“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

చిన్నతమ్ముడు నిత్యానంద జాతకం - విశ్లేషణ

నిత్యానంద జననతేదీ కోసం వెదికితే,  ఇంటర్ నెట్ లో మనకు రెండు తేదీలు లభిస్తున్నాయి. ఒకటి 19-3-1977, మరొకటి 1-1-1978. మొదటిది తన పాస్ పోర్ట్ లో ఇచ్చుకున్నది. రెండవది హైకోర్టులో సమర్పించినది. కనుక ఉన్నంతలో రెండవదే సరియైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వ్రాతపూర్వకంగా కోర్టుకు అబద్ధం చెప్పలేడు గనుక.

ఇకపోతే, జననసమయం గురించి వెదికితే అర్ధరాత్రి 00.32 అని ఒక సమయం దొరికింది. ఇదెంతవరకు నిజమో తెలియదు. ఇతని అఫిషియల్ వెబ్ సైట్లో మాత్రం ఏమీ లేదు. కారణాలేమిటో తెలియదు గాని, ప్రముఖులు తమ అసలైన జననతేదీలను సమయాలను సామాన్యంగా  బయటపెట్టరు. కానీ ప్రస్తుతానికి ఇదే దొరికింది. సరియైనది దొరికేవరకూ ఇది సరిపోతుందో లేదో చూద్దాం.

అనుమాననివృత్తి కోసం ప్రశ్నశాస్త్ర సహాయం తీసుకుందాం. 

ప్రశ్నసమయం : ఈరోజు ఉదయం 10.10 గంటలు

ప్రదేశం : హైదరాబాద్

లగ్నం తుల అవుతూ స్వక్షేత్రంలో ఉన్న కుజునితో చూడబడుతున్నది. లగ్నాధిపతి దశమకేంద్రంలో ఉన్నాడు. దశమాదిపతి చంద్రుడు లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఈ సమయం సరియైనదే అన్న సూచన ఉన్నది.

ఈయన పుట్టింది తిరువన్నామలై లో. అది మాత్రం సరిగానే దొరుకుతోంది. ఇప్పుడీయన జాతకాన్ని చూద్దాం.

నా విధానంలో ఈ సమయాన్ని సంస్కరించగా అర్ధరాత్రి ౦౦.24 నిముషాలు అవుతోంది. అదంతా ఎలా చెయ్యాలి? అన్న విషయం నన్నడక్కండి. పాత పోస్టులలో చాలా జాతకాలకు జననకాల సంస్కరణ చేశాను కావాలంటే అవి చూసుకోండి.

ఇది ఇతని జాతకమేనా కాదా తెలియాలంటే ముందుగా కొన్ని కొన్ని పరీక్షలు చెయ్యాలి.

జాతక పరీక్ష

ఇద్దరు సంతానంలో ఇతను చిన్నవాడు. 11 లో కుజుని వల్ల ఇది సరిపోతున్నది. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమో చేశాడు. వక్రత్వం వల్ల మిధునంలోకి వచ్చిన కుజుడు చతుర్దంలో ఉన్న రవి శుక్రులను చూస్తున్నాడు కనుక ఇంజనీరింగ్ విద్యనూ ఇస్తాడు. సరిపోయింది. లగ్న సప్తమాలలో ఉన్న రాహుకేతువుల వల్ల వివాహజీవితం భగ్నం అయింది. ఇదీ సరిపోయింది. కనుక జాతకం సరిపోతున్నట్లే కనిపిస్తున్నది. ఇక ముందుకెళదాం.

