నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, నవంబర్ 2022, శుక్రవారం

మూడవ అమెరికా యాత్ర - 52 (మా 54 వ పుస్తకం 'సనత్సుజాతీయము' విడుదల)




నేటినుంచి ఇల్లినాయ్ రాష్ట్రంలోని షాంపేన్ సిటీలో మూడురోజుల పాటు 'స్పిరిటిట్యువల్ రిట్రీట్' నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగా నా కలం నుంచి వెలువడుతున్న 54 వ పుస్తకం 'సనత్సుజాతీయము' ను విడుదల చేస్తున్నాను.

వ్యాసమహర్షి చేత రచింపబడిన ‘మహాభారతము’ ప్రపంచసాహిత్యం లోనే ఒక అద్భుతమైన గ్రంథము. ‘యన్నభారతే తన్నభారతే’ (మహాభారతములో లేనిది భారతదేశంలో లేదు) అనే సూక్తి చాలా సత్యము, సమంజసము అయినది. ఇక్కడ భారతదేశమంటే ‘ప్రపంచము’ అనిన అర్థమును తీసుకోవాలి.


సంస్కృత మహాభారతంలోని ఈ ప్రసిద్ధ శ్లోకమును గమనించండి.


శ్లో|| ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ ||


ఓ భరతశ్రేష్ఠా! ధర్మపరమైన విషయంలో గాని, అర్థపరమైన విషయంలో గాని, కామపరమైన విషయంలో గాని, మోక్షపరమైన విషయంలోగాని, ఇక్కడున్నది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదు’. 


మానవునకు గల జీవితగమ్యములు ధర్మార్థ కామమోక్షములే. వీటికంటే ఎవరికైనా ఇంకేమీ గమ్యములు ఉండటానికి సాధ్యం కాదు. వీటిని చతుర్విధ పురుషార్థములంటారు. ఈ నాలుగు విషయములలోను, మహాభారతంలో చెప్పబడినది మిగతా గ్రంథములలో చెప్పబడి ఉండవచ్చునేమో గాని, దీనిలో చెప్పబడనిది మాత్రం, ఏ ఇతర గ్రంథంలోనూ ఉండదని ఈ శ్లోకం అంటుంది. అందుకనే, మహాభారతమునకు పంచమవేదమని కూడా పేరున్నది.


ఈ మాట సత్యమే. మహాభారతంలో లేని ధర్మం ఏ దేశంలోనూ, ఏ మతంలోనూ, ఏ దైవగ్రంధంలోనూ లేదు. మానవజాతి చరిత్రలోనే మహాభారతం వంటి గ్రంధం ఇప్పటివరకూ వ్రాయబడలేదు. ఇకముందు కూడా వ్రాయబడదు. ఆధ్యాత్మికప్రపంచంలో చివరిమాటగా చెప్పబడే 'భగవద్గీత', మహాభారతంలోని 18 అధ్యాయములలో ఒక అధ్యాయం లోని ఒక చిన్నభాగమని గుర్తుంటే, మహాభారతం యొక్క గొప్పదనం ఏమిటో అర్ధమౌతుంది.


మహాభారతము ఉద్యోగపర్వములో గల, 41 నుండి 45 వరకు ఉన్న అధ్యాయములలో సనత్సుజాతీయమనే ఈ వృత్తాంతము మనకు గోచరిస్తున్నది. ధృతరాష్ట్రమహారాజుకు కలిగిన వేదాంతపరమైన సందేహములకు, బ్రహ్మమానసపుత్రులలో ఒకడైన సనత్సుజాతుడు చేసిన బోధయే ఈ గ్రంథములో చెప్పబడిన విషయము. సనత్సుజాతుని బోధ గనుక దీనికి సనత్సుజాతీయమని పేరు వచ్చినది.


ఇది ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ నుండి వెలువడుతున్న 54 వ గ్రంథము. అద్వైతవేదాంతనిధియైన ఆదిశంకరాచార్యుల వారు దీనికి వ్యాఖ్యానమును రచించినారంటే ఇది ఎంతటి మహత్తరమైన వృత్తాంతమో గ్రహించవచ్చు. అటులనే, నీలకంఠపండితుని వ్యాఖ్యానము, సర్వజ్ఞనారాయణుని వ్యాఖ్యానము కూడా మనకు లభిస్తున్నాయి. ఈ నా వ్యాఖ్యానము, వారికి భిన్నమైన రీతిలో, నాదైన యోగ-వేదాంత కోణములో చెయ్యబడింది.


భోగభూమియైన అమెరికా నుండి ఇటువంటి అత్యున్నత వేదాంతతత్త్వమును వివరించే గ్రంధమును వ్రాసి విడుదల చేయగలగడం నా అదృష్టమని భావిస్తూ నేటిరోజున ఈ గ్రంధమును విడుదల చేస్తున్నాను.


ఈ గ్రంధమును వ్రాయడంలో సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ మరియు చావలి శ్రీనివాస్ లకు, దీనిని విడుదల చేస్తున్న శ్రీనివాస్ నూకల దంపతులకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.


నా ఇతర గ్రంధములవలె, ఇది కూడా పండిత, పామరలోకపు అభిమానమును చూరగొంటుందని భావిస్తున్నాను.


యధావిధిగా ఇదికూడా Google Books నుండి ఇక్కడ లభిస్తుంది.