నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 62 (నా కోరికలు తీరడం నాకిష్టం లేదు)

పన్నెండేళ్ల నుంచీ చెప్పిందే చెబుతూ, రాసిందే రాస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలాగా నా భావజాలమేంటో చెబుతూనే ఉన్నాను. అయినా, ఈరోజుకు కూడా, నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకోకుండా నాకేదో బోధించాలని చూచే మూర్ఖశిఖామణులు ఉంటూనే ఉంటారు. ఇది నా ఖర్మ అయితే, అది వాళ్ళ ఖర్మ.

నిన్న ఒక ఆగంతకుని నుండి మెయిలొచ్చింది, 'గురూజీ. మీ బ్లాగు పోస్టులు చదివాను. మీతో అర్జంటుగా మాట్లాడాలి. మీ ఫోన్ నంబర్ ఇస్తారా?' అని.

'నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. వాట్సాప్ కాల్ మాట్లాడను. మీరు మామూలు కాల్ చేస్తానంటే నా ఫోన్ నంబర్ ఇస్తాను, అప్పుడు మనం ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు' అని మెయిలిచ్చాను. అతను చెయ్యడని నాకు తెలుసు.

అనుకున్నట్లే ఇలా రిప్లై వచ్చింది.

'సారీ అండి. మీరు ఇండియాలో ఉన్నారనుకున్నాను. మామూలు కాల్ చేస్తే నాకు బోలెడంత మోగుతుంది. అందుకని మెయిలే చేస్తున్నాను' అంటూ తను చెప్పాలనుకున్నది మెయిల్లో రాసుకొచ్చాడు.

మెయిల్లోనే మా సంభాషణ జరిగింది.

'మీ బ్లాగు పోస్టులు చదువుతున్నాను. మీకు జ్ఞానం ఉందిగానీ పరిపూర్ణజ్ఞానం లేదు. మా గురువుగారిని అనుసరిస్తే మీకు పరిపూర్ణమైన జ్ఞానం వొస్తుంది' అనేది ఆ మెయిలు సారాంశం.

'నేను పరిపూర్ణజ్ఞానినని చెప్పినట్లు నాకెప్పుడూ గుర్తులేదు. అంతటి పరిపూర్ణజ్ఞానంటూ ప్రస్తుతం ఈ భూమ్మీద ఒకడున్నాడని కూడా నాకు నమ్మకం లేదు. ఇంతకీ మీ గురువెవరు?' అడిగాను.

'ఫలానా' అంటూ ఒక పాపులర్ గురువు పేరు చెప్పాడతను.

నవ్వీనవ్వీ దగ్గుతో నాకు కొరపోయింది.

కాలక్షేపం అంటూ లేకుండా అమెరికాలో ఊరకే ఉన్నానేమో, 'భలే మంచి చౌకబేరమూ' అనిపించింది.  బాగా ఆడుకుందామనుకున్నా.

'మీ గురువుగారు నాకంటే ఏ విధంగా ఎక్కువో ముందు చెప్పండి. ఆ తరువాత నేను మీతో చేరతానో లేదో చెబుతా' అన్నాను.

అతను వెంటనే హర్టయ్యాడు.

'ఏంటి? ఏమనుకుంటున్నారు మా గురువుగారంటే? మా సంస్థ చిన్నాచితకది కాదు. మా గురువుగారి దగ్గర ఇన్ని వేలకోట్లున్నాయి, మీ దగ్గరెన్ని ఉన్నాయి?' అన్నాడు.

'ఓహో ! కోట్లుండటం గురుత్వానికి, జ్ఞానానికి చిహ్నమా?' అనుకొని,' రెడ్ లైట్ క్వీన్ రేష్మాబేగం దగ్గర కూడా కోట్లున్నాయి. మనిద్దరం ఆమె ఆశ్రమంలో చేరదామా మరి?' అడిగాను.

ఇంకా తీవ్రంగా హర్టయ్యాడు. 

'అదేంటండి అలా మాట్లాడతారు? మా గురువుగారిని రెడ్ లైట్ అంటారా?' అన్నాడు.

'రెడ్ లైట్ చూపించేవాడే గురువౌతాడు. మీరు చేసే ప్రతిపనికీ గ్రీన్ లైట్ చూపిస్తే వాడూ మీలాంటి  మామూలు మనిషే. వాడికీ మీకూ తేడా ఏముంటుంది?' అన్నాను.

ఇలా కాదనుకున్నాడో ఏమో, మాటమార్చాడు.

'మా సాధనలలో ఒక్కదానిని చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది' అన్నాడు.

'అదేంటో చెప్పండి వింటాను' అన్నాను.

'తెల్లవారు జామున 3 గంటలకి నిద్రలేవండి. ఒక కోరికను మనసులో అనుకోండి. వారంలో మీ కోరిక తీరకపోతే అప్పుడు చెప్పండి' అన్నాడు రోషంగా.

పొద్దున్నే ఈ పిచ్చోడెక్కడ దొరికాడ్రా దేవుడా? అనుకున్నా.

'అంత పొద్దున్నే లేవడమెందుకు? కోరికలు కోరుకోవడమెందుకు?' అన్నాను.

'లేకపోతే ఎలా తీరుతాయి మీ కోరికలు?' అన్నాడు.

'వీడికి నిజంగా పిచ్చే' అని నాకు ఖాయమైపోయింది. కొద్దోగొప్పో పిచ్చి లేనిదే ఆధ్యాత్మికం ఛాయలకు ఎవరూ రారని మా ఫ్రెండ్ శ్రీకాంత్ అంటూ ఉండేవాడు గతంలో. అది నిజమైనందుకు సంతోషం కలిగింది.

'నా కోరికలు తీరడం నాకిష్టం లేదు' అన్నాను.

ఖంగుతిన్నాడు పిచ్చోడు.

'అదేంటి?' అని సందేహం వెలిబుచ్చాడు.

'అవును కోరికలన్నీ తీరిపోతే ఆ తరువాత ఇంకేముంటుంది?  అంతా శున్యమేగా? అందికని, నా కోరికలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి.  అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. ఇదే నా ఫిలాసపీ. అందుకే, కోరికలను తీర్చుకోవద్దని, ఇంకా ఇంకా పెంచుకోమని మాత్రమే నేను నా శిష్యులకు బోధిస్తూ ఉంటాను. కనుక మీ సాధన నాకు పూలిష్ గా కనిపిస్తున్నది. తెల్లవారుజామున మూడింటికి నిద్రలేవడమేంట్రా పిచ్చోడా? నేనూ లేవను, నువ్వూ లేవకు. అది మనిద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు' అన్నాను.

రిప్లై రాలేదు. ఇక రాదని కూడా నాకర్ధమైపోయింది. అందుకని నేనే ఇలా మెయిలిచ్చాను.

