నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, ఆగస్టు 2021, శనివారం

మనుషుల తీరు

ముందుగా చెబితే
వినే గుణమూ ఉండదు
మూతి పగిలినప్పుడు
ఏడ్చే గుణమూ మారదు
ఏమిటీ మనుషుల తీరు?

ఉన్నప్పుడు 
లెక్కలేకుండా ఎగరడం
లేనప్పుడు
వెక్కిళ్లుపెట్టి ఏడవడం
ఏమిటీ మనుషుల తీరు?

గారంగా చెప్పినప్పుడు
అస్సలు వినకపోవడం
గట్టిగా చెప్పచ్చుకదా
అని పడ్డాక అనడం
ఏమిటీ మనుషుల తీరు?

గుడ్డిగా ముందుకెళ్లి
గుంటలో పడిపోవడం
పడినతర్వాత కూడా
ఎందుకు పడ్డారో తెలీకపోవడం
ఏమిటీ మనుషుల తీరు?

ఈ ఒక్కసారికి
తప్పయిందని బ్రతిమాలటం
ప్రతి ఒక్కసారీ
అవే తప్పులు చేస్తూ ఉండటం
ఏమిటీ మనుషుల తీరు?

మాకూ తెలుసులే
అంటూ తలెగరెయ్యడం
ఎన్ని బొప్పులు కట్టినా
తలదించకపోవడం
ఏమిటీ మనుషుల తీరు?

వెలుగు కావాలంటూ
వెక్కెక్కి ఏడవడం
వెలుగు కనిపించినా
వెంట నడవకపోవడం
ఏమిటీ మనుషుల తీరు?

దేవుడా దేవుడా అంటూ
దొంగ దండాలు పెట్టడం
దేవుడు చెప్పింది మాత్రం
చెవిలో వేసుకోకపోవడం
ఏమిటీ మనుషుల తీరు?