జాతక పరిశీలన

లగ్నరాహువు సూచిస్తున్న ఉచ్చబుధుని వల్ల ఇతను చాలా అతితెలివైనవాడని తెలుస్తున్నది. పైన చెప్పినట్లుగా లగ్న సప్తమాలను అందులోనూ కన్యా మీనరాశులను రాహుకేతువుల ఇరుసు పాడు చేసినందువల్ల ఇతనికి వివాహజీవితం చెడిపోయింది. ఇంజనీరింగ్ లో డిప్లొమా ఎలా వచ్చిందో పైన వివరించాను. తృతీయ వక్రబుధుని వల్ల మంచి మాటకారని అవసరమైతే అబద్దాలు బాగా చెబుతాడని సూచన ఉన్నది. కుజబుధ గురుశనుల వక్రత్వం వల్ల జీవితం అనేక ఒడుదుడుకులకు ఎత్తుపల్లాలకు లోనౌతుందని  పూర్వకర్మ చాలా బలంగా ఉన్నదని తెలుస్తున్నది.

ఆధ్యాత్మిక యోగమైన శనిచంద్రుల కలయిక ఈ జాతకంలోనూ ఉండటాన్ని చూడవచ్చు. ఇది ఆధ్యాత్మిక యోగమే. అయితే, శని వక్రత్వం వల్ల, ఈ యోగం పరిపూర్ణమైన సిద్ధికి సూచిక కాదు. కనుక ఈయన చెప్పుకుంటున్నట్లుగా ఈయన ఒక అవతారం కానే కాదు. ఒక అవతార పురుషునికి ఉండవలసిన యోగాలు ఈ జాతకంలో లేవు. శని వక్రత్వమనేది లోకంతో, లోకులతో ఉన్న బలమైన కర్మను సూచిస్తుంది.

ఇది ఒక తాంత్రికయోగి  జాతకం మాత్రమే గాని అవతార పురుషుని జాతకం ఎంతమాత్రం కాదు. బ్రతికి ఉన్నపుడు అవతార పురుషుని ఎవరూ గుర్తించలేరు. అది సాధ్యం కాదు. లోకం తమను గుర్తిస్తున్నదని గమనించిన వెంటనే వాళ్ళు లోకాన్ని విడచి వెళ్ళిపోతారు. ప్రచారాలు చేసుకుంటూ గౌరవాలు పొందేవాళ్ళు యోగులు సిద్ధులు అయితే కావచ్చేమో గాని అవతారపురుషులు మాత్రం కారు.

ఇతని విమ్శాంశ లగ్నం సింహం అయింది. 9 లో నీచశని ఉండటం చూడవచ్చు. ఇది సాంప్రదాయ విరుద్ధమైన నీచ పోకడలను, సాధనలను సూచిస్తుంది. ఈ శని మీనంలోకి వస్తూ ఉచ్చశుక్రునితో కలవడం వల్ల, ఆ మీనం 8 వ భావం కావడం వల్ల అందగత్తెలైన సినిమా స్టార్స్ తో రహస్య రొమాన్స్ కనిపిస్తున్నది. 12 వ అధిపతి చంద్రుడు దశమంలో ఉచ్చస్థితిని బట్టి రహస్యమైన ఆధ్యాత్మికమార్గం (తంత్రం) లో ఇతనికి సిద్ధి ఉన్నదని, శక్తి ఉపాసన ఉన్నదని, దానిలో కొన్ని శక్తులు సాధించాడని కనిపిస్తున్నది. మేము కాదని ఎంత బుకాయించినప్పటికీ ఆ వీడియోలో ఉన్నది వాళ్లిద్దరే నన్నది సత్యం. 9 వ అధిపతి కుజుడు సప్తమంలో ఉండటం దీనికి బలాన్నిస్తున్నది. 6 లోకి వచ్చి ఉచ్చస్థితిని పొందటం వల్ల, సంప్రదాయ విరుద్ధమైన తంత్రమార్గంలో గట్టి పట్టు ఉన్నవాడని, ఈ పనుల వల్ల లోకంతో విరోధం కలుగుతుందని తెలుస్తున్నది. కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని సూచించే విమ్శాంశ చక్రం ఇతని జీవితానికి సరిగ్గా సరిపోతున్నది. ఇప్పుడు దశలను పరిశీలిద్దాం.

