పౌర్ణమి ఛాయ !
ఆదివారం సాయంత్రం మదనపల్లిలో, ఎదిగిన తన ఇద్దరు కూతుళ్ళని, తల్లే హత్య చేసిందిట. తండ్రి చూస్తూ ఉన్నాట్ట. ఆ చంపడం కూడా ఒకమ్మాయిని శూలంతో పొడిచి, ఇంకొకమ్మాయిని డంబెల్ లో కొట్టి చంపేసిందట ఆ తల్లి.
ఆమెకి పిచ్చెక్కిందో? లేక దయ్యం పట్టిందో? అమ్మాయిలకు 27, 22 ఏళ్ళు. ఇద్దరూ బాగా చదువుకుంటున్నవాళ్ళే. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయవృత్తిలో పిల్లలకు పాఠాలు చెబుతున్న వాళ్ళే. తండ్రయితే ఏకంగా ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అట. ఇదేంటో మరి !
ఇంట్లో వాతావరణం చూస్తే క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా ఉందని పోలీసులన్నారు. తల్లిదండ్రుల కొలీగ్సు, చుట్టుపక్కలవాళ్ళు మాత్రం ఈ కుటుంబం మంచిదని, గొడవలకు పోరని, చదువుకున్న వారని మంచిగానే చెబుతున్నారు. తల్లీ తండ్రీ ఎంతో బాలెన్స్ గా ఉంటారని, అందరికీ సలహాలిస్తారని కూడా చెబుతున్నారు.
అయితే, వీళ్ళకు మతపిచ్చి ఉందని కొంతమంది యూట్యూబ్ లో అంటున్నారు. వీళ్ళు షిరిడీ సాయిబాబా భక్తులట. తరచూ షిరిడీ వెళ్తారట. మెహర్ బాబా, ఓషో పుస్తకాలు చదువుతారట. జగ్గీ వాసుదేవ్ కి వీరభక్తులట. ఇదంతా కొలీగ్స్ చెబుతున్నారు.
అంతేకాదు, మూడ్రోజులుగా బయటి మనుషులెవరో వచ్చి రాత్రీపగళ్ళూ పూజలు చేస్తున్నారట. నగ్నపూజలు కూడా చేశారట. 'మా అమ్మాయిలను కదిలించకండి. వాళ్ళు రేపు బ్రతుకుతారు. ఈ రోజు రాత్రితో కలియుగం అయిపోతుంది. రేపట్నించీ సత్యయుగం వస్తుంది. అది రాగానే వాళ్ళు బ్రతుకుతారు. చంపమని మాకు దేవుడు చెప్పాడు' ఈ విధంగా పిచ్చిపిచ్చిగా ఆ తల్లీతండ్రీ మాట్లాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
'మీరెందుకు మధ్యలో వచ్చి ప్రాసెస్ చెడగొట్టారు? మీరు మధ్యలో రాబట్టే మా కూతుళ్లు బ్రతకలేదు. ఈ ఒక్కరోజు శవాలని కదల్చకుండా అలాగే ఉంచండి. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు' అని పద్మజ (తల్లి), పోలీసు అధికారులతో వాదిస్తున్న వీడియో చూస్తే ఏమనిపిస్తోంది? హిస్టీరియా పరాకాష్ట కనిపించడం లేదూ?
సరే, పోలీస్ విచారణ జరుగుతోంది గనుక, నిజానిజాలు బయటపడతాయని ఆశిద్దాం. ప్రస్తుతానికి మతకోణం ఏముందో కొంచం చూద్దాం.
సమాజంలో ఎక్కడచూచినా, దొంగజ్యోతిష్కులు, సిద్ధాంతులు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు సందుకొకడు, గొందికొకడు తయారయ్యారు. ఏదేదో చెప్పి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. విద్యావంతులై, ఉపాధ్యాయులైన వీళ్ళే ఇన్ని మూఢనమ్మకాలతో కూరుకుపోతే, ఇక పల్లెటూరి ప్రజలు ఎంత ఆటబొమ్మలైపోతారో ఆలోచించండి.
ఇది అసలైన హిందూమతం కాదు, కాదు, కాదు.
