నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, జులై 2022, సోమవారం

సుభాష్ పత్రి జాతకంలో విధ్వంస యోగం

మొన్ననే విధ్వంసయోగం గురించి వ్రాశాను. జాతకంలో ఈ యోగం ఉన్న మరొక ప్రసిద్ధవ్యక్తి నిన్న చనిపోయాడు.

పిరమిడ్ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్ పత్రి నిన్న సాయంత్రం చనిపోయాడు. ఈ న్యూస్ నిన్న సాయంత్రమే తెలిసింది. ఈరోజు ఉదయం, పిరమిడ్ ధ్యానాన్ని అనుసరించే ఒక మిత్రుడు కలిసి అదే వార్తను మళ్ళీ చెప్పాడు. ఆయన కొంతకాలంగా కిడ్నీవ్యాధితో బాధపడ్డాడని దానితోనే మూడ్రోజులు కోమాలో ఉండి చివరకు చనిపోయాడని చెప్పాడు. అదే నాకు ఆశ్చర్యమనిపించింది.

ప్రస్తుతం ఖగోళంలో నడుస్తున్న ముఖ్యమైన గ్రహయోగం మేషరాశిలో రాహు, కుజ, యురేనస్ ల డిగ్రీ యుతి. ఇది మంచినీ చెడునూ రెండింటినీ చేస్తుంది. కొందరికి మంచిని చేస్తే, కొందరికి చెడును చేస్తుంది. ఏ గ్రహయోగమైనా అంతే. కాకపోతే ఇది మరీ తీవ్రమైన యోగం.

దౌపది ముర్మును భారత రాష్ట్రపతిని చేసిందీ ఇదే యోగమే. అనేకమంది కర్కాటకరాశి వారికి స్థానచలనాన్ని, ఉద్యోగంలో మార్పులను ఇచ్చింది ఈ యోగమే. ఇదే యోగం నిన్న సుభాష్ పత్రిని తీసుకుపోయింది.

అనేక ఏళ్ల క్రితం పిరమిడ్ సంస్థలు మొదలౌతున్నపుడు ఒక మాటను వాళ్ళు చెప్పేవారు. 'పిరమిడ్ ధ్యానం చేస్తే రోగాలు పోతాయి' అని. నేనప్పట్లోనే చెప్పాను, అది అబద్దమని. అదే నిజమైతే నేడు వాళ్ళ గురువే కిడ్నీ సమస్యతో చనిపోవడమేంటి మరి? చనిపోయేటప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా? అనవచ్చు. అదే నిజమైతే 'ధ్యానం రోగాలను నయం చేస్తుంది' అని వారు గత ముప్పై ఏళ్లుగా చేసిన ప్రచారం నిజమా అబద్దమా?

సుభాష్ జననతేది 11-11- 1947. ఆయనది తులారాశి.  శనికుజులు కర్కాటకంలో ఉన్నారు. ఇది కుజునికి నీచక్షేత్రం. జాతకంలో కుజశనుల విధ్వంసయోగం మంచిది కాదు. ఈయన మీద వచ్చిన వివాదాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈయన భావజాలం వల్ల సమాజంలో మంచి జరిగిందా?, చెడు జరిగిందా?, జరిగితే ఏది ఎంతవరకు జరిగింది? అనేది కూడా నేను మాట్లాడను. కాకపోతే ఒకటి చెబుతాను. శాకాహారాన్ని ప్రోత్సహించడం, ఆనాపానసతిని నేర్పడం వరకూ మంచిదే. అదే సర్వస్వమని చెబుతూ, ఒక గమ్యమంటూ లేని కలగూరగంపను సృష్టించడం, ఈజిప్టు సమాధులను ప్రతి ఊరిలోనూ కట్టించడం మాత్రం హర్షణీయం కాదు.

కర్కాటకం నుంచి దశమంలో నేడున్న రాహు-కుజ-యురేనస్ యోగమే ఈయన మరణానికి దారి తీసింది. ఈ యోగం ఈయన జననకాల చంద్రుని నుండి మారకస్థానమైన సప్తమంలో ఉంది.  దాని దృష్టి, కిడ్నీలకు సూచిక అయిన తులారాశి పైన ఉంది. ఈయన పోయింది కిడ్నీ వ్యాధితోనే అన్నది గమనార్హం.

పిరమిడ్ సంస్థ పైనా, వారి ధ్యానవిధానం పైనా నాకెప్పుడూ సదభిప్రాయం లేదు. అంతేకాదు, సాయిబాబా, అయ్యప్ప, బ్రహ్మకుమారీస్ మొదలైన కల్ట్ ల మీద కూడా సదభిప్రాయం లేదు. కారణం? వారి పరిమితులు, లోపాలు, నాకు స్పష్టంగా తెలిసి ఉండటమే. హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇవేవీ అవసరం లేదు.

పిరమిడ్ వారు చెప్పే 'శ్వాసమీద ధ్యాన'  అనేది బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానవిధానమే. అయితే, బుద్ధుని మార్గంలో అదొక మొదటిమెట్టు మాత్రమే.  వీరి దృష్టిలో అది తుదిమెట్టు. దానికి పిరమిడ్ ను కలిపారు. అవేమో ఈజిప్తులో సమాధులు. వాటిని తెచ్చి, ఊరూరా కట్టేశారు. దర్శనాలని, లోకాలని, ఆత్మలని రకరకాల మాటలు చెప్పే వీరి సిద్ధాంతమంతా ఒక కలగూరగంపయే గాని అసలైన సనాతనధర్మమూ, హిందూమతమూ కాదు. బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం, హిందూమతం ఇలా  అన్నింటిలో ఉన్న అక్కల్ట్ మాటలను కలగలిపి అతుకులు పెట్టి ఏవేవో చెబుతూ ఉంటారు. వీరి మార్గం చివరకు ఎక్కడకు దారితీస్తుందో వీరికే ఎరుక !

అయితే, హిందూసమాజంలోని కొన్ని కులాలతో, ఒక వర్గపు ప్రజలతో, ఒక ఫాలోయింగ్ ను తయారుచేసుకోవడంలో వీరు విజయాన్ని సాధించారనే చెప్పాలి. మన దేశంలో ముఖ్యంగా హిందువులలో ఉన్న పరిస్థితి ఏమంటే, ఎవరేది చెప్పినా దానిని అనుసరించడానికి వేలల్లో మనుషులు రెడీగా ఉంటారు.

చెప్పేవారు చెబుతున్నారు. అనుసరించేవారు అనుసరిస్తున్నారు. మతాలు మారేవారు మారుతున్నారు. ప్రతివారూ 'మేమే కరెక్టు' అంటున్నారు. ఎవరెక్కడికి పోతున్నారో, ఏది ఎక్కడికి దారి తీస్తున్నదో ఎవరికీ తెలియదు. గుడ్డెద్దు చేలో పడిన చందంగా నేడు హిందూసమాజం ఉన్నది.

ఏదేమైనా, 'ధ్యానం రోగాలను తగ్గిస్తుంది' అని జీవితమంతా ప్రచారం చేసిన ధ్యాన మాస్టర్, కిడ్నీ రోగం నయం కాక చనిపోవడం ఒక వింత అయితే, ధ్యానసిద్ధుడని ప్రచారం జరిగే వ్యక్తి మూడు రోజులపాటు కోమాలో ఉండి చనిపోవడం ఇంకొక వింత. అయితే, రేపటినుంచీ ఈయన శిష్యులు, 'అది కోమా కాదు, సాయిబాబాలాగా ఈయన కూడా మూడ్రోజులు సమాధిలో ఉండి, వివేకానందునిలాగా స్వచ్చందంగా దేహం వదిలేశాడు' అని రకరకాల కధలను ప్రచారం చేస్తారేమో మరి ! 

చూద్దాం !

read more " సుభాష్ పత్రి జాతకంలో విధ్వంస యోగం "

19, జులై 2022, మంగళవారం

శభాష్ చైనా

శభాష్ చైనా !

ఏమాటకామాటే చెప్పుకోవాలి. చైనాను చూచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నిజానికి అనేక రంగాలలో చైనా మనకంటే 50 ఏళ్ళు ముందుకెళ్ళిపోయింది. అంగారకగ్రహం పైన చైనా తన రోవర్ ను దించి ఏడాది అవుతోంది. మనమేమో కనీసం చంద్రుడిని కూడా చేరుకోలేకుండా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి చైనా సాధించిన విజయాలు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందుకు కాదు.

నిన్న జిన్ జియాంగ్ ప్రావిన్స్ ను దర్శించిన ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఒక గట్టి హెచ్చరికలాంటి ప్రకటనను చేశాడు. 'ఇస్లామనేది చైనాలో ఉండాలంటే చైనీయ పద్ధతిలో మాత్రమే ఉండాలి' అనేదే ఆ ప్రకటన. 'లేదంటే?' అనే మాటకు అక్కడ ఆస్కారం లేదు. 'లేదంటే, నువ్వుండవు' అని చైనా ప్రభుత్వం అంటుంది. అంతే ! అలా అయితేగాని అక్కడ పరిస్థితి అదుపులో ఉండదనేది చరిత్రనుంచి చైనా నేర్చుకున్న గుణపాఠం !

చైనాలోని వాయవ్యదిక్కులో ఉన్న ఈ  ప్రావిన్స్ లో ఊగిర్ ముస్లిమ్స్ మెజారిటీగా ఉన్నారు. ఎక్కడైనా ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటే ఏమౌతుందో చైనాలో కూడా అదే జరిగింది. ఇస్లామిక్ టెర్రరిజం మొదలు కాబోయింది. అది చైనాగాని ఇండియా కాదు కదా? ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. గట్టిచర్యలు తీసుకుంది. లక్షలాదిమంది ఊగిర్ ముస్లిమ్స్ ని  జైళ్లలాంటి క్యాంప్స్ లో పెట్టి, మంచి మసాలా ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్లకు ఎక్కిన ఇస్లామిక్ తీవ్రవాద పిచ్చిని వదిలించింది. లక్షలాది ఆడాళ్లకు ఫెమిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించింది. ప్రక్క ప్రావిన్స్ లో ఉన్న హాన్ తెగ ప్రజలను లక్షలాదిగా ఈ ప్రావిన్స్ కు తరలించింది. ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఈ విధంగా నీరుగార్చేసింది.

అమెరికా, బ్రిటన్, కెనడాలు 'చైనాలో మానవహక్కుల ఉల్లంఘన' అంటూ దుమ్మెత్తి పోశాయి. ఏ ఆసియా దేశమైనా ఎదుగుతుంటే అవి సహించలేవన్నది చరిత్ర చెబుతున్న నిజం. అందుకని వాళ్ళ కంట్రోల్లో ఉన్న UN వంటి సంస్థలను ఉసిగొలిపి చైనాను ఇబ్బంది పెట్టాలని చూశాయి.  కానీ చైనా ఎవరిమాటా వినలేదు. 'మా దేశపు సమస్యలను దిద్దుకోవడం మా ఇష్టం' అంది. 'బయటవాళ్ళు నోళ్లు మూసుకోండి' అంది. అనడమే కాదు, బయటవాళ్ళవీ, లోపలవాళ్ళనీ నోళ్లు మూయించింది.

నిన్న ప్రెసిడెంట్ జిన్ పింగ్ ఈ చక్కటి వార్ణింగ్ ఇచ్చాడు. 'ఇస్లాం లేదు ఏమీ లేదు. మీరు చైనాలో ఉండాలంటే, చైనీయులుగా ఉండాల్సిందే. వేరే దారి లేదు' అని నర్మగర్భంగా చెప్పాడు.

అందుకే అంటున్నాను, 'శబాష్ చైనా' అని.

ఈ విధంగా ఇండియా చెప్పగలదా? చెప్పలేదు. కారణం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థలు మాత్రమే. ఈ సంగతి చైనాకు కూడా తెలుసు. గతంలో ప్రెసిడెంట్ జిన్ పింగ్ అన్నాడు కూడా, 'ఇండియాలోని రాజకీయ వ్యవస్థ (పార్లమెంటరీ డెమోక్రసీ ) అనేదే దాని శాపం' అని.

చైనాలో ఒకటే పార్టీ. మనది బహుపార్టీ వ్యవస్థ. చైనాది నియంతృత్వం. మనది ప్రజాస్వామ్యం. చైనా రాజ్యాంగం మనలాగా కలగూరగంప కాదు. వాళ్లకు కావలసినది వాళ్ళు రాసుకున్నారు.  మనమేమో మనకు అక్కర్లేనివన్నీ కాపీ కొట్టి రాసుకున్నాం. అదే మన అభివృద్ధికి ప్రతిబంధకం కావడమేగాక, మన నాశనానికి వెసులుబాట్లను ఇస్తున్నది. రాజ్యాంగంలోని లొసుగులను వాడుకుని దేశద్రోహశక్తులు మనదేశంలో బలపడుతున్నాయి. చైనా చేసినట్లు వీటిని కట్టడి చేయడం ఇండియాకు చాలా కష్టంతో కూడుకున్న పని. కారణం? ఇక్కడి వ్యవస్థలో అన్నీ లొసుగులే.

అసలు మన రాజ్యాంగాన్ని అలా వ్రాయించడంలో బ్రిటిష్ వాళ్ళ లాంగ్ టర్మ్ కుట్ర ఉందన్నది నాకున్న సందేహం. కాశ్మీర్ ని ఎలా తయారుచేసి మనకంటించి పోయారో, ఇండియా పాకిస్తాన్ అంటూ రెండు దేశాలను తయారుచేసి కూడా, మళ్ళీ ముస్లీమ్స్ ని ఇక్కడ ఉంచి పోయారో. కుల, మత విభేదాలను నాయకులమధ్యలో రెచ్చగొట్టి పోయారో,  మన రాజ్యాంగాన్ని కూడా ఆ విధంగా వ్రాయించడంలో వాళ్ళ పాత్ర ఉన్నదని నా నమ్మకం. వాళ్ళే డైరెక్ట్ గా వ్రాయకపోయినా, వ్రాసిన వాళ్ళను ప్రభావితం చేయడానికి చాలా అవకాశాలున్నాయి.