'చూడు గుర్నాధం ! అన్ని వేలకోట్లు బ్లాక్ మనీ వెనకేసిన మీ గురువుగారికి కూడా ఇంకా కోరికలు మిగిలున్నాయి చూడు. అదే ఆయన ఖర్మని నామాటగా ఆయనకు చెప్పు. అయినా ఆ కోట్లన్నీ ఎలా వొచ్చాయి ఆయనకు? ఏమైనా కష్టపడి సంపాదించాడా? డొనేషన్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్సే కదా అంతా. అంత బిజినెస్ ప్లాన్లు నాకు లేవని ఆయనతో చెప్పు. ఇంకోమాట. అంత పొద్దున్నే లేచి కలలు కంటూ కూచోవద్దని కూడా చెప్పు, ఆ కలలేవో హాయిగా పడుకొని కనమను. ఇంట్లోవాళ్లకు బాధ తప్పుతుంది. ఎందుకంటే, ఆయన లేచాడని వాళ్ళు కూడా లేచి కాఫీనీళ్ళు ఆయన మొహాన పొయ్యాలి కదా ! వాళ్ళ నిద్ర ఎందుకు చెడగొట్టడం? ఇకపోతే, ఇలాంటి చెత్త సలహాలు ఇస్తూ మళ్ళీ నాకు మెయిల్ చెయ్యకు. నీ మెయిల్ ఐడీ బ్లాక్ చేస్తున్నాను. 

చివరగా ఒక సలహా. మీ గురువుగారిని వచ్చి నాదగ్గర కొన్నాళ్ళుండి నేను చెప్పేది నేర్చుకోమని చెప్పు, బాగుపడతాడు. నీకంత ధైర్యం లేదని నాకు తెలుసు. కానీ నిజాన్ని చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఉంటా మరి, చెత్తమెయిల్స్ చెయ్యకు' అని చెప్పి అతన్ని బ్లాక్ చేసేశాను.

అదీ సంగతి.

వెనకటికి కొంతమంది గుడ్డోళ్లు చేరి, కళ్ళున్నవాళ్లకు దారిచూపిస్తాం రమ్మన్నారట  

కలికాలమంటే ఇదేనేమో ?
read more " మూడవ అమెరికా యాత్ర - 62 (నా కోరికలు తీరడం నాకిష్టం లేదు) "

మూడవ అమెరికా యాత్ర - 61(అమెరికాలో దేవాలయాలు)

అమెరికా వచ్చిన నాలుగునెలలలో ఇప్పటికి రెండు గుళ్ళు చూచాను. అదికూడా పక్కవారికోసం వెళ్లడమే గాని, మనకు గుళ్ల పిచ్చి లేదు. నిజం చెప్పాలంటే ఇండియా అయినా ఇక్కడైనా చాలా గుళ్ళలో నాకేమీ అనుభూతి కలగదు. కారణం? వాటిలో భక్తికంటే వ్యాపారధోరణి ఎక్కువగా ఉండటమే.

అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఎన్ని గుళ్ళున్నాయో నాకైతే తెలియదు. ప్రస్తుతం ఇంకా ఎన్ని గుళ్ళు కడుతున్నారో అసలే తెలియదు. కానీ ఒక్క విషయం చెప్పగలను. వీటిల్లో ఎక్కడా దైవశక్తి లేదు. అంతా ఫక్తు వ్యాపారమయమే.

ఇక్కడున్న మనవాళ్ళు కూడా, మన ఆచారాలను, మన ఆధ్యాత్మికతను ఏదో మిస్సవుతున్నామన్న ఫీలింగ్ తో గుళ్లకు వెళ్లి పూజలు చేయించుకుంటూ ఉంటారు గాని, వారికి కూడా నిజమైన ఆధ్యాత్మికత ఏమాత్రమూ తెలియదు. ఇక పూజారులు చూద్దామా అంటే, కొత్త కొత్త గుళ్ళు, కొత్త క్లయింట్లు, కొత్త బిజినెస్, ఇది తప్ప వారికి కూడా దైవశక్తి లేదు. పూజారికి దైవశక్తి ఉండటమంటే, నేతిబీరకాయలో నెయ్యి ఉన్నట్లే కదా !

ఇక్కడున్న చాదస్తపు ఇండియన్స్ చూద్దామంటే, పండగలు పబ్బాలు వచ్చినపుడు పంచెలు, చీరలు కట్టుకుని గుళ్ళకొస్తారు. పూజలు, ప్రసాదాలు, హెచ్చులు, ముచ్చట్లు హోదాల ప్రదర్శనలు అంతా మన ఇండియాలో లాగే గోలగోలగా ఉంటుంది.  కాకపోతే, ఇండియాకంటె ఇక్కడ గ్రూపులు ఇంకా ఎక్కువ. ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళతోనే కలుస్తారు. ఏ కులగ్రూపుతో ఆ కులపువాళ్ళే కలుస్తారు. ఇక్కడ కూడా కులగుళ్ళు బాగా పెరుగుతున్నాయి. గ్రూపులు ఎప్పుడో వచ్చేశాయి. మన దరిద్రాలన్నీ ఇక్కడకు కూడా దిగుమతి అయ్యాయి, ఇంకా అవుతున్నాయి.

ఈ రోజు ఉదయం ఒక గుడికెళ్ళాను. వెళ్ళాను అనడం కంటే వెళ్ళవలసి వచ్చింది అనడం సబబుగా ఉంటుంది. ఒక ముప్పై అడుగుల విగ్రహం పెట్టారక్కడ. ఇంకా కొన్ని జంబో సైజు విగ్రహాలు ఆరుబయట గ్రౌండులో ఎందుకెండుతూ, వానకు తడుస్తూ అఘోరిస్తున్నాయి. ఏమంటే, వాటికి గుడికట్టాలి, కట్టినప్పుడు లోపలకు తెస్తామన్నారు. నవ్వొచ్చింది. మరి నెత్తిమీద కప్పు లేకుండా, 30 అడుగుల విగ్రహాలను ఇండియాలో తయారుచేయించి, యిక్కడకు షిప్పింగ్ చేయించి, ఆరుబయట వెయిటింగ్ లో పెట్టడం ఏమిటి? ఆలోచిస్తే దీని వెనుక రహస్యం క్షణంలో అర్ధమైంది.

దేవుడు ఎండకెండి, వానకు తడుస్తున్నాడని రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేసి డొనేషన్లు దండుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఇష్టదైవాలు అలా ఆరుబయట అఘోరిస్తుంటే ఏ హిందువు మాత్రం ఊరుకుంటాడు? కాబట్టి, బాధతో, భయంతో, కుప్పలుగా విరాళాలిస్తారు. అందులో సగం బొక్కెయ్యచ్చు, మిగతాదాంతో మళ్ళీ బిజినెస్  మొదలు. ఆ బిజినెస్ లో  మళ్ళీ ఆ జనమే సమిధలు. పిచ్చిజనం పిచ్చి గోల !

