“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పుచ్చు ప్రశ్నలు - చచ్చు జవాబులు

'మంచి ప్రశ్నలు అడగండిరా బాబూ' అని ఎంత మొత్తుకుంటున్నా కూడా, నా బ్లాగు, నా పుస్తకాలు చదివేవాళ్ళు, నాకు అందని చాలా హై లెవల్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అవేమో మనకర్ధం కావు. ఏం చేస్తాం మరి? అందుకని నా చిన్ని బుర్రకు అర్ధమైన రీతిలో నా చదువరుల ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఉంటాను.

వాళ్ళ పుచ్చుప్రశ్నలకు నా చచ్చుజవాబులు ఎలా ఉంటాయో వినండి, మీకూ కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

ఒకామె ఇలా అడిగింది.

'రామమందిరం శంకుస్థాపన రాహుకాలంలో చేశారేమిటి? అలా చెయ్యవచ్చా?'

అంటే, నీకున్నంత బుర్ర మోడీగారికి అందుబాటులో ఉన్న రాజజోతిష్కులకు లేదా? వాళ్ళు పిచ్చివాళ్ళా? రాహుకాలం మనకొక్కరికే తెలుసా? ఇంకెవరికీ తెలీదా?

ఆమెకిలా చెప్పాను.

'రాహువును గంగలో కలవనీ, నీకేంటి బాధ?'

ఆమె ఊరుకోదు కదా? మళ్ళీ ఇంకో ప్రశ్న సంధించింది.

'మీరు శ్రీ విద్య ఉపాసకులు కదా? శ్రీ విద్య ఉపాసకులు ఇలాగేనా మాట్లాడేది?'

ఇలా చెప్పాను.

'శ్రీవిద్య ఉపాసకులను ఇలాంటి చెత్తప్రశ్నలా అడిగేది? ఇంతకంటే మంచి ప్రశ్నలు అడగడం మీకు రాదా? మంచి ప్రశ్నలు అడగడం ముందు నేర్చుకోండి'.

పట్టువదలని విక్రమూర్ఖురాలు మళ్ళీ ప్రశ్న వదిలింది.

'అసలు మీకు శ్రీ విద్య తెలుసా?'

ఇక నిజరూపదర్శనం ఇవ్వక తప్పేటట్టు లేదనిపించి, ఆమెకు ఇలా జ్ఞానబోధ గావించాను.

'చూడమ్మా. ఎప్పుడో కాలేజిరోజుల్లో శ్రీవిద్య ఉపాసన చేసేవాడిని. కానీ శ్రీవిద్య ముసలిదైపోయింది. అందుకని శ్రీదేవి ఉపాసన మొదలుపెట్టాను. అదీ చచ్చిపోయింది. ఇప్పుడు వేరే దేవత ఉపాసన మొదలుపెట్టాను. నువ్వొక పని చెయ్యి. నీకు ఆధ్యాత్మిక రహస్యాలన్నీ బాగా అవగతం కావాలంటే, ఒక దేవతా ఉపాసన ఉపదేశిస్తాను. నువ్వు రజనీకాంత్ ఉపాసన చెయ్యి. పోనీ ఆయన ముసలాడై పోయాడని నీకనిపిస్తే, నీ ఇష్టం వచ్చిన కుర్రహీరోను ఎంచుకుని వాడి ఉపాసన చెయ్యి. అప్పుడిలాంటి చచ్చు సందేహాలు రాకుండా ఉంటాయి. ఇక నీ పుచ్చుప్రశ్నలతో నన్ను బాధపెట్టకు. నిన్ను బ్లాక్ చేస్తున్నాను. బై'.

మరికొంతమంది నన్ను 'గురూజీ' అని పిలిస్తే నేను ఫ్లాట్ అయిపోతానని అనుకుంటూ ఉంటారు. ఆ పదమంటే నాకు పరమ ఆసహ్యమన్న సంగతి వాళ్లకు తెలీదు. తెలీనితనం వల్లనో, మరెందుకనో గాని, లోకంలో అలవాటైన జిత్తులను నా దగ్గర ప్రదర్శిస్తూ ఉంటారు. తల బొప్పి కట్టించుకుంటూ ఉంటారు.

ఇంకొక సందేహసుందరం ఇలా అడిగాడు.

'గురూజీ ! మీ దగ్గర కర్ణపిశాచి, వటయక్షిణి ఉన్నారని తెలిసింది. ఆ విద్యలను నాకు పరిచయం చేస్తారా?'

అతనికి ఇలా చెప్పాను.

