Once you stop learning, you start dying

22, జనవరి 2023, ఆదివారం

మూడవ అమెరికా యాత్ర - 87 (మా క్రొత్త పుస్తకం 'శ్రీ గోరక్ష వచన సంగ్రహము' విడుదల)

నా కలం నుండి వెలువడుతున్న 60 వ పుస్తకంగా  'శ్రీ గోరక్ష వచన సంగ్రహము'నేడు విడుదలౌతున్నది. ఇది మహాయోగియైన శ్రీ గోరక్షనాధుడు రచించిన సంస్కృత గ్రంధమునకు నా వ్యాఖ్యానము. సిద్ధయోగ సాధనా విధానములపైన ఇది సమగ్రమైన పుస్తకమని చెప్పవచ్చు.

శ్రీ గోరక్షనాథులవారు రచించిన, 'సిద్ధ సిద్ధాంత పధ్ధతి', 'గోరక్షసంహిత', 'యోగబీజము' అనబడే మూడు అద్భుతమైన గ్రంధములకు నా వ్యాఖ్యానమును గతంలో 'పంచవటి' నుండి విడుదల చేసియున్నాము. వాటిలో కూడా, సిద్ధయోగమార్గం వివరింపబడింది. అదేదారిలో వస్తున్న నాలుగవ పుస్తకమిది.

మంత్రయోగము, హఠయోగము, లయయోగము, రాజయోగముల సమాహారమే సిద్ధయోగము. దీనికి మహాయోగమని కూడా పేరున్నది. ఈ మార్గంలో, ఈ నాలుగువిధములైన యోగసాధనలు కలసిమెలసి ఉంటాయి. అందుకని దీనిని మహాయోగమంటారు. అంటే, చాలా ఉన్నతమైన, విశాలమైన పరిపూర్ణమైన యోగమార్గమని అర్ధము.

మూడవ అమెరికా యాత్రలో నేను వ్రాసిన పదవ పుస్తకం ఇది. ఈ ట్రిప్ లో ఇక పుస్తకాలను వ్రాయడం ఆపుతున్నాను. ఇండియాకు వచ్చిన తరువాత తిరిగి నా పుస్తకరచనను ప్రారంభిస్తాను.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' లో మేము అభ్యాసం చేసే సాధనావిధానం సిద్ధయోగమునకు చాలా దగ్గరగా ఉంటుంది. అయితే, ఇది కాకుండా కొన్ని ఇతర అభ్యాసాలు కూడా మా విధానంలో ఉంటాయి.

సిద్ధయోగసాధనా విధానమును అభిమానించేవారికి, ఆచరిస్తున్నవారికి ఈ గ్రంధం ఒక విందుభోజనం లాగా ఉంటుంది.  చదవండి. హిందూమతంలోని అద్భుతాలను గురించి తెలుసుకోండి.

యధావిధిగా ఈ పుస్తకమును వ్రాయడంలో కూడా నాకు తోడునీడలుగా నిలిచిన నా శ్రీమతి సరళాదేవి, నా శిష్యురాళ్ళు అఖిల, లలితలు, శిష్యులు శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

మిగతా మా గ్రంధములలాగే ఇది కూడా Google Play Books నుండి ఇక్కడ లభిస్తుంది. మా మిగతా గ్రంథముల వలె దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాం.