నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, జూన్ 2022, సోమవారం

మా ఆశ్రమం మొదలైంది - 1

మా ఆశ్రమం మొదలైంది.

దాదాపు పదేళ్లుగా పంచవటి సభ్యులందరూ కలలు కంటున్న 'పంచవటి ఆశ్రమం' సాకారమైంది. స్థలం ఒంగోలు దగ్గర చంద్రపాడు గ్రామం. ఊర్లకు దూరంగా, జనసంచారం లేని పొలాలలో, ప్రశాంత ఏకాంత వాతావరణంలో,  అతి నిరాడంబరంగా ఈ ఆశ్రమం ప్రారంభించబడింది.

అయితే, ఆశ్రమం ముందుగా పోయే తారురోడ్డు వల్ల, కేవలం 20 నిముషాలలో మా ఆశ్రమం నుండి మద్రాస్ కలకత్తా నేషనల్ హైవేకు చేరుకోగలుగుతాం. అక్కడనుండి ఒంగోలుకు మరో 20 నిముషాలలో చేరుకుంటాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాహనం  చేతిలో ఉంటే, చాలా తేలికగా సేఫ్ గా మా ఆశ్రమానికి చేరుకోవచ్చు.

మా ఆశ్రమం నిజంగా ఋష్యాశ్రమమే. కాంక్రీటీ బిల్డింగుల కంటే, చెట్లకు, కుటీరాలకే మా ప్రాధాన్యత. పటాటోపం కంటే ప్రకృతిజీవనానికే మా ఓటు.

పాండిత్యం మాకు తక్కువేమీ కాదు. వేదవేదాంత జ్యోతిష్య యోగ తంత్రశాస్త్రాలలో ఎవరికీ లేని విజ్ణానం మా సొంతం. కానీ మేం దానికి విలువనివ్వం. వినయంతో కూడిన సాధనకే మా పెద్దపీట.

డబ్బుకు ఆడంబరాలకు ఎచ్చులకు మా ఆశ్రమంలో స్థానం లేదు. నిజాయితీతో కూడిన వినయవంతులైన సాధకుల కోసమే మా ఆశ్రమం.

రాజకీయాలకు, మతాల గోలకు మేం ఆమడదూరంలో ఉంటాం. మతప్రచారాలలో ఏమీ లేదని మాకు స్పషంగా తెలుసు.

నీ కులమేంటని మా ఆశ్రమంలో ఎవరినీ అడగం. మాకు కులం ప్రధానం కాదు. హృదయం ప్రధానం.  హృదయం మంచిదైతే మా ఆశ్రమం మీకు స్వాగతం పలుకుతుంది. అహంకారం లేనివారు, మంచి హృదయం ఉన్నవారూ మాత్రమే మాతో ఉండగలుగుతారు. లేకపోతే, మాతో ఎక్కువకాలం పాటు నడవలేరు.

లోకానికి తెలిసిన మడీ ఆచారమూ మా దగ్గర ఉండవు. జ్ఞానమే మా మడి, యోగమే మా ఆచారం. విశాలత్వమే మా కులం. హృదయపవిత్రత మా మతం. ఇవన్నీ అసలైన హిందూమతపు మూలస్తంభాలే గనుక, అసలైన హిందూమతాన్ని మేం అనుసరిస్తామని ప్రకటిస్తున్నాం. అలాగని, మేం ఏ కల్ట్ ప్రచారాలూ చెయ్యం. హిందూమతంలో పుడుతున్న అనేక వెర్రి ఆశ్రమాలకూ, వెర్రి పోకడలకూ మేం వ్యతిరేకం.

వేలాది సంవత్సరాల కాలగమనంలో పరాయిమతాల, పరాయిదేశాల దండయాత్రల ప్రభావంతో హిందూమతంలో చేరుతూ వచ్చిన నానాచెత్తనూ తొలగించి, దాని మౌలికసూత్రాలను, సత్యాలను, విశాలమైన దాని ఆచరణాత్మక విధానాలను, ప్రాక్టికల్ గా బోధించడమే మా విధానం. క్రొత్తక్రొత్త సోదిని, థియరీలను మేము బోధించము. హిందూమతంలో లేనిదానిని క్రొత్తగా దేనినో మేము కనుక్కున్నామని గప్పాలు కొట్టుకోము. కొత్తకొత్త దేవుళ్లను అస్సలు ప్రొమోట్ చెయ్యము.

సంసారాన్ని వదిలిపెట్టమని మేం చెప్పం. రంగురంగుల గుడ్డలు వేసుకోమని మేం చెప్పం. మా విధానాన్ని లోకంలో ప్రచారం చెయ్యమని, అనుచరులను పోగెయ్యమని కూడా మేము చెప్పం.  పదిరోజుల, ఇరవైరోజుల, నలభైరోజుల పిచ్చిదీక్షలను మేం అంగీకరించం. కాలగమనంలో ఈ వేషాలన్నీ కూలిపోతాయని మాకు బాగా తెలుసు. ఎప్పటికీ నిలబడే సనాతనధర్మాన్నీ, దాని మౌలికవిలువలనూ, పద్ధతులనూ మాత్రమే మేం అనుసరిస్తాం. బోధిస్తాం. 'నిత్యజీవితమే సాధన' అనేది మా విధానం.

