నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, మార్చి 2021, బుధవారం

సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ


సూయజ్  కాలువ అనేది మధ్యధరా సముద్రాన్ని ఎర్రసముద్రంతో కలుపుతూ కట్టబడిన ఒక కాలువ.  ఇదొక సన్నటి కారిడార్ లాంటిది. దీనిని 1859 - 1869 మధ్యలో పదేళ్ళపాటు నిర్మించారు. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో విడదీస్తున్న ఇది ఈజిప్టు దగ్గరలో ఉంది.

దీనిలో ప్రయాణించే ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా, ఉత్తరఅట్లాంటిక్ సముద్రం నుంచి ఉత్తర హిందూమహాసముద్రంలోకి ఈ దగ్గరిదారిలో నుంచి సూటిగా రావచ్చు. ఓడలు ఈ దారిలో ప్రయాణించడం వల్ల దాదాపుగా 7000 కి. మీ దూరం తగ్గుతుంది. దాదాపుగా పదిరోజుల ప్రయాణం కలిసొస్తుంది. ఏడాదికి వేలాది ఓడలు కార్గోని తీసుకుని ఈ దారిలో ప్రయాణిస్తూ ఉంటాయి.

23-3- 2021 న సరిగ్గా ఈ కెనాల్ లో ఒక ఓడ కూరుకునిపోయి ఆగిపోయింది. అటూ ఇటూ ఓడలన్నీ ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వేలకోట్ల డాలర్ల వ్యాపారం ఆగిపోయింది.  కోట్లాది మనుషుల జీవితాలు వారికే తెలీకుండా ప్రభావితమయ్యాయి. ఒకవారం తర్వాత 29 వ తేదీన ఈ ఓడను కదిలించగలిగారు. సంక్షోభం ముగిసింది. ఓడల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. సరిగ్గా ఒకవారం పాటు ప్రపంచ వ్యాపారం స్తంభించింది.

గ్రహాల పరంగా ఈ వారంలో ఏం జరిగింది? చూడండి.

సరిగ్గా 23 వ తేదీన శుక్రుడు సూర్యుడు మీనరాశి 8 వ డిగ్రీమీదకు వచ్చారు. శుక్రుడు తీవ్ర అస్తంగతుడయ్యాడు. అది ఉత్తరాభాద్ర నక్షత్రం. వింశోత్తరీ విధానం ప్రకారం దానికి అధిపతి శని.  అంటే,స్థంభన, ఆగిపోవడం, ఆలస్యం కావడం, నష్టం వాటిల్లడం మొదలైనవి. శుక్రుడు జలగ్రహం. అంటే ఓడలకు సూచకుడు మీనరాశి జలతత్వ రాశి. అంటే సముద్రానికి, నదులకు, కాలువలకు సూచిక. సరిగ్గా అదే రోజున Ever Given అనే జెయింట్ కంటైనర్ షిప్ సరిగ్గా సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకునిపోయి ఆగిపోయింది. దీనిని పొడవు 400 మీటర్లు. లోతు 33 అడుగులు. బరువు దాదాపు 2,20,000 టన్నులు. 23 వ తేదీన ఇసుకలో కూరుకుపోయిన ఇది ఆరు రోజుల తర్వాత 29 వ తేదీన కదిలింది. ఈ ఆరు రోజులూ అటూ ఇటూ ఓడల రాకపోకలు ఆగిపోయాయి. ఇది అంతర్జాతీయ వ్యాపారాన్ని స్తంభింపజేసిన ఒక పెద్ద సంఘటనే.

జలరాశియైన మీనంలో శుక్రుని తీవ్ర అస్తంగత్వం, దానిపైన శనిదృష్టి ఈ సంఘటనకు ప్రేరకాలు. గతవారంగా జరుగుతున్న అనేక అంతర్జాతీయ సంఘటనలకు ఈ గ్రహస్ధితే ప్రేరకం.

ఈ క్రింది పట్టికను గమనించండి.

23 వ తేదీన శుక్రుడు తీవ్ర అస్తంగత్వంలో ఉన్నాడు. అదేరోజున ఈ ఓడ ఇసుకలో కూరుకుపోయింది. ఈ స్థితి నాలుగు రోజులపాటు అంటే, 26 వ తేదీవరకూ కొనసాగింది. ఆ నాలుగురోజులూ ఓడ కదలలేదు. 27 వ తేదీన సూర్యుని పట్టునుంచి శుక్రుడు దూరం జరగడం మొదలైంది.  అదే రోజున ఓడ కదిలే సూచనలు కనిపించాయి. మరో రెండు రోజులలో 29 వ తేదీనాటికి ఓడ కదిలి ఇవతలకు వచ్చింది. దాని అడ్డు తొలగడంతో రవాణా ఓడల రాకపోకలు మళ్ళీ మొదలయ్యాయి.

ఇది కాకతాళీయమంటారా? ఇంత స్పష్టంగా గ్రహస్థితికీ ఓడ కదలికలకూ సంబంధం కనిపిస్తుంటే, లేదని కాదని ఎలా అనగలం చెప్పండి?

'Ever Given' Ship

ఈ ఇంగిలీషు పదంలో తొమ్మిది అక్షరాలున్నాయి. నా విధానంలో జ్యోతిష్య - సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది అంకె చంద్రునికి సూచిక. చంద్రుడు కూడా ఓడలకు సూచకుడే. ఇతడు కూడా జలగ్రహమే. ఈ వారం రోజులలో చంద్రుని పరిస్థితి గమనిద్దామా?

23 వ తేదీన జలరాశియైన కర్కాటకంలో సున్నా డిగ్రీలలో చాలా బలహీనుడుగా ఉన్నాడు. ఓడ ఇసుకలో కూరుకుపోయినది ఆ రోజునే.

24 వ తేదీన బలమైన శనిదృష్టి చంద్రునిపైన ఉన్నది. ఓడలో కదలిక 
ఆగిపోయింది.

25 వ తేదీన చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. శనిదృష్టి కూడా బలహీనపడింది.  ఇసుకను త్రవ్వి ఓడను కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

26 వ తేదీన జలతత్వరాశియైన కర్కాటకంలోనుంచి చంద్రుడు బయటపడి సింహరాశిలోకి  అడుగుపెట్టాడు. ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

27 వ తేదీన బలమైన బుధదృష్టివల్ల టెక్నీకల్ నిపుణులు రంగంలోకి దిగి ప్రయత్నాలు సాగించారు.

29 వ తేదీన ఊబినుంచి కదిలి ఓడ బయటకొచ్చింది. చంద్రునిస్థితికీ ఈ మొత్తం ఆపరేషన్ కూ సంబంధం ఉందా లేదా మరి?

ఇప్పుడు చెప్పండి గ్రహస్థితులకూ భూమ్మీద జరిగే సంఘటనలకూ సంబంధం లేదంటారా? ఉందని నేనంటాను. లేదని మీరంటే మీకు  లోతైన గమనింపు లేదని అర్ధం.  దీనిని కూడా కాదంటారా? సరే మీ ఇష్టం మరి !
read more " సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ "

సౌత్ డకోటా కార్చిచ్చు - జ్యోతిష్య విశ్లేషణ

అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలో రష్ మోర్ పర్వతం ఉంది. ఇది  పర్యాటకస్థలం మాత్రమేగాక అమెరికా పుట్టకముందునుంచీ నేటివ్ ఇండియన్స్ కి చెందిన చారిత్రకస్థలం కూడా.  ఈ పర్వతం మీదే అమెరికా అధ్యక్షుల ముఖాలు చెక్కబడి ఉంటాయి. దీనిని అనేక సినిమాలలో కూడా మనం చూచాం.

గత మూడురోజులనుంచీ ఇక్కడ కార్చిచ్చు చెలరేగి అడవులు తగలబడిపోతున్నాయి. వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు. పర్యాటకులను రావద్దని ఆపేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ పెద్దఎత్తున రేగుతున్న మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇది  సాధ్యం కాని పని. ఒకటి రెండిళ్ళు తగలబడుతుంటే ఆర్పవచ్చు. తీవ్రమైన గాలులు వీస్తూ, వేలాది ఎకరాల అడవులు కాలిపోతుంటే ఆర్పడం తేలికైనపని కాదు. ప్రస్తుతం దాదాపు వెయ్యి ఎకరాలలో మంటలు రేగుతున్నాయి. మూడుచోట్ల మంటలు పుట్టి వేగంగా వ్యాపిస్తున్నాయి. యంత్రాంగం నానా తంటాలూ పడుతోంది. ఎందుకిది జరుగుతున్నది?

నేనింతకుముందు వ్రాశాను. ఒక గ్రహస్థితి కొన్నిరోజులపాటు ఖగోళంలో ఉంటుంది. దానిలో ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి ఉత్తేజితం అవుతూ ఉంటుంది. అప్పుడు భూమ్మీద రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే.

