నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, సెప్టెంబర్ 2020, సోమవారం

నిత్యానంద జాతకంలో గోచార గ్రహాల పాత్ర - కొన్ని ప్రశ్నలు

గత పోస్టు చదివిన తర్వాత నేను నిత్యానందను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. ఆ ప్రమాదం మీకు లేకుండా చెయ్యడానికే ఈ పోస్ట్. అదీగాక, గత  పోస్ట్ లో గోచారగ్రహాల పాత్రను నేను చెప్పలేదు. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి కదా ! 

అందుకని, ఇప్పుడు చదవండి.

ఏలినాటి శని

పుట్టినపుడు ఎవరికైతే శనిచంద్రులు కలసి ఉంటారో వారు ఏలినాటి శని రెండవ ఘట్టంలో పుట్టినట్లు లెక్క. ఆ జాతకానికి శని యోగకారకుడైనా సరే, ఇలాంటి యోగం జాతకంలో ఉన్నపుడు ఆ జాతకుడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాడు. ఇది జాతకుడి జన్మంతా తప్పని ఒక చెడుయోగం. నిత్యానంద జాతకంలో ఈ యోగం ఉన్నట్లు మనం చూడవచ్చు. పైగా ఈ లగ్నానికి శని అర్ధపాపి. చంద్రలగ్నానికి పూర్ణపాపి. కనుక, ఈ యోగం ఒక విధమైన ఆధ్యాత్మికజీవితాన్ని ఇచ్చినప్పటికీ, ఏదో రకమైన వేధింపులు మాత్రం ఇతనికి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

పన్నెండేళ్ళ వయసులో 360 డిగ్రీల దృష్టి

అంటే అది 1990 వ సంవత్సరం. ఆ సమయంలో గోచారశని పంచమంలోను, గురువు ద్వాదశంలో ఉచ్చస్థితిలోనూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగా అనుభవాలను కలిగించే గోచారమే గనుక ఒక క్షణికమైన అనుభవాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ ఒక విషయాన్నీ గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక అనుభవాలు ఎల్లకాలం నిలబడి ఉండవు. ఆ కాసేపు ఉంటాయి. తరువాత పోతాయి. అందుకే వాటిని లెక్కపెట్టకూడదని యూజీగారు అనేవారు. జిల్లెళ్ళమూడి అమ్మగారు మహిమలను కొట్టి పారేసేవారు. 

శ్రీ రామకృష్ణులు, వారి భక్తులు కూడా మహిమలను మహత్యాలను లెక్కచెయ్యరు.  వారూ ఇదే అంటారు. అనుభవాలు శాశ్వతం కాదు. అనుభవి శాశ్వతం. ఇంకొక మెట్టు పైకెక్కితే అనుభవి కూడా లేడు. యోగి గమ్యం అది కావాలి గాని ఈ క్షణం ఉండి మరుక్షణం మాయమయ్యే చిన్నచిన్న అనుభవాలకోసం అతడు అర్రులు చాచకూడదు. సాధనామార్గంలో వేలాదిగా అలాంటి అనుభవాలు కలుగుతాయి. కానీ మనం పట్టించుకోకూడదు.

ఒకవేళ ఆ సిద్ధి అలాగే నిలబడి ఉన్నది అనుకుంటే, రంజిత వీడియో సమయంలో తన గదిలో సీక్రెట్ కెమెరా ఉన్నదన్న విషయం 360 డిగ్రీల దృష్టి ఉన్నవాడికి ఎందుకు తెలియలేదు? మూడోకన్ను అప్పుడెందుకు పని చెయ్యలేదు? రంజిత సమక్షంలో అన్ని శక్తులూ నీరుగారిపోయాయా? దీనికి సమాధానం ఉండదు. కనుక ఈ సిద్ధి ఆయనకు శాశ్వతంగా ఉన్నట్టి సిద్ధి కాదని అర్ధం కావడం లేదా?

ఇదే సంఘటనకు సమాంతర సంఘటనలు మిగతా గురువుల జీవితాలలో కూడా జరిగాయి.

