నాకెందుకో చిన్నప్పటినుంచీ నిజామాబాద్ అనే పేరు విన్నప్పుడల్లా అది బాగా తెలిసిన ఊరని, ఆ ఊరితో ఏదో అనుబంధమున్నట్లుగా అనిపించేది. ఎందుకో తెలియదు. నేనెప్పుడూ ఇటువైపు రాకపోయినా కూడా అలా అనిపిస్తూ ఉండేది. ఇప్పటికిక్కడికి రావడం ఈ ప్రాంతాలలో తిరగడం అయింది. కానీ ఖర్మేమిటంటే, ఇంత పెద్ద టౌన్లో శాకాహార హోటల్ కోసం ఆటోలో ఎక్కి గంటసేపు వెదుకులాడవలసి వచ్చింది. ఎక్కడ చూచినా చికెన్ హోటళ్లు తప్ప, శుద్ధమైన శాకాహార హోటలే లేదు. విచారించగా, హైదరాబాద్ రోడ్డులో కపిల్ అనే హోటలొక్కటే శాకాహార హోటలని చెప్పారు. భలే విచిత్రమనిపించింది.
గతంలో అయితే, మాంసాహార హోటలు కావాలంటే వెదుక్కోవలసి వచ్చేది. ఎక్కడో సందులో గొందిలో ఉండేది. సారాయి షాపులు కూడా అంతే. ఇప్పుడో, మొత్తం తారుమారైంది. అవన్నీ రోడ్లమీదకొచ్చాయి. శాకాహారహోటళ్లు ఎక్కడా కనిపించడం లేదు. నేను నిజామాబాద్లో ఉన్న రెండురోజులు టిఫిన్ మాత్రమే తిని ఉన్నాను. అప్పుడపుడు అరటిపండ్లు తిన్నాను. రెండవరోజున ఒక పెరుగు కప్పు కోసం ఊరిలో గంటసేపు వెతకవలసి వచ్చింది. ఎక్కడో ఓల్డ్ బజార్లో ఒక డెయిరీ ఉందని అక్కడికెళ్ళమని చెప్పారు. భలే విచిత్రమనిపించింది. జనమంతా కోళ్ళమీద పడి బ్రతుకుతున్నట్లే తోచింది. సామాన్యంగా తోడేళ్ళు, నక్కలు, అడవికుక్కలు, పిల్లులు మొదలైన జంతువులు మాత్రమే కోళ్లను తింటూ ఉంటాయి. అందుకేనేమో, నేటి జనంలో కూడా వాటి మనస్తత్వాలే దర్శనమిస్తున్నాయి.
తినే తిండిని బట్టే కదా మనసు ఏర్పడేది ! మాంసం తింటున్నంత వరకూ శుద్ధమైన శరీరధాతువులు ఉండవు. ధాతుశుద్ధి లేనంతవరకూ ఆధ్యాత్మికమార్గం అందదు. మాంసం తినడం మానలేనివారు యోగసాధనకు అనర్హులు. వారిలోకి దైవశక్తి దిగిరావడం జరిగేపని కాదు. ఈ విధంగా మనం తినే తిండికీ, సాధనకూ సూటి సంబంధం ఉంటుంది.
ఆ సందర్భంగా ఆర్మూర్ దగ్గర్లోనే ఉన్న సిద్ధులగుట్టకు వెళ్ళొచ్చాను. దీనిని నవనాధక్షేత్రమని పిలుస్తున్నారు. ఈ ఊరికి చుట్టూ తొమ్మిది కొండలున్నందుకు దీనికి ఆరు-మూరు అని పేరొచ్చిందట. నవనాధులు ఇక్కడకు వచ్చారని నమ్ముతున్నారు. నిజానికి నాధప్రోక్తమైన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' పుస్తకాన్ని ఈ గుట్టమీదే విడుదల చేద్దామని అనుకున్నాను. కానీ దైవఘటన వేరుగా ఉన్నది. ఈనాటికీ స్థలదర్శనం అయింది.
