“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, జనవరి 2021, గురువారం

Master CVV జాతక విశ్లేషణ - 2 ( భౌతిక నిత్యత్వం)

ఆధ్యాత్మిక కోణంలోమనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు.

ఒకటి - భూమ్మీద హాయిగా బ్రతకాలనుకునే వారు.

రెండు - భూమిని వదలి ఆకాశంలోకి పోవాలనుకునేవారు.

మూడు- ఆకాశాన్ని భూమికి దించాలనుకునేవారు.

మొదటివారు లౌకికులు. కావలసినంత సంపాదించుకుని హాయిగా బ్రతకడమే వీరికి ముఖ్యం. అంతకంటే ఉన్నతమైన గమ్యాలేవీ వీరికుండవు. రెండవవారు పాతతరం ఆధ్యాత్మికులు. శరీరం ఎలాగూ నశిస్తుంది గనుక, లౌకికజీవితాన్ని ఆధ్యాత్మిక సిద్ధికోసం ఉపయోగించాలని వీరి భావన. మూడవవారు కూడా ఆధ్యాత్మికులే. కాకపోతే వీళ్ళు ఇదే శరీరంతో ఎప్పటికీ ఈ భూమిమీద ఇలాగే ఉండాలన్న గమ్యంతో సాధన చేసేవారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ !

ఈ మూడవరకం వారు, పాత యోగమార్గాలను పరిపూర్ణమార్గాలు కావంటారు. మాదే అసలైన యోగమార్గమంటారు. వీరి మాటలు వినడానికి చదవడానికి చాలా సంభ్రమాన్ని గొలిపేవిగా ఉంటాయి. నిజమేనేమో అనిపిస్తాయి. కానీ దానిలో సిద్ధిని పొందినవారు మాత్రం ఇప్పటిదాకా ఎవరూ లేరు !

నవీనకాలంలో ఈ మార్గాన్ని అనుసరించిన వారు రామలింగస్వామి. అరవిందులు. మాస్టర్ సీవీవీ గారు. ముగ్గురూ వారి సాధనలో విఫలులయ్యారు. అదేంటోగాని దేహంతో శాశ్వతంగా  ఇక్కడే ఉండాలన్న ఈ పిచ్చి దక్షిణభారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరభారతంలో ఇలాంటి యోగమార్గాలను అనుసరించిన వారు ఎవరూ కనిపించరు. బహుశా దానిక్కారణం ఉత్తర భారతమంతా ముస్లిముల దండయాత్రలకు, వాళ్ళు చేసిన అరాచకాలకు బలైపోతూ అతలాకుతలమై పోతూ వెయ్యి సంవత్సరాలపాటు నానాబాధలు పడటమే కావచ్చు. దక్షిణభారతంలో అలాంటి బాధ లేదు. ఎప్పుడో ఏ మలిక్కాఫరో వచ్చి చావగొట్టటమే కానీ, ఉత్తరభారతం వారు పడిన బాధలు వీళ్ళు పడలేదు. ఉత్తరాదివారితో పోల్చుకుంటే వీళ్ళ జీవితం చాలా హాయిగా గడిచింది. అందుకే వీరికి ఇలాంటి విచిత్రపు ఆలోచనలు పుట్టాయేమో అనిపిస్తుంది. మనిషికి తీరిక లేకపోతే జీవనపోరాటమే సరిపోతుంది. తీరిక ఎక్కువైతే ఇలాంటి విచిత్రబుద్ధులు పుడతాయి.

ఇంకా విచిత్రంగా ఈ ముగ్గురూ తమిళనాడులోనే ఈ యోగమార్గాలను నడిపారు. అరవ్వాళ్ళకు పిచ్చి కొంచం జాస్తని  ఊరకే అనలేదు. అయితే ఈ ముగ్గురూ అరవ్వాళ్లు కారు. రామలింగస్వామి అరవాయనే. అరవిందులు బెంగాలీ. సీవీవీ గారు తెలుగునాడు నుంచి అరవదేశానికి పోయి స్థిరపడిన కుటుంబం వారు.

