నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, జనవరి 2022, ఆదివారం

బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి?

క్రొత్త సంవత్సరం రైలుప్రమాదంతో మొదలైంది. 13-1-2022 గురువారం సాయంత్రం 5 గంటలకు ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్ నుండి అస్సాం లోని గౌహతికి వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురి జిల్లాలో ఉన్న మైనగురి అనే ఊరి దగ్గర పట్టాలు తప్పింది. రైల్లో 18 పెట్టెలుంటే వాటిలో 12 పట్టాలు తప్పి చిందరవందర అయ్యాయి. S - 5 మరియు S - 6 పెట్టెలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. తొమ్మిదిమంది చనిపోయారు. 36 మంది గాయాలపాలయ్యారు. యధావిధిగా రైల్వే మంత్రిగారు, ఇతర అధికారులు వచ్చారు. చూచారు. రైలు ఇంజన్లో లోపం ఉందన్న ప్రాధమిక సమాచారాన్ని రైల్వేమంత్రిగారే స్వయంగా వెల్లడించారు. బాధితులకు  నష్టపరిహారం ప్రకటించారు. ఎంక్వైరీ వేశారు. విచారణ జరుగుతోంది.

గ్రహాలేమంటున్నాయి?

భారతదేశానికి సూచికైన మకరరాశిలో శని బుధులు మూడు డిగ్రీల తేడాలో ఉన్నారు.  బుధుడు వేగంగా శనిని సమీపిస్తున్నాడు. వీరిద్దరికీ సూర్య గురువుల ద్వారా అర్గలదోషం పట్టింది.  శుక్రునికి గల వక్రత్వం వల్ల వృశ్చికంలోకి పోతున్నాడు. కనుక అర్గలదోషంలో ఈయన పాత్ర లేదు. శనిబుధులపైన హటాత్తు సంఘటనలకు విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్  ఖచ్చితమైన డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది. కనుక ఈ కోణాన్ని కాదనలేము. వీరిపైన రాహుచంద్రుల కోణదృష్టి కూడా ఉన్నది. రాహుచంద్రులు కూడా విద్రోహచర్యలను సూచిస్తారు. కనుక ఈ అనుమానానికి బలం ఏర్పడుతున్నది. కానీ రైల్వేమంత్రిగారు మాత్రం, ఇంజన్ లోని భాగాలలో లోపమున్నదని అంటున్నారు. మకరరాశిలో శనిబుధుల డిగ్రీ స్థితి, వాయవ్యదిక్కును సూచిస్తున్నది. కానీ ప్రమాదం జరిగింది ఈశాన్యదిక్కులో. కనుక మకరరాశిని కేంద్రంగా చేసుకున్న ఈ విశ్లేషణ కరెక్ట్ కాకపోవచ్చు.

మరొక్క కోణం నుంచి పరిశీలిద్దాం.  భారతదేశాన్ని సూచించే వృషభరాశి నుంచి చూద్దాం.
  • లగ్నము సూర్యుడూ ఒకే డిగ్రీమీదుంటూ ఈ చక్రంలో సూర్యుని పాత్రను స్పష్టంగా సూచిస్తున్నారు.
  • హోరాధిపతి శుక్రుడయ్యాడు. కనుక ధనుస్సుకు ప్రాముఖ్యత ఏర్పడుతూ ఇదే విశ్లేషణకు కేంద్రమని చూపిస్తున్నది.
  • యాక్సిడెంట్ ను సూచించే అష్టమంలో ఉన్న సూర్యుడికి పాపార్గలం పట్టింది. డిగ్రీ పరంగా సూర్యుడు ఈశాన్యదిక్కును సూచిస్తూ అస్సాం ప్రాంతంలో జరుగబోతున్న యాక్సిడెంట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాడు.
  • నవమంలో ఉన్న శనిబుధులపైన ఉన్న యురేనస్ దృష్టిని బట్టి ఇందులో దూరదేశపు విద్రోహకోణం ఉన్నట్లు, ధనుస్సు నుండి కుటుంబస్థానము కావడంతో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని అనుమానించవలసి వస్తున్నది.
  • సూర్యుడంటే శరీరానికి గుండెకాయ. రైలుకైతే ఇంజన్. కనుక ఇంజన్లో లోపం నిజమే కావచ్చు. అయితే, ఆ లోపం ఏర్పడటానికి కారణమేంటనేది అసలు ప్రశ్న. 
  • అర్గల గ్రహాలను పరిశీలిద్దాం. శనిబుధుల వలన పాతబడిపోయిన వైర్లు, లింకులు, ఇంజన్లోని స్టీలుపార్టులు సూచింపబడుతున్నాయి. వృశ్చికంలోని కుజకేతువుల యుతివల్ల, చేయవలసిన దానికంటే ఎక్కువకాలం పాటు ఓవర్ లోడై పనిచేసిన ఇంజన్ విడిభాగాలు, అవికూడా ఇంజన్లో బయటగా కాకుండా బాగా లోపలగా ఉన్న భాగాలు సూచింపబడుతున్నాయి. ఈ రెండు కారణాలవల్ల, ఇంజన్ లో లోపం ఏర్పడినట్లు కనిపిస్తున్నది.
అలాంటప్పుడు, భారతీయ రైల్వేలలో ఇంజన్లకు జరుగవలసిన మెయింటెనెన్స్ సరిగా జరగడంలేదా? కనీసం ఈ ఇంజన్ కు జరగలేదా? అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేయవలసింది శాఖాపరమైన విచారణ మాత్రమే.

అయితే, విచారణలో ఏమి తేలినప్పటికీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? నష్టపరిహారంగా ఇచ్చిన ఎక్స్ గ్రేషియా, వ్యక్తుల లోటును పూడుస్తుందా? బాధ్యులకు శిక్షలు పడతాయా? లోపభూయిష్టమైన మన వ్యవస్థలో తిరిగి ఇవే తప్పులు జరుగకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు మాత్రం  జవాబులు లేని శేషప్రశ్నలు గానే మిగిలిపోతాయి.