ఆర్మూర్ ఊరిలోనుంచి ఈ కొండమీదకు కాలినడకన మెట్లున్నాయి. ఈ మెట్లను గ్రామస్తుల సహకారంతో హరిదాస్ మహారాజ్ అనే సాధువు ఏర్పాటు చేయించాడు. ఆయన 1920 ప్రాంతాలలో హిమాలయాలకు వెళ్లి 18 ఏళ్ళు తపస్సు చేసి అక్కడనుంచి తిరిగివచ్చి ఈ కొండపైనున్న గుహలలో ఉంటూ ఇక్కడే సమాధి అయినాడు. కొండమీదున్న గుహలో జువ్విచెట్టు వేర్ల అడుగుభాగంలో ఈయన జీవసమాధి ఉన్నది. సమాధి సమీపంలోనే నవనాధుల చిత్రపటం ఉన్నది.
ప్రస్తుతం కారుబాట కూడా వేయబడుతున్నందున మేము కార్లోనే సరాసరి గుట్టమీదకు ఎక్కినాము. అది ఒక పర్యాటకస్థలంగా రూపుదిద్దుకుంటున్న సూచనలు గోచరించాయి. పిల్లలు చాలామంది అక్కడున్న ఆటస్థలంలో ఆడుకుంటూ కనిపించారు.
గుట్టనిండా నల్లగుండురాళ్ళు లెక్కలేనన్ని కనిపించాయి. అన్ని గుండురాళ్లను ఒకే కొండమీద మరెక్కడా నేను చూడలేదు. ఈ గుట్టమీద గుహల సమీపంలో పాతకాలపు శివాలయం, రామాలయం ఉన్నాయి. అయ్యప్ప ఆలయం నిర్మాణంలో ఉన్నది.
గుహలోకి వెళ్లే ద్వారం మన నడుము ఎత్తులో ఉంటుంది కనుక నిలబడి నడుస్తూ దానిలోకి పోలేము. వంగి లోపలకు దూరవలసి వస్తుంది. ఆలోపల పాముమెలికలలాగా సహజసిద్ధంగా బండరాళ్ల క్రింద ఏర్పడి ఉన్న దారులు,ఖాళీ స్థలాలే ఆ గుహలు. లోపల చాలాచోటలకు పాక్కుంటూ పోవలసి వస్తుంది. అహంకరించి లేచి నిలబడితే పైనున్న బండరాయి శఠగోపం పెడుతుంది.
ఆ బండరాళ్ల పైన ఒక పెద్ద జువ్విచెట్టు ఉన్నది. దానివ్రేళ్లు ఆ బండ్ల క్రిందదాకా ఉన్నాయి. ఆ వ్రేళ్ళ మధ్యనే హరిదాస్ మహారాజ్ గారి సమాధి ఉన్నది. పాతకాలంలో కరెంటు లేని రోజుల్లో కూడా ఆయన అదే గుహలలో రాత్రనక పగలనక ఉంటూ ఉండేవాడట. ప్రస్తుతం గుహలోపల కూడా కరెంటు దీపాలున్నాయి. అయితే మనతో బాటు కోతులు కూడా లోపలకు వస్తూ పోతూ ఉంటాయి. ప్రమాదం ఏమీ లేనప్పటికీ, ఒంటరిగా గుహలలోనికి వెళ్లడం మంచిది కాదు.
ఆ భూగర్భగుహలలో మెలికలు మెలికలుగా తిరుగుతూ పోతే రామాలయం దగ్గర ఇంకొక ద్వారం నుంచి బయటకు తేలుతాము. భూగర్భగుహలలో దుర్గాదేవి, దత్తాత్రేయుడు, మూడ్నాలుగు శివలింగాలున్నాయి. లోపల చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం ఉన్నది. చాలా చల్లగా ఉన్నది. తపస్సుకు చాలా అనువైన స్థలమని తోచింది.
శిష్యబృందంతో ఒకసారి ఇక్కడకు రావాలన్న సంకల్పంతో కొండ క్రిందకు దిగి నిజామాబాద్ దారి పట్టాము.