రెండ్రోజుల క్రితం తీవ్ర అస్తంగతుడైన శుక్రుడు సూర్యుడిని వదిలి ముందుకు కదిలాడు. నీరు అగ్నిని వదలి దూరం జరిగింది.  అప్పుడేమౌతుంది? అగ్ని విజృంభిస్తుంది. ఇది చాలదన్నట్లు రాహువు కుజుడు ఒకే డిగ్రీ మీదకు వచ్చారు. కుజుడు అగ్నిస్వరూపుడు. రాహువు శనిని సూచిస్తున్నాడు. శని వాయుతత్త్వ గ్రహం. అంటే, అగ్నికి గాలి తోడౌతుంది. నవాంశలో శని వాయుతత్వరాశి అయిన మిథునంలో ఉన్నాడు. అంటే, గాలికి బలం చేకూరింది. ఇవన్నీ కలుపుకుని చూడండి. సౌత్ డాకోటాలో సరిగ్గా అప్పుడే ప్రచండమైన గాలులు ఎందుకు మొదలయ్యాయి? అడవులలో అగ్ని ఎలా పుట్టింది? ఎందుకు వ్యాపిస్తోంది? వందలాది ఇళ్లను ఎందుకు ఖాళీ చేయించారు? టూరిస్టులను ఎందుకు ఆపేస్తున్నారు? ఇవన్నీ అర్ధమౌతాయి.

ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ! సౌత్ డకోటాలోనే ఇది ఎందుకు జరిగింది? అన్నిచోట్లా ఎందుకు జరగలేదు? అంతేగా మీ ప్రశ్న?

నా జవాబు కూడా మీకు తెలుసుకదా? తప్పమ్మా ! ఏదో చెబుతున్నా కదా  అని అలుసు తీసుకుని అన్నీ అడగకూడదూ? సరేనా !

అది దేవరహస్యం !

ఆ ఒక్కటీ అడక్కండి మరి !
read more " సౌత్ డకోటా కార్చిచ్చు - జ్యోతిష్య విశ్లేషణ "

29, మార్చి 2021, సోమవారం

ఇండోనేషియా చర్చిలో ఆత్మాహుతి దాడి - జ్యోతిష్య విశ్లేషణ

ఆదివారం ఉదయం పదిన్నర గంటలు. ఇండోనేషియా లోని సులవేసి ద్వీపంలోని మొకాసర్ సిటీలో  ఒక కాథలిక్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్నాయి. చర్చి నిండా జనం ఉన్నారు. చర్చ్ బయట ఇద్దరు ముస్లిం తీవ్రవాదులు బాంబులతో తమను తామే పేల్చేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ముక్కలైపోయారు. చర్చిలో ప్రార్ధనలు చేస్తున్నవారిలో ఇరవైమంది గాయాలపాలయ్యారు. ఆత్మాహుతి దళం ఇద్దరిలో ఒకరు అమ్మాయట. ఇద్దరూ ఇస్లామిక్ స్టేట్  తీవ్రవాద సంస్థకు మద్దతుదార్లట.

గ్రహస్థితి ఏమంటున్నదో చూద్దాం.

లగ్నమైన వృషభంలోనే రాహువు కుజుడూ ఉంటూ విధ్వంసయోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగాన్ని గతంలో చాలాసార్లు నా పోస్టులలో పుస్తకాలలో చర్చించాను. ప్రస్తుత సంఘటనలో మళ్ళీ ఇది దర్శనమివ్వడం గమనించండి.

మతపరమైన సంస్థలను సూచించే బాధకస్థానమైన మకరంలో బాధకాధిపతి శని, నాశనానికి కారకమైన అష్టమస్థానానికి అధిపతి అయిన నీచగురువుతో కూడి వృషభ లగ్నాన్ని కోణదృష్టితో చూస్తూ ఉండటం గమనించండి. అంటే, నీచమైన ప్లాన్ తో కూడిన మతసంస్థ చేసే ఉగ్రవాద ఘాతుకం సూచితం కావడం లేదూ?

అదేగా మరి జరిగింది?

ఇండోనేషియా ఒకప్పుడు హిందూ దేశం,ఆ తర్వాత బౌద్ధ దేశం, ఇప్పుడు ముస్లిం మెజారిటీ ఉన్న దేశం. అయినా వారికేంటి తెగులు? అక్కడ క్రిస్టియన్లు మైనారిటీలు. హిందువులు కూడా మైనారిటీలే. ఇంకోవారంలో గుడ్ ఫ్రైడే వస్తున్నది. ఈ వారం క్రైస్తవులకు పవిత్రమైనది. వాళ్ళ ప్రార్థనలేవో వారు చేసుకుంటున్నారు. వీరికేంటి బాధ? అంటే, దేశం మొత్తం ముస్లిములే ఉండాలా? అలా ఉన్న దేశాలలో కూడా మళ్ళీ  షియాలు,సున్నీలు, అహమదియాలు, సూఫీలు అంటూ  కొట్టుకుచస్తున్నారు. ఎదుటి మనిషిని చంపడానికి ఏదో ఒక సాకు తప్ప వేరే కారణం ఇంకేమీ కనిపించడం లేదు.

ఇస్లాం అంటే 'శాంతి' అని చెబుతారు. కానీ శాంతి తప్ప మిగతా అన్నీ అందులో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్వేషం కనిపిస్తోంది.  అదేం రకమైన శాంతో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు. సాటి మనిషిని మతంపేరుతో నిష్కారణంగా చంపటం ఏ విధమైన శాంతి అవుతుందో మరి?

చూశారా ఒకే గ్రహస్థితి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సంఘటనలను ఎలా ప్రేరేపిస్తున్నదో? గ్రహస్ధితేమో అదే. కానీ అమెరికాలో ఒక విధంగా, ఆసియాలో మరో విధంగా, ఇంకోచోట ఇంకోవిధంగా, మనుషుల వ్యక్తిగత జాతకాలలో ఇంకో విధంగా, రకరకాలుగా పనిచేస్తుంది. ఫలితాలు చూపిస్తుంది. ఈ కీలకం ఏమిటో అర్ధమైతే మేదినీజ్యోతిష్యం (Mundane Astrology) రహస్యం మొత్తం మీకు అర్ధమైనట్లే. గ్రహప్రభావంతో భూమ్మీద సంఘటనలు ఎలా జరుగుతాయో, ఎప్పుడు జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో మొత్తం అర్ధమైనట్లే.  దేవుని సృష్టి నడక యొక్క రహస్యం మొత్తం అర్ధమైనట్లే.

అదేంటో చెప్పమంటారా? వెల్ ! మీకనవసరం !
read more " ఇండోనేషియా చర్చిలో ఆత్మాహుతి దాడి - జ్యోతిష్య విశ్లేషణ "

నాష్ విల్ వరదలు - జ్యోతిష్య విశ్లేషణ

గత రెండు రోజులుగా కురుస్తున్నరికార్డు స్థాయి భారీ వర్షాలకు అమెరికాలోని టెనెసి రాష్ట్రం అల్లాడి ఆకులు మేస్తోంది. అతలాకుతలమౌతోంది. ఈ రాష్ట్ర రాజధాని నాష్ విల్ లో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అపార్ట్ మెంట్లలో మొదటి అంతస్తులు మునిగిపోయాయి.  వర్షాలు తగ్గాక నాలుగు శవాలు దొరికాయి. అనేకమందిని ప్రభుత్వ, రెడ్ క్రాస్ వంటి సంస్థలు రక్షించాయి.

ఎందుకని అమెరికాలోనే ఇవి జరుగుతున్నాయి? రోజుకొక్క రాష్ట్రంలో, ఒక్కొక్కవిధంగా ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. జ్యోతిష్య దిక్సూచి అమెరికాను ఎందుకు స్కాన్ చేస్తున్నది? అన్న అనుమానం మీకు రాలేదా? ఆలోచనాపరులైనవారికి, జ్యోతిష్యవిద్యలో ప్రవేశం ఉన్నవారికి అలాంటి సందేహాలు వచ్చే ఉండవచ్చు. వారికి నేను జవాబులు చెప్పనుగాని, ఈ వరదల కారణాలను కొంచం విశ్లేషిద్దాం.

అప్పటిదాకా తీవ్ర అస్తంగతుడైన శుక్రుడు సూర్యుని పట్టునుండి విడివడి ముందుకు పురోగమించడమే దీనికి కారణం. శుక్రుడు జలగ్రహం, మీనం జలతత్వ రాశి, కేతువు జలరాశియైన వృశ్చికంలో ఉన్నది, అక్కడనుంచి శుక్రుని చూస్తున్నది. కనుక హఠాత్తుగా వర్షాలు మొదలై అమెరికాలోని ఒక రాష్ట్ర రాజధానిని అతలాకుతలం చేశాయి.

వాతావరణాన్ని పసిగట్టే రాడార్లు, ఉపగ్రహాలు, ఆధునికవ్యవస్థలు ఉన్న అమెరికానే, ప్రకృతి దెబ్బకు గగ్గోలు పడింది. ఇక ఇవేవీ లేని దేశాలను గ్రహదృష్టి ఎలా ఊపుతుందో ఆలోచించండి !

read more " నాష్ విల్ వరదలు - జ్యోతిష్య విశ్లేషణ "

28, మార్చి 2021, ఆదివారం

వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

జ్యోతిష్య దిక్సూచి ఈసారి అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి మారింది. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమెరికాలోని వర్జీనియా బీచ్ లో జరిగిన తొక్కిసలాటలో చెదురుమదురు కాల్పులలో ఇద్దరు చనిపోయారు. ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ బీచ్ కి చాలామంది సరదాగా గడపడానికి వస్తుంటారు. అలాగే ఈ వీకెండ్ లో కూడా వచ్చారు. ఒక గుంపులో మాటామాటా పెరిగి గొడవ జరిగి కాల్పుల వరకూ పోయింది. తర్వాత ఇంకోచోట, ఆ తర్వాత ఇంకోచోట అదే బీచ్ లో ఇలాగే కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పోలీస్ మోహరింపులో నిర్మానుష్యంగా ఉంది.

