Once you stop learning, you start dying

26, జూన్ 2022, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'సావిత్రీ ఉపనిషత్' విడుదల

ఈరోజు ఆదివారం.

నిన్న, నేడు, ఈ రెండు రోజులలో, ఒంగోలు దగ్గరలోని మా చంద్రపాడు ఆశ్రమంలో మొదటి ఆధ్యాత్మికసమ్మేళనం (spiritual retreat) ను ఎంతో సంతోషకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నా కలం నుండి వెలువడిన మరొక్క క్రొత్తపుస్తకాన్ని విడుదల చేస్తున్నాను.

దీనిపేరు, 'సావిత్రీ ఉపనిషత్'.

ఇది సామవేదమునకు చెందినది. గాయత్రీమంత్రమునకే సావిత్రీమంత్రమని కూడా పేరున్నది. ఈ ఉపనిషత్తు, మరణమును జయింపజేసే 'సావిత్రీవిద్య' ను బోధిస్తుంది.

'సావిత్రీవిద్య' అంటే ఏమిటి?

మనమున్న భూమి నుండి మొదలై, అంతరిక్షమును దాటి, శూన్యాకాశంలోకి విస్తరిస్తున్నట్లుగా ఈ సృష్టిని మనం చూస్తాం. కనుక, మనవరకూ, సృష్టి మూడుస్థాయిలలో ఉంటున్నది. అవి, భూ (భూమి), భువః (అంతరిక్షము), సువః (శూన్యాకాశము లేదా స్వర్గము). ఇవే గాయత్రీ మంత్రములోని మూడు వ్యాహృతులు. ఈ మూడుస్థాయిలలోని మూడుశక్తులను ఈ వ్యాహృతులు సూచిస్తూ, సృష్టి మొత్తానికీ ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

గాయత్రీమంత్రములోని మూడు పాదములు కూడా ఈ మూడు వ్యాహృతులలోనే ఇమిడి యుంటాయి. ఈ మంత్రోపాసనా ఫలితమును వివరిస్తూ, 'అది మరణమును జయించడమే' అంటుంది సావిత్రీ ఉపనిషత్తు.

పురాణములలో మనకు కనిపించే సావిత్రీ సత్యవంతుల కధలో కూడా, చనిపోయిన తన భర్త సత్యవంతుడిని, సావిత్రి తిరిగి బ్రతికించుకున్నట్లు మనం  చూస్తాం. కనుక మరణాన్ని జయించే శక్తికి 'సావిత్రి' అని పేరు. ఇది మిట్టమధ్యాహ్నపు సూర్యుని శక్తి. జాతకచక్రములో ఇది దశమభావంలో ఉచ్ఛస్థితిలో ఉన్న సూర్యునికి సూచిక.

ఇక్కడొక జ్యోతిష్యరహస్యాన్ని పరిచయం చేస్తాను. దశమకేంద్రంలో (నడినెత్తిన) సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉండటం అనేది కర్కాటకలగ్నానికి మాత్రమే సాధ్యమౌతుంది. అదికూడా, ఏప్రియల్ నెల 14 వ తేదీనుండి మే నెల 14 తేదీ వరకు మాత్రమే సాధ్యమౌతుంది. అలాంటి గ్రహస్థితిలో పుట్టినవారిలో 'సావిత్రీశక్తి' ఉంటుంది. అంటే, రోగంతో క్షీణిస్తున్నవారిని, చావుకు సిద్ధంగా ఉన్నవారిని కూడా వారు పునరుజ్జీవింప జేయగలుగుతారు. ఇలాంటివారు డాక్టర్లుగా అద్భుతంగా రాణిస్తారు. ఇది 'సావిత్రీయోగం' అనబడుతుంది. ఇది జ్యోతిష్యగ్రంధాలలో లేదు. నేనే సృష్టించాను.

మహాయోగి అరవిందులవారు కూడా తన మార్మికగ్రంధమునకు 'సావిత్రి' అని పేరును పెట్టడం గమనార్హం.

మా సాధనామార్గం కూడా అదే.

'అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ' అసత్యం నుండి సత్యంలోకి, తమస్సు నుండి వెలుగులోకి, మృత్యువునుండి అమృతత్వంలోకి మమ్ములను నడిపించు - అనే వేదఋషుల ప్రార్ధనయే మా సాధనావిధానం కూడా.

అందుకని, మా ఆశ్రమ ప్రారంభోత్సవ సందర్భంగా, సూర్యభగవానుని దినమైన ఈ ఆదివారంనాడు, మరణాన్ని జయించే 'సావిత్రీ విద్య'ను వివరించే ఈ ఉపనిషత్తును మా ఆశ్రమస్థలం నుండి విడుదల చేస్తున్నాను.

Google Play Books నుండి ఉచిత పుస్తకంగా ఇక్కడ లభిస్తుంది.

చదవండి. అర్ధం చేసుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.