దశాఫలితాలు

ఇతను పుట్టినప్పుడు రవి - రవి - రాహుదశ నడుస్తున్నది. ఇది తంత్రమార్గాన్ని సూచించే దశ. అంతేగాక దీనివల్ల అనేక కష్టాలు, విరోధాలు, లోకంలో గొడవలు ఉంటాయి. రాహువు ఉచ్చ బుధుని సూచిస్తూ తెలివైన మాటకారిని, రహస్య కార్యకలాపాల నేర్పరిని, అనేక దేశాలు తిరిగేవాడిని సూచిస్తున్నాడు. 12 అధిపతిగా సూర్యుడు తంత్రజ్ఞానాన్నిస్తాడు. అదే సమయంలో అధికారులతో గొడవలను, జైలు జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు. 4 లో 9 వ అధిపతి అయిన శుక్రునితో కలసి, 7 అధిపతి మరియు బాధకుడైన గురువుతో చూడబడుతూ - ఆధ్యాత్మికజీవితం గడుపుతూ, అందగత్తెలతో రహస్యకలాపాల వల్ల చిక్కులు ఎదుర్కోవడం కనిపిస్తున్నది. జరిగినది అదే కదా మరి !  ఇతని జీవితం ఇలాగే జరుగుతున్నది గనుక మనం చూస్తున్న ఇతని జనన సమయం సరియైనదే కావచ్చు.

1982 లో నాలుగేళ్ల చిన్న వయసులో ఈయన గురువైన మాతా విభూతానంద పురి ఇచ్చిన కాషాయవస్త్రాలను ధరించాడని అంటున్నారు - ఈ సంఘటన రవి - కేతువులో గాని, రవి - శుక్ర దశలో గాని జరిగి ఉంటుంది. కేతువు మోక్షకారకుడు, మోక్షరాశి అయిన మీనంలో ఉన్నాడు. శుక్రుడు 9 వ అధిపతిగా 12 వ అధిపతి అయిన రవితో కలసి ఉన్నాడు. కనుక ఈ సంఘటన జరగడానికి ఆస్కారం ఉన్నది. అయితే, ఆ తరువాత చేసిన గోలంతా ఏమిటి? అని ఆలోచిస్తే ఆ కాషాయాలకు ఏమీ విలువ లేదని అర్ధమౌతుంది.

పన్నెండేళ్ళ వయసులో ఈయనకు 360 డిగ్రీల దృష్టి వచ్చిందని అంటారు. మామూలు మనుషులకు 90 డిగ్రీల దృష్టి మాత్రమె ఉంటుంది. పినియాల్ పిట్యూటరీ గ్రంధులు ఉత్తేజితములైన యోగులకు మాత్రం ఈ పరిధి పెరుగుతూ పోయి 360 ల దృష్టి లభిస్తుంది. అంటే, వీళ్ళు ఆ స్థితిలో ఉన్నపుడు తల తిప్పకుండా వెనుక కూడా ఏమి జరుగుతున్నదో చూడగలుగుతారు.  ఇది యోగంలో సాధ్యమే. పరమహంస యోగానంద గారికి ఇది కలిగింది. యూజీ గారికి ఇది కలిగింది. ఇంకా అనేకమంది యోగులకు ఇది కలిగింది. సరిగ్గా సాధన చేస్తె,  ఇప్పటికైనా సరే, ఇది ఎవరికైనా కలుగుతుంది. కానీ ఈయన భక్తులు చెబుతున్నట్లుగా ఇది జ్ఞానస్థితి మాత్రం కాదు. ఇది ఒకరకమైన చిన్నపాటి సిద్ధి మాత్రమే. ఆ వయసులో ఈయనకు చంద్ర - బుధ దశ జరిగింది. ఇది భ్రమపూరిత దశేగాని సిద్ధిదశ కాదు. కనుక ఇది అబద్దం.
 
1992 లో ఈయనకు 14 ఏళ్ళ వయసులో పరమశివానుభావం కలిగిందని చెబుతున్నారు. ఇది నిజం కాకపోవచ్చు. అప్పుడాయనకు చంద్ర-శుక్ర దశ జరిగింది. చంద్రుడు 12 లో 5 వ అధిపతి అయిన శనితో కలసి ఆధ్యాత్మిక యోగంలో ఉన్నాడు. శుక్రుడు 9 వ భావాదిపతి. కనుక ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగే సూచన ఉన్నది. కానీ ఇంత స్థాయి అనుభవం కలిగే సూచన లేదు. కాకపోతే, ఏదో ఒక చిన్నపాటి సమాధిస్థితి కలిగి ఉండవచ్చు. లగ్నంలో ఉన్న రాహువు భ్రమలకు కారకుడు గనుక దానినాయన 'పరమశివానుభవం' అనుకుంటూ ఉండవచ్చు. కనుక ఇదీ అబద్దమే.

ఈయన వేదాంతమును తంత్రమును శ్రీవిద్యను ఔపోశన పట్టినట్లుగా చెబుతున్నారు ఈయన శిష్యులు. ఇది నిజం కాదు. కాకపోతే వాటిలో ప్రవేశం ఉండి ఉండవచ్చు గాని ఔపోశన పట్టాలంటే మానవమాత్రుని వల్ల జరిగే పని కాదు. శ్రీ రామకృష్ణుల వంటి అవతార పురుషులకే అది సాధ్యమౌతుంది. అలాంటి యోగాలు ఈయన జాతకంలో ఎక్కడా లేవు. కనుక ఇది ఉత్త ప్రచారం మాత్రమేగాని నిజం కాదు. తనను తాను ఒక అవతారంగా ప్రచారం  చేసుకుంటూ నిత్యానంద మళ్ళీ తప్పు చేస్తున్నాడు. ఇదీ అబద్దమే.

1992 - 1995 - ఈ సమయంలో ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. అప్పటికే జ్ఞానసిద్ధిని, పరమశివానుభావాన్ని పొంది వేదాంతమును, తంత్రమును శ్రీవిద్యను ఔపోశన పట్టిన వ్యక్తికి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చెయ్యవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదు. కనుక పైన చెప్పుకుంటున్న ప్రచారాలు నిజం కాదని తెలుస్తున్నది. ఇంజనీరింగ్ మొదలయ్యే సమయంలో చంద్రదశ చివరలో ఉంది. చంద్రునిమీద ఉన్న శని ప్రభావం వల్ల ఇనుప మిషన్లకు సంబంధించిన విద్య అబ్బింది. చదువు అయిపోయే సమయానికి కుజదశలో మొదటి మూడు అంతరాలు జరిగాయి. కుజుడుయంత్రాలకు సూచకుడు గనుక ఇది కూడా సరిపోయింది. 

1995 లో మద్రాస్ రామకృష్ణ మఠంలో బ్రహ్మచారిగా చేరాడు - ఈయనను నేను స్వల్పంగా అభిమానించడానికి ఉన్న కారణాలలో ఇదొకటి. నా గురువులలో ఒకరైన శ్రీమత్ స్వామి నందానందగారికి ఇతను కొన్నాళ్ళు శ్రద్దగా సేవ చేశాడు. అందుకని ఇతను నా చిన్నతమ్ముడిలాంటి వాడు. ఆ ఒక్క పాయింట్ మీద ఇతనిని నేను కొద్దిగా లైక్ చేస్తాను.

ఆ సమయంలో ఇతనికి కుజ - గురు దశ జరిగింది. గురువు నవమంలో ఉండటం చూడవచ్చు. కుజుడు 8 వ అధిపతిగా సాధనామార్గాన్ని సూచిస్తు, మంత్రస్థానమైన పంచమాన్ని చూస్తున్నాడు. కనుక సరిపోయింది.