షిరిడీసాయి భక్తులలో స్వార్ధం పాళ్ళు చాలా ఎక్కువని, వాళ్ళు చాలా చవకబారుగా ఉంటారని, అహంకారులని, నేను పదేళ్లనుంచీ చెబుతున్నాను. నా చిన్నప్పటినుంచీ నేను గమనిస్తూ వస్తున్న నిజం ఇది. మొక్కులు మొక్కుకోవడం, కోరికలు కోరుకోవడం, తేరగా పనులు కావడం, అప్పనంగా వరాలు రావడమే వీరికి ప్రధానంగాని, అసలైన ఆధ్యాత్మికత వీరికి తెలియదు. సాయిబాబాను నేనేమీ అనడం లేదు. ఆయన్ను అలా తయారుచేసి కూచోబెట్టిన దొంగగురువులను దొంగభక్తులను అంటున్నాను.
వీళ్ళు మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని. ఆయనది శుద్ధమైన ప్రేమతత్వం. ఆచారాలు, పూజలు వీటిని ఆయన ఒప్పుకోలేదు. శుద్ధమైన భగవత్ప్రేమకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. సాటిమనిషిలో, జంతువులలో, పక్షులలో, అన్ని జీవులలో దైవాన్ని చూస్తూ వాటిని ప్రేమిస్తూ సేవచెయ్యమని ఆయన బోధించాడు. Mastery in Servitude అన్నది ఆయన సిద్ధాంతం. వీళ్ళు మెహర్ బాబా భక్తులా? ఆయన పేరును ఉఛ్చరించడానికి కూడా వీరికి అర్హత లేదు.
ఓషో పుస్తకాలను కూడా వీళ్ళు బాగా చదువుతారని కొందరంటున్నారు. ఓషోను అనుసరించేవారిలో నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినవారిని ఒక్కరంటే ఒక్కరిని గత నలభై ఏళ్లలో నేను చూడలేదు. నా దృష్టిలో ఓషో ఒక కంప్లీట్ ఫెయిల్యూర్. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈయన వల్ల జరిగిన నష్టం ఇంతాఅంతా కాదు. ఈయన తానూ బాగుపడలేదు. తనను నమ్మినవారినీ ఉద్ధరించలేదు. రెంటికి చెడ్డ రేవడి అంటే ఈయనే.
ఇకపోతే మిగిలింది ఓషోకి కాపీక్యాట్ అయిన జగ్గీ వాసుదేవ్. లోకంలోని ప్రతి విషయంపైనా మంచి ఇంగిలీషులో లాజికల్గా మాట్లాడతాడని ఈయనకు పేరుంది. కానీ ఆయనైనా సరే, ఇలాంటి క్షుద్రపూజలను, హింసను ఒప్పుకుంటాడంటే నేను నమ్మలేను. ఆయనే కాదు, నిజమైన ఏ గురువూ ఇవి ఒప్పుకోడు. బోధించడు. ఇలాంటివి బోధిస్తే వాడసలు గురువే కాదు. కానీ ఈయన శిష్యులలో ఇలాంటి పోకడలు కొన్నున్నాయి. వాటిని నేను చూచాను.
మా మిత్రులలో ఈయన వీరశిష్యులు కొంతమందున్నారు. వారిలో ఒకరింటికి గతంలో నేను వెళ్లాను. ఆయన ఇచ్చిన 'లింగభైరవి' అనే ఒక విగ్రహాన్ని వాళ్ళింట్లో చూచాను. అదొక గ్రానైట్ బండలో చెక్కబడిన యంత్రం+విగ్రహం. చాలా బరువుంది. అప్పట్లోనే దాని వెల 5 లక్షలని చెప్పారు. లారీలో దానిని ఆయన ఛిష్యులే తెచ్చి వీళ్ళింట్లో దించి ప్రతిష్టించి వెళ్లారట. దానికి నన్ను నమస్కారం చెయ్యమన్నారు. నాకేమీ ఆ వైబ్రేషన్స్ రుచించలేదు. అందుకని నేను నమస్కారం చెయ్యలేదు.
'మీకు కుండలిని లేచిందా?' అని ఆ మిత్రుడు నన్నడిగాడు.
'లేచి మళ్ళీ పడుకుంది' అని సీరియస్ గా సమాధానం చెప్పాను.
'అదేంటి? మా గురువుగారు నెత్తిన చెయ్యి పెడితే కుండలిని వెంటనే లేస్తుంది. ఇక పడుకోదు' అని మిత్రుడన్నాడు.
'అలా అయితే చాలా కష్టం కదా ! మరి దానిని పడుకోబెట్టాలంటే ఏం చెయ్యాలి?' అనడిగాను.
'అందుకే 'లింగభైరవి' విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుంటే లేచిన కుండలిని మళ్ళీ పడుకుంటుంది' అన్నాడు మిత్రుడు.