ఆ రాజ్యాంగం ప్రకారం దిద్దబడిన మన వ్యవస్థ ఎలా తయారైందంటే, ఒక సమస్యకు చైనాలో అయితే ఒక ఏడాదిలో పరిష్కారం అయ్యేది ఇక్కడ ఏళ్లకేళ్లు పట్టినా అది పరిష్కారం కాదు. మౌలికమైన వ్యవస్థాగత లోపాలే దీనికి కారణం. చైనాలో లోపలిశత్రువులు లేరు. ఇండియాలో అడుగడుక్కీ వ్యతిరేకవాదులే. ప్రతి మంచిపనికీ అడ్డుపడేవాళ్ళే. 'అన్నిటికంటే దేశం గొప్పది' అనే భావన ఒక్క హిందువులలో మాత్రమే ఉండటం ఈ దేశపు దురదృష్టం.

జనాభాలో ప్రపంచ నెంబర్ 1 గా అతిత్వరలో మనమే మారబోతున్నాం. ప్రస్తుతం కాశ్మీర్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, యూపీ, బీహార్, తెలంగాణ ఇలా చాలా రాష్ట్రాలలో ఇస్లామిక్ తీవ్రవాద ధోరణులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి వ్యవస్థతో, ఇలాంటి జనాభాతో, ఇండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నది ప్రశ్నార్ధకమే అయినప్పటికీ, ప్రస్తుతానికి ఈ సమస్యను వాళ్ళదైన శైలిలో డీల్ చేస్తున్నందుకు మాత్రం చైనాను  శభాష్ అనకుండా ఉండలేం.

మన శత్రువులో అయినా సరే, మంచిగుణం ఒకటి ఉన్నపుడు దానిని మెచ్చుకోవడం, అనుసరించడం ఉత్తమలక్షణం కదా మరి ! కానీ మెచ్చుకోవడం వరకూ సరే. అనుసరించాలంటే మన వ్యవస్థే మనకు అడ్డుగా ఉంది. అంతా మన రాజ్యాంగ కర్తల దూ ....... ర దృష్టి ఫలితం మరి !!!

ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో??

read more " శభాష్ చైనా "

16, జులై 2022, శనివారం

'Savitri Upanishad' Our new E Book released


మా సంస్థనుండి వెలువడుతున్న 49 వ పుస్తకంగా Savitri Upanishad ఇంగ్లీషు పుస్తకం విడుదలౌతున్నది. గతంలో తెలుగులో విడుదలైన ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము. దీనిగురించి ఇంతకుముందే వ్రాశాను గనుక అదంతా మళ్ళీ చెప్పను.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి చక్కని అనువాదం  చేసిన నా శిష్యురాలు గాయత్రికి, తప్పులను దిద్దిన అఖిలకు, ప్రచురణలో ముఖ్యపాత్రలను పోషించిన సరళాదేవి, అఖిల, ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు. ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఉచిత పుస్తకంగా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " 'Savitri Upanishad' Our new E Book released "

14, జులై 2022, గురువారం

విధ్వంసయోగం - మనోనాశయోగం

ఈ మధ్యకాలంలో  జ్ఞానమార్గంలో నడచిన కొందరి జాతకాలను పరిశీలించి వీరిలో కామన్ గా ఉన్న ఒక యోగాన్ని చదువరులకు పరిచయం చేయబోతున్నాను. ఈ యోగం పేరు విధ్వంసయోగం. దీనికీ పేరును నేనే పెట్టాను. ఈ విషయాన్ని 'మెడికల్ అస్ట్రాలజీ' పుస్తకంలో వ్రాశాను.

శనికుజుల కలయికతో ఏర్పడే ఈ యోగం కృత్రిమపు బ్రతుకులు బ్రతికేవారి జీవితాలలో యాక్సిడెంట్లను ఇస్తుంది. ఆధ్యాత్మికమార్గంలో నడిచేవారి జీవితాలలో అయితే 'కెలామిటీ' అనబడే విధ్వంసాన్ని సృష్టిస్తుంది.  దీనినే 'మనోనాశం' అంటారు. ఈ కెలామిటీ అనే దశ వారికి వచ్చినపుడు వారి మానసికదృక్పథం మొత్తం రివర్స్ అవుతుంది. అప్పటిదాకా ప్రపంచాన్ని వారు చూస్తున్న తీరు మొత్తం కుప్పకూలిపోతుంది. వారి మనస్సు మొత్తం కూలిపోయి నూతనంగా తయారౌతుంది. ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని నెలలనుంచి కొన్ని ఏళ్ళు పట్టవచ్చు. ఆ సమయంలో వారు నరకాన్ని అనుభవిస్తారు. ఆ తరువాత మాత్రం నిత్యస్వర్గంలోకి అడుగుపెడతారు. అయితే ఆ స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఉండరు. అసలెవరూ ఉండరు. అడుగుపెట్టిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు. కనుకనే అది స్వర్గం అవుతుంది.

రమణమహర్షి (30-12-1879)

  • శని, కుజగురులచేత అర్గలబందీ అయ్యాడు. ఇదొకరకమైన విధ్వంసయోగం. 
  • శని ముందుకు పోకుండా కుజుడు ఆపుతున్నాడు. 
  • ఇది లగ్నాత్ సప్తమంలో జరిగింది. సప్తమం లగ్నానికి ప్రతిరూపం. 
  • శనిదృష్టి చంద్రునినుండి చతుర్దంపైన ఉంది. ఇది మనోనాశయోగాన్ని సృష్టిస్తున్నది. 
  • స్వయానా చంద్రుడు కేతుగ్రస్తుడైనాడు

మెహెర్ బాబా (25-2-1894)

  • చంద్రునితో కలసి ఉన్న శనిదృష్టి కుజునిపైన ఉంటూ విధ్వంసయోగాన్ని, మనోనాశయోగంగా మారుస్తున్నది.
  • యురేనస్, శనిచంద్రులతోనే కలసి ఉన్నాడు.
  • మత్తుకు కారకుడైన నెప్ట్యూన్, మరణకారకుడైన ప్లుటోలు వృషభంలో ఒకే డిగ్రీపైన ఉంటూ, కుజశనుల మధ్యరాశిని చూస్తున్నాడు.

UG (9-7-1918)

  • లగ్నాత్ చతుర్దంలో ఉన్న కుజుడిని శని వీక్షిస్తున్నాడు.
  • స్వయానా మనస్సు, బుద్ధులకు కారకులైన చంద్ర, బుధులు శని (యముని) చేతిలో చిక్కి ఉన్నారు. 
  • వీరి వెనుకగా మిధునంలో నాశనానికి కారకుడైన ప్లూటో ఉన్నాడు. 
  • వీరితో కలసి కర్కాటకంలో మత్తుకు కారకుడైన నెప్ట్యూన్ ఉన్నాడు. 
  • కుంభంలో ఉన్న యురేనస్, చంద్రబుధుల మధ్యబిందువును విధ్వంసక దృష్టితో చూస్తున్నాడు. వీటిఫలితంగా మనోనాశయోగం ఏర్పడింది.
కార్ల్ రెంజ్ (12-12-1953)

  • తులాలగ్నంలో పుట్టిన ఈయన లగ్నంలోనే శనికుజులు కలసి ఉన్నారు.  
  • మత్తుకు కారకుడైన నెప్ట్యూన్ కుజునికి ఒక డిగ్రీ దూరంలో తులలోనే ఉన్నాడు. 
  • మరణకారకుడైన ప్లూటో సింహం ఒకటో డిగ్రీలో ఉంటూ లగ్నకుజుడిని ఖచ్చితమైన దృష్టితో చూస్తున్నాడు. 
  • శని ముందుకు పోకుండా కుజుడు అడ్డుపడుతున్నాడు.
  • ఆత్మ(మనో)నాశకయోగం ఏర్పడింది.
మూజీ (29-1-1954)

  • నీచచంద్ర, ఉచ్చశనుల మధ్యన కుజుడుంటూ విధ్వంసయోగాన్ని, మనోనాశయోగంగా మారుస్తున్నాడు. 
  • ఇక్కడకూడా శని ముందుకు పోకుండా కుజుడు అడ్డుపడుతున్నాడు. 
  • మత్తును కారకుడైన నెప్ట్యూన్ శనితో కలసి తులలోనే ఉన్నాడు.
  • మనోనాశయోగం ఏర్పడింది
ఈ జాతకాలలోని గ్రహయోగాల బలాబలాలను బట్టి వీరి ఆధ్యాత్మికస్థాయిలలో తేడాలున్నప్పటికీ, కెలామిటీ అనబడే మనోనాశాన్ని వీరు పొందినట్లుగా పై జాతకాలనుంచి కనిపిస్తున్నది. అవన్నీ వ్రాస్తే, వీరి అనుచరుల మధ్యలో అనవసరమైన వివాదాలు లేస్తాయి గనుక, ఆయా స్థాయీభేదాలను వివరించడం లేదు.
read more " విధ్వంసయోగం - మనోనాశయోగం "

13, జులై 2022, బుధవారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 6

'సరే. ఇవాళ UG  గారి పుట్టినరోజు కదా. ఆయన గురించి నీకు తెలిసిన విశేషాలు చెప్పు' అడిగాను.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు పోయాక, ఆమె భక్తులలో కొంతమంది UG గారి దగ్గరకు చేరారు. నెల్లూరు డాక్టరు గారు, వాళ్ళ అబ్బాయి వారిలో ఉన్నారు' అన్నాడు.

'అవునా? అదంతా మామూలే. సగటు మనుషులకు కావలసింది ఒక మానసికఆసరాయే గాని సత్యం కాదు. సత్యాన్వేషకులు అలా గురువులను మార్చరు. అది సరే, అమ్మగారి గురించి UG ఏమనేవారు?' అడిగాను.

'నాకు తెలీదు. బహుశా చంద్రశేఖర్ గారికి తెలిసుంటుంది' అన్నాడు.

'ఆయనతో నేను గతంలో మాట్లాడాను. నీకు పరిచయం ఉందా?' అడిగాను.

'ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడాను. ఆయన వీడియో మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఒకరి రెండు అటెండ్ అయ్యాను. ఒక విచిత్రాన్ని గమనించాను. మహనీయులు పోయాక వారితో ఉన్నవాళ్లు వేరే వాళ్ళ దగ్గరకు షిఫ్ట్ అవుతూ ఉంటారు. అమ్మగారు పోయాక భరద్వాజగారు జిల్లెళ్ళమూడి వదిలేశారు. అమ్మ భక్తులు చాలామంది అరుణాచలం చేరుకున్నారు. లేదా కొంతమంది UG గారిని ఆశ్రయించారు. రమణమహర్షి పోయాక ఆయన భక్తులందరూ అరుణాచలం వదిలి వెళ్లిపోయారు' అన్నాడు.

'కానీ చలం ఒక్కడే అక్కడ ఉండిపోయాడు' అన్నాను.

'చలమూ, సౌరిస్ గారూ UG కి చాలా ఆకర్షితులైనారు. UG నడుస్తుంటే సాక్షాత్తు శివుడే నడుస్తున్నాడని వాళ్ళు అనుకునేవారు' అన్నాడు.

'మరి వాళ్ళు UG గారినెందుకు అనుసరించలేదు? సౌరిస్ గారు కూడా తన మార్గంలో తాను నడిచారు గాని UG గారి మార్గంలో పోలేదు. UG గారు కూడా, ఇండియా వచ్చినప్పుడల్లా, చలాన్ని చూడటం కోసమని బెంగుళూరు నుంచి అరుణాచలం చాలాసార్లు వెళ్లేవారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు' అన్నాను.

'తలైయార్ ఖాన్ అనే ఆమె రమణమహర్షి భక్తురాలు. అరుణాచలం కొండ పక్కనే ఒక ఆశ్రమాన్ని కట్టించింది. ఆ డాబాపైకెక్కితే, అరుణాచలం కొండ ప్రక్కనే కనిపిస్తుంది. ఆ ఆశ్రమాన్ని UG కి ఇస్తానని, అక్కడ సెటిలవ్వమని తలైయార్ ఖాన్  UG గారిని అడిగింది.

దానికి UG, 'ఒక్కరోజులో ఈ ఆశ్రమాన్ని prostitution center గా మారుస్తాను' అన్నాడు. ఆ మాటతో తలైయార్ ఖాన్ నిర్ఘాంతపోయింది. UG ఆ ఆశ్రమాన్ని తీసుకోలేదు. తరువాత ఆమె అక్కడే చనిపోయింది. ప్రస్తుతం ఆమె సమాధి అక్కడే ఉంది' అన్నాడు వెంకట్.

'ఆయనెందుకలా అన్నారు?' అడిగాను.

'తెలీదు. ఆయన కొన్నిసార్లు అలా మాట్లాడేవారు' అన్నాడు.

'గురువులందరినీ ఆయన తెగ తిట్టేవారు కదా?' అన్నాను నేను.

'అవును. మామూలు మాటలు కాదు. బూతులు వాడేవాడు. అంతేకాదు ఆయన దగ్గరకు చాలామంది నాడీ జ్యోతిష్కులు వచ్చి ఆయన పూర్వజన్మలగురించి నాడీగ్రంధాలు చదివేవారు' అన్నాడు.

'అవును. విన్నాను. అందులో ఏమొచ్చేది?' అడిగాను.

'ఒకానొక జన్మలో UG గారు రామానుజాచార్యులవారి శిష్యుడని, ప్రస్తుతం ఈ జన్మలో ఈయనదగ్గరకొచ్చే ఇంకొకాయన శైవుడని, అప్పట్లో వైష్ణవులకూ శైవులకూ గొడవలొస్తే, వీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వాటిని చక్కదిద్దారని, అందుకే మళ్ళీ ఈ జన్మలో కలిశారని ఒక నాడీగ్రంధం చెప్పింది. ఎక్కువగా భువనేశ్వరీ అమ్మవారు ఆ నాడీ లోకి వచ్చి, UG గారి గురించి ' ఇతను నా బిడ్డ. ఇతని స్థితి చాలా గొప్పది' లాంటి మాటలు చెప్పేది' అన్నాడు.

'ఊ. బాగానే ఉంది' అన్నాను.

