రవి ఆ ఫోటోని చూస్తుంటే అంజలమ్మ దగ్గరకొచ్చి "ఏంటి చూస్తున్నారు?' అనడిగింది.
'ఈ ఫోటోలో అమ్మాయి మాకు తెలుసు' అన్నాడు రవి
'ఆ అమ్మాయి మాతో హరిద్వార్ రిషీకేష్ యాత్రకొచ్చింది. మేమంతా కలసి నేపాల్ కూడా వెళ్లాం. అప్పుడే వరదలొచ్చి రిషీకేష్ మునిగిపోయింది' అంది అంజలమ్మ.
'ఓ! మీరు పాదం పెట్టినప్పుడేనా అంత ఉపద్రవం వచ్చింది?' అన్నాడు రవి నవ్వుతూ.
కోపంగా చూసింది అంజలమ్మ.
'అబ్బే! నా ఉద్దేశం అది కాదు. పాపం ఎక్కువైపోతే అలాంటివి జరుగుతాయని అంటారు కదా. అర్ధంకాక అలా అడిగాను.' అన్నాడు రవి.
'పాపం ఎక్కువై కాదు. మేము అక్కడ పాదం పెట్టినందుకు అక్కడ ఆల్రెడీ ఉన్న పాపం వరదల రూపంలో ప్రక్షాళన అయింది' అందిట అంజలమ్మ.
'పోనీలెండి ఏదో ఒకటి. నాకెందుకు? ఇంతకీ ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుందో?' అడిగాడు రవి.
'అమెరికాలో ఉంది. ఈ అమ్మాయి మీకెలా తెలుసు?' అడిగింది అంజలమ్మ
'అప్పట్లో కొన్నాళ్ళు మా ఫ్రెండ్ తో టచ్ లో ఉందిలే. అలా తెలుసు' అన్నాడు రవి.
వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా స్వామీజీ బయటకొచ్చాడు. అందరూ మెల్లిగా బయలుదేరుతున్నారు. వాళ్ళలో బాగా బంగారం దిగేసుకున్న ఒకామెని చూసి స్వామీజీ ' ఏమ్మా ! ఇందాక శ్రీచక్రానికి పూర్ణాహుతి తర్పణం చేయించా కదా? అప్పుడు మీ ఒంటిమీదున్న బంగారం అంతా అక్కడ అర్పించి వెళ్ళాలి. నిలువు దోపిడీ అన్నమాట ! అలా బంగారం వెనక్కు తీసుకెళితే అమ్మవారికి కోపం వస్తుంది' అన్నాడు నవ్వుతూ.
నిజమేనేమో అని ఆమె చాలా కంగారు పడిపోయింది.
అదిచూసి స్వామీజీ విరగబడి నవ్వుతూ 'ఏం భయమేసిందా? ఊరకే జోకేశాలే. ఆ బంగారం అంతా అర్పించమంటే, నువ్వుకూడా 'జంప్ జిలానీ షేక్ సుభానీ' అయిపోతావు. మళ్ళీ రావు'. అన్నాడు.
'ఓరి నీ బంగారం పిచ్చీ!' అనుకున్నాడు రవి మనసులో.
'అంటే కొంతమంది అలా మానేస్తూ కూడా ఉంటారా?' అడిగాడు భయం భయంగా.
స్వామీజీ ఏదో చెప్పబోయేలోపు అంజలమ్మ కల్పించుకుని 'ఆ ! ఎందుకు మానరు? బోలెడుమంది అలా మానేసినవాళ్ళున్నారు. పూర్ణదీక్ష తీసుకున్న తర్వాతకూడా అడ్రస్ లేకుండా పోయినవాళ్ళున్నారు. మెంటల్లో రకరకాలు మరి! మీ ఫ్రెండ్ కూడా అలా మానేసినదే. స్వామీ ! ఈయనకామె తెలుసుట ' అంది.
'మళ్ళీ గతచరిత్ర అంతా చెప్పాలేమో స్వామీజీకి' అని రవికి భయమేసిందిట.
లక్కీగా స్వామీజీ అదేమీ అడక్కుండా, వెళ్ళిపోతున్న వారివైపు చూస్తూ 'అందరూ టచ్ లో ఉండండి మన వాట్సప్ గ్రూపులో' అన్నాడు. ఆయన గోల ఆయనది !
