ఇప్పటికి ఎందరో వారి శిష్యులు, సోకాల్డ్ 'మాస్టర్లు' జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండులమని చెప్పుకునేవాళ్ళు ఈయన జాతకాన్ని వివరించే ప్రయత్నం చేశారు. వీరిలో ఎక్కువమంది సాయనసిద్దాంతానుసారులు. పురాణకధలతో, థియోసఫీ మాయాపదజాలంతో, ఇంకా ఏవేవో కల్పిత విషయాలతో, కాకమ్మ పిచ్చికమ్మ కబుర్లతో వీరి విశ్లేషణలు సాగినవి.
మాస్టర్ సీవీవీ గారు తమ యోగమార్గాన్ని సైన్టిఫిక్ యోగా అన్నారు. కానీ వారి శిష్యుల విశ్లేషణలన్నీ వారంటే ఉన్న భక్తికి తార్కాణములుగా మాత్రమే ఉన్నాయి గాని, వాటిలో శాస్త్రీయత పాళ్ళు లోపించినాయి. ఏ మహాపురుషుని నమ్మినవారైనా, వారిని ఏదో దేవుని అవతారమని చెప్పుకోవడం కద్దు. ఎందుకంటే, అలా చెప్పుకోనిదే వారికి తృప్తీ నమ్మకమూ రెండూ కలగవు. కానీ ఇలాంటి భావనల వెనుక సత్యంకంటే డొల్లనమ్మకము, అసత్య ప్రచారములే ఆధారములుగా ఉంటున్నాయి. ఇటువంటి కుహనాభక్తి పూరితములైన నిరాధారపు ప్రచారములను దూరము పెట్టి వీరి జాతకచక్రం ఏమంటున్నదో నిస్పాక్షికమైన దృష్టితో చూద్దాం.
మంత్రస్థానాధిపతి, కర్మకారకుడు అయిన శని తృతీయ ఉపచయస్థానంలో ఉంటూ నవమాన్ని, రవిబుధులను చూస్తున్నాడు. లగ్నాధిపతి బుధుడు పదకొండులో రవితో కలసి ఉంటూ శనిని చూస్తున్నాడు. శని దృష్టి ద్వాదశంలో ఉన్న రాహువుమీద ఉంది. వీటివల్ల లోతైన యోగసాధన, తపస్సు, దయాహృదయములు గోచరిస్తున్నాయి. చతుర్ధం మనస్సు, ద్వాదశం రహస్యసాధన గనుక, ఈ శపితయోగప్రభావం వల్ల లోకపుబాధలను తనమీద వేసుకొని పరిష్కారం చెయ్యాలని ప్రయత్నించే సాధన కనిపిస్తున్నది. వీరు కనిపెట్టిన భృక్తరహిత తారకరాజయోగం అలాంటిదే.
నవమాధిపతి శుక్రుడు దశమంనుంచి నవమంలోకి వస్తూ శనివీక్షణకు గురౌతున్నాడు. కనుక ఈయనది సన్యాసమార్గం కాదని, అన్ని భోగాల మధ్యన ఉంటూనే చేసే సాధన యని తెలుస్తున్నది.
లాభాధిపతి అయిన పూర్ణచంద్రుడు మంత్రస్థానంలో ఉంటూ శనిదృష్టికి గురవడం లోతైన ఆధ్యాత్మికచింతనకు సూచనగా ఉంది. అదే చంద్రునిపైన ఉన్న సూర్యబుధదృష్టి వల్ల వివాహజీవితంలో చికాకులు, భార్య వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సప్తమంలో వక్రించి ఉన్న సప్తమాధిపతి గురువు వల్ల భగ్నమైన వివాహజీవితం సూచింపబడుతున్నది. ఈయన మొదటి భార్య గతించగా రెండవ వివాహం చేసుకున్నారు. రెండవభార్య వల్ల ఈయన సాధనలో చాలా చిక్కులు ఎదుర్కొన్నట్లు, మొదట్లో ఆమె చాలా మొండిగా చెప్పినమాట అర్ధం చేసుకోకుండా ఉన్నట్లు తెలుస్తున్నది. దారాకారకుడైన బుధుడు రాశిసంధిలో ఉండటం దీనిని బలపరుస్తున్నది.
ఈయన పౌర్ణమి ఛాయలో జన్మించాడు. కనుక వివాహజీవితం బాగుండదు. ఇది నిజమే అని ఈయన జీవితాన్ని ఈయన డైరీలను చదివితే అర్ధమౌతుంది.