'శ్యామల అని ఒకామె ఉండేది. UG గారిని అనుసరించేది. UG గారు చనిపోకముందే ఆమె యాక్సిడెంట్ లో చనిపోయింది. 'శ్యామల ఎందుకలా చనిపోయింది?' అని UG చాలాసార్లు అడిగేవారు. తాను చనిపోబోయేముందు చంద్రశేఖర్ గారిని కూడా చాలాసార్లు ఇదేమాట అడిగారని అంటారు' అన్నాడు వెంకట్.

'అదేంటి? తన భార్య ఇండియా వెళ్లిపోతున్నా UG గారు అమెరికాలోనే ఉండిపోయారు. ఆమె పిచ్చెక్కి ఇండియాలో చనిపోయినా ఆయన యూరప్ లోనే ఉండిపోయారు. బాధకూడా పడలేదు. అలాంటివ్యక్తి, ఎవరో భక్తురాలు చనిపోతే  అంతగా ఎందుకు ఫీలయ్యారు? ఆఫ్ కోర్స్ భక్తురాలు అనే మాట ఆయనకు నచ్చదనుకో. మాటవరసకు మనం అలా అనుకోవాలి మరి' అడిగాను.

'తెలీదు. కానీ ఆయన యూరప్ లో ఉన్నపుడు ఒక రాత్రి ఒక యూదువనితతో పడక పంచుకున్నాడు. ఆ తర్వాత ఎందుకలా చేశానా అని చాలా మధన పడ్డాడు. అందుకే తన భార్యను అలా వదిలేసి ఉండవచ్చు' అన్నాడు.

నేను నవ్వాను. 'అదేంటి? దానికీ దీనికీ సంబంధం ఏంటి? ఎవరో యూదు అమ్మాయితో ఒక రాత్రి గడిపితే, భార్యను  వదిలేయాల్సిన పనేంటి? అది కరెక్ట్ కాదుకదా? అదే రూలైతే, ప్రపంచంలో అందరు మొగాళ్ళూ పెళ్లాలను వదిలేయాల్సి ఉంటుంది. చాలామంది పెళ్లాలు కూడా తమ మొగుళ్లను వదిలేయాల్సి ఉంటుంది' అడిగాను.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు.

'అంటే, ఆయనకు అర్ధం కాని విషయాలు కూడా చాలా ఉన్నాయనే కదా మీరు చెప్పినవాటి అర్ధం?' అన్నాను.

'కావచ్చు. ఆయన చనిపోబోయే ముందు ఒక తెల్లని బట్టలలో ఉన్న దేవత ఆయనకు కనిపించి, 'నీకు ఆయుస్సు ఇంకా కావాలా? ఇంకా కొన్నాళ్ళుంటావా? పెంచమంటే చెప్పు పెంచుతాను' అందట. దానికి UG 'వద్దు. నాకు ఉండాలని లేదు' అన్నాడట' చెప్పాడు వెంకట్.

'ఇది నేను వినలేదు. మరి వెంటనే UG చనిపోతే, ఈ విషయం బయటకెలా తెలిసింది? మూడోవ్యక్తి ఎవరు విన్నారు? ఎవరు చెప్పారు?' అడిగాను.

'అంటే, వెంటనే UG చనిపోలేదు. ఇంకా కొన్ని రోజులలో పోతాడనగా ఈ సంఘటన జరిగింది. ఆయనే ఈ విషయం చెప్పాట్ట' అన్నాడు.

'నేను విన్నదేమంటే, ఆయన బాత్రూం లో బక్కెట్టు లేపబోతూ కాలుజారి పడ్డాడు. కాలు ఫ్రాక్చర్ అయింది. అలా జరగడం అది రెండోసారి. ఆ తరువాత ఆయన తిండి తినడం మానేశాడు. చావును ఆహ్వానించాడు. వారానికో రెండు వారాలకో పోయాడు. ఈ మధ్యలో ఈ దేవత కనిపించిందా?' అడిగాను.

'ఏమో మరి. కానీ ఆయన సమక్షంలో చాలా మహాత్యాలు జరిగాయి. UG గారు కొన్ని కేన్సర్ కేసులను కూడా తగ్గించారు. కేన్సర్ తో బాధపడుతున్న ఒక వ్యక్తి తలమీద చెయ్యిపెట్టి ఒక అరగంటో ఏమో ఉన్నాడాయన. అతని కేన్సర్ మాయమైంది. కానీ అందరికీ ఆయనలా చెయ్యలేదు' అన్నాడు.

'ఎందుకని?' అడిగాను.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు.

'ఇటలీలో కదా ఆయన పోయింది?' అడిగాను.

'అవును'

'మహేష్ భట్ ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఆయన అంత్యక్రియలు చేసింది మహేషే' అన్నాను.

ఇదంతా వింటున్న మా అమ్మాయి ఇలా అంది 'UG గారి ఫోటో పెట్టి, నిన్న పూజా భట్ మెసేజ్ పెట్టింది నాన్నా, 'The father my father never had' అని. 

'అవును. వాళ్ళ ఫేమిలీకి UG గారంటే చాలా భక్తి' అన్నాను.

'UG గారంటే మహేష్ భట్ కి చాలా భక్తి. UG గారు కూడా మహేష్ భట్ తో చాలా చనువుగా ఉండేవారు. UG గారు ఎక్కడుంటే అక్కడకు ఆత్మలు వచ్చి ఆయనకు కనిపిస్తూ ఉండేవి. త్రాచుపాములు కూడా ఆయనెక్కడుంటే అక్కడకు వచ్చేవి. ఒకసారి UG ఏదో విషయంలో చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు జిడ్డు కృష్ణమూర్తి యాస్ట్రల్ ట్రావెల్లో వచ్చి UG కి కనిపించి Cool down Old man అని అన్నట్లుగా జరుగుతుంది. అది చూచి UG కి మరీ కోపం వచ్చి ఆ రోజంతా జిడ్డుని తిడుతూనే ఉన్నాట్ట' అన్నాడు వెంకట్.

'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా 'వాడిని ఇక్కడకు తీసుకురండి ఒకసారి' అన్నారట. చంద్రశేఖర్ గారూ, శ్రీపాద గారూ ప్రయత్నం చేశారట కూడా. కానీ UG జిల్లెళ్ళమూడికి రాలేదు'  అన్నా నేను.

'గురువులందరినీ జిడ్డు తిడుతున్నాడని ఎవరో అమ్మతో అంటే, 'జిడ్డును పోగొట్టడానికి ఉప్పొస్తుందిలే' అందిట. UG ఇంటిపేరు ఉప్పులూరు కదా ! తరువాత కొంతకాలానికి UG వచ్చి జిడ్డును తిట్టడం మొదలుపెట్టాడు' అన్నాడు.

నేను మౌనంగా ఉన్నాను. 

'జిడ్డును ఉప్పు పోగొట్టింది. మరి ఉప్పు ఘాటును తగ్గించడానికి ఇంకెవరు రావాలో?' అని మనసులో అనుకున్నా.

'తనకు కలిగిన కెలామిటీ కూడా a-casual అని UG అనేవారు. ఇది ఎవరికైనా కలగవచ్చు అని కూడా ఆయన అనేవారు. అలాగే, Karl Renz అనే ఆయనకీ కూడా ఈ కెలామిటీ కలిగింది. ఆయనక్కూడా చీకట్లో ఉన్నపుడు చర్మం కాంతితో వెలగడం, ఒంటినుండి బూడిద రాలడం మొదలైన విచిత్రాలు జరిగేవి. UG గారికి కూడా ఇవి జరిగేవి. 'నాలో ఆలోచన పుట్టీపుట్టగానే నాశనమైపోతుంది. అలా నాశనమైన ఆలోచన ఒంటిమీద బూడిదగా రాలుతుంది' అని UG దానికి వివరణనిచ్చేవారు' అన్నాడు వెంకట్.

'అవును. ఇంతకీ ఈ Karl Renz అనే ఆయన ఉన్నాడా ఇప్పుడు' అడిగాను.

'ఉన్నాడు. ఏడాదికి ఆర్నెల్లు అరుణాచలంలో ఉంటాడు. మిగతా ఆర్నెల్లు విదేశాలలో ఉంటాడు. ఆయన మీటింగ్స్ అరుణాచలంలో పెట్టినపుడు ఫ్రీగా అందరినీ రానిస్తాడు. బయటైతే టికెట్ ఉంటుంది. యూట్యూబ్ లో ఆయన ప్రసంగాలున్నాయి' అన్నాడు వెంకట్.

'టిక్కెట్టా? ఆ ఖర్మేంటి? సరేలే ఆయనిష్టం ఆయనది. ఆయనకూడా బ్రతకాలిగా మరి ! వేరే ఆదాయం లేదేమో?' అన్నాను.

కాసేపాగి, UG గారికి అసలేం జరిగిందో, Calamity అనేది ఎందుకొస్తుందో, ఆయనెందుకలా విచిత్రంగా ప్రవర్తించేవాడో, అసలు సాధనామార్గంలో ఉన్నవారికి ఎందుకలా జరుగుతుందో వెంకట్ కు వివరించాను. ఈ వివరాలు యోగరహస్యాలు, ఇవి అందరికీ చెప్పేవి కానందున ఇక్కడ  వ్రాయడం లేదు.

ఆ తరువాత, 'శ్రీవిద్యారహస్యం' 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' అనే రెండు పుస్తకాలు తనకు గిఫ్ట్ గా ఇచ్చి, 'చదువు. డౌట్లుంటే అడుగు. ఇక బయల్దేరు' అని సాగనంపాను.

(అయిపోయింది)

read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 6 "

12, జులై 2022, మంగళవారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 5

ఈలోపల భోజన సమయమైంది గనుక తనను కూడా భోజనానికి ఆహ్వానించాము. భోజనం అయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా, 

'ఇంకొక్క డౌటు' అన్నాడు వెంకట్

'నీదే ఆలస్యం' అన్నాను.

'శ్రీవిద్యోపాసనలో బాల, లలిత, త్రిపుర, బగళ మొదలైన అంతమంది అమ్మవార్లెందుకు? శ్రీవిద్యలో ఒకదాని తర్వాత మరొక ఉపదేశం అంటూ మంత్రోపదేశాలు ఉంటాయి కదా? ఇన్ని ఉపదేశాలెందుకు? సిద్ధిని ఒక్క అమ్మవారు ఇవ్వలేదా?' అడిగాడు.

'ఈ సందేహం నీకెందుకొచ్చింది?' అడిగాను.

'నాకొక ఫ్రెండున్నాడు. అతను డాన్సర్. అతను శ్రీవిద్యోపాసకుడు. ఒకసారి బాల, ఒకసారి లలిత ఇలా ఉపాసన చేస్తున్నానంటాడు. ఎందుకలా?' అన్నాడు.

'అతన్నే అడక్కపోయావా ఎందుకిలా చేస్తున్నావని?' అన్నాను.

'అడిగాను. ఒక్కొక్క అమ్మవారి రూపం ఒక్కొక్క రసాన్ని వ్యక్తీకరిస్తుంది. శాంతరసం, రౌద్రరసం ఇలా డాన్స్ లో ఉంటాయి కదా ! ఆయా రసాలను సిద్ధింపజేసుకోవడం కోసం ఆయా దేవతల ఉపాసనలను చేస్తున్నానని అతను చెప్పాడు, ఇంకా, అమ్మవారు తనతో మాట్లాడుతుందని కూడా చెబుతాడు' అన్నాడు వెంకట్.

'ఎలా మాట్లాడుతుంది? కనిపించి మాట్లాడుతుందా?' అడిగాను.

'లేదు. ఎప్పుడైనా ఒక్కోసారి, 'ఇది చెయ్యి ఇది చెయ్యకు' అన్నట్లుగా చెబుతుందిట' అన్నాడు. 

నవ్వాను.

'అది అతని భ్రమ. అతని మనసే అలా చెబుతుంది. నిజంగా అమ్మవారు ఆ విధంగా మాట్లాడాలంటే అతని మనస్సు ఎంతో శుద్ధత్వాన్ని సంతరించుకుని ఉండాలి. అంతటి శుద్ధత్వం అతనికి కలిగితే, డాన్స్ జోలికి పోడు. డాన్స్ కోసం ఉపాసన చెయ్యడు. నూటికి తొంభై తొమ్మిది మంది ఇలాంటి భ్రమలలోనే ఉంటారు. అవి నిజాలు కావు' అన్నాను.

ఇంకా కొనసాగిస్తూ, 'విను. అసలైన శ్రీవిద్య అది కాదు. సాధకులతో గాని, గురువులతో గాని వచ్చిన చిక్కే ఇది. అసలు ఉపాసనను ఎవరైనా ఎందుకు చేస్తారు? ఏదో లౌకిక ప్రయోజనం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక ప్రయోజనమైన మోక్షం కావచ్చు. అంతేకదా ! లౌకిక ప్రయోజనాలకోసం దేవతా ఉపాసనను చేయడం క్షుద్రం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు, చక్రవర్తి దర్బారుకు పోయి, కేజీ వంకాయలు కావాలని కోరుకున్నట్లుగా ఇది ఉంటుంది. మోక్షం కోసం ఉపాసనను చేయడం ఉత్తమం.  కానీ లోకంలో ఉత్తములెందరున్నారు. లేరు. అందరూ క్షుద్రులే. అంటే, ఏవో వరాలను ఆశించి దైవాన్ని ప్రార్ధించేవారే. క్షుద్రపూజ అంటే చేతబడి కాదు. ఒక లౌకిక ప్రయోజనాన్ని ఆశించి నువ్వు పూజించావంటే అది క్షుద్రపూజే. ఒక్క మోక్షాన్ని మాత్రమే నువ్వు కోరుకుంటే అది శుద్ధమైన పూజ. సరే, అది వారి ఖర్మ. ఆ సంగతలా ఉంచు.

శ్రీవిద్యలో కూడా, ప్రయోజనాలను ఆశించి రకరకాల అమ్మవార్ల ఉపాసనలు చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు.  అలాంటివాళ్ళు నువ్వు చెప్పిన విధంగా భ్రమపడుతూ ఉంటారు. ఏ అమ్మవారైనా లౌకికమూ, మోక్షమూ రెండూ ఇవ్వగలదు. ఉదాహరణకు, బాల అనే అమ్మవారు ఉపాసనలో ప్రాధమికదేవత అని కొంతమంది భావిస్తారు. అది చిన్నపిల్ల వంటి స్థితి అని అంటారు.  కానీ బాలా ఉపాసనతో ముక్తిని పొందినవారు ఎందరో ఉన్నారు. బాలా ఉపాసనయే అత్యుత్తమమైనదని, అది అన్నింటినీ ఇవ్వగలదని భావించేవారు కూడా ఎందరో ఉన్నారు. ఇది సత్యం కూడా. నువ్వు పట్టుకోగలిగితే ఒక్క అమ్మవారు చాలు. అన్నీ సిద్ధిస్తాయి.