జనసామాన్యానికి అవసరమైన విగ్రహారాధనను మేం ఒప్పుకుంటాం. అది చాలా అవసరమని మాకు తెలుసు. దాని పరిమితులూ మాకు తెలుసు. అదే సమయంలో, జ్ఞానులు అనుసరించే నిరాకారసాధననూ ఒప్పుకుంటాం. భక్తినీ, జ్ఞానాన్నీ, యోగాన్నీ, తంత్రాన్నీ, వేదాన్నీ, వేదాంతాన్నీ, దానిలోని ఎన్నో శాఖోపశాఖలనూ మేం ఒప్పుకుంటాం. సాధనామార్గంలో వాటి వాటి స్థానాలు మాకు స్పష్టంగా తెలుసు. వాటన్నిటి జ్ఞానమూ మా సొంతమే. సోపానపంక్తిలో ఏ మెట్టునూ మేం వ్యతిరేకించం, ముందుకు నడవమని మాత్రమే చెబుతాం. ఎలా నడవాలో ప్రాక్టికల్ గా నేర్పిస్తాం.

ఉదారమైన, విశాలమైన మా భావజాలానికి, మేము అనుసరించే సాధనామార్గానికీ వెలుగుదారులను చూపిన  శ్రీరామకృష్ణులవారిని, రమణమహర్షిగారినీ, జిల్లెళ్ళమూడి అమ్మగారిని మేం అనుసరిస్తాం.  అయితే, వారిని వ్యక్తిపూజాపరంగా పూజించడం మా ఆశ్రమంలో ఉండదు. వారి తత్త్వాన్ని, వారు చెప్పినదానిని ప్రాక్టికల్ గా మా జీవితాలలో అనుసరిస్తాం. అదే మా విధానం.

అందుకే, మా ఆశ్రమంలో ఏ గుడీ ఉండదు. ప్రశాంతవాతావరణంలో ఒక ధ్యానమందిరం మాత్రమే ఉంటుంది. ఎవరి ఇష్టదేవతను వారు ఇక్కడ ధ్యానించుకోవచ్చు. ఎవరికేది అవసరమో ఆ సాధన వారికి ఉపదేశింపబడుతుంది. ఆ మార్గంలో వారికి మార్గనిర్దేశం చెయ్యబడుతుంది.

'అన్ని మతాలూ ఒక్కటే' అని మేము చెప్పం. అది నిజం కాదు. మతాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి. మతాలన్నీ ఒకే సత్యాన్ని చెప్పడం లేదు. అవన్నీ ఒకటి కావు. 'అన్ని మతాలలోకీ హిందూమతమే సర్వశ్రేష్టమైనది' అని మాత్రమే మేం చెబుతాం. ఎందుకంటే, ఆయా మతాలలో ఉన్నదంతా హిందూమతంలో ఆల్రెడీ ఉండటమే కారణం. కానీ హిందూమతంలో ఉన్నదంతా ఇతర మతాలలో లేదు. కనుక, ఈ దేశంలో పుట్టినవాడెవరూ ఇతర మతాలలోకి మారవలసిన అవసరం లేదు. అంతేకాదు, ఘర్ వాపసీ కావలసిన అవసరం ఉన్నది. అయితే, ఆ కార్యక్రమం మా గమ్యం కాదు.

ముందు అవగాహన, తరువాత సాధన, ఆ తరువాత బోధన అనేదే మా విధానం.

హిందూమతపు తాత్వికచింతనలలోని అన్ని సిద్ధాంతాలనూ సులభమైన విధానంలో, అర్ధమయ్యే భాషలో నేర్పించడమే కాదు, ప్రాక్టికల్ గా ఆ సాధనామార్గంలో నడిపించడమే మా విధానం.

అసలైన హిందూమతపు వెలుగులు ఇక్కడనుండి లోకానికి వెదజల్లబడతాయి. ఆ కార్యక్రమానికి నిన్న మొదటి భౌతికపునాది పడింది. 'భౌతికం' అని ఎందుకన్నానంటే, భావజాలపరంగా నా వ్రాతలలో, పుస్తకాలలో, ఆడియో ప్రసంగాలలో గత పదేళ్లుగా దానిని చెబుతూనే ఉన్నాను. నేడు దానికి ఒక స్థలంలో పునాది పడింది గనుక, 'భౌతికం' అంటున్నాను.

అసలైన యోగసాధనకు మేమిచ్చే ప్రాధాన్యతకు గుర్తుగా మా ఆశ్రమానికి 'పంచవటి యోగాశ్రమము' అని పేరును నిశ్చయించాం.  

(ఇంకా ఉంది)