1996 - లో బేలూర్ మఠానికి చేరుకున్నాడు. అప్పుడు కుజునిలో శని అంతర్దశ జరిగినిది. శని 5 అధిపతిగా సాధనను సూచిస్తూ 12 భావమైన మోక్షస్తానంలో ఉన్నాడు. తరువాత రామకృష్ణ మఠాన్ని వదిలేసి హిమాలయాలకు యాత్ర సాగించాడు. కుజ-శనిదశ యాక్సిడెంట్లను ఇస్తుంది. రామకృష్ణమఠాన్ని వదిలెయ్యడం ఇతని జీవితంలో ఒక యాక్సిడెంటే. అక్కణ్ణించి ఇతని దారి పెడదారిపట్టింది. అందులో ఉంటే ఇప్పుడు తను చేస్తున్న పనులు చెయ్యడం కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా అణిగిమణిగి ఉండాలి. వివేకానందస్వాములవారు పెట్టిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అక్కడుంటూ ఇలాంటి పనులు చేస్తే, వాళ్ళే తన్ని బయటకు నెడతారు.

కానీ ఇతని పూర్వకర్మ చాలా బలంగా ఉన్నది. నాలుగు గ్రహాల వక్రత్వము, కుజుని నీచత్వము, అంశచక్రాలలో శని నీచత్వము, లగ్మలో రాహువు పరిస్థితి - ఇవన్నీ ఆపనిని చేయ్యనివ్వవు. లోపలనుంచి పూర్వకర్మ ఊపుతూ ఉంటుంది. కనుక రామకృష్ణమఠంలో ఇమడలేక బయటకు వచ్చాడు. 
 
దేశమంతా ఆ విధంగా తిరిగి తిరిగి 2000 సంవత్సరానికి మళ్ళీ తమిళనాడు చేరుకున్నాడు. అప్పటికి కుజ మహర్దశ అయిపోయింది.

కుజుడు 3 వ భావాదిపతి, అంటే దగ్గర ప్రయాణాలిస్తాడు. అందుకే ఇండియాలో తిరిగాడు. అప్పటికి విదేశాలకు ఇంకా పోలేదు. నీచ వక్రకుజుడు గనుక ఒక సన్యాసిగా కాలినడకన దేశమంతా తిరుగుతూ చాలా బాధలు పడి ఉంటాడు. రామకృష్ణమఠంలో చేరి కొన్నాళ్ళుండి బయటకు వచ్చాడు. ఇదంతా కుజ మహర్దశలో జరిగింది.

ఆ తరువాత మొదలైన 18 ఏళ్ళ రాహు మహర్దశ ఇతనికి చుక్కలు చూపించింది. మరి రాహువంటే మాటలా? చుక్కలూ చూపిస్తాడు, బురదలోనూ పడేస్తాడు, ఎక్కడెక్కడో దొర్లిస్తాడు, ఏవేవో పనులు చేయిస్తాడు. రాహువు రాక్షసుడు కదా మరి ! రాహు దశ అలాగే ఉంటుంది. ఈ సమయంలోనే ఆశ్రమాలు పెట్టడం, ఊళ్లు తిరగడం, మూడవ కన్నుకు సంబంధించిన ప్రయోగాలు, నిదర్శనాలు చూపించడం, రోగాలు తగ్గించడం, మహిమలు చూపించడం మొదలైనవన్నీ జరిగాయి. ఇవన్నీ నిజాలెలా అవుతాయి? అన్ని శక్తులు ఒక్కసారి ఎలా వస్తాయి? కాబట్టి ఇవన్నీ చీప్ ట్రిక్స్ అయి ఉంటాయి. హస్తలాఘవంతో, చీప్ గారడీతో కొంతమంది పిచ్చోళ్ళని మాయ చెయ్యవచ్చు. సత్యసాయి అలా చేసినవాడే. ఇతనూ అదే దారిలో పోతూ తమిళనాడు పల్లెకారు జనాలను కొందరిని బుట్టలో వేసుకుని ఉండవచ్చు. అంతేగాని, ఈ మహిమలు నిజాలు కావు. ఉత్త ప్రచారాలు మాత్రమే.