అసలు, 'ఇవ్వడం' 'తీసుకోవడం' అంటూ నువ్వు ఆలోచిస్తూ. లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ఉన్నంతవరకూ, నీ సాధన పూర్తిగా నిమ్నస్థాయిలోనూ, తప్పుదారిలోనూ ఉన్నట్లు లెక్క. కావలసింది ఆ అమ్మవార్లేదో ఇవ్వడమూ నువ్వు తీసుకోవడమూ కాదు. నువ్వు అయిపోవాలి. 'నువ్వే అది' అని అనుభవంలో నువ్వు గ్రహించాలి. నిజానికి ఈ రూపాలన్నీ వేర్వేరు కావు. ఒకే శక్తికి ఇవన్నీ వివిధ రూపాలు. ఆ శక్తివి నువ్వే. అంతే. అయితే ఊరకే మాటలు చెబితే సరిపోదు. ఆ అనుభవం నీకు కలగాలి.

బాలలో రౌద్రం కూడా ఉంది. కాళిలో శాంతమూ ఉంది. నువ్వు చూచే రీతిని బట్టి నీకు కనిపిస్తుంది. బాలే కాళిగా మారుతుంది. ఆమె ఏ రూపాన్నైనా ధరించగలదు. సృష్టి స్థితి సంహారములు చేసే శక్తికి సాధ్యం కానిదేమున్నది?

ఉదాహరణకు, ఈ చిన్న కిటికీ లోనుంచి మన ఇంట్లోకి వెలుతురు వస్తున్నది. ఆ వెలుగును బాల అనుకో. ఆ పెద్ద తలుపులోనుంచి కూడా వెలుగు వస్తున్నది. అది లలిత అనుకో. ఈ వెనుక ఉన్న నల్లని అద్దంలో నుండి కూడా వెలుగు పడుతున్నది. అది కాళి అనుకో. ఏదైనా ఒకే వెలుగు. ఆ వెలుగు అనేకరూపాలలో అనేక కాంతులలో నీదాకా వస్తున్నది. కానీ దానిని నీవు చూచే తీరు వేరుగా ఉంటుంది. దానిని నీవు వాడుకోవడమా, లేక, దానిననుసరించి కిటికీలోనుంచి గాని, తలుపులోనుంచి గాని, మొత్తం మీద నీవు బయటకు పోయి, బయటనున్న ఆ అనంతమైన వెలుగులో నీవు లీనం కావడమా అనేదానిని బట్టి అంతా ఉంటుంది. ఆ వెలుగునే బ్రహ్మమని, శివుడని, నారాయణుడని రకరకాల పేర్లతో పిలుస్తారు. నువ్వు చెయ్యవలసింది ఆ వెలుగులోకి వెళ్లడం, అంతేగాని ఆ వెలుగును వాడుకుని ఇదే ఇంట్లో కూచుని ఏవేవో పనులు చేసుకుందామని  నువ్వు అనుకుంటే అది నీ అల్పత్వం మాత్రమే. నువ్వు ఈ ఇంటిని వదలి బైటకు అడుగుపెట్టాలి.  ఆ వెలుగులో నువ్వు కరగిపోవాలి. దానికి దారిని చిన్న కిటికీ  అయినా,పెద్ద కిటికీ అయినా, చిన్న సందైనా, లేక తలుపైనా, తలుపుసందైనా, ఏదైనా చూపగలదు. దానిని ఆసరాగా తీసుకుని నువ్వు బయటకు వెలుగులోకి పోవాలి. ఏ దేవతతో మొదలుపెట్టినా, దాని ఆసరాతో అనంతమైన బ్రహ్మంలోకి నీవు అడుగుపెట్టాలి. ఈ విధంగా చూస్తే ఏ దేవతైనా ఒకటే.  దేవతలలో చిన్నా పెద్దా ఏమీ లేవు.

అందుకనే, 'మంత్రమంటే ఏమిటో తెలిస్తే అన్ని మంత్రాలూ ఒకటేనని తెలుస్తుంది' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనేవారు. 'అన్ని మంత్రాలూ ఒకటే ఎలా అవుతాయి?' అంటూ ఆమెను విమర్శించినవాళ్ళు ఆ రోజులలో చాలామంది ఉన్నారు.

చిల్లర ప్రయోజనాలను ఆశించేవారు మాత్రమే దేవతలలో, మంత్రాలలో భేదాలను చూస్తారు. ఈ దేవత ఎక్కువ, ఈ దేవత తక్కువ, మా దేవుడు ఎక్కువ, మీ దేవుడు తక్కువ అంటూ గొడవపడేది ఇలాంటి చిల్లరనుషులే. వీళ్లంతా అసలు విషయం తెలియని అజ్ఞానులు.

శ్రీవిద్యలో మెట్లున్నాయి. రకరకాల మంత్రాలున్నాయి. నిజమే. అయితే ఆ మెట్లను దాటడమంటే ఏమిటి? ఆ మంత్రాలను ఉపాసించడమంటే ఏమిటి? ఆయా శక్తులను నీలో ఆవిష్కరింపజేసుకోవడమే. నాకు తెలిసిన కొందరు శ్రీవిద్యోపాసకులున్నారు. గురువులున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? కరోనా టైంలో స్కూల్లో పరీక్షలు పెట్టకుండానే పాస్ చేసినట్లు, మూడునెలలకొక మంత్రం ఇచ్చేసి జపించమంటున్నారు. దానికొక ఫీజు. ఆ యంత్రాలు అమ్ముకోవడం. ఆరు నెలల తర్వాత ఇంకో మంత్రం. మళ్ళీ డబ్బులు. ఏడాది తర్వాత ఇంకో మంత్రం. మళ్ళీ డబ్బులు. ఇదొక బిజినెస్ అయిపోయింది. ఎంత తప్పో చూడు !  డబ్బుకోసం ఇంత నీచత్వానికి పాల్పడాలా !

ఆ శిష్యులు కూడా ఎలా ఉన్నారు? 'త్వరత్వరగా ఈ గురువు దగ్గరున్నదంతా పీల్చేసి మనం ఇంకో షాపు పెట్టుకుందాం. మనమూ మంత్రాలను అమ్ముకుంటూ సంపాదిద్దాం. గురువులుగా పాదపూజలు చేయించుకుందాం. జనాల్ని బకరాలను చేద్దాం' అని వాళ్ళనుకుంటున్నారు.

ఇదా శ్రీవిద్యంటే?

శ్రీవిద్యలోని మంత్రాలు సిద్ధించాలంటే ఎంతోకాలం పాటు వాటిని ఉపాసించాలి. అంతేకాదు. అవి సిద్ధించినదానికి రుజువులుగా నీకు కొన్ని నిదర్శనాలు కనిపిస్తాయి. నీ లోపలే మార్పులొస్తాయి. నీ వ్యక్తిత్వమే మారిపోతుంది. నువ్వే మారిపోతావు. అది జరగాలి. అది  జరగకుండా, 'నేను ఆర్నెల్లు బాలామంత్రం జపించాను. నాకు సిద్ధించింది. ఇక షాపు తెరిచి దానిని అమ్ముకుంటాను' అని నువ్వనుకుంటే నీకంటే దరిద్రుడు ఇంకెవడూ ఉండడు.

నా చిన్నప్పుడు ఇదే డౌటు నాకొచ్చింది, 'శ్రీవిద్యోపాసనలో ఇంతమంది అమ్మవార్లెందుకు? ఒక అమ్మ చాలు కదా?' అని. కొంతమంది గురువులను అడిగాను. కొందరేమో, 'నువ్వు చిన్నపిల్లవాడివి నీ వయసుకి నీకు చెప్పినా అర్ధం కాదు' అన్నారు. మరికొందరు ఇంకేదో చెప్పారు. అసలు విషయమేమంటే వాళ్ళకెవరికీ సమాధానం తెలియదు. కాలక్రమంలో నా సాధనే నాకు సమాధానాలిచ్చింది. అమ్మవారే దారి చూపించింది. బోధించింది. అన్నీ అర్ధమయ్యేలా చేసింది. 

ఈ శక్తులన్నీ నీలోని భాగాలే. నీలోని భాగాలను నీవు ఆవిష్కరించుకుంటూ, ఒక్కొక్కదానినీ తెలుసుకుంటూ, దాటుతూ, చివరకు నిన్ను నీవు తెలుసుకోవడమే అసలైన శ్రీవిద్య. కానీ ఈ శుద్ధమైన శ్రీవిద్యను చెప్పేవారు నాకు తెలిసి ప్రస్తుతం ఎవరూ లేరు. అందరూ చిల్లరకొట్లు పెట్టుకున్న చిట్టెమ్మలే' అన్నాను.

'అవును. కావ్యకంఠ గణపతిమునిగారు కూడా బాల, లలిత, త్రిపుర, మొదలైన దేవతలందరినీ మనలోని వివిధశక్తులనే చెప్పారు. నేనాయన సంస్కృతాన్ని బాగా అర్ధం చేసుకోలేకపోయాను. కానీ నాకర్ధమైనంతలో విషయం ఇదే ననిపించింది' అన్నాడు వెంకట్.

'అవును. 'ఉమాసహస్రం' చదువు అందులో ఆయన ఇదే చెప్పారు. ఆయనది శుద్ధోపాసన. అందులో వేదమూ, తంత్రమూ సమన్వయములౌతాయి. ఇప్పుడు నేను చెబుతున్నది కూడా అదే. ఈ మార్గంలో, బాహ్యోపాసన అంతరికోపాసనగా మారుతుంది.  అంటే,  నీ బయటా నీ లోపలా సమన్వయపరచబడుతుంది. బాహ్యంగా నువ్వు ఉపాసిస్తున్న అమ్మవార్లందరూ నీలోని శక్తులేనని అంతిమంగా నీకు అనుభవపూర్వకంగా అర్ధమౌతుంది. అందుకే 'శ్రీవిద్యారహస్యం' పుస్తకానికి 'శుద్ధోపాసనా వివరము' అని సబ్ టైటిల్ పెట్టాను. అర్థమైందా?' అడిగాను.

'అర్ధమైంది' అన్నాడు.

(ఇంకా ఉంది)

read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 5 "

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 4

'ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు' అన్నాను.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' పెట్టాలని మీకెందుకనిపించింది?' అడిగాడు.

'నా చిన్నప్పటినుంచీ నేను సాధనామార్గంలో నడిచాను. అనేక మార్గాల సాధనలు, ఉపాసనలు నేను చేశాను. ఒక ఉదాహరణ విను. నాకు పన్నెండేళ్ల వయసులో 'కాలభైరవ సాధన' చేశాను. ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటాను ఆతర్వాత ఏమేం చేశానో అర్ధం చేసుకోడానికి. తరువాత నలభైఎనిమిదేళ్లలో వందలాది ప్రాచీనగ్రంధాలను అధ్యయనం చేశాను. నా జీవితంలో మొదటినుంచీ ఇప్పటివరకూ నన్ను వదలకుండా ఉన్నది అధ్యయనం, సాధనలు మాత్రమే. మధ్యలో ఎన్నో విద్యలు నా దగ్గరకు వచ్చాయి. అవన్నీ ఒక ప్రక్కన ఉంటాయి. అంతే. ముఖ్యమైనది సాధన ఒక్కటే.

ఈ సుదీర్ఘప్రయాణంలో, సాధనామార్గమంటే ఏమిటో, రకరకాల మతాలు, ఆయా సాధనావిధానాలు ఏమి చెబుతున్నాయో, భగవంతునివైపు మనిషి చేసే ప్రస్థానంలో వాటి స్థానాలు ఏమిటో, వాటి విలువలు ఏమిటో, ఏది ఎంతవరకు పనికొస్తుందో, ఏవి అసలో, ఏవి నకిలీలో, ప్రపంచం ఎటు పోతున్నది, ప్రజలు ఎటు పోతున్నారు, గురువులెలా ఉన్నారు, వారి అనుభవాలేమిటి? వారి స్థాయీభేదాలేమిటి? విశ్వమనే ఈ ప్రణాళికలో దేనిస్థానం ఏమిటి? -  ఈ మొత్తం విషయమంతా నాకర్ధమైంది.

ఆ అవగాహనను పునాదిగా చేసుకుని, నా జీవనగమనంలో చుట్టూ చూస్తుంటే, అందరూ తప్పు తప్పు దారులలో నడుస్తున్నారని కూడా నాకర్ధమైంది. మతాల డొల్ల ఆచరణలలో ఉన్న ఎక్కువమంది అసలు దారిలోనే లేరు. ఉన్నకొంతమంది కూడా తప్పుదారులలో ఉన్నారు. వారిలో దురహంకారులకు మనం చెప్పినా ప్రయోజనం లేదు. వినరు. తలబొప్పికట్టి, గుంటలో పడితేనే వాళ్లకు అర్ధమౌతుంది. అంతకు ముందు, ఎవరు చెప్పినా వారు వినరు. బహుశా అప్పుడుకూడా వారికి అర్ధం కాకపోవచ్చు. ఇక మిగిలిన కొద్దిమంది మంచివాళ్ళు. నిజాయితీపరులు. నిస్వార్ధపరులు. కనీసం వారికైనా, వారి వెదుకులాటను తగ్గిద్దామని, అసలైన దారిని వారికి చూపుదామని అనుకున్నాను.

నా చిన్నప్పటినుంచీ నేనెంతో వెదికాను. లోపలా బయటా ఎంతో సంఘర్షణకు గురయ్యాను. వెదుకగా వెదుకగా చివరకు విషయమంతా నాకర్ధమైంది. నాలాగా వెదుకుతున్న వారికి, అయోమయంలో ఉన్నవారికి, దొంగగురువుల చేతులలో మోసపోతున్న మంచివారికి,  సాయం చేద్దామని అనుకున్నాను. అందుకే 'పంచవటి' మొదలుపెట్టాను.

