“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

17, నవంబర్ 2020, మంగళవారం

Online Sri Vidya - 3

'త్వరలో నేను హైదరాబాద్ వస్తున్నాను. అప్పుడు ఫలానా వాళ్ళింట్లో ఉంటాను. అక్కడ కలుద్దాం. అందరం' అన్నాడు స్వామీజీ.

'ఓ అలాగే గురూజీ' అని అందరూ అరిచారు.

'అప్పటికప్పుడే 'శ్రీవిద్య కోర్స్' అంటూ ఒక వాట్సప్ గ్రూపు మొదలైపోయింది.  అందరూ అందులో జాయినయ్యారు. సమాచారం అంతా అందులో పెడదామని నిశ్చయించుకున్నారు అందరూ.

అందరూ పసుపుముద్దలని చేసుకుని రోజూ లక్ష్మీగణపతి మంత్రంతో దానికి తర్పణాలు వదలడం మొదలుపెట్టారు.

అసలు లక్ష్మీగణపతిమంత్రం అంత ఘోరమైన స్వార్ధపూరిత మంత్రం ఇంకొకటి లేదు నా దృష్టిలో. స్వార్ధం బాగా కరుడుగట్టిన మనుషులే దానిని జపిస్తారని నా నమ్మకం. నా నమ్మకానికి వెనుక చాలా గట్టి  ఆధారాలున్నాయి.  ఇది వ్రాస్తూ ఉంటె, గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

కొన్నేళ్ళ క్రితం కొంతమంది పెద్దమనుషులు నా దగ్గరకు వచ్చి లక్షీగణపతి మంత్రం ఉపదేశం కావాలని అడిగారు.

'ఎందుకు?' అని నేనడిగాను.

'అది చేస్తే డబ్బులు తేరగా వస్తాయట కదా ! మనుషులు వశమౌతారట కదా !' అని ప్రశ్నించారు ఆ ఆశపోతులు.

వాళ్ళలా అనుకోడంలో తప్పు లేదుమరి. అందులో - 'సర్వ జనం మే వశమానయ స్వాహా  స్వాహా' అని ఉంటుంది. అంటే - 'అందరు జనాల్నీ నాకు వశం చెయ్యి' అని అర్ధం. అంతకంటే దరిద్రమైన ఆలోచన ఇంకొకటి ఉండదని నేనంటాను.  అది స్వార్ధానికి పరాకాష్ట. 'స్వార్ధం తగ్గించుకోండి' అని చెప్పే నేను అలాంటి మంత్రాలు ఎందుకు ఉపదేశం చేస్తాను?

నాకు చీదర పుట్టింది.

'మీమీ పెళ్ళాలు మీరు చెప్పిన మాట వినరు. మీకు లోకమంతా వశం కావాలా? దురాశకైనా అంతుండాలి. అసలు లక్ష్మిని గణపతినీ కలిపిన దరిద్రుడెవరో ముందు నాకు చెప్పండి. ఆ తర్వాత ఆ మంత్రం సంగతి ఆలోచిద్దాం' అన్నాను.

వాళ్లకు నేనొక వింతమనిషిలా కనిపించాను. సరే మనం కాదంటే ఆ హోమాలు చేసేవాళ్ళు బొచ్చెడుమంది ఉన్నారు కదా లోకంలో. ఎవడినో ఒక చీప్ పూజారిగాడిని పట్టుకున్నారు. ఆ హోమాలూ గట్రా చేసుకుంటున్నారు. లోకమంతా వాళ్లకు వశమౌతుందన్న భ్రమలో, తాము మహాభక్తులమన్న భ్రమలో బ్రతుకుతున్నారు.

ఎప్పుడో జరిగిన ఈ సంఘటనను పక్కనపెట్టి 'మరి వచ్చాడా హైదరాబాద్ కి?' అడిగాను.

'ఇది జరిగిన ఒకవారం తర్వాత వీకెండ్లో హైదరాబాద్ కి వచ్చాడు. ఆయన చెప్పినట్లే ఒక శిష్యుడి ఇంట్లో అందరం కలిశాం' అన్నాడు రవి.

'ఆ ఎపిసోడ్ ఏమైందో చెప్పు మరి?' అడిగాను.