ఈ గుడి కమిటీ ఎవరు? అని అక్కడి పిల్లపూజారిని అడిగాను. వేరే ఇంకొక గుడిలో చాలా ఏళ్ళు పనిచేసిన ఒక  పెద్దపూజారి, గ్రీన్ కార్డు వచ్చాక, అక్కడ మానేసి, ఈ స్థలం కొని ఇక్కడ కొత్త గుడి మొదలుపెట్టాడని చెప్పాడు పిల్లపూజారి. ఈ మధ్యన చాలామంది పూజారులు అలా చేస్తున్నారు. గ్రీన్ కార్డు రావడం ఆలస్యం,  వేరే చిన్న గుడి కట్టేసుకుంటున్నారు. మనవాళ్ళు గనక, కంపెనీలు మారినట్లు, లేదా తామే ఒక స్టార్ట్ అప్ కంపెనీ పెట్టినట్టన్నమాట !

అది సాఫ్ట్ వేర్ టెక్నాలజీ. ఇది రెలిజియస్ టెక్నాలజీ. అంతే తేడా.

గుడిగా మార్చకముందు ఇదొక చర్చ్ అట. ఎవరూ రాకపోతుంటే, ఆ అమెరికన్ కమిటీవారు దాన్ని అమ్మేశారు. ఇక్కడ క్రైస్తవం వేగంగా క్షీణిస్తున్నది. చదువుకున్న వాళ్ళెవరూ దాన్ని నమ్మడం లేదు. స్థలం చీప్ గా వస్తోందని మనవాళ్లు కొనుక్కుని మన గుడిగా మార్చారు. కానీ వీళ్ళు చేస్తున్నది కూడా బిజినెస్సే, అదే సారాయిని ఇంకొక సీసాలో పోశారు అంతే. సరుకు అటూఇటుగా అదే, ప్యాకింగ్ మాత్రమే మారింది.

దణ్ణం పెట్టుకుని వచ్చేస్తుంటే, 'డిసెంబర్ నాలుగున రండి.  అభిషేకం ఉంది' అన్నాడు పిల్లపూజారి.

'ఎవరికి?' అన్నా సీరియస్ గా.

'స్వామికి?' అన్నాడు పూజారి అయోమయంగా..

ఇంకా ఎందుకులే పాపం పిల్లోడిని ఆడుకోవడమనిపించి, నవ్వేసి బయటకొచ్చేశా.

30 అడుగులు 40 అడుగులు విగ్రహాలు పెడుతున్నారు, పూజలు అభిషేకాలు చేస్తున్నారు గాని అక్కడ దైవశక్తి ఏమీ ఉండటం లేదు.  ఈ విషయం పిచ్చిభక్తులకు తెలీదుకదా, వస్తున్నారు, పోతున్నారు. మాయాప్రపంచం భలే సరదాగా ఉంది !

ఒక గుడిలో దైవశక్తి ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఎలా ఆ గుడిని మెయిన్ టెయిన్ చెయ్యాలి? అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు. అంతా వ్యాపారం అయిపొయింది. ఛీ అనిపించింది.

ఇక్కడ గుళ్ళు మన ఇండియాలో గుళ్లలాగా ఉండవు. మన ఇండియాలో చేసినట్టు ఇక్కడ గోలచేస్తే, వెంటనే మూస్తారు. కనుక, అదొక ఇల్లులాగే ఉంటుంది. లోపల మాత్రం శుచీ శుభ్రతా ఏమీ ఉండవు. స్టోర్ రూమంటూ ఉండదో, లేక ప్లాన్ చేసుకోరో తెలీదుగాని, అన్నీ చెల్లాచెదురుగా పడేసి ఉంటాయి. మనం గుడికొచ్చామా, లేక, ఒక పచారీ కొట్టుకొచ్చామా అని అనుమానం మనకే వస్తుంది. అంత గందరగోళంగా ఉంటుంది లోపల.

ఇంకా చెప్పాలంటే, ఒక డీసెన్సీ అన్నది, ఒక నీట్ నెస్ అన్నది ఇక్కడి చర్చిలలోనే కన్పిస్తుంది గాని మన గుళ్ళలో ఎక్కడా కనిపించదు  మన గుళ్ళు సూపర్ బజార్ లాగా ఉంటాయి గాని దేవాలయం లాగా ఉండవు. 

ఇక్కడున్న మనవాళ్లలో కొందరికి గురువులుగా చెలామణీ అవుదామని తెగ దురదగా ఉంటుంది. వాళ్ళు ఈ గుళ్ళలో ఫౌండర్లుగా, కమిటీ మెంబర్లుగా, ఉంటారు. కొంతమంది అందులో దూరదామని చూస్తూ ఉంటారు.  కొంతమంది దూరి, అధికారం చెలాయిస్తూ ఉంటారు.  వాళ్ళకదొక సంతుత్తి.

వీళ్ళందరూ నాకు ఎదిగీ ఎదగని అటిజం పిల్లల్లాగా కనిపిస్తున్నారు.

పేరేమో ఒక దేవుడి గుడి అని ఉంటుంది, కానీ లోపలకెళ్తే మ్యూజియం లో ఉన్నట్లు, పాత, క్రొత్త, కొక్రొత్త ఇలా ఎంతోమంది దేవతల విగ్రహాలు కనిపిస్తున్నాయి. కొన్నేమో, పాతబడిపోయి మూలల్లో అఘోరిస్తూ కన్పిస్తున్నాయి. వాటినెవరూ పట్టించుకోవడం లేదు.

'ఒక్క దేవుడి గుడిని కట్టుకుని దాన్ని శుద్ధంగా మెయిన్ టెయిన్ చెయ్యవచ్చు కదా ! ఇంతమంది దేవుళ్ళని పెట్టి, మొయ్యలేని బరువును నెత్తికెత్తుకోవడం ఎందుకు?' అని కర్ణపిశాచిని అడిగాను.

'ఏంటీ దేవతల విషయాలు నన్నడుగుతున్నావ్?' అంది కొంటెగా.

'పేరుకు పిశాచివైనా నువ్వుకూడా ఒక మినీదేవతలాంటి దానివే కదా? అందుకే నిన్నడిగా. అయినా నువ్వుతప్ప నాకెవరున్నారు చెప్పు?' అన్నా ఉబ్బేస్తూ.

