పదేళ్ళక్రితం నేను జిల్లెళ్ళమూడికి తరచుగా వెళ్ళడం మొదలుపెట్టినపుడు అప్పారావన్నయ్య నాతో ఒకమాటన్నారు.
'జిల్లెళ్ళమూడిలో మీకు చాలామంది భక్తులు కన్పిస్తారు. వాళ్ళలో చాలామంది అమ్మ ఉండగా అమ్మను చూచినవాళ్ళు, ఆమెతో మాట్లాడినవాళ్ళు. వాళ్ళందరూ మీకు చాలా సాదాసీదాగా కనిపిస్తారు. అంతమాత్రం చేత వాళ్ళు మామూలు మనుషులని అనుకోకండి. వాళ్ళు మహాయోగులు. నిరంతరం వాళ్ళు అమ్మ స్మరణలో అమ్మ ధ్యానంలో ఉంటారు. అమ్మనే తలుస్తూ ఉంటారు. కనుక బయటకు పల్లెటూరి మనుషులలాగా కనిపించినప్పటికీ వాళ్ళు అంతరికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్లే'.
ఈ మాట నిజమని నేను చాలాసార్లు గమనించాను. అయితే, అక్కడున్న అందరిలోనూ అమ్మ యొక్క ఉన్నతమైన తాత్వికచింతన కనిపించదు. అమ్మ భావజాలం అత్యున్నతమైనది. అది వేదవేదాంత, సాంఖ్య, యోగ, తంత్రశాస్త్రాల పరిధులను తనలో ఇముడ్చుకుని ఉంటుంది. కానీ అతి సులువైన మామూలుభాషలో ఉంటుంది. కానీ ఈ తాత్వికచింతన, అక్కడున్న భక్తులలో కనిపించదు. ఇది సహజమే కదా. అందరికీ అంతటి ఉన్నతమైన తాత్త్వికచింతన ఉండదు.
భక్తులందరూ భక్తిలో ఉంటారు. శరణాగతభావంలో ఉంటారు. వాళ్లకున్న సమస్యలు తీరాలని, పనులు కావాలని అమ్మను వేడుకుంటూ ఉంటారు. అయితే అమ్మ భావాలు వేరు. ' నువ్వనుకున్న పనులు అవడమూ కాకపోవడమూ రెండూ అనుగ్రహమే' అంటుంది అమ్మ. ఇంతటి అత్యున్నతమైన స్థితిని అందరూ అందుకోలేరు. కనుక వాళ్ళు భక్తులుగానే ఉంటారు. జ్ఞానులు కాలేరు. అమ్మదేమో శ్రీ రామకృష్ణుల వారి లాగా భక్తి జ్ఞానముల పరాకాష్ట స్థితి.
కొద్దిగా గమనించేవారికి జిల్లెళ్ళమూడిలో ఈ సూక్ష్మమైన భేదాలు కనిపిస్తాయి. అక్కడున్న వారిలో భక్తులున్నారు, భక్తి జ్ఞానం కలసినవాళ్ళున్నారు. జ్ఞానపరిపక్వతను అందుకున్నవాళ్ళున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో అక్కడవాళ్ళు కనిపిస్తారు. ఒక దారిలో నడుస్తున్న వాళ్ళు అందరూ కట్టగట్టుకుని ఒకేచోట ఎలా ఉంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క మజిలీలో ఉంటారు. సహజమే కదా !
మూర్తి తరచుగా ఇదే అంటుంటాడు. అమ్మ స్థాయి అక్కడివారిలో కనిపించడం లేదు అనేది అతని బాధ. ఈరోజు ఉదయం కూడా ఏదో మాటల సందర్భంలో ఇదే మాట అన్నాడు. అమ్మ స్థాయి ఇతరులలో ఎలా ఉంటుంది? అది అసంభవం. కనీసం అమ్మ తాత్వికచింతనా స్థాయి కూడా కనపడటం లేదే అని అతని బాధ !