జ్యోతిష్యపరంగా కారణాలు చూద్దాం.

ఈ సమయంలో శుక్రుడు, రవి ఇద్దరూ  మీనరాశి 12 డిగ్రీలమీద ఉన్నారు. దీనిని జ్యోతిష్యపరిభాషలో యుతి లేదా కంజంక్షన్ అంటారు. దీనివల్ల శుక్రుడు పూర్తిగా అస్తంగతుడయ్యాడు. శుక్రుని కారకత్వాలేమిటి? అందగత్తెలైన యువతులు, విలాసప్రాంతాలు, పిక్నిక్ స్పాట్లు మొదలైనవి. జలతత్త్వరాశియైన మీనరాశి దేనిని సూచిస్తున్నది? చేపలు విరివిగా ఉండే  నదులు,సముద్రప్రాంతాలు, బీచ్ లను సూచిస్తున్నది. మీనమంటేనే చేప. అందుకే బీచ్ లో ఈ కాల్పులు జరిగాయి.

ఆ సమయంలో అక్కడ తులారాశి ఉదయిస్తుంది. సుఖస్థానమైన మకరం నీచగురువు శనుల యుతితో ధ్వంసమైపోయింది. జలతత్త్వరాశి అయిన మీనంలో జలకారకగ్రహమైన శుక్రుడు తీవ్ర అస్తంగతుడైనాడు. గందరగోళాన్ని విధ్వంసాన్ని సూచిస్తున్న అష్టమంలో గొడవలకు సూచకులైన రాహు కుజులున్నారు. ఇంకేం కావాలి?

అసలీ జ్యోతిష్య దిక్సూచి ఎలా మారుతుంది? దీని గమనం ఎలా ఉంటుంది?  ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒకే దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా ఇది మారుతుంది? అని మాత్రం అడక్కండి. అబ్బా ! ఆశకైనా అంతుండాలి. ఏళ్లకేళ్లు ఘోరమైన రీసెర్చి చేసి నేను కనుక్కున్న జ్యోతిష్య సూత్రాలను, లోతైన విషయాలను ఊరకే బ్లాగులో చెప్పేస్తాననుకున్నారా? ఊరకే ఊరిస్తాగాని అసలైన రహస్యాలను మాత్రం ఎప్పటికీ వెల్లడించను. అది నెక్ట్ టు ఇంపాజిబుల్ !

read more " వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

25, మార్చి 2021, గురువారం

బోల్డర్ గ్రోసరీ స్టోర్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

22-3-2021 మంగళవారం మధ్యాన్నం 2.30 
కు  అమెరికాలో మరో ఘాతుకం జరిగింది. ఈసారి గ్రహదృష్టి కొలరాడో రాష్ట్రంలోని బోల్డర్  కి మారింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో దగ్గర్లోని ఒక స్టోర్ లో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో పదిమంది చనిపోయారు. వీళ్ళలో ఒక పోలీస్  ఆఫీసర్ కూడా ఉన్నాడు.

ఈ దుండగుడి వయసు కూడా 21 సంవత్సరాలే. వీడిపేరు అహమద్ అల్ అలివి అలిస్సా అని చెబుతున్నారు. ఊరకే కాల్పులు జరిపి పార్కింగ్ లాట్ లో కొంతమందిని, గ్రోసరీ స్టోర్ లో కొంతమందిని కాల్చేశాడు. ఇతని  మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఇతని అన్న చెబుతున్నాడు. ఇతను 1999 లో సిరియాలో పుట్టి తర్వాత అమెరికాలో సెటిలయ్యాడు. హైస్కూల్ దశనుంచే ఇతనికి నేరప్రవృత్తి ఉంది.

గ్రహస్థితిని గమనిద్దాం.

రాశిచక్రంలో ఉఛ్చస్థితిలో ఉన్న శుక్రుడు తీవ్ర అస్తంగతుడయ్యాడు. నవాంశలో నీచస్థితిలో మళ్ళీ అస్తంగతుడయ్యాడు. శుక్రునిపైన నీచగురువు దృష్టి ఉన్నది. అలాగే శనిదృష్టి ఉన్నది. అంతేగాక శనికుజులమధ్యన ఖచ్చితమైన డిగ్రీ దృష్టి ఉన్నది. కుజుడు రాహువుతో కలసి ఉన్నాడు. కుజ, శని, రాహువులకు పరస్పరసంబంధం ఈ విధంగా ఏర్పడింది.

వృషభం భౌతికమైన నిత్యావసర వస్తువులకు సూచిక. మకరం సామాన్యజనానికి సూచిక.ఈ సంఘటనకు ఇవే ప్రేరకాలుగా పనిచేశాయి.

ఈ సంఘటన జరిగిన సమయంలో చంద్రుడు మిధునంలో సంచరిస్తూ అమెరికాను సూచిస్తున్నాడు. చంద్రునినుంచి దశమకేంద్రంలో పైన చెప్పిన యోగాలున్నాయి. దానిపైన అష్టమం నుంచి గురుశనుల దృష్టి ఉన్నది.

రాక్షసగురువైన శుక్రుడు ముస్లిములకు సూచకుడు. ఉఛ్చశుక్రుని గందరగోళ పరిస్థితి ఇలాంటి జాతివిద్వేషపూరిత సంఘటనలకు ప్రేరకంగా పనిచేస్తుందన్న జ్యోతిష్యశాస్త్రసూత్రం ఈ సంఘటనతో మళ్ళీ  రుజువౌతున్నది.
read more " బోల్డర్ గ్రోసరీ స్టోర్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

19, మార్చి 2021, శుక్రవారం

అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

16-3-2021 మంగళవారం సాయంత్రం అమెరికా టైం 5 గంటల ప్రాంతంలో అట్లాంటాలోని స్పాలలో జరిగిన కాల్పులలో ఎనిమిదిమంది చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొరియా జాతీయులైన ఆడవాళ్లు. వారిని కాల్చినది 21 ఏళ్ల పిల్ల అమెరికన్. అదేరోజు సాయంత్రానికి పోలీసులు అతన్ని పట్టేశారు. అతని పేరు రాబర్ట్ ఎరన్ లాంగ్, జార్జియా కు చెందినవాడు. సెక్స్ ఎడిక్షన్ కు ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. మసాజ్ పార్లర్లను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాడట. ఎందుకంటే, అక్కడ అలాంటి కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టిట. ఇంతకు ముందు తనుకూడా ఆ పార్లర్ల కష్టమరేట. ఆ వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళని కాల్చేశానని అంటున్నాడు. ఇదీ న్యూస్.

అసలు జ్యోతిష్యపరంగా ఇదంతా ఏంటో చూద్దాం.

ఆ సమయంలో శుక్రుడు దారాకారకుడుగా ఉంటూ సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడివున్నాడు. మనఃకారకుడైన చంద్రుడు, మొండి పట్టుదలకు సూచికగా మేషంలో ఉంటూ, పాపార్గళానికి గురయ్యాడు. ఇది చాలదన్నట్లు శుక్రునిమీద నీచ గురువు, శనుల దృష్టి ఉన్నది. గురువు ద్వేషభావానికి సూచికైన షష్టాధిపతిగా సప్తమంలో ఉంటూ లగ్నాన్ని బలమైన దృష్టితో చూస్తున్నాడు. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఆడవాళ్ళతో సంబంధం ఉన్న విలాసపూరితమైన స్థలాలు (మసాజ్ పార్లర్లు, స్పాలు), విదేశీయులపట్ల ద్వేషం, మొండిమూర్ఖత్వం, హింస ఇవన్నీ సూచింపబడుతున్నాయి. అదేగా మరి జరిగింది?

శుక్రునికి మీనరాశిలో ఉచ్ఛస్థితి ఉన్నది. కానీ సున్నా డిగ్రీలలో శుక్రుడు బలంగా లేడు. ఒకపక్కన ఉఛ్చత్వం, మరొకపక్కన బలహీనత్వం ఈ రెండూ కలసి శుక్రుడిని అటూఇటూ ఊపేస్తాయి. కనుక శుక్రకారకత్వాలు గందరగోళానికి గురౌతాయి.  కుజ, రాహు, శనులవల్ల విధ్వంసకాండ జరుగుతుంది. నా పుస్తకాలు చదివినవారికి ఈ యోగాలు సుపరిచితాలే. 

