Once you stop learning, you start dying

21, నవంబర్ 2022, సోమవారం

మూడవ అమెరికా యాత్ర - 59 (సంతోషం)

తల్లి ఒడిలో కళ్ళు తెరచిన

క్షణం నుండి

నీ పయనం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా పయనించు


ఊపిరి పీల్చుకోవడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ నడక మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా నడువు


గడపదాటి బయటకు

అడుగేసిన క్షణం నుండి

అందరితో నీ స్నేహం మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా సాటివారిని ఆదరించు


తిండనేది తినడం

మొదలుపెట్టిన క్షణం నుండి

నీ బ్రతుకు మొదలైంది

ఆపడం నీ చేతిలో లేదు

సంతోషంగా బ్రతుకు


నవ్వూ ఏడుపుల మధ్యన

నీ జీవితంలోకి 

దేనిని తీసుకోవాలనేది మాత్రం

నీ చేతిలోనే ఉంది

నవ్వునే స్వీకరించు


ఏ పరిస్ధితిలో ఉన్నప్పటికీ

సంతోషంగా ఉండాలా

ఏడుస్తూ ఉండాలా

అనేది మాత్రం నీ చేతిలోనే ఉంది

సంతోషంగా ఉండు


సంతోషమనేది బయట లేదు

నీ చుట్టూ ఉన్న పరిస్థితులలో లేదు

నీకు కలిగే లాభాలలో లేదు

జీవితమంటే నీ అవగాహనలో ఉంది

దానిని నీలో కళ్ళు తెరవనీ


అన్నీ ఉన్నా ఏడుస్తూ ఉండచ్చు

ఏమీ లేకున్నా సంతోషంగా ఉండచ్చు

ఉండటం లేకపోవడాల మీద

సంతోషం ఆధారపడి లేదు

ఈ అవగాహనను నీలో వెలగనీ


సంతోషపు రహస్యమేమిటో చెప్పనా?

కృతజ్ఞత నీలో ఉంటే 

సంతోషం నీలో ఉంటుంది

నీలో ఏ అర్హతలూ లేకున్నా

నీకు దక్కిన వరాలు గుర్తుంటే

సంతోషం నీలో ఉంటుంది


బ్రతకడానికి నీకేం అర్హతుంది?

కానీ సృష్టి నిన్ను బ్రతకనిస్తున్నది 

ఈ కృతజ్ఞత అనుక్షణం నీలో ఉండాలి

అప్పుడే సంతోషరహస్యం నీకర్థమౌతుంది

అప్పుడే నీ జీవితం ఆనందమయమౌతుంది