రాత్రి పదింటికి రైలు. సెలవు తీసుకుందామని, చీకటిపడ్డాక అక్కయ్య దగ్గరకు వెళ్ళాము. పడుకుని ఉన్న ఆమె మమ్మల్ని చూస్తూనే లేచి కూర్చుని, లోనికి రమ్మని మమ్మల్ని పిలిచారు.
'సాయంత్రం ఓంకారానందగిరి స్వామి వచ్చి ఇప్పుడే వెళ్లారు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి కాసేపు కూచుని కాఫీ త్రాగి ఆమాటా ఈ మాటా మాట్లాడి వెళుతూ ఉంటారాయన' అంటూ సూటిగా అక్కయ్య సంభాషణ మొదలుపెట్టారు.
'ఆయన సన్యాసా? ఇక్కడే ఉంటారా?' అడిగాను నేను.
'కాదు. ఆయనకు భార్యా పిల్లలున్నారు. ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రిటైరయ్యారాయన. ఇప్పుడాయనకు 67 ఏళ్లు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ మన కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయనకు తెలియని విషయమంటూ లేదు. అమ్మ తత్త్వం ప్రజల్లోకి వెళ్ళడం లేదని ఆయన బాధ. అమ్మ తాత్త్వికచింతన ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైనదని, అది ఈ మారుమూల కుగ్రామంలో దాగి ఉందని, అందరికీ తెలియాలని, చాలా తపనపడుతూ ఉంటారాయన. అమ్మను గురించి ఆయన కూడా చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఒక్కసారి తెలిశాక, అమ్మను గురించి చదివాక, ఇక ఇక్కడకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నారు. అమ్మను గురించి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు ధారగా కారిపోతూ ఉంటాయి. అంత భావోద్రేకం వస్తుంది ఆయనకు' అంది అక్కయ్య.
'ప్రస్తుతం ఆయనకు అనుకూలమైన కాలం నడుస్తోందక్కయ్య. ఇంతకు ముందైతే కమ్యూనికేషన్ లేదు. ఏమీ లేదు. కనీసం ఫోన్లు కూడా లేని కాలాన్ని మనం చూశాం. ఇప్పుడో, అనుకున్న క్షణంలో అమెరికాలో ఉన్నవాళ్ళతో మాట్లాడుతున్నాం. యూట్యూబ్ ఉంది. ఒక చానల్ పెట్టి ఆయన భావజాలాన్నీ, అమ్మ గురించి ఆయన చెప్పాలనుకున్న వాటిని ఆ ఛానల్లో చెప్పవచ్చు, ఇల్లు కదలకుండా ప్రపంచమంతా తిరగవచ్చు ఈ రోజుల్లో' అన్నా నేను.
'అవును. కొన్ని యూట్యూబ్ లో పెట్టారు. ఇంకా కొన్ని చేస్తున్నారు. కానీ ఆయన తపన చూచి నేను ఒకటే చెబుతూ ఉంటాను. 'అమ్మను గురించి ఎవరూ చెప్పడం లేదు. అమ్మ తత్త్వచింతనను గురించి చెప్పడం లేదు' అని కదా మీ బాధ. ఇక్కడ ఉన్న అందరికీ అది సాధ్యం కాదు. ఇక్కడ ఉన్నది భక్తులు. వాళ్ళు, అమ్మ జీవించి ఉన్నపుడు, అమ్మతో కలసి మెలసి తిరిగిన ఆయా అనుభవాలను నెమరు వేసుకుంటూ మౌనంగా అమ్మ ధ్యానంలో జీవిస్తూ ఉంటారు. వాళ్ళు తత్త్వప్రచారం చేయరు. వారికి అమ్మే లోకం. అమ్మ ధ్యానంలో మౌనంగా అలా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళలో చాలామంది వెళ్లిపోయారు. అమ్మను చూచిన ఆ తరం వాళ్ళందరూ ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. కొద్దిమంది మాత్రం ప్రస్తుతం మిగిలి ఉన్నారు. వాళ్ళు అమ్మను తలచుకుంటూ, గతంలో అమ్మ సమక్షంలో వారు గడిపిన క్షణాలను నెమరు వేస్తుకుంటూ మౌనంగా జీవిస్తూ ఉంటారు గాని, స్టేజి లెక్కి ఉపన్యాసాలివ్వరు. ఎందుకంటే, వాళ్ళు భక్తులు. భక్తుడు భగవంతునిలో కరిగిపోవాలని కోరుకుంటాడు గాని ప్రచారం చేద్దామని కోరుకొడు. అమ్మ తత్త్వం వారికి తెలియక కాదు. తెలుసు. కానీ ప్రచారం చేయరు. అమ్మ దగ్గర వారికంటిన పరిమళాన్ని వారి స్థాయిలో వారు వెదజల్లుతూ ఉంటారు. అంతేగానీ, మీరు ఆశించిన స్థాయిలో ఆర్భాటంగా ప్రచారం ఉండదు.
