నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఓషో ప్రియురాలు 'మా యోగ వివేక్' చంపబడిందా?

31 ఏళ్ళుగా నలుగుతున్న ఒక రహస్యాన్ని తేల్చడానికి జ్యోతిష్యశాస్త్రాన్ని ఉపయోగిద్దాం.

క్రిస్టియన్ వుల్ఫ్ స్మిత్ అనే అమ్మాయి 'యునైటెడ్ కింగ్ డం' లో 19-3-1949 న పుట్టింది. 9-12-1989 న  పూనాలో ఓషో ఆశ్రమంలో చనిపోయింది. ఈమెకు ఓషో 'మా యోగ వివేక్' అని పేరు పెట్టాడు. తర్వాత 'మా ప్రేమ్ నిర్వానో' అని ఇంకొక పేరు ఈమెకు పెట్టబడింది. ఈ అమ్మాయి 40 ఏళ్ళు మాత్రమె బ్రతికింది. అందులో 20 ఏళ్ళు ఓషో పక్కనే తోడునీడగా ఉంటూ అన్ని సేవలూ చేస్తూ ఉన్నది. ఈమె గనుక పక్కన ఉండి ఎంతో జాగ్రత్తగా 20 ఏళ్ళపాటు చూచుకోకపోయినట్లైతే ఓషో అన్ని ఏళ్ళు బ్రతికేవాడు కాదు. ఎందుకంటే ఓషో ఆరోగ్యం అంత గట్టిది కాదు.

ఈమె గురించి ఓషో ఒక కధ చెప్పేవాడు. ఓషో చిన్నప్పుడు వాళ్ళ పల్లెటూళ్ళో డాక్టర్ శర్మ అనే ఒకాయన ఉండేవాడు. ఆ కుగ్రామంలో ఆయనే డాక్టరు. ఆ డాక్టరు కూతురిపేరు శశి. ఈ అమ్మాయి రజనీష్ ఇద్దరూ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. కలసి మెలసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యన ప్రేమ చిగురించింది. చిన్ననాటి ప్రేమ చాలా మధురమైనది. దానిలో సెక్స్ అనేది ఉండదు. అలాంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్యన ఉండేది. అయితే, ఉన్నట్టుండి ఏదో జబ్బు చేసిన శశి 1947 లో చనిపోయింది. అప్పటికి రజనీష్ కి 16 ఏళ్ళు. ఆ అమ్మాయికి 14 ఉంటాయేమో? చనిపోయేటప్పుడు రజనీష్ ని చూస్తూ ఆ అమ్మాయి ఇలా అన్నది ' నేను మళ్ళీ వస్తాను. నీ తోడుగా ఉంటాను. నిన్ను చూసుకుంటాను'.

తర్వాత రెండేళ్లకు 1949 లో క్రిష్టియన్ ఉల్ఫ్ స్మిత్ అనే అమ్మాయిగా శశి మళ్ళీ బ్రిటన్ లో పుట్టిందని ఓషో అనేవాడు. ఈ అమ్మాయి 20 ఏళ్ళ వయసులో ఆధ్యాత్మికతను వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి 1989 లో చనిపోయేవరకు ఓషోతో ఉండిపోయింది. ఓషో సమక్షంలో ఈమెకు తన పూర్వజన్మ గుర్తు వచ్చిందని అంటారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యనా చాలా గట్టి ప్రేమ ఉండేది. దాదాపు 20 ఏళ్ళపాటు ఒషోని కంటికి రెప్పలాగా చూసుకుంది.

ఓషోకు సేవ చెయ్యడం అంటే మాటలు కాదు. అది ఒక ధ్యానం లాంటిదే. అనుక్షణం ఎంతో జాగరూకతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆయన ఆరోగ్యం మంచిది కాదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయనకు ఉండేది. ఆయనకు ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉండేది. కొద్దిగా దుమ్ము తగిలినా ఆయనకు జలుబు చేసేది. ఆస్తమా ఎటాక్ కూడా వచ్చేది. 17 డిగ్రీలు దాటిన వాతావరణం ఆయనకు పడేది కాదు. దీనికి తోడూ ఆయనకు డయాబెటీస్ ఉండేది. ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్లు ఆయనను చూసుకోవాల్సి వచ్చేది. ఇదిగాక, పెద్ద చప్పుడులు ధ్వనులు ఆయన భరించలేడు. కొంతమంది ఒంటి వాసన ఆయనకు పడేది కాదు. ఇంటి గదులు ఎంతో క్లీన్ గా ఉంటె తప్ప ఆయన ఉండలేకపోయేవాడు. ఇలాంటి సమస్యలున్న మనిషిని ఎలా చూసుకోవాలి? వివేక్ ఈ పనులన్నీ చాలా ఓపికగా 20 ఏళ్ళ పాటు చేసింది. కానీ ఏనాడూ తన ఆధిపత్యం చేలాయించాలని చూసేది కాదు. ఒక నీడలాగా మౌనంగా ఆయన పక్కనే ఉండేది. సేవ చేసేది. అంతే !