ఆరిగాన్ లో తన ఇంటిని, తన గదిని షీలా వైర్ ట్యాపింగ్ చేయించినప్పుడు ఓషో తెలుసుకోలేకపోయాడు. తర్వాత, అమెరికన్ మీడియా ఆయన్ను అడిగింది - 'నువ్వు జ్ఞానివైతే నీ గదిలో జరుగుతున్నది నీకు తెలీలేదా?' అని. దానికి ఓషో ఏవేవో కాకమ్మ కబుర్లు చెప్పాడు. నవ్వుల పాలయ్యాడు.

ఎన్నో శక్తులున్నాయని చెప్పుకునే అరబిందో కూడా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మనకు స్వతంత్రం వచ్చిన రోజున, పాండిచేరి అరబిందో ఆశ్రమాన్ని నాస్తికులు ఎటాక్ చేసారు. అరబిందో వ్యక్తిగత అనుచరుడు ఆ కొట్లాటలో స్పాట్ లో చనిపోయాడు. దీనిని అరబిందో ముందుగా తెలుసుకోలేక పోయాడు. ఆపలేక పోయాడు. దీనికి ఆయన భక్తులు ఇప్పటిదాకా తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ప్రత్యక్షమై ఆపరేషన్లు కూడా చేశాడని ప్రచారం చేయించుకున్న సత్యసాయిబాబా, స్టూడెంట్స్ మర్డర్ నాటి రాత్రి, తన గదిలోకి పారిపోయి లోపలనుంచి గడియ బిగించుకుని దాక్కున్నాడు. పెద్దవయసులో ఆరోగ్యంతో పాటు శక్తులూ తగ్గిపోయాయా?  ఏంటిదంతా?

జరిగే ప్రచారాలేమిటి? జరుగుతున్న వాస్తవాలేమిటి? ఎక్కడైనా పొంతన ఉందా అసలు? పిచ్చిలోకం పిచ్చి గోల?

కనుక, ప్రతి సాధకుడికీ, గురువుకూ,  కొద్దో గొప్పో శక్తులు ఉంటాయి. కానీ ప్రచారం మాత్రం గోరంతలు కొండంతలు చేసుకుంటారు. ఇది తప్పు. ఇక్కడే ప్రతి గురువూ అతని శిష్యులూ  తప్పు చేస్తున్నారు. శిష్యుల అతిప్రచారం వల్లనే గురువులు పతనం అవుతారు. ఉన్నవీ లేనివీ ప్రచారాలు చేసి జనాన్ని మోసం చేస్తే, సమయం వచ్చినపుడు శనిభగవానుడి చేతిలో శిక్ష తప్పదు. అందుకే, గొప్పలు ఎచ్చులు పనికిరావు.

14 ఏళ్ళ వయసులో పరమశివానుభవం

అప్పుడు 1992 వ సంవత్సరం. ఆ సమయంలో గోచార శని వక్రస్థితిలో మకరంలో ఉన్నాడు. ఇది గోచారానికి షష్ఠమస్థితి, మంచిదే. పోనీ, వక్రత్వం వల్ల పంచమం లోకి వచ్చాడని అనుకుంటే ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగే అవకాశం ఉన్నది. కానీ గురువు ద్వితీయంలో కన్యలో ఉన్నాడు. కనుక ఏ విధమైన అనుభవమూ కలిగే అవకాశం లేదు. కనుక ఈ సంఘటన జరగడానికి సూచన లేదు.

1995 - 1996

సప్తమ శని, తృతీయ గురువు. ఆ సమయంలో మద్రాస్, బేలూర్ మఠాలలో బ్రహ్మచారిగా ఉన్నాడు. గురువు నవమాన్ని చూస్తూ ఒక నిజమైన ఆధ్యాత్మికసంస్థలో ప్రవేశాన్నిచ్చాడు. కానీ 1996 లో బేలూర్ మఠాన్ని వదిలేసి, హిమాలయాలకు పయనం సాగించాడు. దానికి కారణం అప్పుడే మొదలైన అష్టమశని ప్రభావం.  గురువు కూడా పంచమంలో ధనుస్సులోకి వచ్చాడు. కనుక మంత్రతంత్రాల పైకి శక్తుల పైకి మనస్సు మళ్ళింది. అందుకే, శుద్ధమైన ఆధ్యాత్మికమార్గాన్ని ప్రబోధించే రామకృష్ణమఠంలో ఇమడలేక బయటకు వచ్చాడు. సిద్ధులు శక్తుల కోసం ప్రయత్నాలు చేశాడు.