'నా దగ్గర అన్ని డబ్బుల్లేవు. 5 లక్షలిచ్చి గ్రానైట్ బండను కొనుక్కునేంత స్తోమత నాకొద్దు. అసలు దాన్ని లేపడం ఎందుకు? మళ్ళీ పడుకోబెట్టడం ఎందుకు?' అని నేనడిగాను.
'లేకపోతే మీకు మోక్షం రాదు కదా' అన్నాడు మిత్రుడు.
'ఏం రాకపోతే? అలా డబ్బులిచ్చి కొనుక్కునే మోక్షం నాకొద్దులే' అని నేను జవాబిచ్చాను. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పినా వినేటట్లు ఆ మిత్రుడు లేడు. ఏదో పూనకంలో ఉన్నట్లు మాట్లాడాడు. నేనూ వదిలేశాను.
ఆ ప్రహసనం అంతటితో ముగిసింది. ఇలాంటి పోకడలు ఈయన శిష్యులలో కొన్ని ఉన్నాయన్నది నిజమే.
అప్పుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.
ఒక బుద్ధిలేని పెద్దమనిషి అమ్మను ఇలా అడిగాడు.
'అమ్మా ! మీకు కుండలిని నిద్ర లేచిందా?'
దానికి అమ్మ చమత్కారంగా ఇలా అన్నారు.
'నీకు నిద్రలేస్తే ఈ ప్రశ్నను నువ్వడగవు'
ఆ ప్రబుద్ధుడికి అమ్మమాట అర్ధం కాలేదని వేరే చెప్పనవసరం లేదుకదా !
'నీకు యవ్వనం వచ్చిందా?' అని ఒకరిని అడగవలసిన అవసరముందా? మనకు కళ్ళు సరిగ్గా ఉంటే, మనకే కన్పిస్తుంది ఎదుటిమనిషికి యవ్వనం వచ్చిందో లేదో. అడుగుతున్నామంటే మనకు కళ్ళు కనపడటం లేదని అర్ధం. అలా ఉంటుంది వీళ్ళ గోల!
ఏదేమైనప్పటికీ మదనపల్లి సంఘటన చాలా బాధాకరం. ఇది పిచ్చి, మానసికరోగాలు, క్షుద్రపూజల ప్రభావమేనా? లేక ఇందులో ఆస్తి తగాదాలు, పరువుహత్య మొదలైన ఇతర కోణాలున్నాయేమో పోలీసులు తేలుస్తారు.
కానీ తల్లిని చూస్తే పిచ్చిదానిలాగే ఉన్నది. ఆమె తండ్రి కూడా ఈ మధ్యనే మానసికరోగంతో చనిపోయాడట. ఆమె మేనత్తకో ఎవరికో ఇదే మానసికపరిస్థితి ఉన్నదట. ఈమె ముఖమూ, వాగుడూ చూస్తే మెంటల్లీ రిటార్డెడ్ లాగా కనిపిస్తోంది. పిచ్చికి తోడు భక్తిపిచ్చి ముదిరిందన్నమాట.
మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 'నాకు అమ్మవారు కనిపించారు. నాకు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు. నాకు శివుడు కలలో దర్శనమిచ్చాడు. ఒళ్ళంతా బురదపూసుకుని మట్టిలో దొర్లమన్నాడు. నువ్విది చెయ్యి నీకు మంచి జరుగుతుంది. అది చెయ్యి నీకు పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు' - ఇలాంటి సొల్లు చెప్పేవాళ్ళు చాలామంది మన సొసైటీలో ఉన్నారు. వీళ్లంతా సైకియాట్రీ వార్డుల్లో ఉండాల్సిన పిచ్చోళ్ళు, హిస్టీరియా పేషంట్లు. ఈ పోకడ పిచ్చిలో మొదటిస్టేజి. ముందుముందు ఇలాంటివాళ్లకు ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది.
చాలామంది నాలుగు పుస్తకాలు చదివేసి అదే ఆధ్యాత్మికం అనుకుంటారు. అదొక పిచ్చి భ్రమ. పుస్తకాలు చదివితే ఆధ్యాత్మికం రాదు. పూజలు చేస్తే రాదు. అదొక దారి. ఆ దారిలో త్రికరణశుద్ధిగా నడవాలి. ఆ పనిని నూటికో కోటికో ఒకరు మాత్రమే చేయగలుగుతారు. మిగతా అందరూ పుస్తకాలు చదువుతూ, పూజలు చేసుకుంటూ, ఎవరెవరో గురువులను ఫాలో అవుతూ, ఎదుటివారికి మాటలు చెబుతూ, అదే ఆధ్యాత్మికమన్న భ్రమల్లో కూరుకుపోయి ఉంటారు. అది సత్యమైన ఆధ్యాత్మికమార్గం కాదు.