ఇదంతా ఇంటర్ నెట్లో దొరుకుతుంది. ఓషో పుస్తకాలలో దొరుకుతుంది. అది కాదు నేను చెప్పబోయేది. వివేక్ చాలా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయింది. ఇప్పటికీ ఈ మిస్టరీ తేలలేదు. ఈమె చావును హడావుడిగా ముగించేసి, చనిపోయిన రెండే రెండు గంటలలో ఆమెను దహనం చేసేసి, ఏమీ జరగనట్టు నటించారు ఓషో ఆశ్రమ నిర్వాహకులు. అప్పటికి ఓషో చక్కగా బ్రతికే ఉన్నాడు.  జీవితాంతం తనకి సేవ చేసిన అమ్మాయికి అదా ఓషో ఇచ్చిన బహుమతి? ఇదా గురుత్వమంటే?

ఓషోకు ఇంత నమ్మకంగా ప్రేమగా 20 ఏళ్ళు సేవ చేసిన వివేక్. ఓషో చనిపోయే 40 రోజుల ముందుగా తను చనిపోయింది. అప్పటికి ఆమెకు 40 ఏళ్ళు మాత్రమే. ఆమె చనిపోయిన వెంటనే ఒక రెండు గంటలలో చడీ చప్పుడూ లేకుండా, ఒక అనామకురాలిని చేసినట్లు, ఆమెను దహనం చేసేశారు. ఇది వివేక్ ను అభిమానించే ఎందరినో కలచివేసే సంఘటన ! ఇది జరిగి నేటికి 31 ఏళ్ళు  గడిచినప్పటికీ వివేక్ మరణం ఈనాటికీ ఒక తేలని రహస్యంగానే మిగిలిపోయింది.

ఓషో శిష్యులలో ఇప్పటికీ బ్రతికున్నవాళ్ళు ఈ విషయం మీద కల్లబొల్లి కాకమ్మ కధలు చెబుతున్నారు గాని అసలు విషయం ఎవరూ చెప్పడం లేదు. అందుకని, ఈ రహస్యాన్ని జ్యోతిష్యం సహాయంతో చేదిద్దామని అనుకున్నాను. జ్యోతిష్యశాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలిస్తే, జరిగిపోయినది, జరగబోయేది, జరుగుతున్నది అన్నీ ఇంట్లోనుంచి కదకుండా తెలుసుకోవచ్చు. అదే ఈ సైన్స్ గొప్పదనం. ఇక  చదవండి !

ఓషో శిష్యులలో చాలామంది 1949 ప్రాంతాలలో పుట్టారు. ఆ సమయంలో గురువు మకరరాశిలో సంచరిస్తూ నీచస్థితిలో ఉన్నాడు. వీళ్ళందరూ గురుదోష బాధితులు. అందుకే వీళ్ళ జీవితాలు అలా గడిచి, చివరికి  రకరకాలుగా విషాదాంతాలయ్యాయి.

అందులోనూ ఈమెది అనూరాధా నక్షత్రం అయింది. అనూరాధా నక్షత్ర జాతకులు విచిత్రమైన మనుషులు. ఎందుకంటే వీరికి చంద్రుడు నీచస్థితిలో ఉంటాడు. అందుకే వీళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో వీరికే తెలియదు. విశాఖ - 4 వ పాదం, జ్యేష్ట నాలుగు పాదాలు కూడా అంతే. వీళ్ళ మనసులు ఎటు పోతుంటాయో వీరికే తెలియదు.