ఒక సూపర్ పోష్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది ఆ ఇల్లు. అక్కడ సమావేశమైన వారిలో అందరూ బాగా రిచ్ గా కనిపిస్తున్నారు. ఆడాళ్ళయితే ఒంటినిండా బంగారం దిగేసుకుని గంగిరెద్దుల్లా ఉన్నారు. అదీఇదీ మాట్లాడాక స్వామీజీ భార్య లోపలనుంచి ఒక కేజీ పసుపు తెచ్చి అక్కడ గుట్టగా పోసింది. దానితో అందరిచేతా పసుపుముద్దలు చేయించి గణపతి తర్పణాలు ఆయన ఎదురుగా చేసి చూపించమని ప్రాక్టికల్ క్లాసు పెట్టాడు స్వామీజీ.

'అందులో నువ్వు పాసయ్యావా లేదా?' అడిగాను.

'ఏముంది? అదేమన్నా పెద్ద పరీక్షా ఏంటి? చిన్నప్పుడు చూశాం ఇలాంటివన్నీ' అన్నాడు రవి.

'ఆ తర్వాతేమైంది?'

'అందరికీ బాలామంత్రం, వారాహిమంత్రం ఉపదేశించి జపించమన్నాడు. అప్పటికే అక్కడున్న ఆడాళ్ళు ఆ మంత్రాలన్నీ గడగడా చదివేస్తున్నారు. ఆ బీజాక్షరాలూ అవీ వింటుంటే ఏవో క్షుద్రమంత్రాల లాగా ఉన్నాయి. ఆ ఆడాల్లందరూ అలా వేషాలేసుకుని ఆ భయంకరమైన మంత్రాలు చదువుతూనే నాకు భయమేసింది. బిక్కమొహమేసుకుని చూస్తుంటే,  మధ్యమధ్యలో వాళ్ళ గురువుగారి గురించి చెప్పాడు'

'ఓహో ఈయనకు ఇంకొక గురువా?' అన్నాను.

'అవును. ఆయనను ముచ్చటగా గుగ్గురువు అని పిలుచుకుందాం' అన్నాడు రవి.

'ఒకే ప్రొసీడ్' అన్నా.

'ఇప్పుడు విను జోకు. 'గుగ్గురువు గారు చూసే చూపు ఎంత పవర్ ఫుల్ గా ఉండేదో తెలుసా?' అని మమ్మల్ని అడిగాడు. తెలీదని అందరం గేదెల్లా తలలూపాం. నేను మొదటిసారి ఆయన్ను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూసిన చూపుతో 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్' అన్న పాట నా మనసులో మెదిలింది' అన్నాడు గురూజీ. అనడమేకాదు రాగయుక్తంగా పాడి మరీ చూపించాడు' అన్నాడు రవి.

నవ్వీ నవ్వీ నాకు దగ్గొచ్చింది.

'అదేంటి మీ గురువు మొగాడే. గుగ్గురువు కూడా మొగాడే. ఒక మొగాడిని ఇంకొక మొగాడు అలా చూశాడంటే ఇద్దర్లో ఒకడు ఖచ్చితంగా తేడాగాడై ఉండాలి' అన్నా.

'ఏమో నాకూ అలాగే అనిపించింది అది విన్నప్పుడు' అన్నాడు రవి.

'గుగ్గురువు ఎక్కడున్నాడు' అడిగా.

'హార్ట్ ఎటాక్ వచ్చి పోయాట్ట కొన్నేళ్ళ క్రితం'  చెప్పాడు.

'అంతలా అందర్నీ చూసేవాడి హార్ట్ ఎన్నాళ్ళు పనిచేస్తుందిలే పాపం ! అయినా, మీరు వెళ్ళిన పనేంటి? ఆ పాటేంటి? ఏమైనా మ్యాచ్ అవుతోందా అసలు?' అడిగా నేను.

'అదే నాకూ అర్ధం కాలేదు. స్వామీజీకి చిన్నవయసు కూడా కాదు. ఏదో ముచ్చట పడుతున్నాడులే అనుకోడానికి. ఆయనకు డబ్బై పైనే ఉంటాయి' అన్నాడు రవి.

'హతవిధీ' అనుకున్నా మనసులో.

'ఇదిలా జరుగుతూ ఉండగా ఇంట్లోనుంచి ఇంకొకామె వచ్చి అయన చెవిలో 'గురూగారు ! వాళ్ళు లైన్లో ఉన్నారు. వస్తారట. మీరిచ్చిన క్యాష్ ఇమ్మంటారా వాళ్లకి?' అని అడిగింది.