సాంప్రదాయగ్రహమైన గురువు వక్రించి షష్ఠంలోకి వచ్చి శనిని సూచిస్తున్న కేతువుతో కలవడం వల్ల సాంప్రదాయవిరోధియైన ఒక విచిత్రసాంప్రదాయాన్ని అనుసరించడం కనిపిస్తున్నాయి. కేతువుకు ధూమకేతువని పేరుంది. 1910 లో భూమికి దగ్గరగా వచ్చిన హేలీ తోకచుక్క ప్రభావం వల్లనే ఈయన సాధన పురోగమించిందని అంటారు. దీనిలోని నిజానిజాలు దేవునికెరుక. దీనిని ఈయన జాతకంలోని గురుకేతు సంయోగం, సంప్రదాయవిరుద్ధమైన ఒక ఖగోళసంఘటనతో ఈయన సాధన ముడిపడినదని రుజువు చేస్తున్నది. కానీ ఇది ఆరవఇంటిలో జరగడం వల్ల, ఇది పూర్వకర్మ ఫలితమే గాని, దీని పరిణామాలు చివరకు సఫలం కావన్న సూచన బలంగా ఉన్నది.
ఈయన యోగం యొక్క ముఖ్యోద్దేశ్యమైన 'ఎటర్నిటీ' లేదా 'భౌతికశరీరంతో శాశ్వతత్వం పొందటం' అనే గమ్యం ఎంతవరకు నెరవేరిందో చూద్దాం.
మృతసంజీవనికి కారకుడు శుక్రుడు. ఈ జాతకంలో వక్రించి ఉన్నాడు. లగ్నాధిపతి బుధుడు బలహీనుడుగా రాశిసంధిలో ఉన్నాడు. దేహస్థిరత్వానికి కారకుడైన కుజుడు కూడా అతిబాల్యావస్థలో బలహీనుడుగా ఉన్నాడు. కుజబుధుల మధ్యన స్నేహపూరిత సంబంధం లేదు. వారికి బలములూ లేవు. అందువల్ల ఈ జాతకంలో మృతసంజీవనీ యోగం లేదు.
కుజుడూ శుక్రుడు కలసి ఉండటం నిత్యయవ్వనానికి సూచిక. కానీ ఈ యోగం బలంగా లేదు. శుక్రుడు వక్రించి కుజుడిని వదిలేసి వృషభంలోకి పోతున్నాడు. ఈ యోగం విడిపోతున్నది.
అయితే, శని, శుక్ర, రాహు, కేతువులు పరస్పర కేంద్రస్థానాలలో ఉంటూ మిస్టిక్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీరి సాధనలో శని, శుక్రుల రెగులేషన్ చాలా ముఖ్యమైనది. శనంటే స్థిరత్వం. వీరి భాషలో చెప్పాలంటే స్టెబిలిటీ. శుక్రుడంటే భౌతికరూపంతో సుందరంగా ఉన్న సృష్టి లేదా దేహం. రాహుకేతువులంటే కుండలినీ శక్తి. ఈ మిస్టిక్ క్రాస్ అనేది కుండలినీశక్తి జాగృతి ద్వారా భౌతిక దేహానికి స్థిరత్వాన్ని లేదా శాశ్వతత్వాన్ని తెచ్చే ప్రక్రియ. కనుక భౌతికనిత్యత్వ గమ్యపు దారిలో శనిశుక్రులను సాధించడం లేదా రెగులేట్ చేయడం తప్పనిసరి. కనుక వీరి సాధన ఈ దారిలోనే సాగినప్పటికీ, దాని గమ్యాన్ని చేరడంలో మాత్రం ఈయన విఫలమైనాడని చెప్పక తప్పదు. దానికి కారణం శుక్రుని వక్రత్వం. అంటే ఈ సాధనకు దేహప్రకృతి సహకరించకపోవడం. అందుకనే చనిపోతున్న రోజున 'ప్రాణాన్ని దేహం స్వీకరిస్తున్నది కానీ అది నిలబడటం లేద'ని ఆయనన్నాడు. గ్రహాలన్నింటిలోకి శుక్రుడు లొంగడం చాలా కష్టమని కూడా ఆయనన్నాడు.
భౌతిక అమరత్వాన్ని పొందాలని ప్రాచీనకాలంలో ఎందరో ప్రయత్నించినట్లు గాధలున్నప్పటికీ వాటి సాధించినట్లుగా ఆధారాలు మాత్రం లేవు. అలా బ్రతికి ఉన్నవారెవరూ కనిపించడం లేదు. చిరంజీవులు కూడా ఎక్కడో అడవులలో హిమాలయాలలో ఉన్నారని నమ్మడమేగాని వారిని చూచినవారు లేరు. నవీనకాలంలో అరవిందులు కూడా తమ యోగం ద్వారా దీనిని సాధించాలని ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. అరవిందుల మార్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పబడుతున్న మదర్ మీరా కూడా ఈ గమ్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. పాండిచ్చేరి ఆశ్రమంలోని వీరిద్దరి సమాధి వారి భౌతికనిత్యత్వ గమ్యాన్ని వెక్కిరిస్తూ ఈనాటికీ మనకు కన్పిస్తోంది.