నక్షత్రాలకు కొన్ని లక్షణాలు ఉండటం నిజమే. ఆయా నక్షత్రాలలో పుట్టినవారికి ఆయా లక్షణాలు ఉండటం కూడా నిజమే. ప్రాచీన వేదకాలంలో విశాఖ నక్షత్రాన్ని 'రాధ' అనేవారు. దానిని అనుసరించి ఉంటుంది గనుక దాని తరువాత నక్షత్రం అనూరాధ అయింది. అనూరాధా నక్షత్రజాతకులు ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. లేదా ఎవరినో ఒకరిని ఆశ్రయించి, వారిపైన ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ఈ ఆధారపడటం అనేది భౌతికంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు. వివేక్ విషయంలో రెండూ జరిగాయి. 1970 లో ఓషోను కలిసినది మొదలు 1989 లో తను చనిపోయేవారకూ వివేక్ ఓషోతోనే ఉన్నది.

ఈమెది కర్కాటక లగ్నం తులా నవాంశ అని నా ఉద్దేశ్యం. కనుక ఈమె మధ్యాహ్నం 12.50 నుంచి 1.04 లోపు పుట్టి ఉంటుంది. ఈ నిర్ధారణకు ఎలా వచ్చానో అదంతా వివరించను. అదంతా చెప్పాలంటే ఇంకో రెండు పోస్టులు అవుతాయి. సూచనాప్రాయంగా కొన్ని మాత్రం చెబుతాను.

నవమాదిపతి ఐన గురువు సప్తమంలో నీచస్థితిలో ఉండటం - ఈమె గురువు, లవరు రెండూ అయిన ఓషోని సూచిస్తున్నది.

కుటుంబస్థానంలోని శని - ఈమె కుటుంబంలో ఉన్న శాపాన్ని సూచిస్తున్నాడు. ఈమె పెద్దల జీవితాలలో కూడా ఇలాంటి సంఘటనలే ఉండి ఉండవచ్చు.

పంచమంలో నీచస్థితిలో ఉన్న లగ్నాధిపతి చంద్రుడు సమాజపు కట్టుబాట్లకు లొంగని ఒక విపరీతప్రేమ వ్యవహారాన్ని చూపుతున్నాడు. నవమంలో ఉన్న పంచమాధిపతి కుజుడు - ఒక ప్రసిద్ధుడూ శక్తివంతుడూ అయిన గురువుతో ప్రేమలో పడటాన్ని సూచిస్తున్నాడు.

ఇంతకంటే ఎక్కువగా వివరించవలసిన పని లేదు. ఇది ఈమె జాతకమే.

ఈమె చనిపోయిన 9-12-1989 న గ్రహస్థితి ఇలా ఉన్నది.

అప్పుడామెకు ఏలినాటి శని రెండోపాదం జరుగుతున్నది. కనుక కష్టకాలమే. ఇకపోతే గురువు అష్టమంలో వక్రించి ఉన్నాడు. జీవశక్తి బాగా క్రుంగిపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఓషో వల్ల వివేక్ గర్భవతి అయింది. కానీ ఓషో పట్టుపట్టి ఆమెకు అబార్షన్ చేయించడమే గాక, ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశాడు. ఈ సంఘటనతో ఆమె బాగా క్రుంగిపోయింది. ఆ తరువాత ఆమె ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది. ఆమెకు తీవ్రమైన ప్రీ మెన్సురల్ సిండ్రోమ్ ఉండేది. ఆ సమయంలో ఆమె పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. చూసేవాళ్లకు స్కిజోప్రేనియా అనిపించేటంతగా ఆమె విపరీత ప్రవర్తన ఉండేది. ఇవన్నీ కలసి ఆమె ఆరోగ్యాన్ని చిన్న వయసులోనే బాగా దెబ్బతీశాయి.

ఈమె చనిపోయిన రోజున ఉన్న గోచార గ్రహస్థితి ఇలా ఉన్నది.

జననకాల రాహువు మీదకు గోచార చంద్రుడు 

దీనివల్ల మనసు నిలకడ తప్పుతుంది. మీనంలో ఉన్న జననకాల కుజుడిని దాటిన చంద్రునివల్ల, ఆ సమయంలో ఈమె నెలసరికి దగ్గరగా ఉందని తెలుసుకోవచ్చు. కనుక శరీర బాధలకు తోడుగా మనసుకూడా ఈమె అదుపు తప్పిందని తెలుస్తున్నది. అలాంటి సమయాలలోనే విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇది మైక్రో పిక్చర్ మాత్రమే. అంటే, ఈ స్థితి నాలుగైదు రోజులపాటే ఉంటుంది.