'ఈ క్రొత్త క్యారెక్టర్ ఎవరు? అడిగా. 

'అంజలి అని స్వామీజీకి ప్రధానశిష్యురాలట. అక్కడ మొత్తం ఈమెదే హవా నడుస్తుంది. అంతేకాదు ఈమెకీ స్వామీజీ భార్యకీ అస్సలు పడదు. ఒక చిన్న ఇష్యూమీద, మా ఎదురుగానే 'నువ్వేంటే, నువ్వేంటే' అని ఇద్దరూ కీచులాడుకున్నారు' అన్నాడు రవి.

పడీ పడీ నవ్వా మళ్ళీ.

'కలబడ్డారా?' అడిగా.

'ప్రస్తుతానికి లేదు. ఊరకే తిట్టుకున్నారు. ఆ సీన్ కూడా చూస్తానేమో ముందుముందు' అన్నాడు. 

'అదంతా చూసి కూడా అక్కడే కూచున్నావు చూడు. నువ్వసలు గ్రేట్' అన్నా నేను.

'నేనే కాదు. అక్కడేదో పెద్ద తతంగం ఉంటుందని మా ఆవిడని కూడా తీసుకెళ్లా చూడు అక్కడ పోయింది నా పరువు. ఆమెకేమో ఈ రకమైన లేబర్ గోల అస్సలు నచ్చదు. నాకోసం నాలుగుగంటలు భరిస్తూ కూచుంది. చివర్లో లేవబోతే లేవలేక కాళ్ళు పట్టుకుపోయాయి మా ఇద్దరికీ' అన్నాడు రవి.

'అదేంటి? నేలమీద కూచున్నారా అంతసేపు? మరి స్వామీజీ?' అడిగాను.

'ఆయన హాయిగా సోఫాలో కూచున్నాడు. చేరోపక్కనా భార్యా, అంజలమ్మా కూచున్నారు' అన్నాడు.

పడీ పడీ నవ్వాను మళ్ళీ.

'నా మాట వినకుండా వెళ్ళినందుకు బాగా శాస్తి జరిగింది నీకు. నువ్వు వెళితే వెళ్లావు, సిస్టరెందుకు నీకు తోడు?' అన్నా.

'నా ఖర్మ ! ఏవో మంత్రాలు చెబుతాడని వెళ్ళా. నేన్రాను అంటున్నా వినకుండా తనని కూడా తీసికెళ్ళా' అన్నాడు.

'ఆ మంత్రాలన్నీ నెట్లో శుభ్రంగా దొరుకుతాయి. ఎవరినీ అడగక్కరలేదు. పోనీ ఉపదేశం చేశాడా?' అడిగాను.

'ఏమీ లేదు. ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చి, మంత్రాలన్నీ అందులో ఉంటాయి. జపించుకోండి అన్నాడు'

'మరి నాలుగ్గంటల పాటు నేలమీద కూచొని ఏం చేశారు?' అడిగాను.

'ఒక పళ్ళెంలో శ్రీచక్రం పెట్టి రకరకాల మంత్రాలతో దానికి పసుపు కుంకుమలతో పూజ చేయించాడు . ఆ తర్వాత ఆ శ్రీచక్రాలు మమ్మల్ని కొనుక్కోమన్నాడు'

'ఎంతట?'

'మామూలుది 15,000 ట, వెండిది 25,000 ట, ఎనర్జీ నింపినది 50,000 ట'.

'మరి కొనుక్కున్నావా?' అడిగా

'అంత అప్పారావులాగా కనిపిస్తున్నానా?' అన్నాడు రవి.

'మొన్నేమో వెంకట్రావన్నావ్ ఇప్పుడు అప్పారావంటున్నావ్ ఏంటి?'

'ఇంకా చాలామంది వస్తార్లె సమయాన్ని సందర్భాన్ని బట్టి, ఇంకోజోకు విను. శ్రీచక్ర పూజ అయ్యాక - 'ఇప్పుడు శివుడికీ అమ్మవారికీ పెళ్లి జరిగింది. అందుకని బూబంబంతి ఆడించాలి వాళ్ళని. ఆడాళ్ళు ఎవరన్నా ఒక పాట పాడండి' అన్నాడు స్వామీజీ'

ఈ సారి నవ్వి నవ్వి నాకు కడుపులో నొప్పి మొదలైంది.