నేనాయనకు ఇంకా ఇలా చెప్పాను ' మీకు అమ్మ శక్తినిచ్చింది. తెలివి నిచ్చింది. అర్ధం చేసుకునే ప్రజ్ఞనిచ్చింది. మీరు ప్రచారం చేయండి. నలుగురికీ అమ్మ గురించి చెప్పండి. అమ్మ చేసిన మహత్యాలు కాదు. అమ్మ తత్త్వాన్ని చెప్పండి. అది భక్తుల వల్ల కాదు. అది వారి పని కూడా కాదు. అదంతా మీలాంటి తెలివైన వాళ్ళ పని'. అందక్కయ్య.
'అంతే' అన్నాను.
ఇదే మాటలు మూడుసార్లు మార్చి మార్చి చెప్పిందక్కయ్య.
అంతా విని 'సన్యాసి కాకపోతే ఆయనకా పేరు ఎలా వచ్చింది?' అడిగాను.
'వేదాద్రిమహర్షి దగ్గర ఈయన యోగాన్ని నేర్చుకున్నాడు. ఆయనే ఈయనకీ పేరు పెట్టాడు' అందక్కయ్య.
'సరే ఈ సారి వచ్చినపుడు వీలైతే కలుస్తాను' అన్నాను.
అక్కయ్య దగ్గర సెలవు తీసుకుని వెనక్కు వచ్చేస్తూ ఉండగా మూర్తి ఇలా అన్నాడు.
'ఎంత విచిత్రం గురువుగారు ! పొద్దున్న మనం మాట్లాడుకున్నదానికి అక్కయ్య నోటినుంచి అమ్మే ఇలా సమాధానం చెప్పించిందని నాకనిపిస్తున్నది'
'అవును. ఒక అతీతమైన విశ్వమానసం మనల్ని అనుక్షణం గమనిస్తున్నదని, మన సందేహాలకు వెంటనే స్పందించి అది జవాబులిస్తుందని నేనెప్పుడూ చెప్పేదానికి ఇదే నీకు నిదర్శనం. నాతో నడిచే ప్రయాణంలో ఇలాంటివి ముందుముందు చాలా చూడబోతున్నావు నువ్వు' అన్నాను.
అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశాము.
భక్తులు పిల్లలవంటివారు. వాళ్ళకే కష్టం వచ్చినా 'అమ్మా' అని అరుస్తారు. వాళ్ళ పని అంతే. అమ్మ పెట్టింది తింటారు. ఉంటారు. తాత్త్వికులు పెరిగిన పిల్లలవంటివారు. వాళ్ళు ప్రపంచంలోకి వెళతారు. అవీ ఇవీ సాధించాలని చూస్తారు. ఆ క్రమంలో ఎందరితోనొ మాట్లాడవలసి వస్తుంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ప్రచారం వాళ్ళ వల్ల అవుతుంది. భక్తుల వల్ల అవదు. అంతమాత్రం చేత భక్తులు తక్కువా కాదు, తాత్వికులు ఎక్కువా కాదు. ఎవరి పాత్ర వారిది. ఎవరి పాత్రత వారిది. ఈ ఇద్దరిలో, ఎవరి కష్టాలు వారికుంటాయి, వారివారి సాధనామార్గంలో ఎవరి అడ్డుగోడలు వారికుంటాయి.