నాడీజ్యోతిష్యంలో వాడే రాశితుల్యనవాంశ విధానం ప్రకారం చూస్తే కర్కాటకలగ్నం నాలుగు గ్రహాల ప్రభావానికి లోనైంది. అవి - రవి, చంద్రుడు, రాహువు, శుక్రుడు. ఇది అమావాస్య యోగం (పిచ్చిప్రవర్తన) + సెక్స్ పరమైన పెడధోరణులకు సూచిక. రాహువు, కుజుడు, శని వృషభంలో ఉన్నారు. ఇది కాల్పులు, యాక్సిడెంట్లు, నేరాలకు సూచిక. వీరందరూ శుక్రరాశి యైన వృషభంలో ఉన్నారు. అంటే శుక్ర సంబంధం వీరికి ఉన్నది. శుక్రుడేమో ఇలాంటి చోట్లను ఇలాంటి పనులను చక్కగా సూచిస్తాడు. అదేగా మరి జరిగింది?

ఇందులో రేసిస్ట్ ఛాయలున్నాయని కొందరంటున్నారు. కాదు, ఇది పూర్తిగా సెక్స్ పరమైన విపరీతప్రవర్తనతో కూడిన నేరమని కొందరంటున్నారు. రెండూ కలసి ఉన్నాయని గ్రహాలు చెబుతున్నాయి.  అసలు గ్రహాల దాకా ఎందుకు? సింపుల్ సైకాలజీ తెలిస్తే చాలు. సెక్స్ కోరికలనేవి మనసులోనుంచి పోవాలిగాని, మసాజ్ పార్లర్లు, బార్లు, స్పాలు, రెడ్ లైట్ ఏరియాలను తొలగిస్తే అవి ఎలా పోతాయి? ఇది చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. కారణాలు చెప్పడానికైనా అర్ధాలుండాలి. 

ఇప్పుడు మీకొక చచ్చుసందేహం రావచ్చు. దీనికి కారణం గ్రహాలైతే,  భూమ్మీద అన్నిచోట్లా ఇవే  జరగాలికదా? ఎందుకు జరగలేదు అని. దానికి నా జవాబేమిటంటే, భూమ్మీద అందరికీ ఇదే సందేహం రావాలి కదా, మీకొక్కరికే ఎందుకొచ్చింది? ముందు దీనికి జవాబు చెప్పండి, తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.

ఇలాంటి సంఘటనలకు కారణాలు గ్రహాలు కాదు. అలా చెప్పేవారికి ఏమీ తెలియదు. గ్రహాలు కారకాలేగాని కారణాలు కావు.

భూమిమొత్తం మీద ఒకే సంఘటన ఎప్పుడూ జరగదు. ఒకే గ్రహకారకత్వానికి సంబంధించిన సంఘటనలు రకరకాలైన ఛాయలలో కోణాలలో అనేక  ప్రదేశాలలో ఒకేసారి జరుగుతాయి. అదే ఈ భూమ్మీద జరుగుతున్న డ్రామా. మరొక్కవిషయం చెబుతా వినండి ! ఆ రోజున  చవితి అయింది. మీరు గమనించుకుంటే,  చాలామంది ఆడవాళ్లు ఆ రోజునా, ఒకరోజు అటూఇటూగా, చాలా హిస్టీరికల్ గా ప్రవర్తించినట్లు గమనిస్తారు. అది మీ మీ కుటుంబాలలో కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల కావచ్చు. కరెక్టేనా కాదా? అదేమరి గ్రహప్రభావమంటే ! 

లొకేషనల్ ఎష్ట్రాలజీ సూత్రాలు తెలిస్తే మీకీ విషయాలు అర్ధమౌతాయి. సందర్భం వచ్చినపుడు వాటిని వివరిస్తాను. అంతవరకూ, జ్యోతిష్యశాస్త్రం నిజమే అని చెప్పడానికి  ఈ సంఘటన మరొక్క చక్కటి రుజువని అర్ధం చేసుకోండి. అంతవరకూ అర్ధమైతే చాలు !

read more " అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

14, మార్చి 2021, ఆదివారం

శివరాత్రి - 2021

మొన్న శివరాత్రి నాడు, రాత్రి పదకొండున్నర దాటాక మిత్రుడు ఫోన్ చేశాడు. అప్పుడే నిద్రపట్టబోతోంది. 'ఏంటి ఈ టైంలో ఫోన్?' అనుకుంటూ ఫోనెత్తి 'హలో' అన్నా బద్ధకంగా.

'ఏం చేస్తున్నావ్' అన్నాడు.

తనెప్పుడూ ఇంతే. భోంచేస్తుంటే ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటాడు. నిద్రపోతుంటే ఫోన్ చేసి  ఏం చేస్తున్నావ్? అంటాడు. స్నానం చేసే టైం లో అడగటం లేదు. అదొక్కటే వెసులుబాటు. ప్రస్తుతానికి బాత్రూం లోకి ఫోన్ తీసికెళ్ళడం లేదు. ముందుముందు అదికూడా చెయ్యాల్సి వస్తుందేమో మరి?

'ఈ టైంలో ఏం చేస్తాను? ఎగుర్లాడుతున్నా' అన్నా.

'అవునా? నువ్వు కూడా అదే చేస్తున్నావా?' అన్నాడు ఆశ్చర్యంగా.

'నేను కూడానా? ఇంకా ఎవరైనా ఇదే చేస్తున్నారా ఏంటి ఖర్మ?' అన్నా.

'అదేంటి? నువ్వు చూడటం లేదా?' అన్నాడు.

'ఏంటి చూసేది?' అన్నా.

'అదే. లైవ్ ప్రోగ్రామ్. ఫలానా ఆశ్రమంలో శివరాత్రి లైవ్ వస్తోంది. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు ఉత్సాహంగా.

'శివరాత్రి లైవా? అదేంటి? అదేమన్నా ఫేషన్ షోనా లైవ్ రావటానికి? పైగా ఎగరటమేంటి?' అన్నాను.

'అక్కడ శివరాత్రి అలాగే చేస్తారు. పెద్దపెద్ద వాళ్లంతా ఉన్నారు. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు మళ్ళీ.

'పెద్ద పెద్దవాళ్ళంటే ఏంటి? సైజా? ఎంత పొడుగున్నారేంటి?' అన్నాను.

'ఛ అది కాదు. అర్ధరాత్రికూడా నీ జోకులూ నువ్వూనూ. సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు. నా ఫెవరెట్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె డాన్స్ చెయ్యకపోతుంటే, స్వామీజీ ఆమె జబ్బ పట్టుకుని లేపి మరీ డాన్స్ చేయిస్తున్నాడు చూడు' అన్నాడు ఎంతో ఊగిపోతూ.

'హతవిధీ' అనుకున్నా మనసులో

'శివరాత్రి అలా కూడా చేసుకుంటారా? అయినా ఊరకే ఎగరమంటే ఆమెందుకు ఎగురుతుంది? లక్షలిస్తే ఎగురుతుంది గాని' అడిగా.

దానికి జవాబు చెప్పకుండా 'నేనుకూడా వెళ్తే బాగుండేది. తనతో నేను కూడా డాన్స్ చేసేవాడిని ' అన్నాడు నిరాశగా.

'తనతో అంటే ఎవరితో స్వామీజీతోనా' అన్నా నవ్వుతూ.

'ఛా! ఆ ముసలోడితో నాకెందుకు? నా ఫెవరెట్ హీరోయిన్ తో' అన్నాడు నీరసంగా.

'ఆ! నీకోసమే ఎదురుచూస్తోంది వెళ్ళు. ఆ దరిదాపులకు కూడా నిన్ను వెళ్లనివ్వరు. సోలో డాన్స్ చేసుకోవడమే నీకు చివరకు జరిగేది. ఇదంతా సరేగాని, దీనిని శివరాత్రి అంటారా? నా చిన్నప్పుడు కోటప్పకొండ తిరునాళ్లలో రాత్రంతా ఎద్దుబండ్లమీద రికార్డింగ్ డాన్సులు జరిగేవి. వాటికీ వీటికీ తేడా ఏంటో?' అన్నా నవ్వుతూ.

'అది నేలబారు. ఇది సోఫిస్టికేటెడ్, మైల్డ్ వెర్షన్ ఆఫ్ ఓషో ఆశ్రమంలా ఉంది.' అన్నాడు మిత్రుడు గాలిలో తేలిపోతూ.

'బైటికి మైల్డ్, లోపల మాత్రం వైల్డ్. బయటపడటానికి సమయం పడుతుంది' అన్నా.

'అంతేనంటావా?' అన్నాడు నీరసంగా.

'అయితే ప్రస్తుతం ఈ స్వామీజీ భక్తుడివా నీవు? శ్రీవిద్యని వదిలేశావా?' అన్నా మళ్ళీ నవ్వుతూ.

'అదేం లేదు. సరదాగా లైవ్ చూస్తున్నా. కాసేపాగి శంకరాచార్యులవారు వ్రాసిన నిర్వాణ శతకం చదువుకుంటా. విన్నావా ఈ పేరు ఎప్పుడైనా?' అన్నాడు.

'అది నిర్వాణశతకం కాదు. నిర్వాణషట్కమని ఆరుశ్లోకాలు. అది చిక్కటి అద్వైతం. అవి చదివితే నీకేమొస్తుంది?' అడిగా. 

'అందులో నువ్వే శివుడివి నువ్వే శివుడివి అని ఉంటుంది తెలుసా నీకు?' అన్నాడు.