'ఒద్దులే. ఇంకెవరిదగ్గరైనా వెయ్యి ఈ డ్రామాలు. మేం పడం ఇటువంటివాటికి' అంది నవ్వుతూ.

'సరే, అడిగినదానికి చెప్పచ్చు కదా?' అన్నాను బ్రతిమాలుతూ.

'అలా రా దారికి. ఇందులో ఏమీ బ్రహ్మరహస్యం లేదు. ఒక్కదేవుడిని పెడితే ఆయన భక్తులే వస్తారు. ఆయన పండగ ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది. మిగతా ఏడాదంతా గుళ్ళో ఈగలు తోలుకోవాలి. అందుకని అందరినీ గేలం వేసి పట్టడానికి, అంతమంది దేవతలను పెడతారు. సింపుల్' అంది కర్ణపిశాచి.

'అంతమందిని పెట్టుకుంటే ఏకనిష్ఠ ఎలా ఉంటుంది?' అడిగాను.

'అందుకే అక్కడ దైవశక్తి ఏమీ ఉండదు. అదొక బిజినెస్ అంతే' అని చప్పరించేసింది కర్ణపిశాచి.

'అంతేనా? మన ఇండియాలో చాలదని ఇక్కడ కూడా మొదలుపెట్టారన్నమాట?' అన్నా.

'ఇండియాలో చాలా నయం. శక్తివంతమైన క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఒక దేవుడంటే, అక్కడ శుద్ధంగా ఆ దేవుడికే పూజ జరుగుతుంది. కనుక శక్తి ఉంటుంది. అలాంటిచోట్లలోనే అవినీతి జరుగుతోంది. ఆఫ్కోర్స్ అక్కడ కూడా బిజినెస్ గుళ్ళు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవడమే అనవసరం. ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ఆరాధనా స్థలమైనా ఇంతే. అసలు విషయం ఏమీ ఉండదు. పొట్టు ఫుల్లు. బియ్యం నిల్లు. అంతే' అంది కర్ణపిశాచి.

పిశాచయినా సత్యం చెప్పింది. సంతోషం కలిగింది.

సృష్టిలో దైవాన్ని చూడలేనివాడే గుడిలో చూస్తాడు. సాటిజీవులలో దైవాన్ని చూడలేనివాడే ఎక్కడో దృష్టి సారిస్తాడు. మళ్ళీ ఇందులో డబ్బు, కులాలు, అహంకారాలు, హెచ్చులు, గొప్పలు రాజకీయాలు, కుట్రలు, పైరవీలు.

దేవుడా ! ఎలా భరిస్తున్నావ్ ఈ మనుషుల్ని ?

read more " మూడవ అమెరికా యాత్ర - 61(అమెరికాలో దేవాలయాలు) "

25, నవంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 60 (డెట్రాయిట్ కి తిరిగి వచ్చేశాం)

షాంపేన్ సిటీలో రెండువారాలుండి, స్పిరిట్యువల్ రిట్రీట్ నిర్వహించి, నిన్ననే మళ్ళీ డెట్రాయిట్ కు తిరిగి వచ్చేశాం. వచ్చేటప్పుడు కూడా AMTRACK రైల్లోనే ప్రయాణం. మళ్ళీ చికాగో వచ్చి, అక్కడ రైలు మారి, ట్రాయ్ సిటీకి చేరుకున్నాం. ఉదయం తొమ్మిదికి రైలెక్కితే రాత్రి తొమ్మిదికి ట్రాయ్ కి వచ్చేశాము.  మధ్యలో చికాగోలో ఒక గంట వెయిటింగ్. 

సౌత్ నుంచి నార్త్ కి వెళుతున్నాం కాబట్టి చలి పెరుగుతుంది. చికాగో నుంచి ట్రాయ్ వెళ్లే దారిలో కంట్రీసైడ్ అంతా మంచుతో కప్పబడి కనిపించింది. ఇళ్లన్నీ మంచులో ఉన్నాయి. న్యూయార్క్ లో కూడా గత వారం చాలా ఎక్కువగా మంచుకురిసి కొంతమంది చనిపోయారు కూడా. అక్కడ ఐదడుగుల ఎత్తులో మంచు పేరుకుంది.

బ్యాటిల్ క్రీక్, డెట్రాయిట్, డియర్ బార్న్, రాయల్ ఓక్, ట్రాయ్ అన్ని సిటీలూ వర్షం పడినట్లు రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఈరోజు థాంక్స్ గివింగ్ డే. రేపు బ్లాక్ ఫ్రై డే.  కనుక, ఇక్కడ హాలిడే. ప్రతి సిటీలోనూ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపులన్నీ మూసేసి ఉన్నాయి. 

ట్రెయిన్లో నా ప్రక్కన ఒక అమెరికన్ అబ్బాయి కూచున్నాడు. చికాగోలో చదువుకుంటూ, కలమజూ అనే ఊరిలో ఉన్న పేరెంట్స్ దగ్గరకు వస్తున్నాడు. తనకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టమని దానిపైన రీసెర్చి చేస్తున్నానని చెప్పాడు. ఇండియానాపోలిస్ లో ఏదో ఇండియన్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగితే అక్కడకు వెళ్లి మరీ విన్నానని చెప్పి ఆ వీడియో చూపించాడు.

ఇండియన్ మ్యూజిక్ ఎంత గొప్పదో అతనికి వివరించి చెప్పాను. బసంతి, ఆనందభైరవి, యమన్ కళ్యాణి, దీపక్, మేఘమల్హార్ మొదలైన హిందూస్తానీ రాగాలను గురించి, తాన్సేన్ మొదలైన మహాగాయకుల గురించి, యోగానికీ సంగీతానికీ ఉన్న సంబంధం గురించి అతనికి వివరించాను. ఇండియన్ మ్యూజిక్ మీద రీసెర్చి చెయ్యమని అతనికి చెప్పాను. గంట తర్వాత కలమజూ స్టేషన్ వచ్చినపుడు వదల్లేక వదల్లేక తన  బ్యాగ్ తీసుకుని దిగిపోయాడు.

రాత్రి తొమ్మిదికి ట్రాయ్ లోని మా ఇంటికి చేరుకున్నాం.


