నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, ఆగస్టు 2021, బుధవారం

సెక్స్ పరమైన నేరాలు - ఇవిగో గ్రహప్రభావానికి రుజువులు

సింహరాశిలో కుజశుక్రుల వల్ల ఏమేం జరుగుతాయో వ్రాశాను. ఊహించినట్లే జరుగుతోంది గమనించండి.

హైదరాబాద్ లో  పోష్ హోటల్లో దిగిన ఒక ప్రేమజంటలో అమ్మాయిని చంపి అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడు. ఆ హోటల్ రూము హాంటెడ్ రూమయింది.

కేరళలో ఒక 24 ఏళ్ల మెడికోని, ప్రేమికుడినంటూ వెంటపడిన ఒకడు తుపాకీతో కాల్చేసి, తరువాత తనూ చనిపోయాడు. మంచి సినిమా తీసుకోవచ్చు చోటా డైరెక్టర్లు.

ఢిల్లీలో తొమ్మిదేళ్ల అమ్మాయిని శ్మశానంలోనే చంపేసి చడీచప్పుడు కాకుండా పూడ్చేశారు ముగ్గురు దుండగులు. వాళ్లలో ఒక పూజారిగాడు కూడా ఉన్నాట్ట. స్మశానంలో పూజారేంటో మరి? ఆ అమ్మాయి రేప్ కు గురైందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అమ్మాయి శవానికి మళ్ళీ పరీక్షలు చెయ్యబోతున్నారు.

కావాలనే ఈ అమ్మాయి కులాన్ని నేను వ్రాయడం లేదు. మన మీడియాలో ఒక దరిద్రపు అలవాటుంది. ఒకే నేరంలో, కొన్ని కులాలనేమో ఎత్తి చూపుతారు. మిగతావాళ్ల కులాలగురించి మాట్లాడరు. దానివల్ల, ఆ ఒక్క కులంపైన సానుభూతి, మిగతా కులాలపట్ల బాధితులకు ద్వేషమూ పెరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. నేరం ఎవరు చేసినా నేరమే. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమాత్రం సమాజానికి మంచిని చెయ్యవు. కనుకనే నేను కులాన్ని చెప్పడం లేదు.

ఎవరైతే ఆ అమ్మాయిని అలా చంపేశారో, వాళ్ళకి ఉరే సరియైన శిక్ష. ఆ పూజారిగాడిని మాత్రం రెండుసార్లు ఉరి తియ్యాలి. ఎందుకంటే, పూజారై ఉండి అలాంటి పనిచేసినందుకు. అది హిందూ పూజారే కానక్కరలేదు. కేరళలోని కేథలిక్ ఫాదరైనా, మిడిల్ ఈస్ట్ లోని ముల్లాగాడైనా ఎవరైనా సరే, వాడికి మామూలు నేరస్తుడికంటే డబల్ శిక్ష పడాలి.

'గ్రహాలు అలా చేయిస్తున్నాయి మేమేం చెయ్యం?' అనే సొల్లు మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాళ్ళని గ్రహాలతో తన్నించాలి. రేప్ చెయ్యమని గ్రహాలు మీకు చెప్పవు. గ్రహాలు ఒక సాధారణమైన ప్రభావాన్ని సృష్టిస్తాయి.  దానిని ఎలా వాడుకోవాలో మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు, మబ్బులు కమ్మి వాన పడేటట్లుగా, హాయిగా ఉంటుంది. ఆ సమయంలో, ఒకడికి త్రాగాలనిపిస్తుంది. ఇంకొకడికి వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది. మరొకడికి ఏదో విధంగా గొడవపెట్టుకుని ఎవడినైనా తన్నాలనిపిస్తుంది. కవిగాడికి కవిత్వం వ్రాద్దామనిపిస్తుంది. ఇంకొకడికి కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దామనిపిస్తుంది.

మబ్బులు అందరికీ ఒకటే ఇచ్చాయి. దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన సంస్కారాన్ని బట్టి, విచక్షణను బట్టి ఉంటుంది. సంస్కారం ఉన్నవాడు అలా చెయ్యడు, విచక్షణ ఉన్నవాడూ చెయ్యడు. సంస్కారమే విచక్షణనిస్తుంది. అవి రెండూ లేనప్పుడు చట్టభయమైనా ఉండాలి.

సంస్కారమూ, విచక్షణా, ధర్మం నుంచి వస్తాయి. ఇవి ఉన్నవాడు స్వతహాగానే తన హద్దుల్లో తానుంటాడు. వాడు దైవానికి భయపడతాడు గనుక. అవి లేనివాడు మనుషులు పెట్టిన చట్టానికైనా భయపడాలి. ఈ రెండూ లేనప్పుడు ఇలాంటి నేరాలే జరుగుతాయి.

వాతావరణం చల్లగా ఉందని, గ్రహప్రభావమని, మనిష్టం వచ్చినట్లు మనం చెయ్యకూడదు. చట్టానికైనా భయపడాలి, ధర్మానికైనా భయపడాలి. అప్పుడే మనిషి బ్రతుకు సరియైనదారిలో నడుస్తుంది.

దురదృష్టవశాత్తూ మన దేశంలో చట్టభయం లేదు. ఆ విధంగా ఇన్నాళ్లూ మనల్ని భ్రష్టుపట్టించిన పాపం ఇప్పటివరకూ పాలించిన ప్రభుత్వాలది, నాయకులది. చట్టభయం లేకుండా చేసి, వ్యవస్థను భ్రష్టుపట్టించింది నాయకులే. అమెరికాలో చట్టభయం చాలా ఎక్కువ. అక్కడేమీ మనకంటే ధర్మాత్ములేమీ లేరు. కానీ చట్టానికి భయపడి రుజువుగా ఉంటారు.

ఇకపోతే, తమంతట తాముగా ధర్మాన్ని అనుసరించేవారు, మన పుణ్యభూమిలో నైనాసరే, ఎందరున్నారు? చాలా తక్కువ. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి.

ఎదురుగా సమాధులు కనిపిస్తున్నా కూడా మనిషికి చట్టమూ గుర్తురాదు, ధర్మమూ గుర్తు రాదు. ఎంత విచిత్రం?

గ్రహప్రభావం అంటే ఇదేనేమో మరి? సారీ, ఈ మాటంటే గ్రహాలకు కోపమొస్తుంది. మనిషి దిగజారుడుతనానికి పరాకాష్ట అంటే సరిపోతుంది.

నిర్భయకేసులాగా ఎనిమిదేళ్లు తాత్సారం చెయ్యకుండా, ఈ కేసునైనా త్వరగా తేలిస్తే దేశం ఊరటపడుతుంది.