అయితే, ఏనాడూ నేను బయటపడి 'నేనింత చేశాను, నాకింత తెలుసు' అని చెప్పుకోలేదు. లో ప్రొఫైల్లోనే ఉన్నాను. కనీసం నా స్నేహితులకు, మా బంధువులకు కూడా నేనేంటో తెలియదు. ముప్పై ఎనిమిదేళ్లపాటు ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్న నేను, గత పదేళ్లనుంచీ మాత్రమే  బయటపడుతూ, నా సర్కిల్ లోకి వచ్చిన వారికి సరియైన దారిని చూపిస్తూ, వారిని చక్కదిద్దుతూ, వారికి బోథిస్తూ వచ్చాను. వినేవారు  విన్నారు. విననివారు వినలేదు. కొందరు నాతో మమేకమైపోయారు, కొందరు కొన్నాళ్ళు  ఉండి వెళ్లిపోయారు.

చాలామంది నన్నుచూసి అసూయపడ్డారు, కొంతమంది భయపడ్డారు. మరికొంతమంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది వారివారి స్వార్ధాలకోసం నన్ను వాడుకోవాలని చూశారు. మరికొంత మంది నా దగ్గరున్న సమాచారాన్ని, విద్యలను ఆశించారు. అన్నీ నాకు తెలుసు. కానీ ఎవరినీ నేను లెక్కచేయలేదు. ఎవరినీ కాదనలేదు. నాతో నడుస్తామంటే సరేనన్నాను. విడిపోతామంటే సరేనన్నాను. 'నువ్వే మా ప్రాణం' అంటే సరేనన్నాను. 'నువ్వు మాకు నచ్చలేదు' అంటే సరేనన్నాను. 'నువ్వు మోసగాడివి' అంటే సరేనన్నాను. 'మేము చూసినవారందరిలోకీ నువ్వు ఉత్తముడివి' అంటే సరేనన్నాను. అవన్నీ వారివారి అవగాహనలు. వారికి అర్ధమైనట్లు వారు అర్ధం చేసుకున్నారు. నేనెందుకు కాదనాలి? 

నాదారిలో నేను నడుస్తున్నాను. నాతో నడిచేవారిని నడిపిస్తున్నాను. మిగిలినవారిని పట్టించుకోను. ముందుముందు కూడా ఇదే చేస్తాను.

లోకాన్ని ఉద్దరించాలని నాకేమీ పెద్దపెద్ద ఆశయాలు లేవు. లోకం కుక్కతోక అని నాకు బాగా తెలుసు. ఇదెప్పటికీ సూటిగా, వంకర  లేకుండా, పరిపూర్ణంగా మారదు. అలా మారితే అది లోకమే అవదు. మనుషులందరినీ ఏకమొత్తంగా భగవంతుని సన్నిధికి నడిపించడం ఎవరికీ సాధ్యం కాలేదు. కాదు కూడా ! చెప్పాను కదా  ! నాతో నడిచేవారిని మాత్రమే నేను నడిపిస్తాను. నా పరిధిలో నా భావాలను ప్రచారం చేస్తాను. అంతకంటే ఎక్కువ ప్రయత్నం చెయ్యను.

అయితే, ఇప్పుడు మన పరిధి చాలా విస్తృతమై పోయింది. ఇంట్లో కూచుని భూగోళం అవతల ఉన్నవారిని మనం ప్రభావితం చెయ్యవచ్చు. నా భావజాలం నచ్చితే దూరంతో పనిలేకుండా నన్ను అనుసరించేవారు వేలల్లో ఉన్నారు. నేను నడిచిన మార్గంలో వాళ్ళను కూడా నడిపిస్తాను. పరిపూర్ణతకు వారిని చేరుస్తాను, ఇందుకే 'పంచవటి' మొదలుపెట్టాను' అన్నాను.

ఇంకో ప్రశ్న.

'శ్రీ రామకృష్ణులు ఒక కధ చెప్పారు కదా ! ఒక చెరువు దగ్గర ప్రజలందరూ బహిర్భూమిగా వాడుతుంటే, ఎంతమంది చెప్పినా వినకపోతుంటే, చివరకు రాజుగారు అక్కడ బోర్డు పెట్టించారని, అప్పుడు మాత్రమే ప్రజలు విన్నారని. 'భగవంతుని ఆజ్ఞ లేనిదే లోకానికి బోధించలేరు'. అని ఆయన అన్నారు. అలా బోధించడానికి మీకు కూడా భగవంతుడి ఆజ్ఞ వచ్చిందా? ఆ ఆజ్ఞానుసారం పంచవటి పెట్టారా? అనేది నా సందేహం' అడిగాడు వెంకట్.

నవ్వాను.

'అదేమీ లేదు. నువ్వనుకుంటున్న రీతిలో సినిమాల్లోలాగా నాకే దేవుడూ ఒక రూపంలో కనిపించి చెప్పలేదు. భగవదాజ్ఞ అనేక రూపాలలో రావచ్చు. శుద్ధమైన మనస్సులో ఉదయించే నిస్వార్ధ సంకల్పం కూడా భగవదాజ్ఞయే. అది కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఆ విధంగా నాకనిపించి నేను పంచవటిని మొదలుపెట్టాను గాని, నాకేమీ దేవుడు ప్రత్యక్షమై 'నువ్వు లోకానికి బోధించు' అని చెప్పలేదు. కాలక్రమేణా నా సంకల్పం సత్యమైనదే అని రుజువైంది కదా. ఈనాడు ఎంతోమందిని అసలైన సాధనామార్గంలో భగవంతుని వైపుగా నడిపించగలుగుతున్నాను. నాకు భగవత్శక్తి తోడుగా ఉందనడానికి ఇంకేం కావాలి ఋజువు?' అన్నాను.

(ఇంకా ఉంది)

read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 4 "

11, జులై 2022, సోమవారం

నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను

ఈ రోజున ఒక మెయిలొచ్చింది.

'నా పేరు ఫలానా. నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను' అన్నది దాని సారాంశం.

నాకర్ధం కాలేదు.

'సారీ మాది అనాధాశ్రమం కాదు' అని తిరిగి మెయిలిచ్చాను.

ఈసారి సుదీర్ఘమైన మెయిలొచ్చింది. ఆయనకు కోపం వచ్చిందని అర్థమౌతోంది.

'మీకెలా కనిపిస్తున్నాను? నేను స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసి ఈ మధ్యనే రిటైరయ్యాను. పదేళ్లనుంచీ మీ బ్లాగు ఫాలో అవుతున్నాను. నాకు డొంకతిరుగుడు నచ్చదు. మీరంటే నాకు నమ్మకం కలగలేదు. మీరు మధ్య మధ్యలో రాసే కామెడీ పోస్టులే దానికి కారణం. నిజంగా ఆధ్యాత్మికం ఉంటే అలాంటి కామెడీ చెయ్యరని నా నమ్మకం. ఆధ్యాత్మికమంటే సీరియస్ వ్యవహారం. కామెడీ కాదు.

పైగా, మీకు ఆశ్రమం లేదు. అందుకే మిమ్మల్ని నేనిన్నాళ్ళూ నమ్మలేకపోయాను. ఇప్పుడు మీరు ఆశ్రమం పెట్టారు. అందుకే కొద్దిగా మీరంటే నమ్మకం కుదిరింది. మా ఆవిడ రెండేళ్ల క్రితం గతించింది. పిల్లలు సెటిలయ్యారు.  అందుకే ఇప్పుడు మీ ఆశ్రమంలో వచ్చి ఉందామనుకుంటున్నాను, ఎంత కట్టాలి? వగైరా గైడ్ లైన్స్ చెబుతారా?' అంటూ మెయిల్ ఇచ్చాడు.

నవ్వొచ్చింది. ఆయనకిలా మెయిలిచ్చాను.

గైడ్ లైన్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. వినండి.

1. పిచ్చోళ్లకు మా ఆశ్రమంలో చోటు లేదు. అందుకని, 'నేను పిచ్చోడ్ని కాను' అని ఒక రాగిరేకును మీ మెడలో కట్టుకోవాలి. ఆర్నెల్లకోసారి డాక్టర్ చేత దానిని సర్టిఫై చేయించి మాకు చూపిస్తూ ఉండాలి.

2. ఇది వృద్ధాశ్రమం కాదు. మీకస్సలు ప్రవేశం లేదు. వయసులోనూ మనసులోనూ వృద్ధులను మా ఆశ్రమంలో అనుమతించం. కానీ ఆ రూలు మాకు వర్తించదు.

3. మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడికొచ్చి ఉండటానికి అస్సలు కుదరదు. ఎందుకంటే, మా లైఫ్ స్టైల్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు. మా లైఫులో స్టైలే ఉండదు.

4. ఇప్పుడు ముఖ్యమైన గైడ్ లైన్ వినండి. ఎంత కట్టాలి? అని అడిగారు కదా. మేము చిన్నచిన్న ఎమౌంట్స్ తీసుకోము, మీ ఆస్తి మొత్తం మా ఆశ్రమానికి రాయాలి. ఆ తరువాత, మాకిష్టమైతే మీకింత ముద్ద పెడతాం. లేదంటే మాతోబాటు పస్తు ఉంచుతాం. మీరు నోరెత్తకూడదు. ఎత్తినా జవాబు ఉండదు.

5. ఒకసారి మీ ఆస్తి మొత్తం మాకు రాసిచ్చాక, మీ వారసులకు నచ్చక, ఏవైనా లీగల్ మేటర్స్ ఉంటే, అన్నీ జెనీవా కోర్టులోనే తేల్చుకుంటాం. ఇండియా కోర్టులంటే మాకు నమ్మకం లేదు.

6. ఉన్నట్టుండి మా ఆశ్రమంలో అందరమూ కనపడకుండా పోవచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తామో, అసలొస్తామో లేదో ఎవరికీ చెప్పం. అప్పటిదాకా ఆ అడవిలో మీరొక్కరే ఉండవలసి వస్తుంది. దిక్కూ దివాణం ఉండదు.

7. ఆశ్రమంలో ఎన్నాళ్ళున్నా బోధనలేమీ ఉండవు. పైగా మధ్యమధ్యలో పిలిచి 'ఏం నేర్చుకుంటున్నావ్?' అని పరీక్షలు పెడుతూ ఉంటాం. ఫెయిలయితే పనిష్మెంట్ ఉంటుంది.

8. నాతో ఎవరేది మాట్లాడినా దానిని బ్లాగులో రాసేస్తాను. అది నా అలవాటు. ఇప్పుడు మీ మెయిల్ని కూడా రాయబోతున్నాను. మీరు హర్టయితే నాకు  సంబంధం లేదు.

ఇన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మీకు నచ్చితే చేరవచ్చు. ఇందులో కామెడీ ఏమీ లేదు. చాలా సీరియస్' అని మెయిలిచ్చాను.

ఇంకా రిప్లై రాలేదు. 

I am still waiting...
read more " నేను మీ ఆశ్రమంలో చేరాలనుకుంటున్నాను "

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 3

'నీ సమస్య నాకర్ధమైంది. చెప్తా, జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ విను' అని చెప్పడం మొదలుపెట్టా.

మన వేదాంతతత్త్వంలో, విధివాదము, కర్మవాదము అని రెండు వాదాలున్నాయి. అందులో విధివాదాన్ని నువ్వు చెప్పావు.  అంటే - 'ముందే అంతా నిర్ణయించబడి ఉంటుంది, ఇక్కడ నీ పాత్ర ఏమీ లేదు, నీ జీవితంలో కూడా నీ పాత్ర ఏమీ లేదు', అని.

రెండవది కర్మవాదం. దీనిప్రకారం, 'నువ్వు చేసినదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు చేసుకున్నదే నువ్వు అనుభవిస్తావు. అది ఈ జన్మలో రావచ్చు. లేదా మరుజన్మలో రావచ్చు' ఇది కర్మవాదం.

ఈ రెండూ ఒకదానికొకటి పరస్పర విరుద్ధములైన సిద్ధాంతాలుగా కనిపిస్తాయి. ఒకటి నిజమైతే మరొకటి నిజం కాదని అనిపిస్తుంది' అన్నాను.

నన్ను మధ్యలో ఆపుతూ, 'జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా, 'అంతా వాడు చేయిస్తున్నాడనైనా అనుకో, లేదా అంతా నువ్వే చేస్తున్నావనైనా అనుకో' అన్నారు కదా' అన్నాడు వెంకట్.

'అవును. అన్నారు. అదేంటో చెప్తా విను. అంతా వాడు చేస్తున్నాడనో, చేయిస్తున్నాడనో అనుకున్నపుడు నీ 'అహం' నాశనమౌతుంది. ఎందుకంటే నీ పాత్ర ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడలా అనుకోవడానికి అడ్డుపడుతూ, ఇబ్బందిపడుతోంది నీ అహమే.  అలాకాకుండా, 'అంతా నేనే చేస్తున్నాను'  అనుకుంటే, అప్పుడు నీ పనులకు బాధ్యత నీదే. నువ్వు పడుతున్న బాధలకు వేరెవరూ కారకులు కారు. నువ్వే కారకుడివి.  కాబట్టి అప్పుడూ నీకు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇంకెవరినీ నిందించవలసిన పని కూడా లేదు.

మొదటిదాంట్లో నీ అహమే అదృశ్యమౌతుంది. రెండో దాంట్లో నీ బాధ అదృశ్యమౌతుంది. బాధకికూడా అహమే కదా కారణం ! ఎలా చూచినా, నీ జీవితం ఎలాంటి బాధా లేకుండా సాఫీగా సాగుతుంది. అందుకని అమ్మ అలా చెప్పారు. కానీ అందరూ ఆమె మాటలని కోట్ చేసేవారేగాని ఆచరించేవారేరీ? ఇతరులకి చెప్పడం తేలిక, మనం ఆచరించడం కష్టం కదా !

ఈ రెండూ కాకుండా ఇంకొక సిద్దాంతం కూడా ఉంది. అదేంటో చెప్తా విను.