'నాయనా ! నేనిక నవ్వలేను. ఏంటీ? శివుడికీ పార్వతికీ పెళ్ళిచేసి బూబం బంతి ఆడించారా మీరు? దానికొక పాటా? దీనిని శ్రీవిద్య అంటారా? సర్లే ఏదో ఒకటి, చివరికి నువ్వే పాడావా పేరంటం పాట?' అడిగాను నవ్వుతూనే.

'అదే విచిత్రం. అంతమంది ఆడాళ్ళున్నారుకదా అక్కడ. ఒక్కదానికీ పేరంటం పాటలు రావు. అదేంటో మరి?' అన్నాడు.

'ఇప్పుడవన్నీ ఎవరికీ గుర్తున్నాయి? టీవీ సీరియల్స్ లో వచ్చే జింగిల్స్ పాటలు చెప్పమంటే చెప్తారు నేటి ఆడాళ్ళు. వాళ్లకి పెళ్లిపాటలూ, పేరంటంపాటలూ ఎక్కడ గుర్తున్నై?' అన్నా నేను.

'ఏ ఆడదీ పాడకపోతుంటే, చివరకు స్వామీజీనే పాడాడు ఒక పాట. అదేంటో ఊహించు?' అడిగాడు రవి.

'ఏముంది? 'పార్వతీ కళ్యాణవైభోగము చూడరే సతులాల! పరగయందరి యుల్లములే రంజిల్లగా ' అనే పాటేగా, చాలాసార్లు విన్నాలే' అన్నా నేను.

'అదికాదు. ఓల్డ్ హిందీ సాంగ్ అందుకున్నాడు ! 'ఆధా హై చంద్రమా రాత్ ఆధీ, రేహన్ జాయే తేరీ మేరీ బాత్ ఆధీ ములాకాత్ ఆధీ ఆధాహై చంద్రమా ' అని పాడాడు' అదిట శివపార్వతుల బూబం బంతి పాట !' అన్నాడు రవి నీరసంగా.

నాకు వాయిస్ రాలేదు.

'అదేంటి? ఆపాటా? నిజంగానా?' అనడిగాను ఆశ్చర్యపోతూ.

'అవును. పైగా, మేం అడుగుతామని ఊహించి, 'ఏం? ఇదేం తప్పు పాట కాదు. ఫస్ట్ నైట్ కి ఈ సాంగ్ చాలా బాగుంటుంది' అని ముక్తాయింపు కూడా ఇచ్చాడు' అన్నాడు.

ఈసారి నాకు నవ్వు రాలేదు. ఏడుపొచ్చింది.

'పాపం జాలిపడు. తీరని కోరికలేమో స్వామీజీకి? అయితే, శ్రీవిద్యలో భాగంగా ఆ మంత్రాలతో పాటు ఆ పాటని కూడా కంటస్తం చేయ్యమన్నాడా మిమ్మల్ని?' అడిగాను.

'అదొక్కటే తక్కువ ఈ జన్మకి? ఎందుకెళ్లాన్రా దేవుడా? అని తిట్టుకోని క్షణం లేదు' అన్నాడు మళ్ళీ నీరసంగా.

'సరే అలా అయిందన్నమాట నీ ఉపదేశ ప్రహసనం?'

'అవును. చివర్లో కాళ్ళు పట్టుకుపోయి లేవలేకపోతే, ఎవరో పట్టుకుని నన్నూ నా భార్యనీ పైకి లేపారు. అంతసేపు క్రింద బాసింబట్లు వేసుకుని కూచోడం అలవాటు లేదుగా మనకి' అన్నాడు.

'ఇక ఇంటికి బయల్దేరావా?' అడిగా

'ఆ ! కుంటుకుంటూ బయటకొస్తుంటే గోడకున్న ఫోటోలలో ఒక ఫోటో కనిపించింది. అయిదేళ్ళ క్రితం రిషీకేష్ యాత్ర గ్రూప్ లో ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ ఫోటో వాళ్ళదగ్గర చూశా' అన్నాడు.

'ఓహో ! అప్పట్లో నాకు చెప్పిందిలే. ఎవరో ఒక గురువుతో హిమాలయయాత్ర కెళ్లానని. ఈయనేనా ఆయన? అయితే ఆ గ్రూపులో కంటిన్యూ అవుతోందా? అప్పుడే అనుకున్నా ఎవడో ఒక దొంగగురువు చేతులో ఖచ్చితంగా ఇరుక్కుంటుందని' హాశ్చర్యపోయా మళ్ళీ.

(ఇంకా ఉంది)