సామాన్యంగా, అమాయకులు, పిచ్చివాళ్ళు, మంచివాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంలోకి అడుగుపెడతారు. మోసగాళ్లు, దుర్మార్గులు ఇందులోకి రాలేరు. వచ్చినా ఎక్కువరోజులు ఉండలేరు. పై కేటగిరీ లో, పిచ్చివాళ్లను నార్మల్ మనుషులుగా మార్చవలసిన పని ఆ గురువుకు ఉంటుంది. ఆ గురువే మోసగాడైతే, వీళ్ళను పట్టించుకోడు. ఆ కుహనా ఆధ్యాత్మిక పిచ్చిలో పడి ఈ పిచ్చివాళ్ళు మరీ పిచ్చివాళ్లవుతారు. అప్పుడు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీకుండా పోతుంది. అదే ఈమె కేసులో, ఈమె కుటుంబం కేసులో జరిగింది.
ఒకమనిషి ఎప్పుడూకూడా తలుపులేసుకుని రోజుల తరబడి ఒంటరిగా ఉండకూడదు. మనుషులలో కలుస్తూ తిరుగుతూ ఉండాలి. హెల్తీ కంపెనీ ఉండాలి. లేకపోతే ఇలాగే పిచ్చి ముదురుతుంది. చాలామంది డిప్రెషన్లో పడి, ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ధ్యానశక్తి ఉన్న యోగులు మాత్రమే నెలలతరబడి ఒంటరిగా ఉన్నప్పటికీ శారీరక, మానసిక సమతుల్యతతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మామూలు మనుషులు అలా ఉండలేరు. వాళ్లకు పిచ్చెక్కుతుంది. కరోనా వచ్చి ఇదే విధంగా చాలామందిని పిచ్చోళ్లను చేసిందన్నది నిజం. లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా ఇందులో ఉంది.
మంగోలిజం, OCD, ADHD, Autism మొదలైన రోగాలు జన్యువులలో పిల్లలకు కూడా వస్తాయి. పుట్టుకతోనే అందరికీ రాకపోవచ్చు. కొన్నాళ్ళు పోయాక, సరియైన పరిస్థితులు వచ్చినపుడు అవి బయటపడతాయి. అదే విధంగా ఈమె కూతుళ్ళకు కూడా మానసికపరిస్థితి సరిగ్గా లేదు. ఉంటె, అలాంటి అనవసరమైన భయాలు, పిచ్చి నమ్మకాలు, వాళ్లలో ఎందుకుంటాయి?
భక్తి వేరు. అక్కల్ట్ వేరు. లిమిట్ లో ఉన్నంతవరకూ భక్తి మంచిదే. లిమిట్ దాటితే భక్తికూడా మంచిది కాదు. కానీ అక్కల్ట్ మొదలుకే మంచిది కాదు. అక్కల్ట్ చాలావరకూ మోసమే. ఒకవేళ మోసం కాకపోయినా అది ప్రమాదకరమైన లోకం. రహస్యపూజలు, దయ్యాలు, భూతాలూ, ఆత్మలు, మంత్రతంత్రాలు, దేవతలు, శక్తులు, ఇలాంటివాటి జోలికి పోవడం అస్సలు మంచిది కాదు. దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి.
సరే ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేదు. వాళ్ళు అలా చంపుతుంటే, ఎదిగిన ఆ కూతుళ్లు ఎలా చంపించుకున్నారో? ఎదురు తిరిగి వాళ్లనే ఏదైనా చేసి ఉన్నా సెల్ఫ్ డిఫెన్స్ పరంగా తప్పుండేది కాదు. కానీ ఎదురు తిరగలేదంటే, వాళ్ళూ ఈ రిచువల్ లో పాత్రధారులే అన్నది అర్థమౌతోంది. అదే రోజున ఇంస్టాగ్రామ్ లో అలేఖ్య అనే పెద్దకూతురు (చనిపోయినవారిలో ఒకమ్మాయి), "Shiva will come, Work is done" అని మెసేజి పెట్టింది. జగ్గీ వాసుదేవ్ ది "శివా కల్ట్" అన్నది అందరికీ తెలుసు. 'ఆదియోగి శివా' అంటూ కోయంబత్తూరు కొండల్లో ఆయన పెద్ద విగ్రహమే పెట్టాడు. బహుశా జగ్గీ కల్ట్ లోనే ఈ మూఢనమ్మకాల బురదను వీళ్ళు అంటించుకుని ఉండవచ్చు. అవకాశాలు బలంగా ఉన్నాయి.