సృష్టి pre determined కాదు. దీనికి స్క్రిప్ట్ రైటర్ అంటూ ఎవడూ లేడు. నువ్వే ఆ రైటర్ వి. ఈ క్షణానికి ఇలా జరుగుతుంది.  అంతే, ర్యాండమ్ గా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీటికి ముందూ ఉండదు, వెనుకా ఉండదు. ఆ క్షణానికి వచ్చిన ఆలోచనను బట్టి ఆ ఈవెంట్ జరుగుతుంది. అంతే ! మిగతాదంతా నువ్వు అల్లుకునే కధ. దానిచుట్టూ నీ మనసు అల్లుకునే కధ. సృష్టిలో అంతా a-casual మాత్రమే. సృష్టికొక రీజనూ రైమూ ఏమీ ఉండవు. అంతేకాదు వరుసగా జరిగే రెండు Events మధ్యన connecitivity కూడా ఉండదు. ఉందని నువ్వు ఊహించుకుంటావు. దీనినే UG గారు చెప్పారు. అయితే, ఇది జీర్ణం కావడం చాలా కష్టం. ఇంకా, ఇది సంపూర్ణసత్యమా కాదా అనేది తర్వాత చెబుతా. 

ఉదాహరణకి, 'చనిపోయాక మనం ఉంటామా?' అని UG గారిని ఒకరడిగారు. ఆయనిలా అన్నారు, 'అసలిప్పుడున్నావా నువ్వు?' అని.

'ఉన్నాను కదా?' అంటాడు వాడు.

'నువ్వు లేవు, 'ఉన్నాను' అని అనుకుంటున్నావు' అంటాడు UG.

ఎలా అర్ధం చేసుకుంటావు దీన్ని? 

నీ దృష్టిలో నువ్వు సత్యం. కానీ UG దృష్టిలో నువ్వు సత్యం కాదు. నీ ఉనికి ఆయనకు సత్యం కాదు. నీకిలా అనిపిస్తున్నది. ఆయనకు అలా కనిపిస్తున్నది. అదాయన దర్శనం. ఆ standpoint నుంచి ఆయన మాట్లాడతాడు. అది నీకు అయోమయంగా అనిపిస్తుంది.

గతంలో 'రా' అని ఒకమ్మాయి నాతో మాట్లాడుతూ ఉండేది. చాలా పెద్ద వేదాంతం మాట్లాడేది. ప్రతివారినీ విమర్శించేది. తన గురించి బ్లాగులో రాస్తే మాత్రం గోలగోల చేసేది, 'మీరు రాసేవన్నీ మా బంధువులు నా స్నేహితులు చదువుతారు, ఎందుకు నా గురించి రాస్తారు? అవన్నీ తీసెయ్యండి' అంటూ మెయిల్సిచ్చేది.

ఆమెతో నేనిలా అన్నాను, 'ఆత్మంటావు, పరమాత్మంటావు. ఇంకేదో అంటావు. మళ్ళీ లోకానికి భయపడతావెందుకు?' 

దానికామె, 'నాకు సంసారం ఉంది, మొగుడు పిల్లలు ఉన్నారు' అన్నది. 

'మరి సంసారానికి అంత భయపడేదానికి ఆధ్యాత్మికం ఎందుకు? అంత హై ఫిలాసఫీ మాట్లాడేవాళ్ళకు లోకభయమేంటి?' అని నేనడిగాను.

జవాబు లేదు.

నలుగురిలో ఒక గురువుగా చెలామణీ కావాలన్న కోరిక ఆమెలో ఉండేది. తన అసలు స్థితేంటో బ్లాగులో నేను వ్రాస్తే ఆమె తట్టుకోలేకపోయేది. నలుగురిలో, ముఖ్యంగా ఆమె సర్కిల్లో చులకన అయిపోతానని ఆమె భయం.

చాలామంది ఇంతే, జీవితం కంటే ఆధ్యాత్మికం భిన్నమని అనుకుంటారు. రెండూ ఒకటే అని నేనంటాను. 'ఇంతకంటే ఇంకేదో ఉందని నేననుకోవడం లేదు నాన్నా' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనేవారు. నాదీ అదే మాట.

జరిగే ఈవెంట్స్ కి ఒక రూలూ రైమూ పాస్థూ ఫ్యూచరూ లేకపోతే, అది pre determined కాకపోతే, శ్రీరామ్ సార్ లాంటివాళ్లు భవిష్యత్తును ఎలా చెప్పగలుగుతారు మరి? అని నీకు డౌటు రావచ్చు. ఆయనెలా చెబుతారో నాకనవసరం. వాళ్లకు సర్దిఫికెట్ ఇవ్వాల్సిన పని నాకేంటి? అనేకరకాలుగా అలా చెప్పవచ్చు. కర్ణపిశాచి సిద్ధి ఉన్నా చెప్పవచ్చు. లేదా ఆధ్యాత్మికంగా పూర్ణసిద్ధి ఉన్నా చెప్పవచ్చు. ఈ రెండు బిందువుల మధ్యలో ఉన్న అనేక లెవల్స్ లో అనేక పద్ధతులను ఉపయోగించి అలా చెప్పవచ్చు. భవిష్యత్తును దర్శించడం పెద్ద గొప్పేమీ కాదు. నిజమైన సాధనామార్గంలో అది చాలా చిన్నవిషయం.

ఒక విధానంలో, అంటే, హయ్యెస్ట్ స్పిరిట్యువల్ విధానంలో, అదెలా జరుగుతుందో చెబుతా విను.

యూనివర్సల్ విల్ అనేది ఒక పెద్ద వృత్తం అనుకో. నీ ఇండివిడ్యువల్ విల్ అనేది అందులో ఉన్న చిన్న వృత్తం అనుకో. పెద్ద వృత్తానికి పాస్టు, ప్రెసెంట్, ఫ్యూచరూ ఏవీ లేవు. చిన్నదానికి ఉన్నాయి. ఇప్పుడు, మనుషులకయ్యే జ్ఞానోదయం లేదా Enlightenment అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, నిదానంగా మెట్టుమెట్టుగా జరిగే జ్ఞానోదయం రెండు, హఠాత్తుగా జరిగే జ్ఞానోదయం. వీటిని gradual enlightenment, sudden enlightenment అంటారు. రెండో రకంలో నడిచేవారు ఉన్నట్టుండి చిన్న వృత్తంలోనుంచి పెద్ద వృత్తంలోకి టాంజెన్షియల్ గా వెళ్ళిపోతారు. వారికేమౌతుంది? అప్పటిదాకా ఉన్న గతం, వర్తమానం, భవిష్యత్తులు వారికి ఉన్నట్టుండి ఒకటే అయిపోతాయి. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా , టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరుగుతుంది. వాళ్ళ టైం లో ఈ మూడు డివిజన్స్ ఉండవు. అంతా ఒకేసారి జరుగుతున్నట్లు వాళ్ళు చూస్తారు. యూని డైమెన్షనల్ నుండి వారి దృష్టి మల్టి డైమెన్షనల్ అవుతుంది. కనుక మీరనుకుంటున్న భవిష్యత్తు కూడా వాళ్లకు ఇప్పుడే ఇక్కడే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది.  దాన్ని నీకు చెప్పారనుకో, లేదా ఒక కాయితం మీద వ్రాసి పెట్టారనుకో, నీ టైం ఫ్రేములో ముందుముందు ఆ సంఘటన జరిగినప్పుడు నువ్వా కాయితం తెరచి చూచి బిత్తరపోతావు.  నీకది ఎంతో అద్భుతంలాగా కనిపిస్తుంది. కానీ వాళ్ళకది మామూలుగా ఉంటుంది. అందులో వాళ్ళకేమీ అద్భుతం కనపడదు. 'అద్భుతం' అనే భావమే వారికి ఉండదు. శ్రీరామ్ సార్ స్థితి ఏమిటో నాకు తెలీదు. ఇదే విధానంలో ఆయన చూచి చెప్పాడో లేక ఇంకోవిధంగా చెప్పగలిగాడో నాకు తెలీదు. నాకనవసరం కూడా.

నువ్వు చెప్పిన వేదవ్యాస, భరద్వాజ లాంటివాళ్ళు మహిమలు, మహత్యాలు, లోకాలు, ఆత్మలు, పునర్జన్మలు, దర్శనాలు, పనులు కావడాలు, రోడ్లపక్కన తిరిగే అవధూతలు మొదలైన చెత్తకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. సాయిబాబాను దేవుడిగా ప్రొజెక్ట్ చేసి హిందూసమాజాన్ని చెడగొట్టడంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. అలాగే, శ్రీరామ్ సార్ గురించి చెప్పబడే పై ఈవెంట్ ను వాళ్ళు సంభ్రమాశ్చర్యాలతో చూశారు. వాళ్ళ అనుచరులూ అలాగే అయ్యారు. ఇప్పటికీ ప్రచారాలు చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఇది అసలైన ఆధ్యాత్మికత కాదు. 

ఇంకా విను. సృష్టినీ జీవితాన్నీ నువ్వెలా తీసుకున్నా, అంటే, pre-determined గా తీసుకున్నా, నీ self effort గా తీసుకున్నా, లేదంటే, random happening గా తీసుకున్నా, ఒకటి మాత్రం నిజం. నువ్వు బ్రతుకున్న విధానంలో తప్ప వేరే విధంగా నువ్వు బ్రతకలేవు. ఒకవేళ వేరే విధంగా బ్రతికినా, అలా కాకుండా ఇంకో విధంగా బ్రతకలేవు. పోనీ అలాగే అనుకున్నా, అలా ఎన్ని విధాలుగా బ్రతకగలవు? ఎలా బ్రతికినా తేడా ఏమీ ఉండదు. బ్రతకడం తప్పదు కదా. చావడం తప్పదు కదా. కనుక నువ్వు నువ్వుగానే బ్రతకాలి. వేరే దారి నీకు లేదు.

ఒకవేళ జీవితాన్ని pre determined కోణంలోనే నువ్వు చూచావనుకో. దేవుడో దయ్యమో లేదా ఇంకెవరో వ్రాసిన ఆ స్క్రిప్ట్ ఏంటో నీకెలా తెలుస్తుంది? అది తెలిసేటంతవరకూ బాత్రూం కెళ్లకుండా బిగబట్టుకుంటావా? కుదరదు కదా. ఈలోపల నీ ప్యాంట్ తడిసిపోతుంది. జీవితాన్ని నువ్వెలా తీసుకున్నప్పటికీ, నీ ఆలోచన ప్రకారమే, నీ అనుభూతి ప్రకారమే నువ్వు పోవాలి. ఆ ఆలోచన నీదైనా, లేక, దేవుడు ముందే స్క్రిప్ట్ రాసినదైనా, ప్రస్తుతం నువ్వేమీ చెయ్యలేవు. పోనీ, నువ్వు నువ్వులా కాకుండా ఇంకోలా ఆలోచించగలవా? ప్రయత్నించి చూడు. నీ వల్లకాదు. ఆ 'ఇంకోలా' అనేది కూడా ముందే నిర్ణయింపబడి ఉందేమో? నీకెలా తెలుస్తుంది?

శ్రీరామ్ సార్  చెప్పినా, నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, నీకున్నది రెండే మార్గాలు. ఒకటి, ఒక నిజమైన గురువును ఆశ్రయించి ఆయన చెప్పినట్లు సాధన చెయ్యడం. ఎదగడం. ఆత్మానుభూతిని పొందటం. అలా చెయ్యలేకపోతే, ఆయుస్సున్నంతవరకూ ఒక మామూలు మనిషిగా నీ బ్రతుకును నువ్వు బ్రతకడం, తరువాత చావడం. అంతే, ఇంతకంటే ఎవరయినా సరే ఏమీ చెయ్యలేరు.

కనుక, 'అంతా ముందే నిర్ణయింపబడి ఉన్నదనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను' అనుకోకు. నువ్వు జీర్ణించుకున్నా, జీర్ణించుకోలేకపోయినా తేడా ఏమీ రాదు. నీకోసం సృష్టి మారదు. చేతనైతే నువ్వే మారాలి, లేదా ఇలాగే చావాలి. అంతే. వెరీ సింపుల్. ఇందులో అంత అర్ధంకానిది ఏముంది?' అన్నాను.

(ఇంకా ఉంది)

read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 3 "

ఈ గురుపూర్ణిమకు ఎవ్వరూ హైదరాబాద్ కు రావద్దు

ఈ సంవత్సరం జూలై 13 నా పుట్టినరోజునాడు గురుపూర్ణిమ వచ్చింది. హైదరాబాద్ వస్తామని చాలామంది నాకు మెయిల్స్ ఇస్తున్నారు.

ఇండియాలోను, ఇతర దేశాలలోను ఉన్న నా శిష్యులందరికీ మెసేజిగా ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ప్రతి ఏడాదీ జరుపుకున్నట్లుగానే ఈ ఏడాది కూడా గురుపూర్ణిమను జరుపుకుందాం.

కానీ ఒక మార్పు.

ప్రస్తుతం హైదరాబాద్ వర్షాలతో ఉంది. ఈ వర్షంలో పడి నన్ను చూడటం కోసం దూరాభారాలనుండి ఎవ్వరూ హైదరాబాద్ కు రావద్దు. మీమీ ఇళ్లలోనే ఉండి, నేను చెప్పిన సాధనను చెయ్యండి. మీకు కావలసింది అక్కడే లభిస్తుంది.

హైదరాబాద్ లో ఉన్న శిష్యబృందానికి కూడా ఇదే సూచన. మీరు కూడా మీ మీ ఇళ్లలోనే ఉండి నేను చెప్పినట్లు చెయ్యండి. సరిపోతుంది. వర్షంలో ప్రయాణం పెట్టుకుని మీరు ఇబ్బంది పడకండి. మీ కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకండి.

దూరంతో మనకు సంబంధం లేదు.

వచ్చే ఏడాది గురుపూర్ణిమను మన ఒంగోలు ఆశ్రమంలో జరుపుకుందాం.

గమనించండి.
read more " ఈ గురుపూర్ణిమకు ఎవ్వరూ హైదరాబాద్ కు రావద్దు "

10, జులై 2022, ఆదివారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 2

అనుకున్నదానికంటే పావుగంట ముందే అతను తలుపు  తట్టాడు. లోపలకొచ్చి కూర్చున్నాక సంభాషణ మొదలైంది.

తనకు మా అబ్బాయి వయసుంటుంది.

'ఎక్కడుంటావు?' అడిగాను.

'కార్ఖానా దగ్గరలో ఉంటాను. డిఫెన్స్ లో ఆడిటర్ గా పనిచేస్తున్నాను'  అన్నాడు.

'పెళ్లయిందా?' అడిగాను.

'అయింది. రెండేళ్ల పాప ఉంది' అన్నాడు.

'ఇంత చిన్నవయసులో ఈ ధోరణి ఏంటి? ఎప్పటినుంచీ ఇది?' అడిగాను.

'చిన్నప్పటినుంచీ ఉంది' అన్నాడు.

'ఎలా మొదలైంది?' అడిగాను, ఎలా మొదలౌతుందో తెలిసినప్పటికీ.

'చిన్నప్పుడు వివేకానంద పుస్తకాలు చదివేవాడిని. 'రాజయోగం' అనే పుస్తకం చదివి అందులోని ప్రాణాయామం చేస్తుంటే  కొంతమంది, 'గురువు లేకుండా వాటిని చేస్తే వికటిస్తాయి. వద్దు చెయ్యకు' అన్నారు. ఆ తర్వాత ఓషో పుస్తకాలు చదివాను. చాలావరకు ఆయన పుస్తకాలను చదివేసానని అనుకున్నాక ఒక అనుమానం వచ్చింది. ఆయన, ఒకే విషయాన్ని రెండుచోట్ల రెండువిధాలుగా చెప్పేవాడు. ఒకదానికి ఇంకోదానికీ సంబంధం ఉండేది కాదు. అసలీయన చెబుతున్నది నిజమేనా? అనే అనుమానం వచ్చేది. అందుకని ఓషోను ఎవరు విమర్శించారు? అని వెదికితే జిడ్డు కృష్ణమూర్తి  దొరికాడు. 'అన్నన్ని రోల్స్ రాయిస్ కార్లేంటి?' అని జిడ్డు ఓషోని విమర్శించేవాడు. ఓషో కూడా జిడ్డుని విమర్శించేవాడు. అందుకని జిడ్డును చదవడం మొదలుపెట్టాను. కొన్నాళ్ళకు జిడ్డు కూడా డొల్లే అని అర్ధమైంది. ఆయనేదో choiceless awareness అంటూ పెద్దపెద్ద మాటలు వాడతాడు. కానీ విషయమేమీ ఉండదు. అంతా చదివితే చివరకు అక్కడేమీ కనపడదు. పెద్ద వాక్యూమ్ లో మనల్ని వదిలేస్తాడు. ఆయనకంటే ఓషోనే కొంత నయం. ఆయన ఫాలోయర్స్ కి తాంత్రిక్ సెక్స్ అన్నా ఆసరాగా ఉంది. దాంట్లో ఏదో కొంత ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఒక యుఫొరియాలో ఉంటారు. కానీ జిడ్డు దగ్గర ఒక పెద్ద వాక్యూమ్ తప్ప ఏమీ లేదు. అందుకని, జిడ్డును ఎవరు విమర్శించారని వెదికితే UG దొరికాడు. జిడ్డు పెద్ద చీటరని, ఆయనొక మీడియం తప్ప ఇంకేమీ కాదని UG అనేవాడు. 

ఇక UG ఏమో వయసులో ఉన్నపుడు రమణమహర్షి గారిని సందర్శించాడు. అప్పటికే హిమాలయాలలో ఎంతో తపస్సు చేసి ఉన్నాడు. రమణాశ్రమంలో ఏదో ఒరుగుతుందని ఆశించి అక్కడకెళ్లాడాయన. కానీ అక్కడేమీ దొరకలేదు. పైగా ఇంకా ఇంకా ఆయనకు అసంతృప్తి ఎక్కువైపోయింది.

'నీదగ్గరున్నదానిని నాకివ్వ'మని రమణమహర్షిని UG అడిగాడు.

'నేనివ్వగలను. నీవు తీసుకోగలవా?' అని మహర్షి బదులిచ్చాడు.

'ఇప్పటికే ఇంత సాధన చేసి ఉన్నాను, తీసుకోడానికి నాక్కాకపోతే ఇంకెవరికి అర్హతుంది? అయినా నేను తీసుకోగలనో లేనో ఈయనకు తెలీదా? నన్నడగడమెందుకు? ఈయనేం జ్ఞాని?' అనుకుంటూ UG కోపంతో వెనక్కొచ్చేశాడు. 

ఆ రకంగా అక్కడనుంచి రమణమహర్షినీ, UG గారిని తెలుసుకున్నాను' అంటూ ఇంకా చెప్పబోతున్నాడు.

ఆపి, 'ఈరోజు UG గారి పుట్టినరోజు తేదీలప్రకారం' అన్నాను.

'అవునా? నాకావిషయం తెలీదు' అన్నాడు.

'సరే, కొనసాగించు' అన్నాను

'మొదటినుంచీ నాకు రెండు సందేహాలుండేవి. ఒకటి, 'హృదయం అనేది కుడివైపున ఉంటుంది' అని రమణమహర్షి అన్నారు. ఇదేంటి? అని ఒక సందేహం. నేను రెండేళ్లక్రితం అరుణాచలంలో ఎనిమిది నెలలున్నాను. బయట రూమ్ తీసుకుని, ఆశ్రమంలో ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో, ఒకరోజున ధ్యానంలో ఉన్నపుడు, ఒక్క క్షణంపాటు ఛాతీలో కుడివైపున ఏదో కరెంట్ షాక్ లాగా కొట్టింది. అప్పుడు నాకర్ధమైంది. స్పిరిట్యువల్ హార్ట్ అనేది కుడివైపే ఉంటుంది అని.  ఆ విధంగా ఆ సందేహం నివృత్తి అయింది.

రెండు, సృష్టిలో ప్రతిదీ  ముందే నిర్ణయింపబడి ఉంటుంది అంటారు  కదా ! ఉదాహరణకు, ముదలియార్ అనే ఆయన రమణమహర్షిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి మహర్షి 'నిజమే' అన్నారు. అప్పుడు  ముదలియార్ తన ముందున్న కాఫీకప్పునో గ్లాసునో ప్రక్కకు జరిపి 'నేను ఇలా జరుపుతానన్నది కూడా ముందే నిర్ణయింపబడి ఉంటుందా?' అనడిగాడు. దానికి కూడా మహర్షి 'అవును' అన్నారు. దీనిని చదివినప్పుడు నాకస్సలు మింగుడు పడలేదు.

ఇదంతా చెబుతూ, 'మీకు ఎక్కిరాల భరద్వాజ, వేదవ్యాసలు తెలుసా?' అన్నాడతను.

నేను నవ్వి, 'తెలుసు, నువ్వు కొనసాగించు' అన్నాను.

'వేదవ్యాస  ఒకబ్బాయిని చదివిస్తూ ఉండేవారు. ఒకరోజున ఆ అబ్బాయిని ఇలా అడిగారు.

'నీకు భవిష్యత్తును చెప్పడం వస్తుంది కదూ"

దానికా అబ్బాయి, 'లేదండి నాకు రాదు' అన్నాడు.

అప్పుడు వేదవ్యాస, 'చూడు. నీకు  వస్తుందని నాకు తెలుసు. నిజం చెప్పు' అన్నాడు

అప్పుడా అబ్బాయి 'నిజమే నాకు అలా చెప్పడం వస్తుంది' అని ఒప్పుకున్నాడు.

'ఎంత ఖచ్చితంగా చెప్పగలవు?' అన్నాడు వేదవ్యాస.

ఒక కాగితం తెప్పించి దానిపైన ఏదో వ్రాసి కవర్లో ఉంచాడు ఆ అబ్బాయి. ఆ కవర్ని సీల్ చేసి ఫలానా తేదీన తెరచి చూడమని చెప్పాడు. వేదవ్యాస IAS ఆఫీసర్ కనుక,  ఏదో పని మీద ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి ఆ డేట్ అయిపొయింది. సోఫాలో కూచుని ఆ కవర్ తెరవబోతుంటే పెంపుడు కుక్కపిల్ల ఆయన ఒళ్ళోకి దూకింది. కవర్ తెరచి, అందులో ఉన్న కాగితాన్ని చదివాడాయన.

'అనుకున్న తేదీన మీరీ కవర్ని తెరవలేరు. ఫారిన్ ట్రిప్ అడ్డొస్తుంది. తిరిగొచ్చాక సోఫాలో కూచుని తెరవబోతుంటే మీ కుక్కపిల్ల మీ ఒళ్ళోకి  దూకుతుంది' అని దాంట్లో ఉంది' అన్నాడు.

'అవునా ! ఆ అబ్బాయి పేరు?' అడిగాను.

'ఆయన పేరు శ్రీరామ్ సార్' అన్నాడు.

'విన్నాను ఆయన గురించి' అన్నాను.

'ఆయనిక్కడే మాదాపూర్ లో ఉంటారు'  అన్నాడు.

'ఆదిత్య అనే శిష్యుడు వాట్సాప్ గ్రూపులతో ఈయనను ప్రోమోట్ చేస్తుంటాడు కదూ?' అడిగాను.

'అవును. శ్రీరామ్ సార్ కి చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు కానీ ఆదిత్య ఎక్కువగా ఈయన్ను ప్రోమోట్ చేస్తుంటాడు' అన్నాడు.

'మీరాయన ఫాలోయరా?' అడిగాను.

'కాదు. ఒకటి రెండుసార్లు వీళ్ళిద్దర్నీ కలిశాను' అన్నాడు.

'శ్రీరామ్ సార్ అనే ఆయన వేంకటేశ్వరస్వామి అవతారమని ఆయన ఫాలోయర్స్ ప్రచారం చేస్తుంటారు కదా' అడిగాను.

'అవును, కొంతమంది అలా నమ్ముతారు' అన్నాడు.

అప్పుడిలా అడిగాను.

'సరే, నాదొక డౌట్. శ్రీరామ్ సార్ లో అంతటి శక్తి ఉందని వేదవ్యాస రుజువులతో సహా గ్రహించినప్పుడు ఆయన్ను ఎందుకు ఒప్పుకోలేకపోయాడు? ఎందుకు అందరికీ ఆయన గురించి అప్పుడే చెప్పలేకపోయాడు? పైగా, నామాలు పెట్టుకుని తానే వెంకటేశ్వరస్వామినని ప్రచారం చేసుకుని భక్తబృందంతో భజన చేయించుకున్నాడు వేదవ్యాస.  ఇదేంటి  మరి?' అన్నాను.

'ఏమో నాకు తెలీదు. అహంకారం ఆయనకు అడ్డుపడి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో ప్రక్కనున్న ఎక్కిరాల భరద్వాజ మాత్రం, 'నీవు భవిష్యత్తులోకి ఎంతదూరం అలా చూడగలవు?' అని శ్రీరామ్ సార్ ని అడిగాడు.

దానికి శ్రీరామ్ సార్, 'రాబోయే పదిరోజులలో ఏదో ఒక న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ఏమొస్తాయో ఇప్పుడే వ్రాసి ఇవ్వగలను. మీరు సరిపోయినన్ని కాయితాలు నాకు తెచ్చివ్వండి. ఎటర్నిటీ వరకూ ఏం జరుగబోతున్నదో వ్రాయగలను' అన్నాడు.

దానికి భరద్వాజకు కోపమొచ్చి, 'నువ్వు నాన్ బ్రాహ్మిన్ వి, నీకంత శక్తి ఎలా వస్తుంది?' అని కోప్పడ్డాడు. భరద్వాజగారికి స్పిరిట్యువల్ ఈగో చాలా ఎక్కువగా ఉండేదని ఈ విషయం గురించి విన్నతర్వాత నాకర్ధమైంది' అన్నాడు వెంకట్.

నేను నవ్వాను.

'అక్కడ స్పిరిట్యువల్ ఏమీ లేదు. ఉన్నది 'ఈగో' ఒక్కటే. నా దృష్టిలో ఎక్కిరాల బ్రదర్స్ ఆంధ్రాలో ఆధ్యాత్మికతను చాలా పాడు చేశారు. వాళ్లలో EK కొంచం బెటర్. అంతే' అన్నాను.

'మీరు భరద్వాజ గురించి ఇంకోటి వ్రాశారు. 'అన్నేళ్లు అమ్మ దగ్గర జిల్లెళ్ళమూడిలో ఉండి, బయటకెళ్లిపోయాడు భరద్వాజ. తప్పు చేశాడు' అని. అదికూడా నాకు నచ్చింది' అన్నాడు.

'ఎందుకెళ్ళిపోయాడో కూడా వ్రాశా కదా అందులోనే' అన్నా నవ్వుతూ. 

'కాకపోతే ఒకటి. శ్రీరామ్ సార్ ఇలా చెప్పడం వల్ల నాకొకటి అర్ధమైంది. Everything is predetermined in this universe అని. The first script of God is the last script' ప్రతివాడి జీవితంలోనూ జరిగేదంతా ఎప్పుడో డిసైడ్ అయింది, అందులో మార్పేమీ ఉండదు' అని శ్రీరామ్ సార్ కూడా అంటారు' అన్నాడు మళ్ళీ.

'సో వాట్? దీనిలో శ్రీరామ్ సార్ క్రొత్తగా చెప్పేదేముంది? ఇదంతా మన శాస్త్రాలలో ముందే చెప్పబడే ఉందికదా? కొత్తేముంది?' అన్నాను.

'అదికాదు. అంటే మన సోకాల్డ్ థాట్స్ కూడా ముందే డిసైడ్ అయి ఉంటాయనే కదా అర్ధం? ఇది నాకస్సలు డైజెస్ట్ కాలేదు. ఈ ఆలోచనతో, నా మైండ్ పోయినంత పనైంది. రోజువారీగా జరిగే సంఘటనలే గాక, మనం ఏం ఆలోచిస్తాం? ఎలా ఆలోచిస్తాం? అన్నది కూడా ముందే డిసైడ్ అయి ఉంటే, స్క్రిప్ట్ అంతా ముందే వ్రాయబడి ఉంటే, ఇక మనమేముంది? జీవితమేముంది? మనమంటూ సొంతగా చేస్తున్నదేముంది? అని నాకు దిగ్భ్రమ కలిగింది.

ఈ సందేహం నాలో ఇంకా మిగిలి ఉంది. దీనికి జవాబు మీ దగ్గర దొరుకుతుందేమోనని వచ్చాను.

ఇప్పటికి మనకు తెలిసిన మహనీయులలో రమణమహర్షి. UG కొంచం సరిగ్గా ఉన్నట్లు నాకనిపించారు. కానీ అందరూ UG గారిని తిడతారు. ఆయనకు కోపమెక్కువ. అరుస్తాడు. తిడతాడు' అంటారు. అంతకోపం ఉన్నవాడు జ్ఞాని ఎలా అవుతాడు? అంటారు. UG గారి గురించి మంచిగా మీరొక్కరే రాశారు. ఆయనమీద ఎనిమిది పోస్టులు రాశారనుకుంటా. ఆ తరువాత మధ్యలో ఆపేశారు. అందుకే మీకు మెయిలిచ్చాను. ఇప్పుడు మీ దగ్గరకొచ్చాను' అన్నాడు వెంకట్.

ఈలోపల మూర్తీ, సంధ్యా పల్నాడు ఎక్స్ప్రెస్ దిగి ఇంటికొచ్చారు.  'ఇతనే మూర్తి, పంచవటి ఇండియా ఫౌండేషన్ సెక్రటరీ. ఈమె సంధ్య, ఈయన సతీమణి, ఇద్దరూ ఎంతో పుణ్యాత్ములు, కారణజన్ములు' అని  వారిని వెంకట్ కు పరిచయం చేశాను. 

అతను చెప్పినదానిని బట్టి,  పుస్తకాలను బాగా చదివాడని, సరియైన దారికోసం బాగా వెదుకుతున్న ఒక అన్వేషకుడని నాకర్ధమైంది. పాపం అన్వేషణలో ఉన్నాడు, విషయాన్ని అర్ధమయ్యేలా చెబుదానుకున్నాను.

ఆ తరువాత చాలాసేపు, అంటే దాదాపు అరగంటసేపు, అందరం మౌనంగా ఉన్నాం.

చివరకు గొంతు సవరించుకుని ఇలా చెప్పడం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)
read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 2 "

9, జులై 2022, శనివారం

UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 1

జూలై 9

తేదీల ప్రకారం UG గారి పుట్టినరోజు.

ఈరోజున వెంకట్ అనే ఒకతను మా ఇంటికొచ్చాడు. ఉదయం పదికి మొదలైన మా సంభాషణ మూడు గంటలపాటు సాగింది.

అసలిదంతా రెండురోజులక్రితం మొదలైంది. ఈ మధ్యనే నా బ్లాగ్ చదివాడట. 'మీరు వ్రాసిన జిల్లెళ్ళమూడి స్మృతులు చదివాను. చాలా బాగున్నాయి. నాకు శ్రీవిద్య నేర్చుకోవాలని ఉంది, మీలాగా multi faceted wisdom తో జీవించాలని ఉంది. నాకు శ్రీవిద్యాసాధన ఎక్కడ మొదలుపెట్టాలో తెలియడం లేదు. కెన్ యు గైడ్ మి?' అంటూ మెయిలిచ్చాడు.

'తప్పకుండా. మీరు శ్రీవిద్యను ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో నాలుగు కారణాలు చెప్పండి?'  అడిగాను.

అతనిలా చెప్పాడు, ' 

1.  అమ్మవారితో మా ఫెమిలీ మెంబర్ తో మాట్లాడినట్లు మాట్లాడాలని ఉంది 

2. ప్రకృతి, బయటకు చూపించడం కంటే దాచిపెట్టేది ఎక్కువగా ఉంది. నాకు తీక్షణమైన బుద్ధికుశలత, జ్ఞానమూ లేకపోతే, ప్రకృతియొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన గారడీని నా నిత్యజీవితంలో నేను ఎల్లప్పటికీ మిస్సవుతూనే ఉంటాను. ప్రతిదానిలోనూ స్పందిస్తున్న ఆ  దివ్యత్వాన్ని చూచే కళ్ళు నాక్కావాలి 

3. నాకు పాములన్నా, దయ్యాలన్నా చాలా భయం. ఏదోవిధంగా భయమనేది చావుతో ముడిపడి ఉంటుంది. నా భయాలన్నింటినీ అంతం చేసి భయం లేనివాడిగా నేను మారాలి. స్మశానంలో  రాత్రిపూట పడుకోవాలని, పాములను చేతులతో పట్టుకోవాలని నా తీరని కల. నిర్భయునిగా ఒక డేర్ డెవిల్ గా మారడానికి శ్రీవిద్య నాకు కావాలి' 

4. అందరిలాగా డబ్బు సంపాదిస్తూ, తింటూ చావడం నాకిష్టం లేదు. భౌతికమైన ప్రపంచంలో బ్రతుకుతూనే, మన శాస్త్రాలలో చెప్పబడినవి సత్యాలేనని, అవి ఎవరివో ఊహలు కావని నేను అనుభవంలో తెలుసుకోవాలి. ఈ నాలుగు కారణాలవల్ల నేను శ్రీవిద్యను నేర్చుకోవాలనుకుంటున్నాను'. అన్నాడు

అందరిలాగా, సమస్యలు, జాతకాలు, డబ్బు తేరగా వచ్చిపడే మార్గాలు, రోగాలు, రొష్టులు లాంటి చెత్తను ఇతను అడగకపోవడం నాకు నచ్చింది.

'మీ జవాబులు నాకు నచ్చాయి. మీ ID లో రమణమహర్షి ఫోటో ఉంది. మీకు  కావలసింది ఆయనదగ్గర దొరకలేదా?' అన్నాను.

'రమణమహర్షి గారిదగ్గర నాకు చాలా శాంతి  దొరికింది.  ఈ ప్రపంచం ఒక కలలాంటిదని, సత్యం  కాదని నేనాయన దగ్గర గ్రహించాను. Inception అనే సినిమాలో చూపించినట్లు, కలలో కలలో కలగంటున్న అనుభవం నాకు కలిగింది. అప్పటినుంచీ ఈ ప్రపంచపు సత్యత్వాన్ని ప్రశ్నించడం అలవాటు చేసుకున్నాను. అంతా ముందే నిర్ణయింపబడి ఉన్నదని ప్రస్తుతం నేను నమ్ముతున్నాను.  ఈ అనుభవాలన్నీ బహుశా నాకు సరియైన అవగాహన లేకపోవడం వల్ల కలుగుతూ ఉండవచ్చు. జీవితమంటే ఒక ఉదాసీనభావం నాకు వీటివల్ల కలిగింది. జీవితాన్ని ఒక చిన్నపిల్లవాడిలా ఉత్సాహంతో శక్తితో గడపలేకపోతున్నాను. ఇది నా అవగాహనాలోపమో, అజ్ఞానమో కావచ్చు. ఇప్పుడు నేను, దీనికి పూర్తి వ్యతిరేకస్థితి అయిన శ్రీవిద్యను కోరుకుంటున్నాను. శ్రీవిద్యలో ఎంతో శక్తి, కోరికా ఉంటాయి. ఉదాసీనతా ఉత్సాహాలలో ఒకటే కాకుండా అదీ ఇదీ రెండూ కావాలని కోరుకుంటున్నాను.

కావ్యకంఠ గణపతిమునిగారిని చదివాను. ఆయన ఆత్మలో రమణమహర్షి ఉన్నారు. అదే సమయంలో ఆయన శ్రీవిద్యాసాధన కూడా చేశారు. గణపతిముని గారిని చదివాక, అదే నా మార్గమని అనిపించింది. జ్ణానం ఆత్మగా, శ్రీవిద్య దానిపైన కప్పిన రంగురంగుల వస్త్రంగా అనుకున్నాను. రమణమహర్షి ఒక తెల్లని బట్టలాంటివారు. దానిపైన అనేక రంగులను  శ్రీవిద్యతో అద్దాలనుకుంటున్నాను. నాకు రమణమహర్షియే కావాలి. కానీ కావ్యకంఠులు చేసిన శుద్ధమైన ఉపాసనద్వారా కావాలి. నేను కోరుకుంటున్న శ్రీవిద్య, జిల్లెళ్ళమూడి అమ్మగారిలాగా నాకు తోస్తున్నది. మొదట్లో రమణమహర్షి గారిని గురించి చదివినప్పుడు, నేను త్వరగా జ్ఞానాన్ని పొంది నా జన్మపరంపరలను అంతం చేసుకోవాలని అనుకున్నాను. కానీ, ప్రస్తుతం, మానవజీవితం చాలా సుందరమైనదని భావిస్తున్నాను. ఎన్నోసార్లు ఇలాగే జన్మలెత్తుతూ ఉండాలని ఇప్పుడు ఆశిస్తున్నాను. ఈ ఆలోచన కూడా నాకు బాగా నచ్చింది. నా సొంత  మోక్షం కంటే, భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన లీలను చూస్తూ ఆనందించాలని ప్రస్తుతం అనుకుంటున్నాను. ప్రస్తుతం నా ఆలోచనాధోరణి ఇలా మారుతున్నది' అంటూ సుదీర్ఘమైన జవాబునిచ్చాడు.

'నా పుస్తకాలు చదివారా/' అడిగాను. 

'లేదు. నిన్న రాత్రి మాత్రమే మీ బ్లాగు చూచాను. కానీ మీ పుస్తకాల శాంపిల్స్ నెట్లో చదివాను. మీది సయింటిఫిక్ ఆధ్యాత్మికత అనీ, చాదస్తపు ఆచారాలు, తంతులు మొదలైన అనవసరమైన చెత్త లేకుండా మీ మార్గం సూటిగా ఉంటుందనీ నాకర్ధమైంది' అన్నాడు.

'సరే, ఇంకొక్క మూడు వారాలలో నేను హైదరాబాదును వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో చెప్పలేను, మీరు కలవాలంటే ఈ లోపల వచ్చి కలవండి' అన్నాను.

'సరేనండి, అడ్రస్ చెప్పండి, ఎన్నింటికి రమ్మంటారు?' అడిగాడు.

అడ్రస్ చెప్పి, 'రేపు ఉదయం సరిగ్గా పదింటికి రండి. సమయపాలనను నేనిష్టపడతాను' అని చెప్పాను.

'సరే' అన్నాడతను.

(ఇంకా ఉంది)
read more " UG గారి పుట్టినరోజు - ఆధ్యాత్మిక సంభాషణ - 1 "

మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది

నేడు మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది. ఇది అధర్వణవేదం లోనిది. ఇది నా కలం నుండి వెలువడుతున్న 48 వ పుస్తకం.

అంగీరసఋషి యొక్క బోధగా ఈ గ్రంధం దర్శనమిస్తుంది. ఈయన ఋగ్వేదకాలపు ఋషులలో ఒకరు. సప్తఋషులలో కూడా ఒకరిగా ఈయనను లెక్కిస్తారు. దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ అనే మూడు సులభమైన భావనలతో సృష్టిని, మానవజీవితాన్ని, సాధనాక్రమాన్ని అంతటినీ కేవలం 32 శ్లోకములలో వివరించడం ఈ గ్రంధపు ప్రత్యేకత.

ఇది సామాన్యోపనిషత్తుల కోవకు చెందినది. ఇవి చిన్నచిన్న ఉపనిషత్తులే అయినప్పటికీ, వీటిలో చెప్పబడిన తత్త్వం మాత్రం అగాధమైనదిగా ఉంటుంది. వీటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే, వేదాంతతత్త్వమంతా సులభంగా అర్ధమౌతుంది.

మరొక్కమాట ! ఇవి పైపైన చదివి పడేసే కధల పుస్తకాలు కావు. ఇవి కనీసం పదివేల సంవత్సరాల నాటి విజ్ఞానపు నిధులు. ఈ నాటికీ హిందూమతాన్ని సజీవంగా ఉంచుతున్న అతీతజ్ఞానపు పునాదులు ఇవే.

దీనిలోని ఒక్కొక్క శ్లోకాన్నీ ధ్యానించి ఆయా లోతుపాతులను అర్ధం చేసుకోవలసి ఉంటుంది.  ఉపనిషత్తులను చదువలసిన విధానం అదే. ఈ కోణం లో చూచినప్పుడు, చిన్నదైన ఈ పుస్తకం ఒక జన్మకు సరిపోయే గైడ్ బుక్ అవుతుంది. యధావిధిగా, ఈ ఒక్క పుస్తకాన్ని దిక్సూచిగా పెట్టుకుంటే చాలు, మనిషి జీవితం ధన్యమౌతుంది. ఈ మాట, నేను వ్రాస్తున్న అన్ని పుస్తకాలకూ వర్తిస్తుంది. అందుకే, నేను వ్రాస్తున్న ప్రతి పుస్తకావిష్కరణలోనూ ఇదేమాటను చెబుతూ ఉంటాను. ఇంకా  చెప్పాలంటే, మొత్తం పుస్తకం కూడా అక్కర్లేదు.  పుస్తకంలోని ఒక్క శ్లోకం చాలు, మనిషి జీవితాన్ని పునాదిగా ఉంటూ ఒక సౌధాన్ని దానిపైన నిర్మించడానికి. అయితే, దానిని అర్ధం చేసుకోవాలి, ధ్యానించాలి, జీవితంలోకి దానిని అనువదించుకోవాలి. అప్పుడే నేను చెబుతున్న ఈ అద్భుతం సాధ్యమౌతుంది.

సాధన చెయ్యలేకపోతే పోయారు ! కనీసం వీటిని చదవండి. మన హిందూమతపు ప్రాచీనవిజ్ఞానం ఎంత అద్భుతమైనదో తెలుసుకోండి. కొంతమేరకైనా ధన్యత్వాన్ని అందుకోండి.

ఈ పుస్తకం వ్రాయడంలో నా సహచరులు సరళాదేవి, అఖిల, ప్రవీణ్,  చావలి శ్రీనివాస్ ల పాత్ర ఎంతో ఉంది. వీరి సహాయం లేకుంటే  ఈ పుస్తకం వెలుగును చూచేది కాదు. వీరికి నా  ధన్యవాదములు, ఆశీస్సులు. 

యధావిధిగా, ఇది కూడా Google Books నుండి ఇక్కడ లభిస్తుంది.

read more " మా క్రొత్త పుస్తకం 'ఆత్మోపనిషత్' విడుదలైంది "

3, జులై 2022, ఆదివారం