2010 - లో సినీనటి రంజితతో గడిపిన వీడియో బయట పడటంతో గగ్గోలు చెలరేగింది. ఈ సమయంలో ఇతనికి రాహు-బుధ దశ జరిగింది. తనమీద తనకున్న అతి నమ్మకం కొంప ముంచింది. నమ్మినవాళ్ళే శత్రువులయ్యారు. ఇది ఖచ్చితంగా రాహు ప్రభావమే.

ఇతని జీవితంలో రాహువు అతిముఖ్య గ్రహం. దీనికి రుజువుగా ఇతని ఉత్తాన పతనాలు రెండూ రాహు దశలోనే జరిగాయి. ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు పుంజుకున్నాయి. అదే విధంగా పడిపోవడమూ జరిగింది. ఇది రాహు ప్రభావమే.

రాహువు పంచమమైన మకరాన్ని, సప్తమమైన మీనాన్ని, నవమమైన వృషభాన్ని చూస్తున్నాడు. నవమం శుక్రస్థానం అయింది. కనుక మతముసుగులో అమ్మాయిలతో సంబంధాలు కనిపిస్తున్నాయి. సప్తమం కూడా శుక్రునికి ఉచ్చస్తానమయింది. ఇది కూడా అగ్నికి ఆజ్యం పోస్తుంది. అక్కడే గురువును సూచిస్తున్న కేతువున్నాడు. కనుక దైవ రాక్షస గుణాలు కలగాపులగం అయ్యాయి. అమ్మాయిల ఆకర్షణకు లోబడ్డాడు. పతనమయ్యాడు. పరువు పోగొట్టుకున్నాడు.

ఓషోకూ నిత్యానందకూ కొన్ని పోలికలున్నాయి. కొన్ని భేదాలున్నాయి. ఓషోను చూస్తే మొండివాడైన పెద్దన్నను చూసినట్లు నాకు చాలా కోపమొస్తుంది. నిత్యానందను చూస్తే తెలిసీ తెలియని చిన్నతమ్ముడిని చూసినట్లు జాలేస్తుంది.

అమ్మాయిలతో సంబంధాలు బయటపడినప్పుడు ఓషో ఏమీ తొణకలేదు బెణకలేదు. 'నేనింతే, మీ దిక్కున్నచోట చెప్పుకోండి' అన్నాడు. కానీ నిత్యానంద భయపడ్డాడు. ఆ వీడియో మాది కాదన్నాడు. తరువాత నేనసలు మొగాడినే కాదన్నాడు. పరీక్షలు  చేశారు. 'నువ్వు మగాడివే, నీకు పటుత్వం ఉంది' అన్నారు. అందుకే నేను రాసిన పోస్ట్ కి 'వీడు మగాడ్రా బుజ్జీ' అని పేరు పెట్టాను.

ఇలా రకరకాలైన అబద్ధాలు చెప్పడంలో పరువు పోగొట్టుకున్నాడు. అలా కాకుండా ఓషోలాగా ధైర్యంగా నిలబడి ఉంటె బాగుండేది. కానీ అలా చెయ్యలేకపోయాడు. ఓషో మహా ముదురు, బరి తెగించినవాడు. అమెరికాలో ఉంటూ అమెరికా ప్రభుత్వానికే ఎదురు తిరిగి సవాల్ చేసిన జగమొండి జగన్నాధం. కానీ నిత్యానంద అలా చెయ్యలేకపోయాడు. పరువు కోసం చూసుకున్నాడు. అబద్ధాలు చెప్పాడు. ఆ క్రమంలో పరువు పోగొట్టుకున్నాడు.