'హైస్కూల్లో ఉన్న రోజుల్లో చదివా అది. అయినా, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అనుకున్నంత మాత్రాన నువ్వు శివుడివి అయిపోవు.' అన్నాను విసుగ్గా.

'ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వేం చేస్తున్నావు?' అడిగాడు.

'ఏమీ చేయ్యను. నిద్రపోతాను నువ్వు వదిలితే' అన్నా నవ్వుతూ.

'అదేంటి కనీసం అర్ధరాత్రి పన్నెండు వరకైనా మెలకువగా ఉండవా?' అడిగాడు చిరాగ్గా.

'ఎందుకు? ఏమొస్తుంది అలా ఉంటే?' అడిగాను.

'శివరాత్రి కదా? శివపూజ చెయ్యవా?' అడిగాడు.

'పూజ మానుకున్నదెప్పుడు మళ్ళీ ఆరంభించడానికి?' అన్నాను.

'అంటే ప్రత్యేకపూజ లేదా?' అడిగాడు.

'ఏ ప్రత్యేకతా లేకపోవడమే పూజనుకుంటున్నాను' అన్నాను.

'అంటే, శివరాత్రికి ఏమీ చెయ్యవా?' అడిగాడు.

'ప్రతిరాత్రీ శివరాత్రే. శివుడు లేని రాత్రేక్కడుంది? పగలెక్కడుంది?' అడిగాను.

'అంటే, చేస్తున్నవాళ్లంతా పిచ్చివాళ్ళా?' అడిగాడు మళ్ళీ.

'పిచ్చివాళ్ళయితే బానే ఉండేది. అజ్ఞానులు. అహంకారులు' అన్నా.

'మరి నువ్వు చేసే పూజ ఏంటి?' అడిగాడు.

'చెప్పినా నీకర్ధం కాదు' అన్నాను.

'సర్లే ఏదో ఒకటి నీగోల. హాయిగా డాన్స్ చూసుకుంటా' అన్నాడు.

'ఆ పని చెయ్యి. శివుడి సంగతి ఎలా ఉన్నా, నీ హీరోయిన్ దర్శనం మాత్రం అవుతుంది, మీ స్వామీజీ ఆమె జబ్బ వదిల్తే' అన్నా నవ్వుతూ.

'సరే పడుకో. ఇక ఉంటా' అంటూ ఫోన్ కట్ చేశాడు మిత్రుడు.

'గుడ్ నైట్' అంటూ ముసుగేసి నిద్రలోకి అడుగుపెట్టా.

ఈ ఒక్క రాత్రికి శివుడిని తలచుకుంటే సరిపోతుందా? అదికూడా ఇలా డాన్సులు పాటలతో దరిద్రంగానా? అసలు శివుడు లేని రాత్రేక్కడుంది?

డర్టీ వరల్డ్ ! దీనిని ఎవడూ బాగుచెయ్యలేడు ! 

read more " శివరాత్రి - 2021 "

5, మార్చి 2021, శుక్రవారం

కర్ణపిశాచి - కరోనా వాక్సిన్

రాత్రి  భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.

ఎవరా అని చూస్తే రవి. సామాన్యంగా ఉదయంపూట మాత్రమే రవి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అమెరికా శిష్యురాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను గనుక అతడి ఫోన్ ఎత్తను. అందుకని ఈ టైంలో చేశాడా అనుకుంటూ 'హలొ రవి' అన్నా.

'ఏం చేస్తున్నావ్?'  అడిగాడు తాపీగా.

'ఇప్పుడే సాంగ్స్ అయిపోయాయి. డాన్స్ చెయ్యబోతున్నా' అన్నా అంతకంటే తాపీగా. 

'అదేంటి డాన్స్ కూడా వచ్చా నీకు? ఇన్నేళ్ల తర్వాత కొత్తకోణాలు కనిపిస్తున్నాయే?' అడిగాడు వింతగా.

'అవును. ఇప్పుడే కదా టీనేజిలోకి అడుగుపెడుతున్నాను. నువ్వెంటి అప్పుడే ముసలాడివై పోయావా? స్పెషల్ చ్యవనప్రాశ్ విత్ గోల్డ్  వాడటం లేదా?' అడిగా నవ్వుతూ.

'సరేలే ఏంటి నముల్తున్నావ్?' అడిగాడు మళ్ళీ.

'ఈ టైంలో ఏం నములుతం చెప్పు? అన్నం తింటున్నా. సరేలేగాని, నువ్వెంటి ఈ టైంలో?' అడిగాను.

'పొద్దున్నే ఫోన్ చేస్తే యోగా అంటావు. కొంచం సేపయ్యాక ఫోన్ చేస్తే అమెరికా శిష్యురాళ్లంటావు. ఆఫీస్ టైంలో పలకవు. సాయంత్రం ఫోన్ చేస్తే మార్షల్ ఆర్ట్స్ అంటావు. అందుకని రాత్రి తొమ్మదికి ఫిక్సయ్యా' అన్నాడు.

'సరే ఏంటి సంగతి చెప్పు' అన్నా.

'ఏం లేదు. అందరూ కరోనా వాక్సిన్ వేసుకుంటున్నారు.  మన బాస్ కూడా వేసుకున్నాడు. నన్నూ వేసుకోమంటున్నారు.  నువ్వూ వస్తే మనిద్దరం వెళ్ళొద్దాం' అన్నాడు.

'నాకొద్దులే. నువ్వెళ్ళి పొడిపించుకో' అన్నా.

'అదేంటి? అందరూ వేసుకుంటున్నారు. భయమా?' అన్నాడు.

'అదేం లేదులే. క్లాసికల్ హోమియోపత్స్ వాక్సిన్లను నమ్మరు. మాకొద్దు' అన్నా.

'మరి రక్షణ ఎలా?' అడిగాడు.

'అందరికీ ప్రభువే రక్షణ' అన్నా నవ్వుతూ.

'అదికాదు. సీరియస్. మరి కరోనా నుంచి ప్రొటెక్షన్ ఎలా?' అడిగాడు.

'హోమియో వాడేవాళ్ళకి వాక్సిన్ అవసరం లేదు' అన్నా.

'అదేంటి?' అన్నాడు అయోమయంగా.

'అవును. వైద్యజ్యోతిష్యం పుస్తకంలో చూడు.  కొన్ని కేసులలో వాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చించా. నా దృష్టిలో హోమియోపతిక్ ప్రోఫిలాక్టిక్స్ వాడితే చాలు. వాక్సిన్ అవసరం లేదు' అన్నాను.

'ఓరి నీ హోమియో పిచ్చి ! డేంజరేమో ఆలోచించు' అన్నాడు.

'ఓరి నీ వాక్సిన్ పిచ్చి ! ప్రచారాలకు పడిపోకు' అన్నా నవ్వుతూ.

ఆ తర్వాత అదీ ఇదీ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రవి.

భోజనం ముగిసింది. టైం తొమ్మిదిన్నర అయింది. గేట్లు వెయ్యాలి. నేనుండే బంగళాకు రెండు గేట్లుంటాయి. ఒకటి పెద్దగేటు. అది ఇంటికి రెండొందల మీటర్ల దూరంలో ఉంటుంది.  దానికి తాళం వేసి వస్తూ వస్తూ చిన్నగేట్టు తాళం వేసి, తోటలోని చెట్లలోనుంచి నడుస్తూ  ఇంటి వాకిలి దగ్గరకు రావాలి. ఇది ప్రతిరాత్రీ నా రోజువారీ దినచర్య. నిజం చెప్పొద్దూ? రాత్రిపూట ఈ నిర్మానుష్య కాలనీలో, ఈ బంగళాలో, ఈ చెట్లమధ్యన నడుస్తూ పోతుంటే కొంచం భయంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒళ్ళు ఝల్లుమంటూ ఉంటుంది  కూడా! అసలైతే,  నేనీ బంగళాలో చేరిన కొత్తలో ఇది భూత్ బంగళా అని నన్ను భయపెట్టబోయాడు రవి.

'అవునా ! అలా అయితే మరీ మంచిది. నేను ఇక్కడకు రావడం వల్ల ఇక్కడున్న దయ్యాలకు మోక్షం వస్తుందిలే, నువ్వు భయపడకు' అని నవ్వేశాను. నవ్వానేగాని లోలోపల పీచుపీచుమంటూనే ఉంటుంది మరి ! అయినా సరే, కొన్నిసార్లు రాత్రి పన్నెండువరకూ హాల్లొ ఒక్కడినే కూచుని, గజగజా వణికిపోతూ, నెట్ ఫ్లిక్స్ లో హర్రర్ మూవీస్ చూస్తూనే ఉంటాను. కానీ అదేంటో మరి? మోక్షం ప్రసాదిద్దామంటే, ఒక్క దయ్యం కూడా ఇప్పటివరకూ కనిపించలేదు. బహుశా వాటికి కూడా నన్ను చూస్తే హడలెత్తి ఉంటుంది !

