నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, నవంబర్ 2021, ఆదివారం

ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం

ప్రస్తుతం, గురువు కుంభరాశిలో సున్నా డిగ్రీల మీదున్నాడు. ప్లూటో మకరరాశి సున్నా డిగ్రీలమీదున్నాడు. ఇద్దరికీ ఆచ్చాదనా యోగం ఏర్పడింది. గురువు జీవకారకుడు, ప్లూటో యముడు, ఫలితం? జీవశక్తిని మరణం కమ్మేస్తుందని అర్ధం. జ్యోతిష్యశాస్త్రపరంగా దీనిని 'మరణయోగం' అనవచ్చు.  అంటే, లోకానికి మళ్ళీ మూడిందని అర్ధం. అందుకే, ఇప్పటివరకూ వచ్చిన అన్ని రకాల కోవిడ్ వైరస్ ల కంటే ఎన్నోరెట్లు భయంకరమైన 'ఓమైక్రాన్' వేరియంట్ హఠాత్తుగా తలెత్తింది.

ఇప్పటివరకూ పెద్దగా కోవిడ్ న్యూస్ అంటూ లేని ఆఫ్రికాలో, మొట్టమొదటి ఓమైక్రాన్ వేరియంట్ కనిపించింది. కనిపించీ కనిపించగానే, యూరప్ లో అడుగుపెట్టింది. యూకే, జర్మనీ, ఇటలీలు ఇప్పటికే వణికిపోతున్నాయి. ఇజ్రాయెల్ తన బార్డర్స్ ను మూసేసింది. యూరప్ లో కనీసం 7 లక్షలమంది చావబోతున్నారని WHO అంటోంది. అంటే ఏమిటి? మళ్ళీ  ప్రపంచానికి మూడిన సంకేతాలు వెలువడుతున్నాయి.

గతంలో చాలామంది, 'కరోనా పని అయిపోయింది. ఇదుగో పోయింది, అదుగో పోయింది, మార్చి తర్వాత పోతుంది, ఏప్రిల్ తర్వాత పోతుంది', అని వ్రాశారు. ఇదిప్పుడే పోదని, గ్లోబల్ కర్మ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, స్వార్ధమూ, లెక్కలేనితనమూ జనాలలో ముదిరిపోయాయని, మనుషులకి గట్టిగా బుద్ధి చెప్పనిదే ప్రకృతి ఊరుకోదని, నేనన్నాను. చూడండి ఏం జరుగుతోందో మరి?

ఓమైక్రాన్ కు ఎదురులేదని, వాక్సిన్లేవీ దానిని అడ్డుకోలేవనీ, అది వ్వాపించే వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, దాని విధ్వంసం కూడా ఎక్కువేననీ, నిపుణులు అంటున్నారు. కనుక, ఇప్పటిదాకా వాక్సిన్  వేసుకున్నవారైనా, వేసుకోనివారైనా, ప్రస్తుతం అందరూ ఒకటే అయిపోయారు. ఒక ఆర్నెల్లలో దీనికి కూడా వాక్సిన్ తయారు చేస్తామని కంపెనీలు అంటున్నాయి.  మళ్ళీ 'రెడ్డొచ్చె మొదలాడు' అన్నట్లు, ఈ క్రొత్త వాక్సిన్ కోసం మళ్ళీ క్యూలు మొదలవబోతున్నాయి.  ఇంతా చేస్తే, ఆ క్రొత్త వాక్సిన్ ఎంతవరకూ పనిచేస్తుందో దేవుడికే ఎరుక ! భలే ఉంది కదూ మనుషులతో వారి కర్మ ఆడుతున్న ఆట !

గురువు - ప్లుటోల మరణయోగం మానవాళికి డేంజర్ సిగ్నల్స్ ను మ్రోగిస్తోంది. విమాన సంస్థలు, తమ సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ ప్రయాణ రంగం మళ్ళీ కుదుపులకు లోనవబోతోంది. అంతేకాదు, దేశదేశాలన్నీ మళ్ళీ లాక్ డౌన్ దిశగా చూస్తున్నాయి.