చికాగో పరిసరాలు










చికాగో రైల్వే యార్డ్

















చికాగో రైల్వే యార్డ్





చికాగో రైల్వే యార్డులోని పాయింట్స్, క్రాసింగ్స్, క్రాసోవర్స్






ట్రెయిన్ పాంట్రీ కార్లో ఉన్న AMTRACK కంపెనీ వారి ఫోటో



చీకటి పడింది




ట్రాయ్ స్టేషన్ వచ్చేసింది

read more " మూడవ అమెరికా యాత్ర - 60 (డెట్రాయిట్ కి తిరిగి వచ్చేశాం) "

21, నవంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 59 (సంతోషం)

తల్లి ఒడిలో కళ్ళు తెరచిన

క్షణం నుండి

నీ పయనం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా పయనించు


ఊపిరి పీల్చుకోవడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ నడక మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా నడువు


గడపదాటి బయటకు

అడుగేసిన క్షణం నుండి

అందరితో నీ స్నేహం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా సాటివారిని ఆదరించు


తిండనేది తినడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ బ్రతుకు మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా బ్రతుకు


నవ్వూ ఏడుపుల మధ్యన

నీ జీవితంలోకి 

దేనిని తీసుకోవాలనేది మాత్రం

నీ చేతిలోనే ఉంది

నవ్వునే స్వీకరించు


ఏ పరిస్ధితిలో ఉన్నప్పటికీ

సంతోషంగా ఉండాలా

ఏడుస్తూ ఉండాలా

అనేది మాత్రం నీ చేతిలోనే ఉంది

సంతోషంగా ఉండు


సంతోషమనేది బయట లేదు

నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో లేదు

నీకు కలిగే లాభాలలో లేదు

జీవితమంటే నీ అవగాహనలో ఉంది

దానిని నీలో కళ్ళు తెరవనీ


అన్నీ ఉన్నా ఏడుస్తూ ఉండచ్చు

ఏమీ లేకున్నా సంతోషంగా ఉండచ్చు

ఉండటం లేకపోవడాల మీద

సంతోషం ఆధారపడి లేదు

ఈ అవగాహనను నీలో వెలగనీ


సంతోషపు రహస్యమేమిటో చెప్పనా?

కృతజ్ఞత నీలో ఉంటే 

సంతోషం నీలో ఉంటుంది

నీలో ఏ అర్హతలూ లేకున్నా

నీకు దక్కిన వరాలు గుర్తుంటే

సంతోషం నీలో ఉంటుంది


బ్రతకడానికి నీకేం అర్హతుంది?

కానీ సృష్టి నిన్ను బ్రతకనిస్తున్నది 

ఈ కృతజ్ఞత అనుక్షణం నీలో ఉండాలి

అప్పుడే సంతోషరహస్యం నీకర్థమౌతుంది

అప్పుడే నీ జీవితం ఆనందమయమౌతుంది

read more " మూడవ అమెరికా యాత్ర - 59 (సంతోషం) "

20, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 58 ('శ్రీరామగీత' అమెరికానుండి విడుదల)

నా కలం నుండి వెలువడుతున్న 55 వ పుస్తకంగా ఆధ్యాత్మ రామాయణాంతర్గతమైన 'శ్రీరామగీత' నేడు విడుదల అవుతున్నది. దీనిని అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రం లోని షాంపేన్ సిటీ నుండి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాను.

మన హిందూమతంలో ఉన్న గ్రంధములలో నూరుకు పైగా 'గీత' లున్నాయి. అయితే, వాటిలో బహుళ ప్రచారమును పొందినది భగవద్గీత ఒక్కటే. కానీ, ఇతరములైన, దేవీగీత, హంసగీత, ఉద్ధవగీత, వశిష్టగీత, బ్రాహ్మణగీత మొదలైన ఎన్నో గీతలున్నాయి. బౌద్ధంలోని ధమ్మపదమును కూడా 'బుద్ధగీత' అంటారు. సంస్కృతంలో గీతమంటే 'చెప్పబడినది, గానం చేయబడినది' అని అర్ధము. ఆయా మహనీయుల బోధలన్నీ వారివారి 'గీతము' లనిన పేర్లతో మనకు లభిస్తున్నాయి. 


అత్యున్నతమైన వేదాంతతత్త్వమును ప్రతిపాదించే గ్రంధములే వీటిలో ఎక్కువగా ఉంటాయి. వేదప్రతిపాదితమైన పరబ్రహ్మతత్వమును, దానిని చేరుకునేటటువంటి జ్ఞానమార్గ సాధనను వివరించినది ఈ 'శ్రీరామగీత'. అంతేగాక, కర్మ, భక్తి, జ్ఞానమార్గములను, సాకార సగుణోపాసనను, నిరాకార నిర్గుణోపాసనను సమన్వయపరుస్తూ చెప్పబడిన అద్భుతమైన తాత్వికచింతన దీనిలో ఉంటుంది. శ్రీరాముని యొక్క అవతారతత్వమును, పరబ్రహ్మతత్వమును వివరిస్తూ ఈ గ్రంధం ఉంటుంది.


శ్లో || రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః

రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః ||


రూపు దాల్చిన ధర్మమే రాముడు. ఆయన సౌమ్యుడు, సత్యమైన పరాక్రమవంతుడు. సర్వలోకములకు ఆయనే రాజు. దేవతలలో ఇంద్రునివంటివాడు.


శ్లో || జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం

యదిచ్ఛసి చిరం భోక్తుమ్ మా కృథా రామ విప్రియమ్ ||


నీ జీవితమునుగాని, సుఖమును గాని, దుర్లభమైన రాజ్యమును గాని, ఎక్కువకాలం కొనసాగించాలనుకుంటే రాముడిని నీ శత్రువుగా చేసుకోకు.


అని మారీచుడు, రావణునకు బోధించినట్లుగా రామాయణం అరణ్యకాండలో మనం చూడవచ్చు. అటువంటిది శ్రీరాముని మహోన్నతమైన వ్యక్తిత్వము, అవతారతత్వము.


ప్రాచీనకాలంనుంచీ, శ్రీరామచంద్రుని ఆరాధనకు ఆంధ్రదేశం పెటింది పేరు. 50 ఏళ్ల క్రితం నా చిన్నతనంలో, గ్రామగ్రామంలోనూ రామాలయాలు ఉండేవి. రామభజనలు, సంకీర్తనలు, శ్రీరామనవమి, హనుమజ్జయంతి ఉత్సవములు జరుగుతూ ఉండేవి. ఎంతవరకైతే సమాజంలో రామభక్తి ఉన్నదో అంతవరకూ ఆంధ్రదేశం అన్నింటిలోనూ పురోగమిస్తూ ఉండేది. సమాజంలో నీతినియమములు, పద్ధతులు కూడా చక్కగా ఉండేవి. ప్రజలు ధర్మాన్ని తప్పకుండా ఉండేవారు. రానురాను రామభక్తి తగ్గిపోతూ వచ్చింది. రావణాసురుడిని హీరోగా చూపిస్తూ సినిమాలు తియ్యడం మొదలైంది. రామాయణవిషవృక్షం వంటి విషపు పుస్తకాలు వచ్చాయి. అప్పటినుంచీ ఆంధ్రదేశ పతనం మొదలైంది.