2000 సంవత్సరం ప్రాంతంలో తన తిరుగుడును ఆపి తమిళనాడులో స్థిరపడ్డాడు. అప్పటికి శని గురువులు వృషభంలో కలిశారు. అది ఈయనకు వృత్తి స్థానమైన దశమం అయింది. కనుక తన ఆశ్రమాలు, ప్రచారాలు, శిష్యులను పోగేసుకోవడం మొదలు పెట్టాడు.

ఏలినాటి శని మళ్ళీ మొదలు

2004 లో ఇతనికి మళ్ళీ ఏలినాటి శని మొదలైంది. ఇక అక్కడనుంచి ఇతనికి చెడుకాలం మొదలైంది. సినిమా యాక్టర్లు అమ్మాయిలూ చుట్టూ చేరడం మొదలు పెట్టారు. 2006 మధ్యవరకూ ఏలినాటి శని మొదటి ఘట్టం జరిగింది. తరువాత 2009 వరకూ రెండవ ఘట్టం జరిగింది. ఆ సమయంలోనే, అంటే 2008 డిసెంబర్ లోనే ఇతని జన్మనక్షత్రం అయిన ఉత్తర మీదకు శనిసంచారం జరిగింది. తరువాత కొంతకాలం వక్రించి మళ్ళీ ఆగస్ట్ 2009 లో పూర్తిగా ఆ నక్షత్రం మీదకు శని వచ్చాడు.  అక్కడనుంచీ ఇతని పతనం ప్రారంభమైనది.

ఏ మనిషికైనా ఇది జరుగుతుంది. మీరు కావాలంటే మీమీ జాతకాలలో పరిశీలించి చూసుకొండి. మీ జన్మనక్షత్రం మీదకు గాని, అనుజన్మ నక్షత్రాలమీదకు గాని శనిసంచారం జరిగినప్పుడు మీరు నానాబాధలు పడి ఉంటారు. దీనిని ఎవరూ తప్పుకోలేరు. ఇతనిది ఉత్తరానక్షత్రం. కరెక్ట్ గా ఉత్తరానక్షత్రం మీద  శని సంచరిస్తున్నపుడే రంజిత ఉదంతం జరిగింది. అక్కడనుంచి ఇతని జీవితం కష్టాలపాలు కావడం మొదలైంది. నాటకాలాడితే ఎవరైనా క్షమిస్తారేమో గాని శని భగవానుడు మాత్రం క్షమించడు.

2012, 2013 లలో శని తులారాశిలో ఇతని తృతీయంలో ఉచ్చస్థితిలో సంచారం సాగించాడు. అందుకే అన్ని బిరుదులు పదవులు వరించాయి. శని భగవానుడు ఇంతే, ఇచ్చేటప్పుడు గొప్పగా ఇస్తాడు. కోసేటపుడు దయాదాక్షిణ్యం లేకుండా కోసేస్తాడు.

ఎవరి జీవితమైనా సరే, గ్రహప్రభావం ప్రకారం ఖచ్చితంగా జరుగుతుంది. గీచిన గీత దాటదు. అర్ధం చేసుకుంటే అంతా అర్ధమౌతుంది.

ఆ తరువాత 2014 లో మొదలైన అర్దాష్టమశని అనేక వక్రత్వాల వల్ల 2017 ఫిబ్రవరి వరకూ సాగింది. ఇది ఇతనిని నానా బాధలూ పెట్టింది. కోర్టు కేసులు వెంటాడాయి. మీడియా వెంటాడింది. సమాజం ఛీ కొట్టింది. ఇదంతా మళ్ళీ శని ప్రభావమే.

ఆ తరువాత 2019 వరకూ ధనుస్సులో పంచమంలో శని సంచరించాడు. పంచమం బుద్ధిస్థానం. అప్పుడు ఇతని మనస్సు బాగా క్రుంగిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఎటు చూచినా అన్నీ సమస్యలు అడ్డంకులు కనిపిస్తున్నాయి. నిస్సహాయ స్థితిలో పడ్డాడు.

