“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

2, జనవరి 2021, శనివారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చెట్లు - పైరు)


26-12-2020 రాత్రి బయల్దేరి మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు వెళ్లాను. కారణం? అక్కడ మనకంటే చలి విపరీతంగా ఉండటమే. హైదరాబాద్ చలి మనకు చాలడం లేదు. ఇంకా చలి కావాలి. ఇంకా ఏకాంతం కావాలి. నార్త్ ఇండియాలో కోల్డ్ వేవ్ రాబోతోందని ముందే తెలియడం వల్ల, ఈ సంవత్సరాంతాన్ని మధ్యప్రదేశ్ అడవులలో గడుపుదామని నిశ్చయించుకున్నాను. మన సంకల్పాన్ని ప్రకృతి తప్పక ఆమోదిస్తుంది గనుక  పరిస్థితులు అలా రూపొందించబడ్డాయి. అదలా అయిపోయింది ! 

27 ఉదయం దుర్గ్ లో దిగేసరికి దాదాపు పదకొండైంది. మిట్టమధ్యాన్నమైనా ఎండ ఉండీ లేనట్లుగా ఉంది. చలి విపరీతంగా ఉంది. ఊర్లో జనసంచారం పెద్దగా లేదు. అలాంటి వాతావరణం మనకు బాగా నచ్చుతుంది గనుక హాయిగా అనిపించింది. స్టేషన్ కి ఎదురుగా ఉన్న ఇండియా కాఫీ హౌస్ హోటల్లో బస. అదొక సొసైటీ. దానికి జబల్ పూర్ కేంద్రం. కానీ పనివాళ్ళందరూ మళయాళీలున్నారు. కొంతమంది కన్నడిగులున్నారు. మనకా రెండు భాషలూ అరకొరగా వస్తాయి గనుక, వాటిల్లో కొంచం మాట్లాడేసరికి వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి.

రూమ్ నంబర్  209 రెండో ఫ్లోర్లో ఉంది. ఫ్లోర్ మొత్తానికీ ఉన్న 20 రూములలో నేనొక్కడినే ఉన్నా. మలుపులు తిరుగుతున్న పొడుగాటి కారిడార్లు, వాటిల్లో మసకలైట్లు, ఫ్లోర్ మొత్తానికీ ఎవరూ లేకపోవడం భలే నచ్చేశాయి. రాహువును కాసేపు ధ్యానించి రూంలో సెటిలయ్యాను. లగేజి తెచ్చిన బాయ్ అలవాటు ప్రకారం టీవీ ఆన్ చేస్తుంటే ' ఉస్కో బంద్ కర్ కె రిమోట్ కో అప్నే సాథ్ రఖో కౌంటర్ మే. ముజ్కో కోయీ జరూరత్ నహీ'  అని చెప్పాను. అతను హిందీవాడే. విచిత్రంగా చూసి, దాన్నక్కడే పెట్టి వెళ్ళిపోయాడు.

వెళుతున్న అతని ముఖంలోకి చూశాను.

'ఈ చానల్స్ చాలడం లేదు. ఇంకా కావాలి. అనే వాళ్లనే చూశా ఇప్పటిదాకా. అసలు టీవీనే ఇక్కడొద్దు. తీసేయ్. అనేవాడిని నిన్నే చూస్తున్నా' అన్న భావం కనిపించింది. నవ్వుకున్నా.

స్నానం కానిచ్చి  క్రిందకు దిగాను. రెస్టారెంట్లో కూచుని వేచిచూస్తూ ఉండగా సహచరులు కొంతమంది వచ్చి కలిశారు. వాళ్ళతో కలసి నార్త్ ఇండియన్ భోజనం కానిచ్చి, ఒక కార్ మాట్లాడుకుని దగ్గర్లో ఉన్న 'మరోదా' అనే ఊరికి వెళ్లి కాసేపు అక్కడ  అటూఇటూ తిరిగి వెనక్కు వచ్చేశాము.

వెనక్కు వస్తుండగా అన్నీ పంట నూర్చిన పొలాలు కనిపించాయి. గట్లమీద చెట్లు మాత్రం కదలకుండా నిలబడి ఉన్నాయి. వాటిని వదిలేశారు రైతులు. పంటను మాత్రం కోసేశారు. ఆ పొలాలమధ్యన ఉన్న రోడ్డు గుండా కారు పోతోంది. ఆ పొలాలనే చూస్తున్న నాతో సహచరులతో ఒకడిలా అన్నాడు.

'పోయినసారి వచ్చినపుడు ఇవన్నీ పైరుతో పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి'.

నవ్వాను.

'ఏదైనా ఎన్నాళ్లుంటుంది?' అడిగానతన్ని

అకస్మాత్తుగా  నా మనసులో ఈ పద్యం పుట్టింది.

ఆ || గట్లమీద చెట్లు గట్టిగా నిలుచుండె 
పంటపైరు కయ్యె పచ్చికోత 
అవసరమ్ము గాదె? అవనిలో జూడంగ
ఏకదైవమగుచు ఏలుచుండు

మనుషులు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా, అవన్నీ 'అవసరం' కోసం మాత్రమే. పైరు తనకవసరం గనుక కోసుకుని దాచుకుంటాడు మనిషి. గట్టుమీదున్న చెట్లనీడ కూడా తనకు అవసరం గనుక వాటిని కొట్టకుండా వదిలేస్తాడు.