రామలింగస్వామి అనే యోగి 5-10-1823 న తమిళనాడు లోని చిదంబరం దగ్గ్గర్లోని మరుదూరులో పుట్టి 30-1-1874 తేదీన ఎవరికీ కనపడకుండా, ఏమైపోయాడో తెలీకుండా మాయమయ్యాడు. ఆ రోజున ఒక గదిలో కెళ్ళి తలుపులేసుకుని ఉండిపోయాడు. ఎన్నిరోజులకూ బయటకు రాకపోతుంటే, మే నెలలో ఒకరోజున ప్రభుత్వాధికారులూ, ప్రజలూ,  శిష్యులూ కలసి తలుపులు పగలగొట్టి చూస్తే ఆయన అందులో లేడు. బయటకు పోయే వేరే దారంటూ ఏదీ  ఆ గదికి లేదు. కనుక ఆయన సశరీరంగా శూన్యంలో కలసిపోయాడని, లేదా జ్యోతిలో లీనమయ్యాడని ఆయన భక్తులు భావించారు. ఆయన ఎదురుగా ఒక వెలుగుతున్న ప్రమిదను ఉంచుకునేవాడు. అందుకని ఆయనకు జ్యోతి రామలింగస్వామి అని పేరొచ్చింది. ఆ జ్యోతిలోనే ఆయన లీనమయ్యాడని అందరూ భావించారు. కానీ, లోతుగా పరిశోధన చేసిన కొంతమంది చరిత్ర పరిశోధకులేమో వేరేగా భావించారు. ఆయనకున్న - సర్వజన సమానత్వం, కులమతరాహిత్యం, సాంప్రదాయ పూజలను నిరసించడం, భౌతిక నిత్యత్వ సాధన - ఇలాంటి భావనలవల్ల ఆయనకు బలమైన శత్రువర్గం చాలా ఉండేదని, వాళ్ళే ఆయనను రహస్యంగా చంపేసి, శవాన్ని ఎక్కడో పారేసి, మళ్ళీ గప్ చుప్ గా తలుపులు తాళాలు వేశారని, అది తెలీని వెర్రిశిష్యులు భక్తులు ఆయన బొందితోనే స్వర్గానికి వెళ్లిపోయాడని లేదా జ్యోతిలో లీనమయ్యాడని భావించారని, రియలిస్టిక్ హిస్టారియన్లు భావించారు. కనుక బొందితోనే శాశ్వతత్త్వం అనేదానిని ఆయన పొందాలని ప్రయత్నించినప్పటికీ దానినాయన పొందలేదన్నది వాస్తవం. పొందితే, ఆయన ఇప్పటికీ మనకు కనిపించాలి కదా ! కానీ అప్పటినుంచీ ఆయన దేహం ఎక్కడా లభించలేదు.  ఈనాటికీ ఆయన అడ్రస్ ఎవరికీ తెలీదు. కనుక ఆయన హత్య చేయబడ్డాడనేది వాస్తవమని నేనూ నమ్ముతాను. నా నమ్మకానికి ఆధారం ఆయన జాతకమే. చూడండి మరి !

ఈయనది చిత్తా నక్షత్రం. తులలోని బుధ చంద్రుల వల్ల ఈయనకు విప్లవాత్మకములైన ఆధ్యాత్మిక భావాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. ఈయనకు చాలా శత్రువర్గం ఉంటుందని, వాళ్లలో చాలా నీచపుబుద్ధి ఉన్న వాళ్లుంటారని సప్తమంలో ఉన్న నీచశని చెబుతున్నాడు. వాళ్ళవల్ల ఈయనకు ప్రమాదం ఉందని, వాళ్ళే ఈయన్ను హఠాత్తుగా చంపేశారని, శవాన్ని కనపడకుండా మాయం చేశారని దశమంలో ఉన్న నీచకుజుడు, చంద్రుడిని సూచిస్తున్న కేతువు, రాహుకేతువులతో పాపార్గళం పట్టిన చంద్రబుధులూ చెబుతున్నారు. కనుక, ఆకాలంలోనే సంఘసంస్కర్తగా, మతసంస్కర్తగా, ఆధ్యాత్మికనూతనవాదిగా పేరుపొందిన ఈయన్ను హత్యచేసి, ఆయన బొందితో స్వర్గానికి వెళ్లిపోయాడని నమ్మించారు. ఇది సత్యమని ఆయన జాతకమే చెబుతున్నది. లోకం మాత్రం తమకు సౌకర్యంగా ఉండే మూఢనమ్మకాల ఊబిలో కూరుకునిపోయి, ఆయన పటం పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నది.

రామలింగస్వామి చనిపోయిన రోజున గ్రహస్థితి ఇలా ఉంది. ఆ సమయంలో ఈయన జాతకం లోని జననకాల చంద్రుడు గోచార రాహుకేతువులు చేత కొట్టబడ్డాడు. సప్తమంలో ఉన్న రాహువు కుజుడిని సూచిస్తూ  ఆయనపైన జరిగిన హింసాపూరితమైన దాడిని సూచిస్తున్నాడు. ఈ గ్రహస్థితి దేనిని సూచిస్తున్నదో, అక్కడ ఏం జరిగి ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా ! 