ప్రపంచంలోని అన్ని మతాలలోనూ, వారివారి ప్రవక్తలు, దేవుళ్ళు మళ్ళీ వస్తారని, ఆకాశం నుంచి ఊడిపడతారని నమ్మకాలున్నాయి. కానీ వేలాది ఏళ్ళు గడచినా, ఆ ప్రవక్తలు దేవుళ్ళు దిగివస్తున్న జాడా జవాబూ ఎక్కడా లేదు. కానీ వాళ్ళొస్తారని జనాన్నినమ్మిస్తూ మాయచేస్తూ జరుగుతున్న గ్లోబల్ వ్యాపారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మతాలన్నీ అవే ! భౌతిక అమరత్వ భావన కూడా ఇలాంటి బూటకమే. దీనిలో ఎవరూ విజయాన్ని సాధించలేదు.
ఇదే విధంగా మాస్టర్ సీవీవీ కూడా విఫలమయ్యారు. ఆయన 12.5.1922 తేదీన చనిపోవడమే దీనికి రుజువు. కొందరు శిష్యులు మాత్రం, ఆయన యొక్క సూక్ష్మశరీరానికి నిత్యత్వాన్ని తెచ్చారని సమర్థిస్తారు. ఎవరు చూచారు? కానీ ఆయన వ్రాతలలో ఉన్నది అది కాదు. భౌతికశరీరం రోగం లేకుండా, కృంగుబాటు లేకుండా, చావు లేకుండా ఉండాలన్నదే ఈయన యోగగమ్యం. దానిని ఆయన సాధించలేదు. అంతేకాదు, ఆయన శిష్యులలో కూడా ఎవరూ సాధించలేదు.
యోగంతో రోగాలు తగ్గించడం పెద్దవిషయం కాదు. యోగసాధనలో కొద్దిగా పురోగమించినవారు ఇలాంటివి చాలా తేలికగా చేయగలుగుతారు. కానీ, మరణించిన వారిని కూడా బ్రతికించారని అనేక కధలను వీరి శిష్యులు చెబుతారు. కానీ ఆ బ్రతికినవారు కొంతకాలానికి మళ్ళీ చనిపోయారని కూడా చెబుతారు. కనుక ఆ బ్రతికించడం ఎందుకు? ఎప్పటికైనా చనిపోవలసినవాడు మరికొద్దికాలం బ్రతికితేనేమి, బ్రతకకపోతేనేమి? అసలా చనిపోయారని చెప్పబడుతున్నవారు నిజంగా చనిపోయారా? లేక కోమా వంటి స్థితిలో ఉండి మళ్ళీ తెలివిలోకి వచ్చారా? అనేది ఎవరూ చెప్పలేరు. నిస్పాక్షికంగా గమనించి రికార్డ్ చేసినవారు ఎవరూ లేనందున, భారతీయులకు సహజమైన మూఢభక్తి శిష్యులలో ఉండటం సహజం అయినందున, ఈ కధలన్నీ నిజాలని మనం నమ్మలేం.
మాస్టర్ సీవీవీ గారు ఇలా వ్రాశారని రికార్డ్ చేయబడి ఉన్నది - 'చనిపోయినవానిని "లేచిరా" అని పిలిస్తే వాడు లేచి రావడం మన యోగమార్గంలో చాలా చిన్నపని'. చెప్పడానికి బాగానే ఉంది. కధలు బాగానే ఉన్నాయి. కానీ రుజువులేవి? ఆ చెప్పినవారే మరణానికి లొంగిపోయారు. వారి శరీరాలు చనిపోయాయి. అలా బ్రతికింపబడ్డారని చెప్పబడినవారూ కొంతకాలానికి చనిపోయారు. ఏమిటిది? ఎందుకిదంతా? ఇవి ఉత్తమాటలా? నిజాలా?
20-8-1917 న ఇవ్వబడిన పిల్లర్ టెస్ట్ ప్రకారం - 'నశ్వరమైన మానవదేహం చావకుండా ఉండదు. నశిస్తుంది. కానీ, దానికి సరియైన శిక్షణనివ్వడం ద్వారా దానిని నేను చావు లేనిదిగా చేస్తా' నని ఆయనన్నారు. కానీ, అది జరుగలేదు. నిజం కాలేదు.