నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

22, మార్చి 2022, మంగళవారం

పద్మశ్రీ జన్మ ధన్యమైంది

https://www.youtube.com/watch?v=OF2VZ_eLB0E

125 ఏళ్ల స్వామి శివానందగారికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఆ అవార్డు తీసుకోవడానికి వచ్చిన ఆయన, ప్రధాని మోడీ గారికి, రాష్ట్రపతి కోవింద్ గారికి మోకాటి తండా వేసి మరీ ప్రణామం చేశారు. ప్రధాని మోడీగారు, వంగి నేలను తాకి, ఆయనకు ప్రతినమస్కారం చేశారు. రాష్ట్రపతిగారు ముందుకొచ్చి ఆయనను లేపి, సాదరంగా అవార్డును చేతికందించారు.

పద్మశ్రీ అవార్డు జన్మ ధన్యమైంది.

ఈ సంఘటన కొన్ని విషయాలను మన కళ్ళముందు తేటతెల్లం చేస్తున్నది.

మొదటిది - యోగాభ్యాసానికున్న మహత్యం

యోగాభ్యాసమనేది ఒక జీవనశైలి. ఆహారవిహారాలను పాటిస్తూ, నియమంతో యోగాభ్యాసం చేస్తే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకడం సాధ్యమేనని యోగశాస్త్రం అంటుంది. నూరేళ్ళే కాదు, ఇంకా ఎక్కువకూడా బ్రతకడం సాధ్యమేనని ఎందరో ప్రాచీనయోగులు నిరూపించారు. నేడు కూడా అలాంటివి సాధ్యమేనా అని సందేహించే వారికి సజీవసాక్ష్యమే స్వామిశివానంద వంటివారు. ఎందరో గురువుల కృషి ఫలితంగా నేడు 'యోగా' అనేది ప్రపంచవ్యాప్తంగా సాధన చేయబడుతున్నది. యోగాను ముందుకు తేవడంలో ప్రధాని మోడీగారి కృషి మరువలేనిది. అంతర్జాతీయ యోగా దినం గా జూన్ 21 ని నియమించడం ఆయన చలువే.

యోగాభ్యాసానికున్న మహత్యాన్ని స్వామి శివానందవంటివారు ఈ రోజులలో కూడా సత్యమేనని నిరూపిస్తున్నారు.

రెండవది - ప్రాచీన భారతదేశపు మర్యాద.

మన దేశంలో ఉండే విలువలు, మర్యాదలు, పెద్దవాళ్ళను గౌరవించే విధానాలు ఎంత అద్భుతమైనవో ఈ అవార్డు ఫంక్షన్ మరొక్కసారి చూపిస్తున్నది. 125 ఏళ్ల  స్వామీజీ, దేశప్రధానికి, రాష్ట్రపతికి ప్రణామం చెయ్యలేదు. వారి రూపంలో ఉన్న మన దేశానికి, వేలాది ఏండ్ల దేశఘనసంస్కృతికి ప్రణామం చేశాడు.

ఈ దేశసింహాసనం మామూలుది కాదు. ప్రపంచానికే ధర్మభిక్ష, జ్ఞానభిక్ష, యోగభిక్ష పెట్టిన  దేశం మనది. అలాంటి దేశసింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఆ ప్రాచీనపరంపరకంతటికీ ఒక ప్రతీకలాంటి వాడు. ప్రాచీనకాలపు మహారాజులు, ఋషులు, జ్ఞానులకు ఆ సింహాసనం ఒక ప్రతీక. ఈ ప్రణామం ద్వారా శివానందస్వామి వారందరికీ ప్రణామం చేశారు. ఆయన భక్తిని చూస్తే అదే అనిపించింది. దీనిని గమనించాలి.   

మూడవది - అహంకారరాహిత్యం

అంత జీవితాన్ని చూచినా, అంతకాలం జీవించినా, ఆయనలో గర్వంగాని అహంకారం గాని లేదు.  బహుశా ప్రపంచం మొత్తానికీ వయసులో పెద్ద వ్యక్తి ఈయనే కావచ్చు. అలాంటి వ్యక్తిలో కూడా పిసరంత కూడా గర్వం లేకపోవడం ఎంత గొప్ప విషయం ! దీనిని కూడా గమనించాలి.

నేడు నాలుగు డబ్బులు జేబులో ఉంటే చాలు, ఎవరికీ కన్నూ మిన్నూ కనపడటం లేదు. మరి వారంతా స్వామి శివానందగారిని చూచి నేర్చుకోవాలా లేదా? 

నాల్గవది - ప్రధాని మోడీగారి ఉన్నత వ్యక్తిత్వం

మోడీగారు కూడా కుర్చీలోనుంచి లేచి, నేలను తాకి ఆయన నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. అది మోడీగారిలోని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నది. ప్రధానినన్న గర్వం ఆయనలో ఏమాత్రమూ లేదు. ఒక సామాన్య సాధువుకు ఆ విధంగా ఆయన  ప్రతినమస్కారం చేయడం ఎంత గొప్ప విషయం !

దీనిని చూచి మన నేటి యువత ఎంత నేర్చుకోవాలో ఆలోచించండి !

అయిదవది - రాష్ట్రపతిగారి హుందా ప్రవర్తన

రాష్ట్రపతిగారైన రామ్ నాధ్ కోవింద్ గారు కూడా ఎంతో హుందాగా ప్రవర్తించారు. ఒక రాష్ట్రపతిగా, ఆయన ఎవరికీ వంగి ప్రణామం చేయకూడదు. ఆ నియమాన్ని ఆయన ఎంతో హుందాగా పాటించారు. స్వామి శివానంద గారిని సాదరంగా లేపి అవార్డు చేతికిచ్చాడు. ఈ మొత్తం ఘట్టంలో ఎవరిలోనూ ఎక్కడా కృత్రిమత్వం లేదు. తెచ్చిపెట్టుకున్న వినయం లేదు. మొత్తం అంతా ఎంతో సహజంగా ఉంది. ఇది కూడా ఎంతో గొప్ప విషయం.

గతంలో ఎందరికో పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారిలో అర్హులూ ఉన్నారు. అనర్హులూ ఉన్నారు.  రాజకీయ పైరవీలు చేసి, రికెమెండ్ చేయించుకుని మరీ అవార్డులు తెచ్చుకోవడాలు నాకు తెలుసు. అందుకే ఈ అవార్డులన్నా, ఫంక్షన్లన్నా నాకు అసహ్యం. వీటిని నేను చూడను. కానీ ఈ ఫంక్షన్ క్లిప్ చూచాను. నచ్చింది.

అందుకే అంటున్నాను.

ఇన్నాళ్ళకి పద్మశ్రీ అవార్డు జన్మ ధన్యమైంది.