జననకాల నీచచంద్రునిమీద గోచార రవి కుజులు

దీనివల్ల, మొండి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు చెప్పినా మాట వినరు. తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారు. ఈ స్థితి నెలా నెలన్నర పాటు వెంటాడుతుంది. అంటే, నెలనుంచీ తర్జన భర్జన పడుతున్న విషయాన్ని ఈమె ఆ సమయంలో అమలు చేసినట్లు తెలుస్తున్నది. ఏంటా విషయం?

జననకాల నీచ గురువు మీద గోచార రాహుశుక్రులు

ఇది ఈమె చావును కొనితెచ్చిన మేక్రో సూచన. ఇందులో రాహుస్థితి ఏడాదిన్నర పాటు ఉంటుంది. శుక్రుడు ఒక నెలపాటు మాత్రమే రాహువుతో కలుస్తాడు. ఈ కలయిక వల్ల ఏం జరుగుతుంది?

అప్పటికే ఓషో ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నది. ఆయన మహా బ్రతికితే ఒక నెల పాటు బ్రతుకుతాడని అందరూ అనుకుంటున్నారు. గురువుమీద ఉన్న అమితమైన ప్రేమను చంపుకోలేకపోయిన వివేక్,  ఆయనకంటే ముందే తాను చనిపోవాలనుకుంది. అబార్షన్ మొదలైన పిచ్చి పనులవల్ల ఎలాగూ తన ఆరోగ్యం కూడా వేగంగా క్షీణిస్తున్నది. ఓషో పోయాక తనుండి చేసేదేముంది? అన్న ఆలోచన ఆమెలో ఏడాది నుంచీ ఉన్నది. ఒక నెలనుంచీ తీవ్రమైంది. ఆ మూడు రోజులలో ఉధృతమైంది. అందుకే తనంతట తాను చనిపోయింది.

ఓషో కమ్యూన్ లో బయటకు కనపడని నేరపూరిత రహస్యాలు చాలా ఉన్నాయి. ఆరిగాన్ లో వీళ్ళంతా ఉన్నపుడు - ఒక మనిషి బాధ లేకుండా చనిపోవాలంటే ఏ ఏ సింథటిక్ విషాలు తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏయే విషాలు కలపాలి? మొదలైన వాటిమీద చాలా రీసెర్చి చేశారు. దానికోసం ఒక గ్రూప్ ప్రత్యేకంగా ఉండేది. ఒకవేళ తన ఆరోగ్యం బాగా క్షీణిస్తే, ఈ విధంగా చనిపోవడానికి ముందే ప్లాన్ వేసిన ఓషో ఆయా విషాలు, ఇంజెక్షన్లు తెప్పించి సిద్ధంగా ఉంచుకున్నాడు. ఈ సంగతి ఆయన ఇన్నర్ సర్కిల్ లో వారికి తెలుసు. ఆయన ఆదేశాల మేరకు వాళ్ళే అవన్నీ తెప్పించి పెట్టారు.

వివేక్ కు కూడా ఇవన్నీ తెలుసు. చివరి రోజులలో, ఓషో పర్సనల్ డాక్టర్ తో ఆమె ఎఫైర్ లో ఉన్నదని అంటారు. కనుక ఆ గ్రూపులోని నిపుణుల సహాయంతో ఆమె ఆ ఇంజక్షన్ తీసుకుని ఉండవచ్చు. లేదా అందరూ నమ్ముతున్నట్టు ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఉండవచ్చు. మొత్తం మీద ఆమెది సహజ మరణం మాత్రం కాదు. ఆమెది ఆత్మహత్య అయినప్పటికీ ఇతరులకు తెలియకుండా జరిగినది మాత్రం కాదు. దీనిలో ఓషో ఇన్నర్ సర్కిల్ శిష్యుల పాత్ర ఖచ్చితంగా ఉన్నది.

దశా ప్రభావం

ఆ సమయానికి జాతకంలో శుక్ర - రాహు - గురు దశ జరుగుతూ నేను చెబుతున్నది నిజమే అని రుజువు చేస్తున్నది. సరిగ్గా గోచారంలో కూడా ఇవే గ్రహాలు ఉన్నాయి గమనించండి. జననకాల గురువు మీదకు గోచార రాహు శుక్రులు సంచరించారు. కనుక ఈ మూడు గ్రహాలలోనే ఈ రహస్యం దాగున్నది.