యధాలాపంగా, నిన్న కూడా భోజనం అయ్యాక గేట్లు తాళాలు వేసి వద్దామని బయల్దేరాను. పెద్ద గేటుకు తాళం వేసి చెట్లలోనుంచి నడుస్తూ లోపలకు వస్తున్నాను. వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి వెనక్కు చూశా. ఎవరో ఒకమ్మాయి మూతికి మాస్క్ వేసుకుని కొంచం దూరంలో నడుస్తూ వస్తోంది. మాస్కున్నా సరే, చూస్తూనే కర్ణపిశాచిని గుర్తుపట్టా. మా బంధం ఇప్పటిది కాదు కదా మరి !

కానీ తెలీనట్లు నటిస్తూ ' ఏయ్ అమ్మాయ్ ! ఎవరు నువ్వు? గేట్ వేసి ఉండగానే లోపలకెలా వచ్చావు? ఎందుకు నా వెంట వస్తున్నావు?' అడిగా. 

అదో రకంగా నవ్వింది కర్ణపిశాచి.

'ఎక్కువ నటించకు. ఎవార్డు రాగలదు' అంది గోదారి జిల్లా యాసలో.

'అబ్బో . తూగో నించా రాక? ఏంటి కధ? ఎవర్నువ్వు?' అన్నా మళ్ళీ.

'నీ నాటకాలు నీ శిష్యుల దగ్గర వేసుకో, నమ్ముతారు, నా దగ్గర కాదు' అంది ఇంకా దగ్గరకొస్తూ.

నేనూ నవ్వేస్తూ 'నీ నాటకాలేంటి మరి? ముఖానికి ఆ మాస్కేంటి? ఆగాగు. అక్కడే ఆగు. సోషల్ డిస్టెన్స్ ఉండాలి' అన్నా ఉడికిస్తూ.

'కరోనా వాక్సినే వద్దనేవాడికి సోషల్ డిస్టెన్స్ ఎందుకో?' అడిగింది ఇంకా దగ్గరకొస్తూ మళ్ళీ అదే యాసలో.

'అంతా విన్నావన్న మాట' అన్నా నీరసంగా. 

'నా పనే అది కదా ! ఎవరేం చెప్పుకుంటున్నారో వినడమే కదా నా పని. రోజూ నేనుకూడా నీతోపాటు హర్రర్ మూవీస్ చూస్తున్నా నీ పక్క సోఫాలో కూచుని, తెలుసా నీకు?' అడిగింది.

'నీ నాటకాలు మీ పిశాచాల దగ్గర వేస్కో. నా దగ్గర కాదు' అన్నా ఉడికిస్తూ.

'నిజ్జం, నీమీదొట్టు' అంది ఇంకా దగ్గరకొస్తూ.

'అవునా? అయితే చెప్పు, ప్రస్తుతం ఏం చూస్తున్నానో నెట్ ఫ్లిక్స్ లో?" అడిగాను.

'పరీక్షలా మాకు !  'యాష్ వెర్సస్ ఈవిల్ డెడ్' సీరీస్ సెకండ్ సీజన్ చూస్తున్నావ్' అంది.

'ఆమ్మో. కనిపించొచ్చు కదా మరి ! నాతోబాటు నీకూ టీ ఇచ్చేవాడిని కదా' అన్నా నవ్వుతూ.

'మాకు టీ ఎక్కడ సరిపోతుంది? మీ శిష్యురాలు తెచ్చిచ్చిన బాటిల్ ఇస్తే బాగుంటుంది' అంది  నవ్వుతూ.

' ఆ బాటిల్ సంగతి నీకూ తెలిసిపోయిందా?' అన్నా ముని స్టైల్లో నటిస్తూ.

' ఇక చాల్లే  ఆపు నీ నాటకాలు.  పాపం మీ ఫ్రెండ్ భయస్తుడు. అతనికోసమన్నా వేసుకోరాదు వాక్సిన్?' ప్రాధేయపడింది.

'ఆ ! నువ్వూ రా తోడు. మనిద్దరం వేసుకుందాం వాక్సిన్' అన్నా నవ్వుతూ.

తనూ నవ్వేసింది.

'ఏంటి ఈ మధ్య బిజీనా? అస్సలు దర్శనాల్లేవు? మీ చెల్లెలు కన్నెపిశాచి కూడా కనిపించడం లేదు?' అడిగా నడుస్తూ.

'మేం బిజీ కానిదెప్పుడు? క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదంటే మా బ్రతుకే' అంది నిట్టూరుస్తూ నడుస్తూనే.

'సర్లే బాధపడకు. మీకూ మంచిరోజులొస్తాయి. పడ్డవాళ్ళు చెడ్డవాళ్లు కారు, నవ్విన నాపచేనే పండుతుంది' అంటూ ఇంకా ఏదో చెప్పబోయా

'ఆపుతావా సోది సామెతలు. అలాంటివి నన్ను చెప్పమంటే లక్ష చెబుతా నీకు వినే ఓపికుంటే' అన్నది.

'సర్లే ఏంటి ఇలా వచ్చావ్?' అడిగా..

'నువ్వంటే దిగులు పుట్టింది. ఒకసారి చూసిపోదామని వొచ్చా' అంది. 

'ఛా! నిజమా' అడిగా హాశ్చర్యపోతూ !

'అదే మరి ! రాజమండ్రి నుంచి నార్త్ ఇండియాకు పోతున్నా. దార్లో క్రిందికి చూస్తే నువ్వు గేటు వేస్తూ  కనిపించావు. సర్లే ఒకసారి పలకరిద్దామని దిగా. సరదాగా మాస్క్ వేస్కుని కనిపించా. అంతే, సింపుల్' అంది.

'ఓ అదా సంగతి ! ఏంటి కబుర్లు?' అడిగా నడుస్తూనే.

'ఏమున్నాయి. నడుస్తోంది ప్రపంచం' అంటూ మా శిష్యుల గురించీ, మా బంధువుల గురించీ, కొన్ని చాడీలు చెపింది తను.

'అవునా' అంటూ తెగ ఆశ్చర్యపోయా మళ్ళీ.

'ఆ నటనే వద్దనేది. సర్లే నే పోతున్నా, మీ ఆవిడ ఇటే చూస్తోంది అనుమానంగా. ఆవిడకి ఎమ్ చెప్పుకుంటావో చెప్పుకో. వస్తా పనుంది. బై' అంటూ గాల్లోకి నిలువుగా ఎగిరిపోయి చీకట్లో మాయమైపోయింది. 

చిన్నగేటుకు కూడా తాళం వేసి, చెట్లలోనుంచి గార్డెన్లో నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చా. మా ఆవిడ అక్కడే నిలబడి నావైపే తీక్షణంగా చూస్తోంది.

'ఏంటి?' అన్నా సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ.

'ఏంటది? చీకట్లో మీలో మీరే చేతులు తిప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయారు ?' అడిగింది అనుమానంగా.

నా వేషాలు మొదట్నుంచీ చూస్తున్నా కూడా, ఈనాటికీ ఇంకా కొన్ని అనుమానాలున్నాయి తనకి.

'అదా ! ఆబ్బె అదేం లేదు. కరోనా గురించి రవితో ఇందాక మాట్లాడా కదా !  బ్రెయిన్ కి కరోనా ఎక్కినట్లుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. రేప్పొద్దున వాక్సిన్ పొడిపించుకుంటా'. అన్నా నవ్వుతూ.

'మీ నాటకాలు నా దగ్గర కాదు. మీ శిష్యుల దగ్గర వేసుకోండి నమ్ముతారు' అంది శ్రీమతి సీరియస్ గా.

'ఖర్మరా బాబు ! భార్యా నమ్మక, శిష్యులూ నమ్మక, మనుషులూ నమ్మక చివరికి పిశాచాలు కూడా నమ్మకపోతే నేనేం చెయ్యాలి? ఇలా లాభం లేదు. రేప్పొద్దున్నే వెళ్లి కరోనా వాక్సిన్ బ్రెయిన్ కి పొడిపించుకోవాల్సిందే' అని గట్టిగా నిర్ణయించుకుని, 'అసలిదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కనిపించకపోతే నీతో మాట్లాడేవాడినే కాను. ఇప్పుడు చూడు మా ఆవిడ ! నాకు పిచ్చనుకుంటోంది' అని కర్ణపిశాచిని తిట్టుకుంటూ దుప్పటి ముసుగేసి నిద్రకుపక్రమించాను.

నిద్రలోకి జారుకుంటున్న నాకు 'ఆపు నీ నాటకాలు ! నా దగ్గరకాదు. నీ శిష్యులదగ్గర వెయ్యి నమ్ముతారు' అని నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం క్లియర్ గా వినిపించింది.

read more " కర్ణపిశాచి - కరోనా వాక్సిన్ "

కర్మవలయం - ప్రశ్నశాస్త్రం

సమయం రాత్రి పది. పనులన్నీ ముగించుకుని నిద్రాధ్యానానికి ఉపక్రమించబోతుండగా ఫోన్ మ్రోగింది. ఏదో క్రొత్త నంబర్. ఒక్కొక్కసారి అమెరికా శిష్యులు కూడా ఇండియా నంబర్ తో ఫోన్ చేస్తుంటారు. సరే ఎవరో చూద్దామని 'హలొ' అన్నా.

'నేను ఫలానా మాట్లాడుతున్నాను. ప్రభుత్వంలో ఫలానా పొజిషన్ లో రిటైరయ్యాను' అందొక మొగగొంతు దర్పంగా, 

ఇలాంటి మాడిపోయిన బల్బులని చాలా మందిని చూసి ఉండటంతో, అదంతా పట్టించుకోకుండా, 'చెప్పండి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు?' అడిగా.