'సారీ బాబు ! మొన్నటిదాకా నా దగ్గరే ఉండేవాళ్ళు. నిన్న షాపింగ్ కని బయటకెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఈ మధ్యనే వాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చి తగ్గింది కూడా. ఏమైపోయారో తెలియడం లేదు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లెయింట్ కూడా ఇచ్చాను. వాళ్ళు భద్రంగా తిరిగి వస్తే అప్పుడు నీ సంగతి ఆలోచిస్తా'.

మనవాడు అంత త్వరగా వదలడు కదా ! అలా వదిలితే అలాంటి విద్యలను ఎందుకు కోరుకుంటాడు?

'జోకులాపండి సార్ ! పోనీ మీకు ఇంకేం విద్యలు వచ్చో చెప్పండి అవి నేర్చుకుంటాను. మీరేం చెబితే అది చేస్తాను. మీరే నా గురువు దైవం కూడా'.

నాకు భలే నవ్వొచ్చింది.

'ఈ రకంగా 'మీరే నా గురువు, మీరే నా దైవం, మీ తర్వాతే ఎవరైనా' అని పెద్దపెద్ద డైలాగులు చెప్పిన దగుల్బాజీలను చాలామందిని గతంలో చూచాను. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నవి నా దగ్జర సాగనప్పుడు వాళ్ళే నన్ను నానామాటలూ అన్నారు. అలాంటి రోడ్ బేవార్స్ గాళ్ళు చాలామంది గతంలో నా శిష్యులే గనుక మళ్ళీ మళ్ళీ మోసపోదలుచుకోలేదు. ఇవన్నీ అవసరార్ధం మాట్లాడే మాటలని నాకు బాగా తెలుసు.

'చూడు బాబు. నాకే విద్యలూ తెలీదు. నా ఇంట్లో ఏ దేవతలూ పనిమనుషులుగా పని చెయ్యడం లేదు. నీ కోరికలు నేను తీర్చలేను. లోకంలో చాలామంది దొంగ గురువులు నీకు సరిపోయేవాళ్ళున్నారు. వాళ వెంటపడు. ఇక నాకు మెయిల్స్ ఇవ్వకు. ఇచ్చావంటే నిన్ను బ్లాక్ చేస్తాను. గుడ్ బై'.

ఇంకొకామె ఇలా ప్రశ్నించింది.

'సంకల్పానికి క్రతువుకి తేడా ఏమిటి?'

'అంత పెద్ద పెద్ద ప్రశ్నలు నాకర్ధం కావమ్మా. నేనంత చదువుకోలేదు. నా స్థాయి ప్రశ్నలు నన్నడుగు' అన్నాను.

'అదేంటండి. ఈ మాత్రం అర్ధం కాకపోతే, మీరసలు గురువెలా అవుతారు?' అంటుంది.

ప్రతివాళ్ళూ ఇదే గోల ! అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వాళ్ళ అవసరాలుంటే 'గురువుగారు, గురువుగారు' అంటారు. అవసరాలు తీరాక 'నువ్వేం గురువ్వి?' అంటారు. వినీ వినీ ఈ మాటంటేనే నాకు చీదర పుడుతోంది. చెత్త మనుషులు చెత్త మాటలు !

ఈమెకిలా కాదని ' సరే చెప్తా వినమ్మా. మీ ఆయన నిన్నేమైనా చెయ్యాలనుకుంటే అది సంకల్పం. చేస్తే అది క్రతువు' అన్నా.

ఆమెకు భలే కోపమొచ్చేసింది. ఎట్ లీస్ట్ అలా నటించింది.

'ఏంటండి? అలాంటి అసభ్యమైన మాటలు?' అంది

'నేనన్నదాంట్లో అసభ్యం ఏముందమ్మా? అసభ్యత ఉంటే గింటే నీ మనసులో ఉందేమో? అందుకే నేను మామూలుగా అన్న మాటకూడా నీకు అసభ్యంగా కనిపిస్తోంది.  పోనీ నీకెలా కావాలో చెప్పు అలాగే చెప్తా' అన్నాను.

అంతే, ఆ దెబ్బతో మళ్ళీ ఆమె మాట్లాడితే ఒట్టు !

ఇంకొక మహనీయుడు ఇలా అడిగాడు.

'గురుగారు ! మీరు కర్ణపిశాచి గురించి తెగ రాశారు. అసలెన్ని పిశాచాలున్నాయి సార్ మీ ఎరుకలో?'

అదేంటో గాని, ఎన్ని ఉన్నతమైన విషయాల గురించి వ్రాసినా, జనాలు కర్ణపిశాఛి గురించే మాట్లాడుతూ ఉంటారు. పిశాచాలంటే ఎంత ముద్దో మనకి?

అతనికి ఇలా చెప్పాను. 

'చాలా ఉన్నాయి నాయన ! కానీ మనకు ఉపయోగ పడేవి మూడే'

'ఏంటి గురూజీ అవి?'