శ్రీరామకృష్ణులు ఇలా అంటారు 'భక్తుడు జిలేబీని తిని దాని రుచిని ఆస్వాదించాలని అనుకుంటాడు. జ్ఞాని తానే జిలేబీగా మారుతాడు'. ఆయనింకా ఇలా అంటారు - 'బావి త్రవ్విన తరువాత కొంతమంది ఆ పలుగూ పారలను అందులోనే పడేస్తారు, మరికొందరు మాత్రం 'ఇతరులకు అవి ఉపయోగిస్తాయిలే' అనుకుంటూ వాటిని తీసి ప్రక్కన పెడతారు'.
ఎంత గొప్ప లోతైన మాటలు !
దీనికి నేను కొంచం జత చేస్తాను. ఇవిగాక, 'వ్యాపారస్తుడు' అనే మూడో తెగ ఉన్నది. వీడు హోటలు పెట్టి, జిలేబీని అందరికీ అమ్ముతూ వ్యాపారం చేసేవాడు. వీడు తినడు, మారడు. ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటూ ఉంటాడు. అయితే, వీళ్లలో కొందరికి జిలేబీరుచి తెలిసి ఉండవచ్చు. మరి కొందరికి తెలీకపోవచ్చు. కానీ ప్రచారంలో తెలివితేటలు ఉంటే, బిజినెస్ లో సక్సెస్ అవుతారు. స్వీట్ షాపులో కూచున్నవాడు సాధారణంగా స్వీట్ తినడు. అలాగే, మతాలు మారుస్తూ, ప్రచారాలు చేస్తూ, ఉపన్యాసాలిస్తూ, అనుచరులను పోగేసుకుని మతబిజినెస్ లు చేసేవాళ్లకు నిజమైన స్వీట్ రుచి తెలియదు. వాళ్ళకు తెలిసింది బిజినెస్ మాత్రమే. అసలైన స్వీట్లు మాత్రం, అమ్మ బోధనల లాగా, ఎక్కడో అజ్ఞాతంగా ఉంటాయి. కొద్దిమంది మాత్రమే వాటిని రుచి చూడగలుగుతారు. వారిలో కొందరు, తాము చూచిన రుచిని ఇతరులకు చెప్పాలని తాపత్రయపడతారు. వేదన పడతారు. అలాంటివాళ్లే తాత్త్వికులు.
ఆధ్యాత్మికజీవితంలో ఏదీ తేలిక కాదు. ఏదీ తేలికగా రానూరాదు. పుస్తకాలు చదవడం, టీవీలో ప్రవచనాలు వినడం, డొల్లపూజలు చేయడం, ఇతరులకు బోధలు చేయడం - ఇది కాదు నిజమైన ఆధ్యాత్మికత. అదొక అంతరిక ప్రయాణం. ఆ దారిలో నడచిన వారికే అది అర్ధమవుతుంది.
అడుక్కునేవాడు భక్తుడు, అర్ధం చేసుకునేవాడు తాత్త్వికుడు, సొమ్ము చేసుకునేవాడు వ్యాపారస్తుడు. మనం భక్తులమా, తాత్త్వికులమా లేక ఉత్త వ్యాపారస్తులమా అనేది ఎవరికి వారు తేల్చుకోవాలి.
ఈసారికి వచ్చినపని అయిపోయింది. అదేరోజు రాత్రి పదికి బాపట్లలో రైలెక్కి ఉదయానికి హైదరాబాద్ వచ్చి చేరుకున్నాము.