళాకారులకి కూడా అంతే. బయటప్రపంచం వారిని ఆరాధించవచ్చు. కానీ వారి వ్యక్తిగతజీవితాలు చివరకు విఫలమే అవుతాయి. వారి జీవితాలు పూలపాన్పులలాగా ప్రపంచానికి గోచరిస్తాయి. కానీ బయట ప్రపంచానికి కనపడని చీకటి కోణాలు వారి జీవితాలలో ఉంటాయి. దానికి కారణం వారి జీవితంలో ఉన్న రాహు, కేతు, శనుల ప్రభావం. ఎంతమంది గాయకుల జననతేదీలను చూచినా ఇవే సీక్వెన్సులు మీకు కన్పిస్తాయి.
read more " గాయకులు - సంఖ్యాశాస్త్రం "

4, ఆగస్టు 2020, మంగళవారం

'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' ప్రింట్ పుస్తకాలు విడుదలయ్యాయి

కరోనా టైమ్స్ లో నేను వ్రాసిన ఈ బుక్సన్నీ ఒక్కొక్కటిగా ప్రింట్ అవుతున్నాయి.  ఈ  క్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి ఈరోజున 'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' అనే రెండు ప్రింట్ పుస్తకాలను విడుదల చేశాము. ఇవి రెండూ యధావిధిగా google play books నుంచి లభిస్తాయి.
read more " 'యోగతారావళి', 'శాండిల్యోపనిషత్' ప్రింట్ పుస్తకాలు విడుదలయ్యాయి "