ఈ లోకంలో ఉన్నది అవసరం ఒక్కటే ! దానికే రకరకాల పేర్లు పెట్టుకుంటాడు మనిషి. ప్రేమ, జాలి,  దయ, అభిమానం, స్నేహం, బంధుత్వం, గౌరవం, భయం, భక్తి, ముక్తి - ఏదైనా అవసరమే. దానికే ఇవన్నీ రకరకాల ముసుగులు. దేవుడికి సహస్రనామాలున్నాయి. కానీ నిజానికి అన్ని నామాలూ అవసరానివే. నిజమైన దేవుడికి పేరు లేదు. అవసరానికి మాత్రం సహస్రనామాలున్నాయి.  

ఎవడి మతాన్నిబట్టి దేవుడికి వాడు పేర్లు పెట్టుకున్నప్పటికీ ఆ దేవుళ్ళు 'అవసరం' అనే దేవుడిముందు ఎందుకూ పనికిరారు. ఈ లోకంలో ఉన్నదీ, లోకాన్ని ఏలుతున్నదీ 'అవసరం' అనే ఏకైకదైవం మాత్రమే. ఆ దేవుడిముందు అందరు దేవుళ్ళూ పారిపోతారు.

ఇదే భావాన్ని హైకూ గా చెప్పమని మనసును అడిగా. వెంటనే ఇలా చెప్పింది.

పైరు కోతకు గురై ఇంటికి చేరింది
గట్లమీద చెట్లు మూగగా చూస్తున్నాయి
తమ సమయం ఎప్పుడా అని

స్వార్ధం కాక ఈ ప్రపంచంలో ఎటుచూసినా ఏముంది?

తన స్వార్ధం కోసం మనిషి ధర్మశాస్త్రాలు రాసుకున్నాడు. దేవుళ్ళని సృష్టించాడు. మతాలను కల్పించాడు.  కానీ అవన్నీ ఉత్త సోది. వీటన్నిటి అంతరాత్మ 'అవసరం' ఒక్కటే. అవసరం ఉంటే అణకువ ప్రదర్శించబడుతుంది. అవసరం తీరాక అహంకారం అలలై పొంగుతుంది. ఇదీ మానవనైజం. దీనినే నేను 'కపటం' అంటాను. ఈ కపటాన్ని దాటనిదే ఆధ్యాత్మికత అందదు. అవసరం కోసం నటించే స్వభావాన్ని అధిగమించడమే ఆధ్యాత్మికతలో మొదటిమెట్టు. కానీ ఈ మొదటిమెట్టునే ఎవరూ ఎక్కలేరు. ఇక్కడే అందరూ బోర్లా పడుతూ ఉంటారు.

అణకువను నమ్మకు
దానివెనుకనున్న అవసరాన్ని చూడు
అసలు నిజం చెప్పనా సత్యా !
అణకువ అసలురూపం అహంకారం
దానిని దాటినవాడే నీ మిత్రుడు

అందుకనే, ఈ లోకంలో మతాలు ఉండొచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి పూజావిధానాలు వారికి ఉండొచ్చు. ధర్మశాస్త్రాలు ఉండొచ్చు. వీళ్లెవరికీ అసలైన ఆధ్యాత్మికత మాత్రం అందదు.

మతాన్ని అధిగమించడమే ఆధ్యాత్మికత. మతం నాటకం. ఆధ్యాత్మికత నిజం. ఆధ్యాత్మికతను బోధించడానికి పుట్టిన మతం నాటకంగా మిగిలింది. అవసరార్ధం పుట్టిన దేవుళ్ళు అవసరం ముందు దిక్కులకొకరు పారిపోతున్నారు. ఎంత విచిత్రం?

అవసరం ఉండేదాకా అన్నీ బాగుంటాయి
అవసరం తీరాక అవే రోత పుట్టిస్తాయి 
అవసరమే ఈ లోకంలో
అసలైన దేవుడు
గుడిలేని దేవుడు

లోకమంతా కోతకు తయారౌతున్న పంటపొలమే. ఎవరి సమయం వచ్చినపుడు వారికి కోత పడుతుంది. కానీ ప్రతిమొక్కా తనకేమీ కాదని అనుకుంటుంది, కాలపుకత్తి తన మెడమీద పడేదాకా !

కోతను తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి. గట్టెక్కాలి. ఎక్కడుంది ఆ గట్టు? ఎవరికీ తెలీదు. 'మా దేవుడే  ఈ గట్టు' అని ప్రతిమతమూ అంటుంది. కానీ అది నిజం కాదు. అది అవసరార్ధం కల్పింపబడిన అబద్దం.

అకస్మాత్తుగా కఠోపనిషత్తు నుండి ఈ మంత్రం నా మనస్సులో మెరిసింది.

|| అనుపశ్య యధాపూర్వే ప్రతిపశ్య తథాపరే
సస్యమివ మర్త్య: పచ్యతే సస్యమివాజాయతే పునః ||

'చూడు ! మనకు ముందటివారూ గతించారు. మన తర్వాత పుట్టబోయేవారూ గతిస్తారు. ధాన్యపుమొక్క లాగా మనిషి పుడతాడు, పెరుగుతాడు, నశిస్తాడు, మళ్ళీ పుడతాడు'

నాలుగురోజుల ఈ లోకంలో అవసరాన్ని, స్వార్ధాన్ని దాటి చూడగలిగిన మనుషులు ఎక్కడున్నారు? అలాంటివాళ్ళు మాత్రమే నాకు కావాలి. ఈ చెత్త మనుషులు, చెత్త లోకం నాకొద్దు.   

ఆలోచనలు సాగుతున్నాయి. కారు దుర్గ్ చేరుకుంది.

(ఇంకా ఉంది)