'శ్రద్ధగా విను నాయన ! ఒకటి కర్ణపిశాచి, రెండు కామపిశాచి , మూడు ధనపిశాచి'

'అబ్బ ! ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ'

'ఏం నాయనా నీకు కర్ణపిశాచి కావాలా?' అడిగాను.

'ఇప్పటిదాకా అదే అనుకున్నాను గురూజీ. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను'.

విషయం అర్ధమైంది నాకు.

'ఇప్పుడెవరు కావాలి నాయన?'

'అదే ... అదే... కా... కా.... కా...' అని కాకిలా అరుస్తున్నాడు.

'అర్ధమైంది నాయనా నీ బాధ ! కానీ ధ ధ ధ లేకుండా కా కా కా వస్తే నువ్వు తట్టుకోలేవు నాయన'

'అదేంటి గురూజీ?'

'ధనపిశాచి నీ దగ్గర లేకపోతే కామపిశాచిని నువ్వేం భరిస్తావురా పిచ్చివాడా ?'

'మరి మార్గం లేదా గురూజి? మీ  దగ్గర ఈ ముగ్గురూ ఉన్నారా?' దీనంగా అడిగాడు.

'ఉన్నారు నాయన ! చిన్నప్పుడు కర్ణపిశాచి ఉపాసన చేశాను. మాంఛి వయసులో ఉన్నపుడు కామపిశాచి ఉపాసన చేశాను. ఇప్పుడు ధనపిశాచిని పట్టుకున్నాను'.

'అదేంటి గురూజీ? మీరు గురువు కదా మీకు ధనం ఎందుకు?'

నవ్వుతో నాకు పొలమారింది.

'హోరి పిచ్చివాడా ! డబ్బెవరికి చేదురా? మీలాంటి మామూలు మనుషులకే ఇంత డబ్బు యావ ఉంటె, ఇక మాలాంటి గురువులకి ఇంకెంతుండాలి? మీది ఒక చిన్న కుటుంబం నాయనా, మాది విశ్వకుటుంబం. ఒక చిన్న ఫేమిలీ నడపడానికే నీకు కిందా మీదా అవుతుంటే, ఇక ఈ విశ్వకుటుంబం నడపాలంటే  మాకెంత కావాలి? ఆలోచించు. మీ డబ్బంతా మాక్కావాలి. మీది కాజెయ్యటానికే  మేమున్నది. మా దాహం అనంతం నాయనా ! మాకు అన్ని దాహాలూ ఎక్కువే. ఎక్కువైతేనే గురువౌతాడు. తక్కువగా ఉంటె మామూలు మనిషౌతాడు. అసలు లేకపోతే అక్కాయౌతాడు'. అన్నాను.

శిష్యుడు పట్టించుకునే మూడ్ లో లేడు. 

'నాకా మూడూ అర్జంటుగా కావాలి గురూజీ. ఉపదేశం చేస్తారా?' ఆక్రోశించాడు.

'ఛస్తే చెయ్యను'

'అదేంటి గురూజీ? నువ్వే నా దేవుడు. నువ్వే నా అమ్మా నాన్నా అన్నీ. నువ్వే కాదంటే నేనెక్కడికి పోవాలి గురూజీ. నువ్వేం చెబితే అది చేస్తా. కావాలంటే నీ ఎంగిలి తినమన్నా తింటా !' భోరుమన్నాడు.

అసహ్యమేసింది. 

'ఛీ ఛీ ... నీ లాంటి బొచ్చెల్ని చిన్నప్పుడే బోల్డుమందిని చూశాన్రా బొండ్లే. నా దగ్గర నాటకాలెయ్యకు. నువ్వు నన్ను గురూజీ అనగానే నీకన్నీ చెప్పెయాలా? మా నాయనే. ఏళ్ళకేళ్ళు నాకు సేవ చేస్తున్నవాళ్ళకే ఇక్కడ దిక్కు లేదు. నువ్వీరోజు వచ్చి బిస్కెట్ వేస్తె పడతానని అనుకున్నావా వెర్రినాగన్న? అది జరిగేపని కాదుగాని, సందుల్లో గొందుల్లో వెతుక్కో, కొండదొరలు, కోయదొరలు ఉంటారు. వాళ్ళ కాళ్ళు పట్టుకో పోయి' అన్నాను  అతన్ని బ్లాక్ చేశాను.

కొద్ది రోజుల తర్వాత దొంగ ఈ మెయిల్ ఐడీలతో తిడుతూ మెయిల్స్ రాసాగాయి. వీడి పని ఇలా ఉందా అని మా ఫ్రెండ్ ఒక ఎస్ పీ కి పోన్ చేసి విషయం చెప్పా.

'వాడి అడ్రస్ తెలుసా నీకు?' అడిగాడు ఎస్ పీ.