ఇంకొక్క నెలలో శని యురేనస్ ల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఏర్పడబోతున్నది. అప్పుడుంటుంది అసలు  విలయం ! ఈలోపల యూరోప్ అట్టుడుకుతుంది. అప్పటినుంచీ, ఇండియా, పాకిస్తాన్, యూకే లలో అసలైన డ్రామా మొదలౌతుంది. జనమంతా తట్టా బుట్టా సర్దుకోవడం మొదలుపెట్టాలి. 'మేం రెండు వాక్సిన్లూ వేయించుకున్నాం, మాకేమీ కాదు' అంటూ మాస్కులు తీసేసి మోర విరుచుకుని తిరుగుతున్నవారందరూ మళ్ళీ మాస్కులు బయటకు తియ్యండి మరి !  

సరే, 'ఓ మైగాడ్' అనుకుంటూ ఓమైక్రాన్ విధ్వంస న్యూస్ కోసం ఎదురుచూద్దాం !

read more " ఓ మైగాడ్ - ఓమైక్రాన్ రంగప్రవేశం "

21, నవంబర్ 2021, ఆదివారం

నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు

ఈ సృష్టిలో మనం అదుపు చెయ్యలేనివి పంచభూతాలూ, నవగ్రహాలే. అందుకే మనమెంతగా విర్రవీగినా, మన జీవితాలు మన చేతులలో ఉండవు.  

మొన్న పౌర్ణమి. రాహుకేతువుల ఇరుసుతో చంద్ర సూర్యుల ఇరుసు ఒకటైంది. చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు, సూర్యుడిప్పుడే నీచస్థితినుంచి బయటపడ్డాడు.

జలతత్వరాశైన వృశ్చికానికి అర్గళం పట్టింది.లాల్ కితాబ్ సిద్ధాంతం ప్రకారం కుజబుధులు కలిస్తే శుక్రుడౌతాడు. కనుక వృశ్చికరాశికి రెండుప్రక్కలా శుక్రునితో అర్గళం పట్టింది. శుక్రుడు జలతత్వ గ్రహం. వృశ్చికం జలతత్వ రాశి. రాహుచంద్రుల కోణదృష్టి భారతదేశానికి సూచికైన మకరం మీదుంది. ఇక ఫలితాలను చూడండి.

అన్నమయ్య జలాశయం, పోచి జలాశయాల గట్లు తెగి, కడపజిల్లాలోని నందలూరు - రాజంపేటల మధ్యన రైల్వే ట్రాక్ ఒక కిలోమీటరు పొడుగునా కొట్టుకుపోయింది. పనిలో పనిగా ఒక రైల్వే బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ముంబాయి చెన్నై రూట్లో రైళ్లు స్తంభించాయి. వర్షంలో తడుస్తూ, భయంకరంగా ఉన్న బురదలో 500 మంది స్టాఫ్ రాత్రింబగళ్ళూ పనిచేస్తూ ట్రాక్ ను వేసే పనిలో, బ్రిడ్జిని మళ్ళీ కట్టే పనిలో ఉన్నారు.

కడపజిల్లా గందరగోళమైంది. వరదలలో 40 మంది గల్లంతయ్యారు. వరదమధ్యలో ఇరుక్కుపోయిన బస్సు మీదనున్న జనాన్ని IAF హెలికాఫ్టర్ ఎయిర్ లిఫ్ట్ చేసింది.

చెన్నైలో, తిరుపతిలో కుండపోత వర్షాలతో రోడ్లు జలమయాలయ్యాయి. తిరుమలలో కురిసిన వర్షాలకు , కపిలతీర్థం మునిగింది. తూర్పు కోస్తా అంతటా వర్షాలు పడుతున్నాయి. సౌత్ మొత్తం గందరగోళమైంది. మకరం దక్షిణదిక్కును సూచిస్తుందని మర్చిపోకండి.

ఒక్క మనదేశమేనా దెబ్బతినేది? అన్న చొప్పదంటు అనుమానాన్ని రానివ్వకండి.