శ్రీరాముడి వేషాలు సినిమాలలో వేసి పేరు తెచ్చుకున్నవారు కూడా నిజజీవితంలో ధర్మాన్ని తప్పారు. పతనమయ్యారు. 'యథారాజా తథాప్రజా' అన్నట్లు క్రమేణా ప్రజలలో కూడా రామభక్తి లోపిస్తూ వచ్చింది, దానికి తగినట్లే, సమాజంలో నీతినియమాలు మాయమౌతూ వచ్చాయి. ప్రస్తుతం ధర్మంతో కూడిన జీవితాలు ఎక్కడా కనపడటం లేదు. ధర్మానికి ప్రాధాన్యం మాయమై, ధనానికి, అవినీతికి ప్రాధాన్యం పెరిగింది. హిందూవ్యతిరేక మతాలు చాపక్రింద నీరులాగా సమాజంలోకి పాకడం మొదలు పెట్టాయి. సమాజం క్రమేణా బీటలువారుతూ వచ్చింది. ఇదంతా రావణభక్తి ఫలితమే.

ధర్మస్వరూపుడైన శ్రీరాముని భక్తి సమాజంలో తగ్గిపోవడమే ఆంధ్రదేశపు నేటి దురవస్థకు గల ప్రధానమైన కారణం. మళ్ళీ రామభక్తి పుంజుకున్ననాడే ఆంధ్రదేశం అన్నిటా బాగుపడుతుంది. లేదంటే ఆంధ్రదేశం ముందుముందు ఏమౌతుందో చెప్పడం కష్టం. రాముని వ్యతిరేకించేవారు రాక్షసులే కాబట్టి, రాక్షసులతో నిండిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.


అదంతా అలా ఉంచితే, ఒక్క వారం రోజులలో ఈ పుస్తకమును వ్రాయగలగడానికి తగిన వాతావరణమును సమకూర్చి సహకరించిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లు, షాంపేన్ లో మమ్మల్ని ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తున్న శ్రీనివాస్ నూకల దంపతులకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులను అందిస్తున్నాను. వారి చేతులమీదుగా అమెరికానుండి ఈ మహత్తరమైన గ్రంధం విడుదల అవుతున్నది.


అమెరికా వచ్చాక ఇప్పటికి అయిదు పుస్తకాలను వ్రాశాను. ఇండియా వచ్చేలోపల ఇంకొక అయిదు పుస్తకాలను వ్రాయాలని సంకల్పం. ఏమౌతుందో చూడాలి.


యధావిధిగా ఈ గ్రంధం కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. చదవండి. హిందూమతాన్ని సక్రమంగా అర్ధం చేసుకోండి. మీ జీవితాలకు ధన్యత్వాన్ని అద్దుకోండి.

read more " మూడవ అమెరికా యాత్ర - 58 ('శ్రీరామగీత' అమెరికానుండి విడుదల) "

16, నవంబర్ 2022, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 57 (గంగిగోవు పాలు)

మొన్నొకాయన కనబడి, 'మా అబ్బాయిని తీసుకుని ఆదివారం సాయంత్రం మీ దగ్గరికి వస్తాను, మీ ఆశీస్సులు వాడికి కావాలి' అన్నాడు. 2017 లో నా స్పీచి ఆయన విన్నాట్ట. ఇప్పుడు మళ్ళీ షాంపేన్ కు వచ్చానని తెలిసి, వాళ్ళబ్బాయిని తీస్కుని వస్తానంటాడు. 

'ఆశీస్సులు కావలసింది నీకు. మీ అబ్బాయికి కాదు. రావద్దు' అని చెప్పాను.

ఆశీస్సులివ్వడానికి నేనేమైనా స్వామీజీనా? పైగా, వారికి కావలసిన ఆశీస్సులేమిటి? అన్నిట్లో కలసి రావడం, డబ్బులు బాగా సంపాదించడం, ఇవేగా? నాకు నచ్చనిదే ఇలాంటి ఆశీస్సులివ్వడం. నేనేం చెబుతున్నానో అర్ధం చేసుకోకుండా, వాళ్ళేదో ఊహించుకుని, నన్నలా చెయ్యమంటే, నాకెలా కుదురుతుంది? నేనున్నది అందరి ట్యూన్స్ కు డాన్స్ చెయ్యడానికి కాదు. నా ట్యూనంటూ ఒకటేడిసింది. దాన్ని నేర్చుకునేవారు నాక్కావాలి.

ఆయన మళ్ళీ అడిగితే, ఇలా చెప్పమన్నాను.

'పాదపూజకైతే పదివేల డాలర్లు అవుతాయి. పోనీ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి తొమ్మిది వేలివ్వండి. గురూజీ ఏదోరకంగా సర్దుకుంటారు'  

మళ్ళీ ఆయన మాట్లాడితే ఒట్టు !

ఇంకొకాయన ఊరకే ఒకసారి సరదాగా వచ్చి కలుస్తానన్నాడు.

'రావద్దు' అని చెప్పమన్నాను.

సరదాగా కలవడానికి నేనేమైనా ఈయన గర్ల్ ఫ్రెండ్ నా? ఈరోజుల్లో అదికూడా ఊరకే ఏమీ కలవదు.  దానికి బోలెడు గిఫ్టులివ్వాల్సి ఉంటుంది. పైగా ఊరకే వచ్చి కాలక్షేపం కబుర్లు, ఇండియా రాజకీయాలు మాట్లాడటానికి నేనేమీ పనీపాటా లేనివాడిని కాను. అలాంటివాళ్ళు చాలామందుంటారు. పోయి వాళ్ళతో ముచ్చట్లేసుకోమని చెప్పాను. వాళ్ళ విజ్ఞానప్రదర్శనకు నేనొక్కడినే దొరికానా? నాకున్న విజ్ఞానమే ఎక్కువై నేను చస్తుంటే పైగా వీళ్ళ విజ్ఞానాన్ని నేనెక్కడ మోసేది?

ఇంకొకామె, 'నేను పాతికేళ్లుగా అమెరికాలో క్రియాయోగా టీచర్ని. నా అనుభవాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటారు?' అని మెయిల్ చేసింది.

'ఈ పంచుకోవడం, ఉంచుకోవడం, చించుకోవడాల మీద నాకు మంచి అభిప్రాయం లేదు. మీరు రావద్దు. మీతో ఏది పంచుకోవడానికైనా నేను సిద్ధంగా లేను. సారీ' అని చెప్పాను.

ఈమెకు ఒక శ్రోత కావాలి. ఆమె సోకాల్డ్ అనుభవాలు విని, 'అబ్బా మీరెంత గ్రేటో? మీరు కాబట్టి ఇంత చిన్నవయసులోనే ఇంతమందితో ఇన్ని అనుభవాలు సంపాదించారు. వేరెవరి వల్లా ఇలాంటిది సాధ్యం కాదు' అని ఆమెకు డప్పు కొట్టాలి. ఇది నేనెక్కడ చెయ్యగలను?