'తెలీదు. కానీ పట్టుకోడం పెద్ద కష్టం కాదు. ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు' చెప్పాను.

'సరే. అడ్రస్ కనుక్కో. వాణ్ని బట్టలిప్పి తలక్రిందులుగా వేలాడదీసి నీ ఎదురుగానే ఉతుకుతా. చూద్దువు గాని' అన్నాడు నవ్వుతూ.

'అంతవద్దులే. చస్తాడు అర్భకపు వెధవ. రోడ్ బేవార్స్ గాడు. మన స్థాయి కాదు వాడిది' చెప్పాను.

'సరే, మళ్ళీ నీకు ఎబ్యూసివ్ మెయిల్స్ ఇస్తే, నాకు చెప్పు, తోలు తీస్తా వాడిది' అన్నాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

ఇంకొక మెంటల్ కేసు ఈ మధ్యనే ఇలా అడిగింది.

'గురూజీ, నాకు శరీరం బయటికి వచ్చి సూక్ష్మశరీరంలో తిరగాలని ఉంది. మీకు తెలుసా ఈ విద్య?'

'ఓ ! ఎందుకు తెలీదు? చాలా వీజీ' చెప్పా.

'నాకు చేయిస్తారా?' అడిగింది.

'తప్పకుండా. కాకపోతే ఒకటే సమస్య ! బయటకు పంపడం వరకూ నాకు  బాగా తెలుసు. లోపలి తేవడం మాత్రం తెలీదు' అన్నాను.

'మరి అపుడు నేనేమౌతాను?' అడిగింది.

'దయ్యమౌతావు' అన్నాను.

'బాబోయ్ నాకసలే దయ్యాలంటే భయం ! అలాంటి మాటలు చెప్పకండి గురూజీ' అరిచింది.

'అంత ఒంటూపిరిదానివి? నీకెందుకే సూక్షశరీరప్రయోగాలు? నోర్మూసుకుని చెప్పిన సాధన చెయ్యి' అన్నా.

ఇంకొక అత్యాశా శిష్యుడు ఇలా అడిగాడు.

'గురూజీ. సంస్కారాలు ఎలా నాశనం అవుతాయి?'

వీడు నోరు తెరిస్తే అబద్దాలు చెబుతాడని, చాడీలు చెబుతాడని, కుట్రలు చేస్తాడని నాకు తెలుసు.

'చూడు నాయన. ముందు సంస్కారం నేర్చుకో. ఆ తర్వాత అవి ఎలా పోతాయో చెబుతా. సంస్కారం ఉన్నవాడికి కదా సంస్కారనాశనం? నీకు లేనిదే అది. కనుక ముందు అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఇక్కడి మాటలు అక్కడా అక్కడి మాటలు ఇక్కడా చేరవేయ్యడం మానుకో. నిజాయితీగా కొన్నాళ్ళు అయినా  బ్రతుకు. ఆ తర్వాత ఆలోచిద్దాం' అన్నా.

ఇలా రకరకాల పిచ్చోళ్ళు మనకు తగులుతూ ఉంటారు. చెబితే వినరు. వాళ్లకి అర్ధం కాదు.  వీళ్ళతో పడలేక నా ఫోన్ నంబర్ మార్చి పారేశా. ఒక్క మెయిల్స్ లో మాత్రమే వీళ్ళతో మాట్లాడుతున్నా. అప్పటికీ ఎలాగో నా నంబర్ కనుక్కొని వాట్సప్ లో కదిలిస్తూ ఉంటారు. ఈ విధంగా గడ్డి పెట్టించుకుంటూ ఉంటారు.

నేను చెప్పేది చేసే శిష్యులు నాకు కావాలి గాని, వాళ్ళ పిచ్చిని నా ద్వారా సాగించుకుందామని అనుకునే నాటకాలరాయుళ్ళు నాకక్కర్లేదు. అలాంటి వాళ్ళు బొక్కబోర్లా పడటమే చివరకు జరిగేది. నా దారిలో వినయంగా నాతో నడిచేవాళ్ళు నాతో మిగులుతారు. మిగతావాళ్ళు పోతారు. అంతే.

చచ్చుప్రశ్నలు పుచ్చుప్రశ్నలు కాదురా బాబు, కాస్త స్థాయి పెంచుకొండిరా. ఎప్పుడూ బురదలోనే దొర్లకండిరా. కాస్త ఆకాశంలో ఎగరడం కూడా నేర్చుకోండి. ఉన్నతంగా బ్రతకడం, ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి. అని మొత్తుకొని చెబుతున్నా. వింటారా? అబ్బే ! వింటే వీళ్ళు ఇలా ఎందుకుంటారు?

ఎప్పుడు బాగు పడతారో ఏంటో ఎర్రి జనాలు?