చైతన్య మహాప్రభువు కూడా ఇట్లాగే, పూరీ జగన్నాధస్వామి విగ్రహంలో శరీరంతో సహా లీనమైపోయాడని ఆయన భక్తులు భావిస్తారు. కానీ చరిత్ర పరిశోధకులేమో పూరీ ఆలయంలోనే ఆయన్ను హత్య చేసి గుండిచా ఆలయం దగ్గర్లో ఆయన్ను పూడ్చిపెట్టారని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు.

బయటకు బహుసుందరంగా కనిపించే మతాల సమాధులలో ఎన్ని కుళ్లిపోయిన అస్థిపంజరాలో? అసలు నిజాలు ఇలాగే వినడానికి చాలా వింతగా, విడ్డూరంగా ఉంటాయి.

ఇదే పోకడతో నడచినవారు బెంగాల్ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడిన అరవిందయోగి. దేహంతో నిత్యత్వాన్ని పొందాలన్న ప్రయత్నం చేస్తూనే ఆయన కూడా కన్నుమూశారు. ఆయన ఆశయమూ నెరవేరలేదు. మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ఆయన ఆశ్రమం మీద తమిళ లోకల్ గూండాలు కొందరు దాడి చేశారు. ఆ దాడిలో ఆయన పర్సనల్ సేవకుడు స్పాట్లో చనిపోయాడు. అతన్ని అరవిందులు తన యోగశక్తితో కాపాడలేకపోయారు. ఆయన శిష్యులేమో మొదటి/రెండవ ప్రపంచయుద్ధాలను ఆయన పాండిచ్చేరిలో కూచుని తన యోగశక్తితో కంట్రోల్ చేశాడని కాకమ్మకబుర్లు చెబుతూ మనలని నమ్మమంటారు. మహామాయకు ఎన్ని రూపాలో ! ఆయన మీద వేరే సీరీస్ ను వ్రాస్తున్నందున ఇక్కడ ఎక్కువగా వ్రాయను. కానీ భౌతికనిత్యత్వాన్ని ఆయనకూడా సాధించలేకపోయారు. ఈయన సమాధే దీనికి సాక్ష్యం.

ఇక మూడవవారు - మాస్టర్ సీవీవీ. ఈయన పరిస్థితి ఇంకో విధంగా అయిపోయింది. ఆయన యోగాన్ని మొదలుపెట్టిన అసలు ఉద్దేశ్యం నెరవేరకపోగా, ఆయన ఒద్దని నిషేధించిన కోర్సులనే ఈనాటి సోకాల్డ్ శిష్యులు చేస్తూ, దానికి థియోసఫీ మాయాపదజాలాన్ని జోడించి, మాస్టర్లని, ఏంజిల్సని, యాస్ట్రల్ లోకాలని, రెక్టిఫికేషన్లని, అడ్జస్ట్మెంట్లని, ఉన్నవీ లేనివీ చెబుతూఎవరి కుంపట్లు వారు పెట్టుకుని, వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కుండలినీజాగృతి పేరుతో రకరకాల డాన్సులు చెయ్యడం, వర్కింగు, ఎడ్జస్ట్మెంట్, రెక్టిఫైకేషన్ మొదలైన ఇంగిలీషు పదాల చాటున పబ్బం గడుపుకుంటున్నారు. రోగాలు తగ్గడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారాలు కలసిరావడం, పెళ్లిళ్లు కావడం, పనులు కావడం మొదలైనవి మాత్రమే వీరి పరమప్రయోజనాలుగాని సాధన కాదు. ఈ యోగపు అసలు ఉద్దేశ్యమేమిటో, సీవీవీగారు అసలెందుకు ఈ యోగాన్ని మొదలుపెట్టారో వారి శిష్యులలో ఎవరికీ నేడు గుర్తు లేదు. ఆ మార్గంలో ప్రయత్నిస్తున్న వారు కూడా ఎవరూ లేరు.