కెనడాలో బ్రిటిష్ కొలంబియా గుర్తుందా? వందలాది మంది పిల్లల సమాధులు ఒక చర్చి స్కూల్ ఆవరణలో  బయటపడ్డాయి కొంతకాలం క్రితం ! అదే ప్రావిన్స్ లో ఇప్పుడు భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి. వృషభరాశి కెనడాను సూచిస్తుందని గతంలో వ్రాశాను గమనించండి. వేలాదిగా పశువులు చనిపోయాయి. కనీసం 18000 మంది వరదలలో చిక్కుకుని అల్లాడుతున్నారు. బ్రిటిష్ కొలంబియా ఎమర్జెన్సీని ప్రకటించింది. అక్కడ జలగ్రహమైన చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటూ, రాహుగ్రస్తుడైన ఈ సమయంలోనే అక్కడ వరదలెందుకొచ్చాయో అర్థమైందా మరి? 

తిరుమలలో ఇలాంటి వర్షాలు గత 500 ఏళ్లలో లేవని అంటున్నారు. ఈ గ్రహణం కూడా దాదాపు  7 గంటలపాటు ఉంది. గత 600 ఏళ్లలో ఇలాంటి చంద్రగ్రహణమూ రాలేదని అంటున్నారు.  కనుక లెక్క సరిపోయిందా మరి?

గ్రహణాలూ, అమావాస్యా పౌర్ణములూ ఇలా భూమిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. గత పదేళ్లుగా నా పోస్టులు చూడండి. ఎన్ని సార్లు రుజువైందో గమనించారా?

మనపైన గ్రహప్రభావం లేదని  ఎలా అనగలం చెప్పండి?
read more " నవంబర్ 2021 పౌర్ణమి ప్రభావం - పెనువర్షాలు "

1, నవంబర్ 2021, సోమవారం

జాతకంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? రాజ్ కుమార్, పునీత్ ల జాతకాలు

21 సంవత్సరాల క్రితం జ్యోతిష్య శాస్త్రంలో నేను MA చేశాను. తెలుగు యూనివర్సిటీ నుండి మాది మొదటి బ్యాచ్. అప్పట్లో నా అభిమాన అంశం - జాతకచక్రంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? తల్లిదం డ్రులనుండి వారసత్వ లక్షణాలు పిల్లలకెలా సంక్రమిస్తాయి? కర్మలు, శాపాలు ఎలా ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతాయి? అనే అంశమే. గుంటూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త BJ రావుగారు కూడా, ఇదే అంశం మీద రీసెర్చి చెయ్యమని తాను చనిపోయేముందు నాతో చెప్పారు. ఆ తరువాత ఈ విషయం మీద చాలా రీసెర్చి చేశాను. ఎన్నో సూత్రాలను కనుక్కున్నాను.

"మెడికల్ ఆస్ట్రాలజీ - పార్టీ 2" లో ఆ అంశాలను అనేక జాతకాల ఆధారంగా విశ్లేషించి లోకానికి అందించబోతున్నాను. ఈ పుస్తకం 2022 లో విడుదలౌతుంది.

ప్రస్తుతానికి ఇదే అంశాన్ని 29  చనిపోయిన పునీత్ రాజ్ కుమార్, అతని తండ్రి రాజ్ కుమార్ ల జాతకాల పరంగా వివరిస్తున్నాను. అయితే, ఒకే ఒక్క సంఘటనను మాత్రమే ఇప్పుడు చెబుతాను. మొత్తం జాతకాలను వివరించను.

వీళ్ళిద్దరూ ఒకే విధంగా చనిపోయారు. ఇద్దరి మరణాలకూ, వ్యాయామం చేసిన తర్వాత వచ్చిన కార్డియాక్ అరెస్ట్ మాత్రమే కారణం అయింది. ఇప్పుడు వీళ్ళ జాతకాలను పరిశీలిద్దాం.

ముందుగా, ఒక చిన్న విచిత్రాన్ని గమనించండి. రాజ్ కుమార్ 46 వ ఏట పునీత్ రాజ్ కుమార్ పుట్టాడు.  మళ్ళీ తన 46 వ ఏట పునీత్ చనిపోయాడు. కనుక 46 అంకెకు వీళ్ళ జాతకాలతో సంబంధం ఉందా లేదా? నా విధానం ప్రకారం 4 కేతువు, 6 కుజుడు, 1 సూర్యుడు. కనుక వీళ్ళ జాతకాలలో ఈ గ్రహాలు ప్రధానపాత్రలు పోషిస్తాయి. మరి ముందుకు పదండి !