'నా బాధలు మీతో చెప్పుకుని, పరిష్కారం అడుగుదామని. ఫలానాయన మీ నంబరిచ్చాడు' అంది స్వరం.

సామాన్యంగా ఆ సమయంలో అలాంటి ఫోన్స్ నేను మాట్లాడను. కానీ ఆ స్వరంలో ధ్వనిస్తున్న కించిత్ బాధ, ఫోన్ కట్ చెయ్యకుండా  నన్ను ఆపేసింది. 'సరే ఏంటో చూద్దాంలే' అనుకున్న వెంటనే  మనసులో అప్పటి ప్రశ్నచక్రం కనిపించింది.

తులా లగ్నమైంది. లగ్నాధిపతి శుక్రుడు, బాధకుడైన సూర్యునితో కలసి పంచమస్థానంలో అస్తంగతుడై ఉన్నాడు. అది శనిస్థానమైన కుంభమైంది. మనఃకారకుడైన చంద్రుడు కుటుంబస్థానంలో నీచస్థితిలో కేతుగ్రస్తుడై ఉంటూ కుటుంబపరమైన మానసికవేదనను సూచిస్తున్నాడు.

'మీ సంతానం గురించి, ముఖ్యంగా మీ అమ్మాయి గురించే కదా మీ బాధ' అన్నాను.

అవతలనుంచి భోరుమంటూ ఏడుపు వినిపించింది. నేను మౌనంగా ఉండిపోయాను. కాసేపలా వెక్కిళ్లు పెట్టిన తర్వాత 'ఏం చెప్పమంటారు మా ఖర్మ? ఎందుకిలా జరుగుతోంది?' అన్నాడు.

పంచమం నుండి సప్తమాధిపతి సూర్యుడు పంచమలగ్నంలో ఉన్నాడు. అక్కడనుంచి నవమాధిపతి శుక్రుడు లగ్నంలో అస్తంగతుడైనాడు. పంచమాధిపతి శని దానికి ద్వాదశమైన మకరంలో నీచగురువుతో కలసి ఉన్నాడు. మకరం ప్రశ్నలగ్నానికి చతుర్ధమైంది. అక్కడ నవమాదిపతి అయిన బుధుడు నీచగురువుతో డిగ్రీ కంజంక్షన్ లో ఉన్నాడు. గురు - రాహు - చంద్రదశ అయింది. అంటే ఇది పితృశాపం ! ఇది వీళ్ళ జీన్స్ లోనే ఉంది. గురుద్రోహం కూడా తోడై ఉంది.

ఈ యోగాలను గమనిస్తూ 'మీ అమ్మాయి ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ కొడుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అంతేనా?' అడిగాను.

'అంతేసార్! నాకు తెలిసి నేనేమీ పాపాలు చెయ్యలేదు, ఇప్పుడు మేమిద్దరం ఓల్డేజి హోములో ఉన్నాం. అక్కడనుంచే మీతో మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్ ఫలానా ఆయన, మీ గురించి చెప్పి, మీ నంబర్ ఇచ్చాడు, మీకు ఎష్ట్రాలజీ బాగా తెలుసనీ చెప్పాడు' అన్నాడు. 

ప్రతివాడూ చెప్పేమాట ఇదే కావడంతో నేనేమీ ఆ విషయం నమ్మలేదు. మనమేం పాపాలు చేస్తున్నామో కూడా తెలీనంత చీకటిలో మనం బ్రతుకుతున్నామన్నది పచ్చినిజం.

చతుర్ధాన్ని అందులోని యోగాలను గమనిస్తున్నపుడే ఈయనగారి గతజీవితం అర్ధమైపోయింది. 'ఏ పాపాలూ చెయ్యలేదా? ఏమీ చెయ్యకపోతే మీకిలా జరగడానికి దేవుడికి తెలివి లేదనుకుంటున్నారా?' అడిగాను కటువుగా.

'అదేంటి అలా అంటారు?' అన్నాడాయన హర్దయిన గొంతుతో.

ఈకాలపు మనుషులతో ఇదే పెద్ద చిక్కు. ప్రతివాడూ తానొక మహా పవిత్రుడినని, తనకంటే మంచివాడు లేడని ఊహించుకుంటూ నానా ఛండాలమైన పనులూ చేస్తుంటాడు.  చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే మాత్రం సహించలేడు. 

మళ్ళీ చతుర్ధాన్నీ, మాతృకారకుడైన చంద్రుడు నీచస్థితిలో ఉచ్ఛకేతువుతో కలసి ఉండటాన్నీ గమనిస్తూ 'మీ అమ్మగారిని ఎందుకంత బాధలు పెట్టారు?' అడిగాను.

రెండు క్షణాలు నిశ్శబ్దం !!

'మేమేం బాధలు పెట్టలేదు. ఓల్డేజి హోమ్ లో ఉంచి, డబ్బులు కడుతూ బాగానే చూసుకున్నాం' అన్నాడు.

ఇక ఇలా లాభంలేదని, బెడ్ మీదనుంచి లేచి కుర్చీలో కూచున్నాను.

'మీరెంతమంది అన్నదమ్ములు?' ఇంటరాగేషన్ మొదలుపెట్టాను.

'నలుగురం' అన్నాడు.

'నలుగురూ బాగానే సెటిలయ్యారు కదా?' అడిగాను.

'అందరం మంచి పొజిషన్స్ లోనే సెటిలయ్యాము. అందరి పిల్లలూ ఇప్పుడు ఫారెన్లోనే ఉన్నారు' అన్నాడు.

'మీ నాన్నగారు?' అడిగాను.

'ఆయన కూడా ప్రభుత్వంలో పెద్ద ఆఫీసరుగా చేశారు. రిటైరయ్యాక కొద్దీ రోజులకే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు' అన్నాడు.

'అప్పుడు మీ అమ్మగారిని ఎవరిదగ్గర ఉంచుకున్నారు?' అడిగాను.

కాసేపు మళ్ళీ నిశ్శబ్దం.

'హలొ. ఉన్నారా?' రెట్టించాను.

'ఆ. ఉన్నానండి. మా దగ్గర ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. అందుకే ఓల్డేజి హోములో చేర్పించాం' అన్నాడు.

అంటే, కోడళ్ళకీ ఆమెకూ పడేది కాదన్నమాట ! కొడుకులేమో భార్యలకు చెప్పలేని చవలయ్యారన్నమాట ! 

'చూడండి. మీరు ఈ టైంలో ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసినది ఇలా అబద్దాలు చెప్పడానికా?' అడిగాను తీవ్రంగానే.

ఆయనకూడా ఆర్గుమెంట్ మోడ్ లోకి దిగాడు.

'ఏం చెప్పమంటారండీ? కోడళ్ళేవరికీ మా అమ్మను చూడటం ఇష్టం లేదు. పనివాళ్లున్నారు. కానీ ముసలామెను ఇంట్లో పెట్టుకోవడం వాళ్ళకిష్టం లేదు. హై సొసైటీ కదండి ! పార్టీలు, గెట్ టుగెదర్స్ ఉంటాయి. ఆమె అడ్డంగా ఉంటుందని, బ్రదర్సందరం మాట్లాడుకుని ఆమెను మంచి ఓల్డ్ ఏజి హోములో చేర్పించాము. ఖర్చులు అందరం పంచుకున్నాము. అది తప్పంటారా?' అడిగాడు.

ఇలా ఉంటారు మనుషులు. రాత్రి పదికి ఫోన్ చేసినా మనం మాట్లాడాలి. వాళ్ళు చెప్పే సోదంతా వినాలి. వాళ్లేమో నిజాలు చెప్పరు. మేం పత్తిత్తులమనే వాదిస్తారు. కానీ కష్టాలు తీరే మార్గాలు చెప్పమంటారు. ఛీ ఛీ అని అసహ్యమేసింది.

'చూడండి ! మీరు నలుగురన్నదమ్ములు. మీ నలుగురినీ చక్కగా పెంచి పెద్దచేసి బాగా చదివించారు మీ తల్లిదండ్రులు. మంచి పొజిషన్స్ కి వచ్చేవరకూ సపోర్ట్ చేసి, పెళ్లిళ్లు చేశారు. మరి అంత చేసిన మీ తల్లిదండ్రులని అలాగా చూసుకోవడం? సరే, మీ నాన్నగారు మీ చేతుల్లో చిక్కకుండా చనిపోయారు. మీమీ భార్యలకు భయపడి మీ అమ్మను ఓల్డేజి హోములో చేర్పించారు. డబ్బులు మాత్రం పడేస్తూ, ఆమె ఆశించిన ప్రేమకు ఆమెను దూరం చేసి, అదేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడతారేమిటి? మీరు చేసినది ఘోరమైన పాపం. దీనికి మీకు శిక్ష తప్పదు' అన్నాను.

ఆయనకు కోపమొచ్చింది.