ఒక దారీ తెన్నూ లేకుండా ఎన్నో ప్రయోగాలు చేసి, తనతో బాటు వేలాదిమంది జీవితాలను నాశనం చేశాడు ఓషో. అందుకే ఆయనంటే నాకు ఒళ్ళుమంట. కానీ, నిత్యానంద అలా చెయ్యడం లేదు. అతన్ని అనుసరిస్తున్న ఎవరి జీవితాలూ నాశనం కావడం లేదు. రంజిత పరువు తనవల్ల పోయింది. అందుకే ఆమెకు తన సంస్థలో ఉన్నతమైన పదవినిచ్చాడు నిత్యానంద. ఆమె హాయిగా ఉన్నది. ఉంటుంది కూడా!  తన స్వార్ధానికి అందరినీ వాడుకొని వదిలేశాడు ఓషో. తన పొరపాటు వల్ల దెబ్బతిన్న వారిని వదిలెయ్యకుండా ఆదుకుంటున్నాడు నిత్యానంద. అదే ఓషోకూ నిత్యానందకూ తేడా !

2012 - లో రాహు - కేతుదశలో మదురై ఆదీనం అనే మఠానికి 293 వ అధిపతిగా నియమితుడయ్యాడు. మళ్ళీ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది.

2012 -  అదే సమయంలో 100 మంది ఆధ్యాత్మిక ప్రముఖులలో ఒకడిగా గుర్తించబడ్డాడు.

ఫిబ్రవరి 2013 - లో రాహు - శుక్ర - చంద్ర దశలో పంచవటి మహానిర్వాణి అఖారా అనే పీఠం ఈయనకు ' మహామండలేశ్వర్' అనే బిరుదునిచ్చింది. ఇచ్చిందనడం కంటే కొనుక్కున్నాడని అనడం బాగుంటుంది.

ఆ తరువాత ఆరేళ్ళ పాటు ఈయనను రకరకాల కోర్టు కేసులు వెంటాడాయి. ఆ సమయంలో రాహు - రవి , రాహు - చంద్ర దశలు జరిగాయి. ఇవి గ్రహణ దశలు గనుక ఇతన్ని నానా తిప్పలు పెట్టాయి.

నవంబర్ 2019 - లో ఈ వేధింపులు తారాస్థాయికి చేరాయి. వాటిని తట్టుకోలేక ఇండియా వదలి పారిపోయాడు. 2018 నవంబర్ లో ఇతడికి ఔన్నత్యమూ పతనమూ రకరకాల ఎత్తుపల్లాలూ అన్నీ చూపించిన రాహుదశ అంతమై గురు మహర్దశ మొదలైంది. జీవితం మళ్ళీ మలుపు తిరిగింది.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

2035 వరకూ ఇతనికి గురు మహర్దశ జరుగుతుంది. ఈ సమయంలో ఒక పేరుగాంచిన గురువుగా ఇతను చెలామణీ అవుతాడు. కానీ బాధలు వేధింపులు తప్పవు. కోటానుకోట్ల సంపదకు అధిపతి అవుతాడు. కానీ సంస్థలో అంతర్గత కుట్రలుంటాయి. ఇతను మొదలు పెడుతున్న కైలాస అనే దేశం అంత త్వరగా అంతర్జాతీయ గుర్తింపును పొందదు. చాలా కష్టపడవలసి ఉంటుంది. 16 ఏళ్ళ ఈ గురు దశలో ఇతను ఎంతో జీవితాన్ని చూస్తాడు. ఆయా అంతర్దశలు మళ్ళీ ఎన్నో ఉత్తాన పతనాలను చూపిస్తాయి. అవి వచ్చినపుడు వాటిని వివరిస్తాను.

ఈ దశ అయిపోయేసరికి ఇతనికి 57 ఏళ్ళు వస్తాయి. అప్పటికి పరిపక్వత వస్తుంది. వేడి చల్లారుతుంది. 19 ఏళ్ళ శని మహర్దశ మొదలౌతుంది. దానిలో మాత్రమే ఇతనికి నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం అందుతుంది, అది కూడా ముందు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉన్నపుడు మాత్రమే.