రాజ్ కుమార్ జాతకం (24 ఏప్రిల్ 1929)

మేషంలో రవిరాహుయోగం ఉంది చూడండి. ఇది, ఆ జాతకుడు హార్ట్ ఎటాక్ తో పోవడాన్ని సూచిస్తున్నది  అంతిమయాత్రకు శని సూచిస్తాడు. ఈ జాతకంలో, కుజశనుల షష్టాష్టకస్థితి అమితశ్రమయే ఈ జాతకుని అంతిమయాత్రకు కారణమౌతుందన్న సత్యాన్ని చెబుతున్నది. కేతు చంద్రులు కలసి ఉండటం వల్ల గుండెకు రక్తప్రసరణ ఆగడం ఈ మొత్తానికీ దోహదమౌతుందని సూచన ఉన్నది. కేతువు శుక్రుడిని సూచిస్తున్నాడని గమనించండి.

పునీత్ రాజ్ కుమార్ జాతకం (17 మార్చ్ 1975)

ఈ జాతకంలో చంద్రుడు శుక్రుడితో కలసి ఉండటం, ఇద్దరూ కేతువుతో మ్రింగబడటం చూడవచ్చు. ఇదే జెనెటిక్ ఆస్ట్రాలజీ మహాత్యం. మరొక్క విచిత్రం - శని కుజులిద్దరూ ఈ చార్ట్ లో కూడా షష్టాష్టక స్థితిలోనే ఉన్నారు. అంటే, అతిశ్రమ వల్లనే అంతిమయాత్రకు దారి ఏర్పడుతుందని సూచన ఈ జాతకంలో కూడా ఉంది. సూర్యుడు పాపార్గళంలో బందీ అయ్యాడు. రాహుశనులచేత చూడబడుతున్నాడు. కనుక కార్డియాక్ అరెస్ట్ జరిగింది.

ఈ విధంగా 46 ఏళ్ల తేడాతో పుట్టిన తండ్రీ కొడుకుల జాతకాలలో ఒకే విధమైన గ్రహస్థితులుండటం వింతగా లేదూ? అయితే, ఇందులో వింతేమీ లేదు. జీన్ కోడ్ ఇలాగే ఒక తరం నుంచి మరొక తరానికి సరఫరా అవుతుంది.  కర్మ కూడా ఇదే విధంగా సరఫరా అవుతుంది. ఒక వంశంలో ఒక విధమైన కర్మ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. దానిని ఆ కుటుంబసభ్యుల జాతకాలు పరిశీలించడం ద్వారా  స్పష్టంగా తెలుసుకోవచ్చు.

అయితే, దీనిని ఎలా మార్చాలన్నదే అసలైన ప్రశ్న. చెప్పమంటారా? అబ్బా ! అదే రహస్యం మరి ! అవన్నీ తెలిస్తే ఇంకేం? అందరూ అన్నీ మార్చేసుకోరూ? కనుక దానిని మాత్రం చెప్పను. జెనెటిక్ ఆస్ట్రాలజీ నిజమే  అన్నది  అర్ధమైంది కదా? అంతవరకూ అర్ధమైతే చాల్లే ప్రస్తుతానికి !

read more " జాతకంలో జీన్ కోడ్ ఎలా దాగి ఉంటుంది? రాజ్ కుమార్, పునీత్ ల జాతకాలు "

యురేనస్ సూర్యుల సమసప్తక యోగం - ప్రభావాలు


యురేనస్ - సూర్యుల మధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల ప్రస్తుతం అనేక మార్పులు ప్రపంచవ్యాప్తంగా జనజీవనంలో చోటు చేసుకుంటున్నాయి. వాటిలో కొన్నింటిని గమనిద్దాం.


జపాన్ మెట్రో రైల్లో కత్తిపోట్లు


పాశ్చాత్యసంస్కృతిలో ఉన్న దరిద్రపు పండగలు ఆసియాలో కూడా ప్రవేశించి జరుపుకోబడుతున్నాయి. మితిమీరిన డబ్బే దీనికి కారణం. అలాంటి ఒకానొక పండుగైన, హాలోవీన్ అనే దరిద్రపు పాశ్చాత్య పండుగ సందర్భంగా, జపాన్ లో మెట్రో రైల్లో, జోకర్ లాగా వేషం వేసుకున్న ఒకడు 17 మందిని కత్తితో పొడిచిపారేశాడు. 'ఎందుకురా ఇలా చేశావ్?' అంటే, 'నాకు చచ్చిపోవాలనుంది. ఇలా చేస్తే, పట్టుకుని చంపేస్తారని ఇలా చేశాన' ని చల్లగా సమాధానం చెబుతున్నాడు.

మనుషుల తలకాయలలో యురేనస్ పుట్టించే పెడబుద్ధులు ఇలా ఉంటాయి. తులారాశి చరరాశి కావడమూ, అక్కడే హింసకు కారకుడైన కుజుడు ఉండటం వల్ల, నడుస్తున్న రైల్లో ఈ హింసాత్మక సంఘటన జరిగింది.


బ్రిటన్ లో గుద్దుకున్న రైళ్లు


నైరృతి బ్రిటన్ లోని శాలిస్ బరీ టౌన్ లోని సొరంగంలో రెండు రైళ్లు గుద్దుకుని చాలామంది గాయపడ్డారు. అయితే, ఎవరూ చనిపోలేదని అంటున్నారు. బహుశా, ACD వంటి నవీన బోగీ టెక్నాలజీ దీనికి కారణం కావచ్చు. హఠాత్ ప్రమాదాలకు యురేనస్ కారకుడనీ, ఆయన ప్రస్తుతం, బ్రిటన్ ను సూచించే మేషరాశిలో ఉన్నాడనీ గుర్తుంటే, ఇదెందుకు జరిగిందో తెలుస్తుంది.

ఇప్పుడు ఇండియావైపు దృష్టి సారిద్దాం.

పునీత్ రాజకుమార్ మరణం

కన్నడ నటుడు రాజ్ కుమార్ తనయుడైన పునీత్ 46 ఏళ్లకే కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశాడు. యురేనస్ హఠాత్ సంఘటనలకు కారకుడు. సూర్యుడు తులారాశిలో నీచస్థితిలో ఉంటూ, ప్రముఖులకు పడుతున్న నీచస్థితిని సూచిస్తున్నాడు. సూర్యుడు గుండె పనితీరుకు, సెలబ్రిటీలకు సూచకుడు. సెలబ్రిటీలను, ముఖ్యంగా సినిమా నటులను సూచించే తులా రాశిలో ప్రస్తుతం ఉన్నాడు. ఇవన్నీ కలుపుకుని చూడండి, అతిగా చేసిన వ్యాయామాల ఫలితంగా పునీత్ ఎందుకు చనిపోయాడో అర్ధమౌతుంది.

ఆఫ్కోర్స్. తల్లిదండ్రులు చనిపోయినట్లే వారి పిల్లలు కూడా చాలావరకూ చనిపోతూ ఉంటారు. ఇది జీన్ కోడ్ ప్రకారం జరిగే ఒక విచిత్రం. రాజ్ కుమార్ కూడా ఇదే విధంగా వ్యాయామం చేసిన రెండు గంటలకు, ఊరకే సోఫాలో కూచున్నవాడు కూచున్నట్లే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఇప్పుడు, పునీత్ కూడా అదే విధంగా చనిపోయాడు. ఈ విషయాన్ని వాళ్ళ ఫెమిలీ డాక్టర్ స్వయంగా చెప్పాడు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలను చెప్పదలచుకున్నాను.

గత 40 ఏళ్లుగా నేను రకరకాల మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చేస్తున్నాను. 35 ఏళ్ల క్రితమే నేను కరాటే స్కూల్స్ నడిపాను. చిన్నప్పటినుంచీ యోగాభ్యాసం నాకు అలవాటుంది.  అందుకని, ఈ విషయాలమీద అధికారికంగా నేను మాట్లాడగలను.

సరిగ్గా చెయ్యకపోతే, వ్యాయామం కూడా ప్రాణం తీస్తుంది. అందులోనూ 40 దాటాక అందరూ అన్ని రకాల వ్యాయామాలూ చెయ్యకూడదు.  జిమ్ వ్యాయామాలు అస్సలు మంచివి కావు. మన యోగాభ్యాసం మరియు గ్రౌండ్ ఎక్సర్ సైజులే మంచివి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ లు మంచివి కావు.  అవి ఖచ్చితంగా గుండెను దెబ్బతీస్తాయి. ఇలా దెబ్బతిన్నవాళ్లను గత 40 ఏళ్లలో ఎంతో మందిని నేను చూచాను. 1990 లలో నా ఫ్రెండ్స్ లోనే కొందరు బాడీ బిల్డర్లు, బాక్సర్లు హార్ట్ సమస్యలకు గురయ్యారు. వారిలో ఒకరికి హార్ట్ ఎన్లార్జ్ అయింది. ఇంకొకరికి హార్ట్ వాల్వులు దెబ్బతిన్నాయి. ఈ విషయాలు నేటి జిమ్ ట్రెయినర్లకు ఎంతమాత్రం తెలీవు. డబ్బుకోసం వాళ్ళు నానామాటలు చెబుతారు. నానా మాంసాలు తినమంటారు. ఎక్కడలేని వ్యాయామాలు చెయ్యమంటారు. ఏమీ పరవాలేదంటారు. వాటిని విని సెలబ్రిటీలు, సినిమానటులు దెబ్బ తింటున్నారు. దురదృష్టవశాత్తూ, నేటి యువతలో కండలమీద మోజు చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా పొరపాటు. ఈ చెడు సంస్కృతిని సినిమాలు పెంచి పోషిస్తున్నాయి. అమ్మాయిలముందు కండలు ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం కాదు. అలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పైగా, ఆ కండల కోసం నానా చెత్తా తింటారు. అవి రక్తనాళాలలో అడ్డుగా ఏర్పడి  హార్ట్ ఎటాక్స్ కు కారణమౌతాయి.

జిమ్ అనేది వెస్ట్రన్ విధానం. దానికి మూలాలు గ్రీకు - రోమన్ కల్చర్ లో ఉన్నాయి. లాంగ్ రన్ లో అది మంచిది కాదు. యోగాభ్యాసం, వీరవిద్యలు  మన భారతీయ విధానాలు.  వీటిని పాటిస్తే నూరేళ్లయినా ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. నేటి యువత ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మాంసాలు తింటూ, జిమ్ చేస్తూ కండలు పెంచితే చాలన్న భ్రమనుండి ఎంత త్వరగా బయటపడితే యువతకు అంత మంచిది.

ఆరోగ్యానికీ కండలకూ ఎలాంటి సంబంధమూ లేదని గ్రహించండి. జిమ్ములు చెయ్యకండి. ఒళ్ళు గుల్లచేసుకోకండి. గుండెజబ్బులకు గురికాకండి. అదే విధంగా, జీరో సైజు అంటూ, అమ్మాయిలు రోజుల తరబడి ఉపవాసాలు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. వారి ఆరోగ్యాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. మితిమీరిన వ్యాయామాలు ఎంత ప్రమాదమో, మితిమీరిన ఉపవాసాలూ అంతే ప్రమాదం. ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.

కేరళ అందగత్తెల మరణం

2019 మిస్ కేరళ అంసి కబీర్, రన్నరప్ అంజనాలు నిన్న రాత్రి ఎర్నాకులం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ హఠాత్ సంఘటన కూడా యురేనస్ - సూర్యుల సమసప్తక ప్రభావమే. జపాన్లో, డుస్తున్న రైల్లో దుర్ఘటన జరిగితే, వీరి కేసులో, వేగంగా నడుస్తున్న కారు బోల్తా కొట్టి, వీరిద్దరూ స్పాట్లో చనిపోయారు. రెండూ, రవాణా వాహనాలు కావడం తులారాశి యొక్క చరకారకత్వపు ప్రభావం.

ఇలా వ్రాస్తూ పోతే, అంతర్జాతీయ, జాతీయ, వ్యక్తిగతరంగాలలో లెక్కలేనన్ని సంఘటనలున్నాయి. మచ్చుకి ఈ నాలుగింటిని వ్రాస్తున్నాను. ఈ గ్రహయోగం ఇంకొక వారంపాటు ఉంటుంది. కనుక, ఈ లోపల ప్రముఖులకు, సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో ఇలాంటి సంఘటనలు జరుగబోతున్నాయి. వేచి చూడండి. 

read more " యురేనస్ సూర్యుల సమసప్తక యోగం - ప్రభావాలు "