'అయామ్ శివా ! కరోనాను నేనే నానుంచి పుట్టించి లోకాన్ని నాశనం చెయ్యమని వదిలాను. నాకే టెస్టు అవసరం లేదు' అంటూ అరుస్తున్న ఆ తల్లిని చూస్తుంటే, పిచ్చి స్పష్టంగా కనిపిస్తోంది.
షిరిడీసాయిబాబా భక్తులు క్షుద్రపూజల జోలికి పోరు. వారు బాబాను అంతగా నమ్ముతారు. ఇక మెహర్ బాబా తత్త్వం అణుమాత్రం అర్థమైనా వీళ్ళిలాంటి పనులు చెయ్యరు. ఓషో పిచ్చి బాగా తలకెక్కి పెడగా తయారయ్యారు. ఇకపోతే మిగిలింది జగ్గీ. ఆయన ఆశ్రమంలో ఇలాంటి అక్కల్ట్ పోకడలు కొన్ని ఉన్నాయి గనుక అనుమానం అటే చూపిస్తోంది. లేదా లోకల్ మంత్రగాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్లచేత ఇలాంటి పూజలు చేయించి ఉండవచ్చు. అదే నిజమైతే, షిరిడీసాయిబాబాను వీళ్ళు సరిగ్గా నమ్మలేదన్నది చక్కగా రుజువౌతుంది. వీళ్ళింటికి పెద్దపెద్ద అక్షరాలతో 'షిరిడీసాయి నిలయం' అని బోర్డు పెట్టించుకుని, ఇంట్లోనేమో మంత్రగాళ్ళని పిలిచి క్షుద్రపూజలేమిటో మరి? బాబా ఉన్నపుడు మంత్రగాళ్ళెందుకు?
చిత్తూరు జిల్లాలో కమ్మవారిని నాయుళ్లంటారు. అక్కడ, వారు చాలా బలమైన రాజకీయ వర్గమన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా వీరు చాలా ధనవంతులు. జగ్గీకి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కులమూ, ధనమూ, రాజకీయబలమూ అన్నీ ఉన్నపుడు 'మేమే ఈ హత్యలు చేశామ్' అంటూ కోర్టులో ఎలుగెత్తి అరిచినా కూడా, వీళ్లకు ఎలాంటి శిక్షా పడదని గట్టిగా చెప్పవచ్చు.
వీళ్లకు శిక్ష పడితే న్యాయం గెలుస్తుంది. అయినా ఉపయోగం ఏమీ లేదు. జరగాల్సిన అన్యాయం ఇప్పటికే జరిగిపోయింది. ఒకవేళ మానసికకారణాలతో వీరికి శిక్ష పడకపోతే, ఆ భక్తి మత్తులోనుంచి బయటకు వచ్చాక, మిగతా జీవితం నరకమౌతుంది. ఎలాచూసినా వీళ్ళ జీవితాలు ఆల్రెడీ సర్వనాశనం అయిపోయాయి.
95% సోకాల్డ్ ఆధ్యాత్మికులకు కావలసింది సైకియాట్రీ ట్రీట్మెంట్ మాత్రమే. వీరిలో ఒక్క 5% మాత్రమే నిజమైన సాధకులు, జిజ్ఞాసువులు ఉంటారు. మిగతావాళ్లందరూ ఏదో ఒక రకంగా మానసిక రోగులన్నది నిజం !
శ్రీరామకృష్ణులు,వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన శుద్ధమైన మహాత్ములను వదలిపెట్టి, పూజారులు, జ్యోతిష్కులు, దొంగగురువులు, వాస్తుసిద్ధాంతులు, మంత్రగాళ్ళు, ఇలాంటివాళ్ళ మాయలో పడితే ఇలాగే జరుగుతుంది మరి !
ఇలాంటి పిచ్చివాళ్లకు సరియైన దారిని చూపాల్సిన అవసరం ఉందా లేదా? వీరి వెనుక ఉండి, వీరిచేత ఈ పనిని చేయించిన వాళ్ళను, ప్రోత్సహించిన వాళ్ళను గాలికి వదిలెయ్యడం సరియైన పనేనా? వీరికి శిక్ష పడుతుంది సరే, వీరిని తప్పుదారి పట్టించిన గురువులకు ఏ శిక్ష పడాలో?
ఇదా హిందూధర్మం?