నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, మార్చి 2022, ఆదివారం

బుజ్జిపాప తత్త్వాలు - 2 ( కరోనా బ్రతుకులు)

మొన్నేమో డెల్టా అంట

నిన్న ఒమిక్రానంట

రేపు డెల్టాక్రానంట

ఓ  బుజ్జిపాపా !


మొదట్లో డెల్టా అన్నారు. తర్వాత ఓమైక్రాన్ అన్నారు. రేపు డెల్టాక్రాన్ వస్తుందంట.


వాక్సిన్ వద్దన్నవారు

చచ్చి శవాలయ్యారు

వాక్సిన్ ఇమ్మన్నవారు

జీవచ్ఛవాలయ్యారు

ఓ బుజ్జిపాపా !


మాకు వాక్సిన్ వద్దన్నవారిలో చాలామంది (ఇతరరోగాలుంటే) చనిపోయారు. శవాలై కాటికి తరలిపోయారు. మూడు వాక్సిన్లూ వేయించుకుని హాయిగా ఉన్నామని అనుకుంటున్న వారిది భ్రమ మాత్రమే. జాగ్రత్తగా గమనించుకుంటే వాక్సిన్ సైడ్ ఎఫెక్టులు ఎవరికి  వారికే కనిపిస్తాయి. వాక్సిన్ పడినవారు బ్రతికున్నారు గాని, జీవచ్ఛవాల మాదిరి బ్రతికున్నారు. ఏదైనా శవమే, ఒకటి చచ్చినది, ఒకటి బ్రతికినది. అంతే !


రోజుకొక్క వేరియంటు

లాక్ డౌనుల కోవనెంటు

తినడానికి చొప్పదంటు

ఓ బుజ్జిపాపా !


మాటమాటకీ ఏదో ఒక వేరియంట్ రావడం, లాక్ డౌన్ అనడం. ఈ గోలలో పడి ఎన్నో వ్యాపారాలు, జీవితాలు తారుమారయ్యాయి. ప్రభుత్వానిదీ తప్పుకాదు. ప్రజలదీ తప్పుకాదు. తప్పంతా గ్లోబల్ కర్మది. 


రోజుకొక్క మాస్కువేయు

టాస్కును భరియించలేక

మాస్కు విసరిపారవేసి

మందుగొట్టె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


భయపడుతున్న మధ్యతరగతి వారే ఇంకా మాస్కు వాడుతున్నారు. 'ఎన్నాళ్లీ మాస్కు' అంటూ సామాన్యుడు మాత్రం దాన్ని తీసిపారేసి జల్సాగా మందుకొడుతూ హాయిగా ఉంటున్నాడు.


ప్రతిరోజూ న్యూసుచూసి

భయపడుతూ చావలేక

మాస్కు విసరిపారవేసి

రోడ్డుకెక్కె సామాన్యుడు

ఓ బుజ్జిపాపా !


ప్రతిరోజూ చావుకన్న

ఒక్కరోజు చావుమేలు

కరోనాలు గిరోనాలు 

జానే దేవ్ అంటున్నాడు

ఓ బుజ్జిపాపా !


'భయంతో రోజూ చావడమెందుకు? కరోనా వస్తే చద్దాంలే. పోయేదేముంది?' అనుకుంటూ ప్రస్తుతం చాలామంది దానిని లెక్కచేయడం లేదు. లోకం తీరు ఇలా తయారైంది.