రిటైర్డ్ స్వేచ్ఛాజీవితంలో మొదటిమెట్టుగా మూడవసారి అమెరికా వచ్చేశాను.
9 వ తేదీ రాత్రి 8.30 కి హైద్రాబాద్ లో బయల్దేరి రాత్రి పదకొండుకు ఢిల్లీ చేరుకున్నాం. తెల్లవారుఝామున 2 గంటలకు ఢిల్లీలో విమానం ఎక్కి, 14 గంటల ప్రయాణం తర్వాత చికాగో ఒహెర్ ఎయిర్ పోర్టులో దిగాం. అప్పటికక్కడ ఉదయం 7 అయింది. అక్కడకు రెండు గంటల ప్రయాణదూరంలో ఉన్న శ్రీనివాస్ దంపతులు ఇడ్లీలు, పులిహోర, పెరుగన్నాలు తీసుకుని అప్పటికే అక్కడకు చేరుకొని మాకోసం వేచిచూస్తున్నారు. పన్నెండువేల మైళ్ళ దూరంలో, దేశం కాని దేశంలో, మా కోసం పొద్దున్నే లేచి అవన్నీ చేసుకుని రెండుగంటలు డ్రైవింగ్ చేసి చికాగో ఎయిర్ పోర్ట్ కొచ్చి అవన్నీ తినిపిద్దామని మాకోసం వెయిట్ చేస్తున్నారు శ్రీనివాస్ దంపతులు. జగన్మాతను మనస్సులోనే స్మరించి నమస్కరించుకున్నాము
చికాగో ఎయిర్ పోర్ట్ లో వారి ఆతిధ్యం స్వీకరించి, మధ్యాన్నం 1.40 కి అక్కడ ఇంకో విమానం ఎక్కి సాయంత్రం నాలుగు గంటలకు డెట్రాయిట్ చేరుకున్నాం.
'చికాగో నుంచి డెట్రాయిట్ వెళ్లకుండా మా ఇంటికి రండి. ఒక వారం మాతో ఉండి అప్పుడు డెట్రాయిట్ వెళ్ళవచ్చు, మిమ్మల్ని ఇట్నుంచి ఇటే కిడ్నాప్ చేద్దామనుకుంటున్నాం' అని శ్రీనివాస్ దంపతులు పట్టుబట్టారు. కానీ డెట్రాయిట్ వారు మాకోసం వెయిట్ చేస్తూ ఉంటారు గనుక వారి అభ్యర్ధనను సున్నితంగా కాదని చెప్పాము. 'వచ్చే నెలలో మీ ఊరికి వస్తాను. మిమ్మల్ని కలుసుకుంటాం. అప్పుడు మీ దగ్గర ఒక వారం ఉంటామ'ని చెప్పాను.
ఈసారి లీవు బాధ లేదు. ఉద్యోగపరంగా పరిమితులు, కట్టుబాట్లు లేవు. కొన్ని సబ్జెక్ట్ లే వ్రాయాలి మిగతావి వ్రాయకూడదు అనే గొడవలు లేవు. కాబట్టి అమెరికా ఉండనిచ్చినన్ని రోజులు ఇక్కడ ఉంటాను. పాతమిత్రులను, శిష్యులను కలుసుకుంటాను. నా టైంటేబుల్ ప్రకారం నా జీవితాన్ని గడుపుతాను. నా టైంటేబుల్ ఏంటో తెలుసుకుందామని ఉందా? చాలా సింపుల్ వినండి.
ప్రతిరోజూ యోగాభ్యాసం, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం, జపధ్యానాలు, చాలాకాలంగా వాయిదా వేసిన కొన్ని మంత్ర-తంత్ర సాధనలు, బోధన, పుస్తకాలు వ్రాయడం, శిష్యులకు మార్గదర్శనం, యూట్యూబ్ వీడియో ఛానల్ ప్రారంభం, వీడియోలు చెయ్యడం, షార్ట్ ఫిలిం లు తియ్యడం, పాటలు పాడటం ఇవన్నీ చేస్తూ రోజులు గడుపుతాను.
ఈ జీవితానికి 'న్యూ లైఫ్' అని పేరుపెట్టాను. ఈ పేరును మెహర్ బాబా జీవితం నుంచి తీసుకున్నాను.
న్యూ లైఫ్ ఆల్రెడీ మొదలైపోయింది.