2020 ప్రారంభ్డంలో శని మకరరాశిలోకి షష్ఠరాశిలోకి ప్రవేశించాడు. గోచారశని 3, 6, 11 లలో ఉన్నప్పుడు మంచి చేస్తాడు. కనుక 2022 వరకూ ఇతనికి మంచిసమయం జరుగుతున్నది. అందుకే ఇండియా నుంచి పారిపోయి ఎక్కడో తన ద్వీపంలో తానున్నాడు. రాజ్యం ఏలుతున్నాడు.

2022 ఏప్రిల్ నుంచీ ఇతనికి కష్టాలు మళ్ళీ మొదలౌతాయి. ఎందుకంటే అప్పుడు గోచారశని ఇతనికి సప్తమంలోకి వస్తాడు. మళ్ళీ వేధింపులు మొదలౌతాయి. ఇప్పుడు తానున్న చోటనుండి మళ్ళీ ఇంకొక చోటకు పోవలసి రావచ్చు. లేదా అరెస్ట్ కావచ్చు.

2025 లో శని మీనరాశిలో, ఇతనికి అష్టమం లోకి రావడం తోనే, ఇతని పరిస్థితి మళ్ళీ గందరగోళంలో పడుతుంది. ఆ పైన మూడేళ్ళు ఇతనికి చాలా కష్టకాలమే. మళ్ళీ నానా బాధలు పడతాడు.

ఈ విధంగా గోచారశని ఇతనిని ఎన్ని బాధలు పెట్టాడో మనం చూడవచ్చు. ఈ బాధలు తప్పాలంటే ఈ క్రింది సూచనలను ఇతను పాటించాలి.

1 . తను అవతార పురుషుడనని గప్పాలు కొట్టడం మానుకోవాలి. ఇదస్సలు నిజం కాదు.

2 . తనకు లేని శక్తులు ఉన్నట్టు చెప్పుకోవడం మానుకోవాలి. ఉన్నవి ఉన్నట్టు చెప్పాలి, నిజాలు మాట్లాడాలి.  మహిమలు మహత్యాల పేరిట చిన్నపిల్లలకు చీప్ ట్రిక్స్ నేర్పించి డబ్బులు చేసుకునే దరిద్రపు అలవాటు మానుకోవాలి. 

3 . అమ్మాయిల నుంచి దూరం ఉండాలి. లేదంటే వాళ్ళవల్లనే చివరకు ఈ సంస్థ మూతబడే ప్రమాదం ఉన్నది. పెద్దపెద్ద సంస్థలన్నీ 'డబ్బు - అమ్మాయిలు' ఈ రెంటివల్లనే దెబ్బ తిన్నాయన్న విషయం మరచిపోకూడదు.

4. అపవాదులు ఎక్కడ వచ్చే అవకాశం ఉన్నదో అక్కడ జాగ్రత్తపడాలి. జనం లోకి ఎక్కువగా చొచ్చుకుపోవడం మానుకోవాలి. లోకులతో ఎక్కువగా పెట్టుకుంటే పతనమే అన్న విషయం గ్రహించాలి. లోకాన్ని లోకులను ఏకమొత్తంగా ఎవ్వరూ ఉద్ధరించలేరన్న విషయం తెలుసుకోవాలి. ఈ పని అవతారపురుషుల వల్లనే కాలేదు. ఇక మామూలు సాధకుల వల్ల, స్వాముల వల్ల ఏమౌతుంది?

5. సాధనాశక్తి తగ్గకుండా చూసుకోవాలి. డబ్బు, పేరు ప్రతిష్టలు, అమ్మాయిలు, బంగారం ఇవన్నీ చుట్టూ చేరితే సాధన భ్రష్టు పడుతుంది. అది పోతే అన్నీ పోతాయి. కనుక ఈ విషయంలో ముఖ్యంగా ఇతను చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ సూచనలు పాటిస్తే, ఈ తరానికి ఇతను ఒక గురువు అవుతాడు. లేకుంటే పతనం తప్పదు.

తస్మాత్ జాగ్రత తమ్ముడూ !