'మీరందరూ 40 రోజులపాటు తర్పణాలు చెయ్యండి మర్చిపోకుండా. ఆ తర్వాత మీకు ఇంకా కొత్త కొత్త మంత్రాలు నేర్పిస్తాను' అన్నాడు మళ్ళీ.
ఈలోపల స్వామీజీ భార్య బయటకొచ్చి, 'ఏమండి రవిగారు! కొంచం మీ ఫోన్ నంబర్ ఇవ్వండి' అనడిగింది. మనవాడు మంచి హై పొజిషన్ లో ఉన్నాడు కదా ! పైగా మినిస్టర్ గారి మరిది కూడా ! అడగరూ మరి !
వెంటనే అంజలమ్మ కల్పించుకుని 'నేను తీసుకున్నాలే. నీకెందుకు?' అని గైమంటూ ఆమెను అరిచింది. అలా అరిచి రవివైపు తిరిగి 'ఆమెని పట్టించుకోకండి. ఇక్కడంతా నేనే. స్వామీజీకి స్క్రిప్ట్ రాసి పెట్టడం దగ్గరనుంచి, ఆయన ప్రోగ్రాం అంతా చూసుకోవడం వరకూ అన్నీ నేనే. ఆమెదేమీ లేదు' అంది చిన్నగా.
'స్క్రిప్టా? అదేంటి?' అడిగా అయోమయంగా.
'స్వామీజీ యూటూబ్ చానల్లో మాట్లాడే స్పీచ్ ఈమె తయారు చేస్తుందట. ఆయన ఊరకే దానిని చదువుతాట్ట. అంతే !' అన్నాడు రవి.
'ఇందులో ఇదొకటా?' అనుకున్నా నీరసంగా.
స్వామీజీ భార్యేమీ తక్కువది కాదు. 'ఏంటే నువ్వు తీసుకునేది? నీ దగ్గరుంటే సరిపోయిందా? నా దగ్గరుండనక్కరలేదా?' అని ఆమె కూడా అరిచింది.
ఆ పాయింట్ మీద ఇద్దరూ అందరి ఎదురుగానే మళ్ళీ కీచులాడుకున్నారు.
'మరి ఇదంతా చూస్తో స్వామీజీ ఊరుకున్నాడా?' అడిగాను.
'అదేంటో మరి? అయన కిమ్మనడం లేదు. కుక్కిన పేనులాగా ఉన్నాడు' అన్నాడు రవి.
మళ్ళీ పగలబడి నవ్వాను.
'శ్రీ విద్యోపాసకులు కదా ! ఆడవారిలో అమ్మవారిని చూస్తారు. అందుకే వాళ్ళలా కొట్టుకుంటుంటే, 'ఆదిశక్తీ పరాశక్తీ కొట్టుకుంటున్నార్లే, మనకెందుకు?' అనుకుని మౌనంగా ఉన్నాడు. నువ్వర్ధం చేసుకోవాలి' అన్నాను.
'ఆహా ! మరి బంగారం మీదా డబ్బులమీదా దృష్టి ఏంటి? అదికూడా శ్రీవిద్యలో భాగమేనా?' అడిగాడు రవి.
'అవును. శ్రీ అంటేనే లక్ష్మి కదా ? శ్రీవిద్య అంటే డబ్బుని ఆరాధించడం. లేదా డబ్బు సంపాదించే విద్య. అంతే, నీ అవగాహనలో లోపానికి వాళ్ళనెందుకు అంటావ్?' అన్నాను.
'అలాగే ఉంది మరి ! సరే, అక్కడే ఉంటే ఇంకేం జాతర చూడాల్సోస్తుందో అని అక్కడనుంచి గబగబా బయటపడ్డాం. ప్రస్తుతం శ్రద్దగా తర్పణాలు చేస్తున్నాను' అన్నాడు రవి.
'మరి కుండలిని లో కదలిక వచ్చిందా?' అడిగా నవ్వు ఆపుకుంటూ.
'నా బొంద వచ్చింది. అలాంటి ఛాయలేమీ కనపడటం లేదు. చూడబోతే నువ్వు చెప్పినదే నిజంలాగా ఉంది' అన్నాడు.
'ఛా ! నేనెందుకు నిజం చెబుతాను? లోకంలో అందరూ చెప్పేది నిజం. నేను నీకు చెప్పేది మాత్రం అబద్దం. నమ్మకు. సరే లేటెస్ట్ న్యూస్ చెప్పు' అన్నా నేను.