శుక్ర రాహువులు ఎఫైర్లకు సూచకులు. ఓషో డాక్టర్ తో ఈమె ఎఫైర్ అందరికీ తెలిసినదే. ఇతనే కాక ఇంకా కొంతమంది లవర్స్ ఈమెకు ఉన్నారని తెలుస్తోంది. ఓషోను అంతగా ప్రేమించిన ఈమె మళ్ళీ ఇలా చేయడం ఏమిటి? అదేంటో ఆ దేవుడికే తెలియాలి. ఓషో ఆశ్రమంలో జరిగిన చండాలమంతా వర్ణించాలంటే ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదేమో మరి? అసలీ తప్పంతా ఓషోది. ఫ్రీ సెక్స్ ని ప్రోత్సహించడం ఆయన చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి. దానివల్ల ఎవరూ బాగుపడలేదు. ఎవరికీ ఆధ్యాత్మికత అనేది అందలేదు. చివరకి అందరూ భ్రష్టు పట్టారు. అంతా సర్వనాశనం అయింది.

రాహుగురువులు కలిస్తే గురుచండాల యోగం అవుతుంది. అంటే, గురువుకు సంబంధించిన గోలలో పడి ఈమె తన గొయ్యి తానే తవ్వుకుందని అర్ధమౌతున్నది. దొంగ గురువుల మాయలో పడితే ఇలాగే అవుతుంది మరి !

శుక్ర గురువుల కలయిక ఎటూ తేల్చుకోలేని గందరగోళపు పరిస్థితినిస్తుంది. ఒకరు రాక్షస గురువు, ఇంకొకరు దేవ గురువు కావడమే ఈ పరిస్థితికి కారణం. జాతకురాలి మనసుని ఒకరు ఒకవైపు లాగితే ఇంకొకరు ఇంకోకవైపు లాగుతారు. ఈ స్థితిలో మరేం జరుగుతుంది? ఊహించండి.

ఈమె జాతకంలో శుక్రుడు 11 వ అధిపతిగా ద్వితీయ రోగ స్థానాధిపతి. పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన రోగాలను సూచిస్తున్నాడు. ఈమెకు జరిగిన అబార్షన్, పీ ఎమ్మెస్, హిస్టీరికల్ ప్రవర్తనలను పైన వివరించాను. ఈ దశ వీటిని స్పష్టంగా సూచిస్తున్నది. ఆ శుక్రుడు బుధునితో కలసి చావును సూచించే 8 వ ఇంటిలో ఉండటం చూడవచ్చు. ఈ 8 వ ఇల్లు నిస్వార్ధరాశి యైన కుంభం అవుతున్నది. ఇతరులమీద ప్రేమతో చనిపోవడాన్ని సూచిస్తున్నది.

అంతర్దశానాధుడైన రాహువు దశమంలో ఉంటూ మనస్సుకు సూచిక అయిన 4 వ ఇంటిని చూస్తూ, రాక్షసమైన ప్లాన్ ను సూచిస్తున్నాడు. అంటే, విషప్రయోగంతో చనిపోవడమన్నమాట. ఈ రాహువు కుజునికి సూచకుడు. ఆ కుజుడు గురువును సూచించే నవమంలో రవితో కలసి ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నాడు. అంటే తీవ్ర అస్తంగత దోషంలో పాపార్గళం పట్టి ఉన్నాడు. కనుక గురువుకోసం చనిపోవడాన్ని సూచిస్తున్నాడు.

విదశానాధుడైన నీచగురువు, సప్తమంలో ఉంటూ, ఓషో పాత్రను కూడా సూచిస్తున్నాడు. ఆసలిలాంటి చెత్త ప్లాన్లను తన శిష్యుల బుర్రలలో ఎక్కించింది ఓషోనే. అందుకే ఈ పాపమంతా ఆయనదే అని నేనంటాను.

ఆ సమయంలో వివేక్ పరిస్థితి ఎలా ఉందో ఈ క్రింది లైన్లు చదివితే మీకర్ధమౌతుంది.  

  • ఓషో మీద విపరీతమైన ప్రేమ.
  • ఓషో ఇంకో నెలలో పోతాడని డాక్టర్లు చెప్పడం
  • పూర్తిగా చెడిపోతున్న తన ఆరోగ్యం. 
  • దానికితోడు గజిబిజి మనసు
  • చెడు దశ
  • చెడు గోచారం
  • వేధిస్తున్న పీ ఎమ్మెస్ 
  • అందుబాటులో ఉన్న రకరకాల ఆత్మహత్యా పద్ధతులు
  • వాటిని అమలు చేయగల నిపుణులు
  • ఓషో పోయాక తన గతి ఏమౌతుందో అన్న భయం 
ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? జవాబు నేను చెప్పనక్కర లేదు. మీరే చెప్పండి.