'ఏంటండీ? నేను ఫలానాగా రిటైరయ్యాను. నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు. మా ఫ్రెండ్ ఏదో మిమ్మల్ని రిఫర్ చేశాడని మీకు ఫోన్ చేశాను.  ఇలా మాట్లాడతారేమిటి? మీకు తెలిస్తే రెమెడీలు చెప్పండి. లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇలా మాట్లాడకండి. అసలు నాకు మీ జ్యోతిష్కులంటే నమ్మకం లేదు.  ఏదో మా ఫ్రెండ్ మాట కాదనలేక ఫోన్ చేశాను' అన్నాడు.

'ఓహో అసలు రంగు బయటపడిందే' అనుకుంటూ - 'వినండి గుర్నాథంగారు ! నేనేమీ రోడ్డుపక్కన జ్యోతిష్కుడిని కాను.  నేనొక సివిల్ సర్వీస్ అధికారిని. ప్రస్తుతం ఇంకా సర్వీస్ లోనే ఉన్నాను.  మీకంటే చిన్న పొజిషన్లో అయితే లేను. మీరేదో నాకు ఫోన్ చేసి నన్ను ఉద్ధరించడం లేదు. నా టైం మీకు కేటాయించి మీతో ఫోన్లో మాట్లాడటమే చాలా ఎక్కువ. అది ముందు తెలుసుకోండి. మిమ్మల్ని పైకెత్తాల్సిన అవసరం నాకు లేదు. పోనీలే ఏదో బాధల్లో ఉన్నారని  ఇంతసేపూ మర్యాదగా మాట్లాడాను. ఇప్పుడు వినండి.

సృష్టిలో ఏదీ ఊరకే జరగదు. మీరేమీ తప్పులు చెయ్యకుండా మీకిలాంటి శిక్షలు పడవు. మీ తండ్రిగానిని మీరు చూసుకోలేకపోవడం, మీ తల్లిగారిని చివరలో ఓల్డేజి హోములో పడేసి ఆమె అక్కడే చనిపోతుంటే, మీరు నలుగురు బ్రదర్సూ ఇక్కడే ఇండియాలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, నెలవారీ ఖర్చులు వంతులు వేసుకుని,  ఒక బెగ్గర్ కి పడేసినట్లు డబ్బులు పడేస్తూ, ఆమె తిన్నదా తినలేదా పట్టించుకోకుండా, ఆమె రోగాలు రొష్టులూ పట్టించుకోకుండా, గాలికొదిలేశారు చూడండి, అదీ మీరు చేసిన ఘోరమైన పాపం. అది చేయడంవల్ల మీరు మాతృశాపాన్ని మూటగట్టుకున్నారు. దానికి తిరుగులేదు. మీ పిల్లలు ఇప్పుడేదో అమెరికాలో ఉన్నారని తెగ సంపాదిస్తున్నారని ఎగరకండి. వాళ్ళ కుటుంబాలు నాశనమౌతాయి. రెండుతరాల తర్వాత వాళ్ళ అడ్రసులు కూడా ఉండవు. మీ మునిమనవళ్లు  మనవరాళ్లు అందరూ అమెరికన్స్ అయిపోతారు. నల్లోళ్ళనీ తెల్లోళ్ళనీ ఏడాదికొకళ్ళని మారుస్తూ చివరకేమౌతారో వాళ్ళకే తెలీకుండా పోతారు. మీ ముఖాలను కూడా వాళ్ళు గుర్తుంచుకోరు. వాళ్ళ ముఖాలు మీకూ గుర్తుండవు.

అప్పటిదాకా ఎందుకు? ప్రస్తుతం మీ గతేంటో చూడండి. మీ అమ్మగారు ఎంతబాధ పడ్డారో అంతకంత బాధలు మీరూ పడతారు.  ఇప్పుడే పడతారు. పైగా, ఎంత అహంకారం మీకు? పెద్ద పొజిషన్లో రిటైరయ్యారా? అయితే ఏంటి బోడి? ఒకప్పుడు మీరు వెయ్యి క్యాండిల్స్ బల్బే కావచ్చు. కానీ ఇప్పుడు మాడిపోయిన బల్బు. ఆ సంగతి మర్చిపోకండి. మీలాంటి వాళ్ళను ఇప్పటికి కొన్ని వేలమందిని చూచాను. ఈ స్థితిలో కూడా  మీకింత అహంకారముందంటే, ఒకప్పుడు ఇంకెంత ఉండేదో నేనూహించగలను.  మీలాంటి పాపాత్ములకు నేను రెమెడీలు చెప్పను. చెప్పి, మీ శాపాన్ని ఉత్తపుణ్యానికి  నా భుజాలకెత్తుకోలేను. మీ ఖర్మ అనుభవించండి. చావండి. నాకెందుకు?

ఇంకో సంగతి. ఇన్ని పాపాల మధ్యలో ఏంతో కొంత పుణ్యం సంపాదించే ఉంటారు మీరు. అందుకే నాతో ఫోన్లో మాట్లాడే అదృష్టం పట్టింది. అది తెలుసుకోండి. మీ పాపిష్టి ముఖాలకి రెమెడీలు కావాలా? గో టు హెల్ !' అన్నాను.

ఆయన కోపంగా ఏదేదో ఇంగిలీషులో అరుస్తున్నాడు.

ఫోన్ కట్ చేసి ఆ నంబర్ బ్లాక్ చేశాను.

ఇవాళ పొద్దున్న మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి, 'ఎందుకురా అలాంటి వెధవలకి నా ఫోన్ నంబరిస్తావు?' అంటూ ముక్కచీవాట్లు పెట్టాను.

'నాకేం తెలుసురా అతనలా మాట్లాడతాడని? అతనూ వాళ్ళావిడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఓల్డేజి హోములో ఉన్నారు. ఇద్దరూ 65+ లో ఉన్నారు. ఆవిడేమో అక్కడే బాత్రూమ్ లో కాలుజారి పడి మోకాలు ఫ్రాక్చర్ అయింది. అదీ పరిస్థితి. గ్రహాలు బాలేవని ఎవరో చెబితే మంచి జ్యోతిష్కుడు కావాలంటే నీ నంబరిచ్చాను. సారీ ! ఇంకెప్పుడూ ఇవ్వను' అన్నాడు.

'మాయమాటలు చెప్పి లక్షలు వదిలించే కమర్షియల్ జ్యోతిష్కులు చాలామంది ఉన్నారుకదా? వీళ్లకు వాళ్ళే కరెక్ట్. వాళ్ళు చూసుకుంటార్లే వదిలేయ్. సరేగాని,  వాళ్ళమ్మను కూడా ఓల్డేజి హోములో ఉంచారటకదా చివర్లో ?' అడిగాను.

'అవునురా. నలుగురు బ్రదర్సూ వెల్ సెటిల్డ్. కానీ పెళ్ళాలు చెప్పినమాటలు విని అమ్మను అలా చంపేశారు. ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ సంతానాన్ని చూసుకుని విర్రవీగారో వాళ్ళే ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  వాళ్ళ మదర్ కూడా చివరలో  ఓల్డేజి హోములో బాత్రూం లో పడి తుంటి ఎముక విరిగింది. ఆమెను వీళ్ళెవరూ పట్టించుకోలేదు.  అప్పట్లో ఈ పెద్దకోడలే ఆమెను ఇంటికి తీసుకురానివ్వలేదు. ఇప్పుడు అదే కోడలు ఓల్డేజి హోంలో కిందపడి మోకాలు విరగ్గొట్టుకుంది. నాకు వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ . అందుకే నాకివన్నీ తెలుసు. సర్లే ఏదో అయిపొయింది. ఇంకెప్పుడూ ఇలాంటి వాళ్ళకి నీ నంబర్ ఇవ్వను. సరేనా !' అన్నాడు బతిమిలాడుతూ. 

నేనేం అనగలను? 'సరే' అన్నాను.

ఇలా ఉన్నారు మనుషులు ! జీవితంలో మన ప్రయారిటీస్ అన్నీ దారితప్పాయి. డబ్బు ఒక్కటే ప్రధానమై కూచుంది. స్వార్ధమూ, జల్సాలూ ముఖ్యమైనాయి. బాధ్యతలంటే అసహ్యం పెరిగింది. కనీసం కృతజ్ఞతకూడా ఎవరికీ ఉండటం లేదు. కర్మనియమాలు ఎవరికీ అర్ధం కావడం లేదు. చేసుకునేటప్పుడు ఎగురుకుంటూ చేసుకుంటున్నారు. పడేటప్పుడు లబోదిబో అంటున్నారు.  కానీ ఆ స్థితిలో కూడా అహంకారాలు ఏమాత్రమూ తగ్గడం లేదు. 

మనమెన్ని తప్పులైనా ఘోరాలైనా చెయ్యవచ్చు. కానీ మనకు మాత్రం అంతా బాగానే ఉండాలి. కనీసం పశ్చాత్తాపం కూడా ఉండదు ఇలాంటి మనుషులకి. పైగా, చింతచచ్చినా పులుపు చావనట్లు ఎంత అహంకారం? ఇలాంటి మృగాలకి ఏం రెమెడీలు చెప్పాలి? ఎందుకు చెప్పాలి?

దేవుడా ! మనం చేసేదే మనకు తిరిగి వస్తుందన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటారో మనుషులు?
read more " కర్మవలయం - ప్రశ్నశాస్త్రం "