'ఏముంది? 40 రోజులు కాకముందే అందరికీ మళ్ళీ ఫోన్లు చేస్తున్నాడు. మెసేజీలు ఇస్తున్నాడు' అన్నాడు.
'ఏమని?' అడిగాను.
'మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాను. 40 రోజులు కాకపోయినా పర్వాలేదు. అందరూ మళ్ళీ రండి. మీ మీ అర్హతలు టెస్ట్ చేసి, ఇంకో మంత్రం ఉపదేశం చేస్తాను. దానికి ఇరవై వేలవుతుంది. అందరూ రండి' అని మెసేజీలు వస్తున్నాయి గ్రూప్ లో' అన్నాడు రవి.
'పోన్లే పాపం. డబ్బు అవసరం పడిందేమో? శిష్యులుగా మీరు ఆదుకోకపోతే ఎవరాదుకుంటారు చెప్పు? ఆయనేమీ ఊరకే డబ్బ్లు అడగడం లేదుగా? మంత్రాలు ఇస్తానంటున్నాడు. ఎందుకాయన్ను తప్పు పడతావు?' అడిగాను.
'నీ జోకులాపు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా?' అడిగాడు రవి.
'ఏంటి?' అడిగాను.
'మా వాట్సప్ గ్రూప్ లో ఒకాయన ఇలా మెసేజి పెట్టాడు'
'డియర్ ఆల్ ! మీ అందరికోసం ఒక విషయం చెబుతున్నాను. మనం ఏ శ్రీచక్రం అయితే పదిహేను, పాతికవేలకి ఈయన దగ్గర కొన్నామో, అవే శ్రీచక్రాలు మరోచోట మూడువేలకు అమ్ముతున్నారు. అవే ఈయన కొని తెచ్చి మనకు ఈ రేటుకు అమ్ముతున్నాడు. ఈ రోజే నేనొక శ్రీచక్రం కొన్నాను. అంతా అదే పీసు. నాకు జ్ఞానోదయం అయింది. నేను ఇక ఈయన దగరకు రాను. గుడ్ బై' అనేది ఆ మెసేజి.
మళ్ళీ హాశ్చర్యపోవడం నా వంతైంది.
'గణపతిమంత్రంతోనే అంత పెద్ద జ్ఞానోదయమైతే ఎలా రవి? ఇంకా పైన ఇరవై మంత్రాలున్నాయి? మీరెవరూ తీసుకోకపోతే అవన్నీ ఏం కావాలి? ఎవరి దగ్గరికి పోవాలి? చెప్పు? అసలు మీకు గురువన్నా మంత్రాలన్నా భయమూ లేదు. భక్తీలేదు. తప్పంతా మీదే. ఆయనది కాదు. సరే ఇపుడు నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు ఫైనల్ గా చెప్పు?' అడిగా.
'ఈ దెబ్బతో నాకూ జ్ఞానోదయమైంది. ఇక ఆయన దగ్గరకు పోను. యూటూబులో మంత్రాలు నేర్చుకుని మూసుకుని జపించుకుంటా. అంతే' అన్నాడు రవి నీరసంగా.
'హతోస్మి ! నీ మంత్రాల పిచ్చీ నువ్వూనూ ! మొత్తంమీద నీ 'శ్రీవిద్య ఆన్ లైన్ కోర్సు' ఇలా ముగిసిందన్న మాట!' అన్నా.
'అవును. ఏం చేస్తాం? సరైన గురువులు ఎక్కడా దొరకడం లేదు. నీకెవరైనా తెలిస్తే కాస్త చెప్పు' అన్నాడు రవి.
'సరే. వెతుకుతాలే. తెలిస్తే చెబుతా. ఈలోపల యూటూబే నీకు గురువనుకో. సరే నీకు తర్పణాలకు టైమౌతోంది. చేసుకో బుద్ధిగా' చెప్పా నవ్వుతూ.
'అవునుకదా. బాగా గుర్తుచేశావ్ ! ఉంటా మరి. తర్పణాలు చేసుకోవాలి' అంటూ ఫోన్ పెట్టేశాడు తను.
కలిమాయకు నవ్వుకుంటూ నా పని నేను మొదలుపెట్టాను.
(అయిపోయింది)