సీవీవీ గారి జాతకంలో నవాంశ చక్రాన్ని చూద్దాం. నవాంశలో ఉన్న నీచగురువు వల్ల వివాహమూలకంగా ఈయన సాధన దెబ్బతింటుందని, ఆధ్యాత్మిక జీవితంలో చికాకులు ఎదురౌతాయని స్పష్టంగా కనిపిస్తున్నది. అంతేగాక, ఈయన తర్వాత ఈయన సతీమణి గారు ఒక గురువుగా చెలామణీ అవుతారని, కానీ ఆమెకు అంతటిస్థాయి లేదని కూడా అర్ధమౌతుంది. లగ్నాధిపతి చంద్రుడు తృతీయ ఉపచయస్థానంలో శనితో కలసి ఉండటంవల్ల, ఆధ్యాత్మికం అంటూ సంసారం నిర్లక్ష్యం చెయ్యబడుతుందని ఈ క్రమంలో  పిల్లలు అనుచరుల వల్ల చాలా నష్టపోతారని స్పష్టంగా కన్పిస్తున్నది.
 
ఆధ్యాత్మిక జీవితాన్ని స్పష్టంగా చూపించే వింశాశ చక్రాన్ని గమనిద్దాం. దీనిలో శని నీచలో ఉన్నాడు. అంటే ఈయన యోగం యొక్క ఉద్దేశ్యం నెరవేరదని, ఈయనకు లభించే శిష్యులలో ఎక్కువమంది సరియైనవాళ్లు కాదని, ఉన్న కాస్తమంది కూడా ఈయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చలేరని, కాలక్రమేణా ఎవరి భావాలను వారు దీనిలో జొప్పించి, కలగూర గంప చేసేస్తారని, ఈ యోగపు పరమోద్దేశ్యాన్ని ఎవరూ సాధించలేరని ఈ చక్రం స్పష్టంగా సూచిస్తున్నది. బుద్ధికారకుడైన బుధుడు నీచశనితో కూడి ఉన్నందున, వీరు ఊహించినది బోధించినది అంతా నిజం కాదని, ఇందులో చాలా భ్రమలున్నాయని, ఇది పెడదారి పట్టిన ఆధ్యాత్మికత యన్న విషయం గోచరిస్తున్నది.

శిష్యులకు సూచిక అయిన పంచమంలో రాహుకేతువులు ఉండటంలో గురుఛండాలయోగం ఉన్నది. కనుక వీరి శిష్యులు వీరి మాటలను లెక్కచెయ్యరని, ఎవరిష్టం వచ్చినట్లు వారు చేస్తూ ఇదే మాస్టారుగారి యోగం అంటారని స్పష్టంగా కన్పిస్తున్నది. నిజానికి ఈయన శిష్యులు ఈయనను ఏమీ పట్టించుకోలేదు. ఈయన అప్పట్లోనే కోటీశ్వరుడు. మహారాజులాగా బ్రతికాడు. శిష్యులదగ్గర ఏమీ తీసుకోకుండా అందరినీ ఆదరించి  భోజనం పెట్టి మరీ యోగం నేర్పించాడు. వీరింట్లో ప్రతిరోజూ కనీసం ఇరవై మంది భోజనం చేసేవారు. ప్రతిపూటా ఇరవై రకాల వంటకాలు భోజనంలో ఉండేవి. ఇవికాక కాఫీలు, టిఫిన్లు నిరంతరం సరఫరా అవుతూ ఉండేవి. ఈయనకు వెయ్యి మంది శిష్యులున్నారని శ్లోకాలు రాసుకుని పాడటం తప్ప వారిలో ఎవరూ ఈయన పరిస్థితి ఏమిటి? మనమేం చెయ్యాలి? అని ఆలోచించినవారు లేరు. తత్ఫలితంగా, మహారాజాలా బ్రతికిన ఆయన చివరిరోజులలో కాఫీకి కూడా లేనంత బీదరికంలో పడిపోయాడు. చనిపోయాడు. ఆ శిష్యులందరూ ఎవరి మానాన వారు హాయిగా వెళ్లిపోయారు. ఎవరి కుంపట్లు వారు పెట్టుకున్నారు.  

వీరి శిష్యులలో ఒక్కొక్కరు ఎవరికీ వారే 'మాస్టర్' అని పేరు పెట్టుకుని, ఎవరి భావాలను వారు ఈయన యోగంగా ప్రచారం చేసుకుంటూ, ధనార్జన చేస్తూ, ఈయన వద్దన్నసాధనలను చేస్తూ, వద్దన్న నాడీగ్రంధాలనే ప్రామాణికంగా తీసుకుంటూ ఈయన బోధించిన అసలు సాధనను గంగలో కలిపేస్తున్నారు. ఈయన జాతకంలో ఇవన్నీ స్పష్టంగా కన్పిస్తున్నాయి.

(ఇంకా ఉంది)