నాకు భజన చేసేవాళ్ళకోసం నేను చూస్తుంటే, ఈమెకు నేను భజన చేయాలట. భలే ఉంది. 

'పోపోవమ్మా, వేరే బకరాని వెతుక్కో' అని మెయిలిచ్చాను.

ఇంకొకాయన, 'ఏమండి? నేను ఆధ్యాత్మికానికి పనికొస్తానా? లేక లౌకికంలో ఉండమంటారా? నా జనానా వివరాలు పంపిస్తున్నాను. చూసి చెప్పండి' అని మెయిలిచ్చాడు.

'జనన వివరాలు' అని వ్రాయవలసింది 'జనానా వివరాలు' అని వ్రాశాడు మెయిల్లో.

అతనికిలా రిప్లై ఇచ్చాను.

'చూడు బాబు. నీ జనానా చాలా పెద్దదిగా ఉంది. అసలే ఇండియాలో జనాభా ఎక్కువైపోయింది. నీవంతు కృషితో దాన్నింకా పెంచకు. ఆ జనానాని వదిలేసి ఒక్కదానితో ఉండు. అప్పుడు బాగుపడతావు. ఇంత చిన్నప్రశ్నకు నీ జాతకం చూడక్కరలేదు. నీవు మెయిల్ చేసిన విధానాన్ని బట్టి నీ మొత్తం జాతకం చెప్పగలను. నువ్వు ఆధ్యాత్మికానికీ పనికిరావు, లౌకికానికీ పనికిరావు. వెంటనే బాంబే వెళ్లే రైలెక్కు. అక్కడ  చప్పట్లు కొట్టుకుంటూ షాపుల వెంట తిరిగే బ్యాచ్ ఒకటుంటుంది. అందులో చేరు. నీకదే సరైనది'

'నాకు ఆకలైనప్పుడు నాకు గుర్తు చెయ్యి' అన్నాట్ట వెనకటికి ఒకాయన ! అలా ఉంది. కలెప్పుడౌతుందో జ్యోతిష్యం చూచి తెలుసుకోనక్కరలేదు. ఒక కప్పు ఆముదం త్రాగితే చాలు. మర్నాటికి బ్రహ్మాండంగా ఆకలౌతుంది.

ఆధ్యాత్మికానికి పనికొస్తాడో లేదో నేను చెప్పాలట ! ఎంత కామెడీగా ఉందో ! ఇంకా నయం. 'నేను పెళ్ళికి పనికొస్తానా?' అని అడగలేదు. బ్రతికిపోయాను.

లోకమంతా ఇలాంటి మనుషులతో నిండి ఉంది. ఇలాంటి త్రికరణశుద్ధి లేని మనుషులతో నాకెందుకు? సరియైన దృక్పధం ఉన్నవాడు ఒక్కడు చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు?

ఒకవేళ గంగిగోవు పాలు దొరకలేదనుకో. అప్పుడేం చెయ్యాలి? దొరక్కపోతే పోనీ, నా టైం నాకు మిగుల్తుంది. సోది మనుషులతో సోది కాలక్షేపం తప్పుతుంది కదా? అదే చాలు.

గంగాజలం దొరకలేదని బురదనీళ్ళు త్రాగలేము కదా? ఆవుపాలు దొరకలేదని ఆముదం త్రాగలేము కదా ! నావరకూ నాకంత దాహమైతే లేదు.

ఏం లోకమో? ఏమి మనుషులో?

read more " మూడవ అమెరికా యాత్ర - 57 (గంగిగోవు పాలు) "

15, నవంబర్ 2022, మంగళవారం

మూడవ అమెరికా యాత్ర - 56 (మంచుపూలు)



మంచుపూలు రాలుతున్నాయి
చలి కుంపట్లు రాజుకుంటున్నాయి
మౌనం ముసుగులో ఊరు
మంచు దుప్పటిలో ఇళ్ళు

శరీరం అమెరికాలో
నసు హిమాలయాలలో
అన్నీ అందుబాటులో 
మనసు మరోలోకంలో

భోగభూమిలో యోగం !
read more " మూడవ అమెరికా యాత్ర - 56 (మంచుపూలు) "

మూడవ అమెరికా యాత్ర - 55 (షాంపేన్ రిట్రీట్ ముగిసింది)

11, 12, 13 తేదీలలో జరిగిన షాంపేన్ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.

సాత్వికమైన మితాహారం, యోగాభ్యాసం, ధ్యానం, సందేహాలకు సమాధానాలు, చర్చలతో కూడిన ప్రేమపూరిత వాతావరణంలో ఈ మూడు రోజుల రిట్రీట్ జరిగింది. దైవాన్వేషణ, ధ్యానం, తమను తాము దిద్దుకోవడం, జీవితాలకు ఔన్నత్యాన్ని అద్దుకోవడం - ఇవి తప్ప వేరే మాటలు, ఆలోచనలు ఎవరికీ లేవు.  

అమెరికాలో ఎక్కడెక్కడినుంచో వచ్చిన, ఎవరికెవరో తెలియని క్రొత్తమనుషులు, అందరూ ఒకే కుటుంబంలాగా స్వచ్ఛమైన ప్రేమాభిమానాలతో మూడు రోజులపాటు కలసి మెలసి ఉంటూ, పంచవటి సాధనావిధానాన్ని నేర్చుకున్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూచారు.

ఉన్నతమైన ధ్యానవిధానాలను వీరికి వివరించి, కొన్నింటిని అభ్యాసం చేయించాను. యోగాభ్యాసంలో ఉన్నత స్థాయి అభ్యాసాలు ఎలా ఉంటాయో వీరికి వివరించి, ప్రదర్శించి చూపించాను. నేర్పించాను.

మూడురోజులూ ఒకే కుటుంబంలాగా కలసి ఉండి, జీవితాలకు ధన్యత్వాన్ని కలిగించే ఎన్నో విషయాలను నేర్చుకుని, సంతృప్తిగా అందరూ వారివారి ఊర్లకు వెళ్లిపోయారు. ఉండటానికి వీలైన కొందరు మాత్రం 14, 15 తేదీలలో కూడా మాతో ఇక్కడే ఉండి, ఈరోజున బయలుదేరి వెళ్లారు. 'మళ్ళీ మీరెప్పుడు కనిపిస్తారో తెలియదు. అందుకే ఇంకొన్ని రోజులు మీతో కలసి ఉంటాం' అన్నది వారి ఉద్దేశ్యం.

