నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, ఏప్రిల్ 2022, సోమవారం

బుజ్జిపాప తత్త్వాలు - 8 (ఇదే మనుషుల తీరు)

అవసరం ఉంటే  అన్నీ పట్టుకుంటారు

అదే లేకుంటే ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వరు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


వీకెండ్ పార్టీలకు వేలు తగలేసేవారు

ఆకలితో పోయేవాడికి అర్ధరూపాయి  ఇవ్వరు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


అధికారమదంతో అంగలార్చేవారు

అమాయకుల ఆసరాకు అస్సలు రారు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


అవినీతితో లక్షల కోట్లు దాచుకునేవారు

నిజాయితీ సామాన్యుణ్ణి నీచంగా చూస్తారు  

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


శాంతీ సహనం ప్రేమా సమానత్వం అనేవాళ్ళు

వాటిని తప్ప అన్నిటినీ ఆచరిస్తారు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


దేవుడూ దేవుడూ అంటూ నీతులు చెప్పేవాళ్ళు

జీవుడిని జీవచ్ఛవంగా చూస్తారు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


అవసరార్ధం అద్భుతంగా నటిస్తారు

అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ వదలరు

ఇదే మనుషుల తీరు

ఓ బుజ్జిపాపా


వేసుకున్న ముసుగులు తొలగిస్తే

అన్నీ కంపుకొట్టే  కంకాళాలే

దాచుకున్న చరిత్రను తవ్విస్తే

అన్నీ మురుగుతున్న గంగాళాలే

ఓ బుజ్జిపాపా


ఎక్స్ రేలు తీయిస్తే

మనుషులందరూ పిశాచాలే

కచ్చడాలు వదిలేస్తే

మనసులనిండా అశౌచాలే

ఓ బుజ్జిపాపా