ఇంకా క్లారిటీ కోసం ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకుందాం !

సమయం : రాత్రి 10.15 నిముషాలు
తేదీ : 7-9-2020 
ప్రదేశం : హైదరాబాద్

లగ్నాధిపతి శుక్రుడు ఆయుష్హు సూచించే 3 వ ఇంటిలో ఉంటూ, గురువును సూచించే 9 వ ఇంటిలో ఉన్న వక్రశని చేత చూడబడుతున్నాడు. ఈ శని ఈ లగ్నానికి బాధకుడు. అంటే ఏంటి దీనర్ధం? గురువుకు తెలిసే ఈమె చావు జరిగిందని లేదా గురువుకోసం ఈమె చనిపోయిందని అర్ధం.

దీనికి ఇంకా బలాన్నిస్తూ, వక్ర గురువు రహస్యాలకు నిలయమైన 8 వ ఇంటిలో మరణసూచకుడైన ఉచ్చకేతువుతో కలసి ఉన్నాడు. తెలివికి కారకుడైన బుధుడు బుద్ధిస్థానంలో ఉచ్చస్థితిలో ఉంటూ అతితెలివితో కూడిన ప్లాన్ ని సూచిస్తున్నాడు. మనస్సుకు కారకుడైన చంద్రుడు మారకుడైన కుజునితో కలసి చావును సూచించే 12 వ భావంలో ఉంటూ బలవంతపు చావును సూచిస్తున్నాడు.

ఇంతకీ అసలు ప్రశ్న తేలలేదు. వివేక్ చనిపోయినది ఇంజక్షన్ తోనా లేదా నిద్ర మాత్రలు మ్రింగడం వల్లనా? మనఃకారకుడైన చంద్రుడు కుజునితో కలసి ఉన్నాడు. కుజుడు కత్తులకు సూదులకు గాయాలకు కారకుడు. కేతువు సూదిని సూచిస్తాడు. ఆయన ధనుస్సులో ఉఛ్చస్థితిలో ఉంటూ చంద్ర కుజులను చక్కగా చూస్తున్నాడు. ఇంకా చెప్పాలా ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని చనిపోయిందని? అందుకే హడావుడిగా ఎవరి కంటా పడకుండా ఆమెను దహనం చేసేశారని? 

జాతకవిశ్లేషణలో కనిపించిన నిజాలన్నీ ప్రశ్నలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా? క్లారిటీ వచ్చిందా లేదా? చెప్పండి !

అసలీ పాపమంతా ఓషోదే. తనను నమ్మిన ఎవరికీ ఆయన మోక్షాన్ని ఇవ్వలేకపోయాడు సరిగదా కనీసం ఆ మార్గంలో సరిగ్గా నడిపించలేకపోయాడు. చివరికి అందర్నీ ముంచాడు. తానూ మునిగాడు. ఇదే జరిగింది.

ఓషో ఎందరో గురువులను విమర్శించాడు. చివరకు అవతారాలను కూడా విమర్శించాడు. కానీ తనను నమ్మి వచ్చిన తన శిష్యులను తానేం చేశాడు? నట్టేట ముంచాడు. వివేక్ కూడా అలాగే మునిగింది.

తన తండ్రిని గురించి చెబుతూ 'ఆయన సమాధి స్థితిలో చనిపోయాడు' అని ఓషో అన్నాడు. ఇది పక్కా కట్టుకధ. ఎందుకంటే, తను, తన శిష్యులు ఎవరూ ఇప్పటిదాకా సమాధిస్థితిలో చనిపోలేదు కాబట్టి. వీళ్ళ చావులన్నీ ఘోరంగా ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు. డ్రగ్స్, ఇలాంటి గోలలో చనిపోయేవాళ్ళు యోగులా? వీళ్ళకు సమాధిస్థితి అందుబాటులో ఉన్నదా? వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే ఎన్నయినా చెప్పి నమ్మించవచ్చు !

సోది మాటలు చెప్పడం వేరు. నిజంగా ఆయా ధ్యానస్థితులను సాధించడం వేరు. సోదితో లోకాన్ని నమ్మించవచ్చు. కానీ ప్రకృతిని, దైవాన్ని, కర్మను మోసం చేయలేం. అది జరిగే పని కాదు.

'యధా గురు తధా శిష్య:' అంటే ఇదేగా మరి !