వారివారి ఊర్లకు రమ్మని అందరూ నన్ను ఆహ్వానించారు. వీలైనప్పుడు వస్తానని వారికి మాటిచ్చాను.

ఇండియాలో నాతో కలసి ఉన్నవారు, నాకు పరిచయస్తులు ఎవరూ నా దగ్గరనుండి వీటిని నేర్చుకోలేకపోయారు. ఇన్ని వేలమైళ్ల దూరంలోని అమెరికాలో ఉంటున్న వీరు నేర్చుకున్నారు.

ఆకలిని బట్టి ఆహారం లభించడం ఆధ్యాత్మిక జీవితపు రహస్యాలలో ఒకటి ! అది ఈ విధంగా మళ్ళీ ఋజువైంది.

వ్యక్తిగత కారణాలరీత్యా ఫోటోలు పెట్టడం లేదు.

read more " మూడవ అమెరికా యాత్ర - 55 (షాంపేన్ రిట్రీట్ ముగిసింది) "

13, నవంబర్ 2022, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన)

ఉదయం తొమ్మిదికి ట్రాయ్ లో రైలెక్కి, మధ్యాన్నం రెండు గంటలకు చికాగో యూనియన్ రైల్వే స్టేషన్లో దిగాము. షాంపేన్ ట్రెయిన్ కోసం అక్కడ రెండు గంటలపాటు వేచి ఉండాలి. ట్రాక్ రిపేర్లు జరుగుతున్నాయని ఈ రైలు డిపార్చర్ ఒక గంట లేటైంది. కనుక మూడు గంటల వెయిటింగ్  టైం ఉంది. అందుకని లగేజి దగ్గర కొంతమంది కాపలాగా ఉంటే, కొంతమందిమి స్టేషన్ బయటకొచ్చి చికాగో డౌన్ టౌన్ లో షికార్లు చేశాము. రెండు వీధుల అవతలనే సియర్స్ టవర్ ఉన్నది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన టవర్లలో ఒకటి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ కట్టకముందు ఇదే ప్రపంచంలోని అతి ఎత్తైన టవర్. ఈ బిల్డింగ్ లో 110 అంతస్తులున్నాయి.  దీనిని 1975 లో కట్టారు.


చికాగో డౌన్ టౌన్, సియర్స్ టవర్ దగ్గర


 చికాగో యూనియన్ రైల్వే స్టేషన్ లాంజ్ లో

చికాగో రైల్వే స్టేషన్, మన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కంటే బాగుంది, నీట్ గా ఉంది. సిటీ మధ్యలో ఉండటంతో దీనికి చాలా ఎంట్రన్స్ లున్నాయి. ఎక్కడా బెగ్గర్స్, హాకర్స్, కనపడలేదు. ప్లాట్ ఫామ్ మీద పడుకుని నిద్రపోయేవాళ్లు, అల్లరిచిల్లరగా తిరిగేవాళ్లు ఎక్కడా లేరు. ఎనౌన్స్ మెంట్ లేదు. వ్యాపారప్రకటనలు లేవు. అంత పెద్ద స్టేషన్ కూడా నిశ్శబ్దంగా, డీసెంట్ గా ఉంది.

ఇది, చెన్నై సెంట్రల్ స్టేషన్ మోడల్లో ఉంది. రైళ్లన్నీ వచ్చి ఒక డెడ్ ఎండ్ లో ఆగుతాయి. అక్కడనుంచి బయటకి దారులుంటాయి. ప్లాట్ ఫామ్స్ మీద మనుషులెవరూ ఉండరు. అవన్నీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటాయి. మనుషులందరూ ఒక పెద్ద వెయిటింగ్ లాంజ్ లో ఉంటారు. రైలు టైమైనప్పుడు, ఒకతను వచ్చి ఆ రైలు పాసింజర్స్ ముందుకు రమ్మంటాడు. మనం వెళ్లి క్యూలో నిలబడితే, అతను దారిచూపిస్తూ తీసుకెళ్లి ఆ ప్లాట్ ఫామ్ కు దారి చూపుతాడు. చాలా డీసెంట్ గా ఉంది. 




చికాగో యూనియన్ రైల్వే స్టేషన్. డౌన్ టౌన్ కు వెళ్లే ఎగ్జిట్ దగ్గరనుంచి



ఇది ఈ స్టేషన్ కున్న అనేక ఎంట్రన్స్ లలో ఒకటి. దీనిలోనుంచి బయటకొస్తే సియర్స్ టవర్ దగ్గరకు వస్తాము.



సియర్స్ టవర్ దగ్గరలోని బిల్డింగ్స్ ఇలా ఉంటాయి


చికాగో రివర్ దగ్గర


చికాగో నది, సియర్స్ టవర్ దగ్గర
చికాగో ని 'విండీ టౌన్' అంటారు. లేక్ మిషిగన్ పక్కనే ఉండటంతో ఎప్పుడూ హోరుమని గాలివీస్తూ ఉంటుంది. ఈ రోజున కూడా బాగా చలిగాలి ఉంది.



చికాగో రివర్



స్టీమర్లో ఎక్కి, చికాగో నది గుండా తిరుగుతూ సిటీ టూర్ చేసే సౌకర్యం ఇక్కడుంది. నేను ఆ బ్రిడ్జి మీద  నిలబడి చూస్తూ ఉండగా  ఒక స్టీమర్ వచ్చింది. దాని వీడియో ఇది.



చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ 


సాయంత్రం అయిందింటికి చికాగో యూనియన్ స్టేషన్ ప్లాట్ ఫామ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ ఐదుకే చీకటి పడిపోతోంది.


చికాగో డౌన్ టౌన్


షాంపేన్ అర్బానా స్టేషన్లో రిసెప్షన్

చికాగోలో సాయంత్రం అయిందింటికి డబల్ డెక్కర్ రైలెక్కి రాత్రి ఏడింటికి షాంపేన్ చేరుకున్నాం. అప్పటికే రాత్రి పదో, పదకొండో అయినట్లు చీకటిగా ఉంది. ఈ ట్రెయిన్ నిండా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్ ఉండటంతో చికాగో నుంచి ఇక్కడకు స్టూడెంట్స్ వస్తూపోతూ ఉంటారు.

శ్రీనివాస్, జ్యోతి, గీత స్టేషనుకొచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు.



షాంపేన్ లో శ్రీనివాస్ గారి ఇంటినుండి 'సనత్సుజాతీయము' తెలుగు పుస్తకం విడుదల



షాంపేన్ సరస్వతీ మాత ఆలయ సందర్శన. ఇక్కడ చలి మైనస్ ఒక డిగ్రీ ఉంది.


షాంపేన్ లో
read more " మూడవ అమెరికా యాత్ర - 54 (చికాగో సందర్శన) "