నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, ఏప్రిల్ 2021, ఆదివారం

రాతియుగం మనుషులు

రాతి విగ్రహాలను పూజిస్తూ

రాతి గుండెలై పోయేవాళ్ళు కొందరు

రాళ్ళను పూజించవద్దంటూ 

వాళ్ళను రాళ్ళతో కొట్టేవాళ్ళు కొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ఎదురుగా ఉన్నదాని కోసం

ఎక్కడెక్కడో వెదుకుతూ కొందరు

ఎదురుగా వచ్చి నిలబడినా

ఎవరెస్ట్ ను చూడలేరు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


కాగితాన్ని పూజిస్తారు కొందరు

కాపట్యాన్ని కళ్లకద్దుకుంటూ కొందరు

కనిపించే మనిషిని వదలి

కనిపించని దేవుడికోసం మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు

 

దేవుడితో వ్యాపారం కొందరు

దేవుడిని చూపించి వ్యాపారం కొందరు

దేవుడికోసం దేవుళ్ళాడే వాడిని

దేబిరించేవారు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


బ్రతకడం తెలీనివారు కొందరు

బ్రతుకుతూ బ్రతికించేవారు కొందరు

బ్రతకడం నేర్పేవాడిని

బడితెపూజ చేసేవాళ్ళు మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ప్రేమించడం తెలీక కొందరు

ప్రేమ కోసం అల్లాడుతూ కొందరు

ప్రేమ తలుపు తడుతున్నా

తెరవడం తెలీక మరికొందరు

రాకెట్ యుగంలో బ్రతుకుతున్న

రాతియుగం మనుషులు


ఈ కవిత చదివి

రాతియుగపు మనిషి ఇలా అన్నాడు

నా పేరెందుకు వాడుకుంటారు?

మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గేస్తోంది

నేను రాతియుగం మనిషినే కావచ్చు

కానీ మీలా రాతిమనిషిని కాను...