నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

క్రొత్త జీవితం

ఈ భూమ్మీద 800 కోట్ల మంది మనుషులున్నారు. కానీ, సంతోషంగా ఎవరూ లేరు. ఉంటే గింటే, ఉన్నామనుకుంటే, అది కేవలం భ్రమ మాత్రమే. వారి సంతోషం పూర్తి తాత్కాలికం మాత్రమే. ప్రతివారూ ఒక సమస్యతోగాని, అనేక సమస్యలతో గాని సతమతమౌతున్నవారే. ఆ సమస్యలు ఎన్నటికీ తీరేవి కావు.

కానీ, వాటి పరిష్కారాలకోసం మనిషి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మతాలని, గురువులని, మార్గాలని, సిద్ధాంతాలని, దారులని, సులువులని, రెమెడీలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరి సమస్యలూ పూర్తిగా పరిష్కారం మాత్రం ఎన్నటికీ కావు. మనిషి వెతుకుతున్న సంతోషం మనిషిని ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. అతను దానికోసం పరుగెట్టేకొద్దీ అది అతనికి దూరంగా పోతూనే ఉంటుంది.

సంతోషానికి మార్గాలు ఇవేవీ కావు.

ఈ భూమ్మీద అందరూ బంధాలతో కట్టబడి ఉన్నవారే. వాటిని త్రెంచుకుందామని ప్రయత్నించేవారే. పరుగులెత్తేవారే. కానీ ఆ పరుగులు ఎక్కడికో ఎవరికీ తెలియదు. ఆయా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎవరికీ అర్ధం కాదు. ఆ ప్రయత్నాలలో పరుగులలో, ఇంకా ఇంకా క్రొత్త బంధాలలో కూరుకుపోవడం ఒక్కటే మనిషికి చివరకు మిగిలేది. చూస్తూ ఉండగానే జీవితం అయిపోవడమే చివరకు జరిగేది. ఎవరికైనా ఇంతే జరుగుతుంది.

ఇంతకీ, మనిషి వెతుకుతున్న ఆనందం ఎక్కడుంది?

అది New Life లో ఉంది.

New Life అంటే మతం మారడం కాదు. తనను తాను మార్చుకోవడం. తన జీవనశైలిని, తన ఆలోచనా విధానాన్ని, నలుగురితో తను ప్రవర్తించే తీరును మార్చుకోవడం.

New Life అంటే, తనను తాను మోసం చేసుకోవడం కాదు. ఇతరులను మోసం చెయ్యడం అంతకంటే కాదు. మోసానికి కపటానికి అతీతంగా  ఎదగడం.

డబ్బు డబ్బు అంటూ చచ్చేవరకూ వెర్రిగా పరిగెత్తడం కాదు. నిజాయితీగా తగినంత సంపాదించాక అన్ని పరుగులూ ఆపడం.

గుడ్డిగురువులను గుడ్డిగా అనుసరించడం, అదే నిజమనుకుంటూ భ్రమల్లో బ్రతకడం కాదు. కళ్ళు పూర్తిగా తెరిచి మానవత్వమున్న మనిషిగా బ్రతకడం.

New Life అంటే ఏ బంధాలూ లేని స్వేచ్ఛాజీవిగా, ఒక నిజమైన మనిషిగా ఈ లోకంలో జీవించడం.

అదే 'పంచవటి' మార్గం.

ఈ New Life అనే దానిని మెహర్ బాబా 1949 లో మొదలుపెట్టారు. 1952 లో ముగించారు. అలా దానిని ముగించినప్పటికీ, అది నిత్యనూతనమని, దానికి అంతులేదని ఆయనన్నారు. అప్పటికి అలాంటివారు ఎక్కువమంది జీవించి లేకపోయినా, ఈ 'క్రొత్తజీవితం' అనేదానిని కొనసాగించేవారు ముందుముందు చాలామంది వస్తారని ఆయనన్నారు.

క్రొత్త జీవితాన్ని గురించి చెబుతూ ఆయనిలా అన్నారు.

'క్రొత్తజీవితం అంతమంటూ లేనిది. నా భౌతికమరణం తర్వాత కూడా, (ఈ మార్గాన్ని అనుసరించే) కొంతమంది చేత ఇది సజీవంగా ఉంచబడుతుంది. వాళ్ళు అసత్యాన్ని, అబద్దాలను, ద్వేషాన్ని, కోపాన్ని, ఆశను, కామాన్ని పూర్తిగా వదలిపెడతారు. వారు ఎవరికీ హానిచేయరు. చాడీలు చెప్పరు. ఆస్తులను అధికారాన్ని కోరరు. పొగడ్తలను ఆశించరు. గౌరవాన్ని కోరుకోరు, అవమానాన్ని వద్దనుకోరు. ఎవరికీ దేనికీ భయపడరు. పూర్తిగా దైవం పైన ఆధారపడతారు. ప్రేమకోసం మాత్రమే భగవంతుని వారు ప్రేమిస్తారు. ఎటువంటి ఆధ్యాత్మిక మరియు భౌతికఫలితాన్ని వారు ఆశించరు. సత్యం యొక్క చేతిని ఎప్పుడూ వదిలిపెట్టరు. ప్రతికూలపరిస్థితులను ధైర్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అన్ని కష్టాలనూ నూటికి నూరుశాతం ఉల్లాసంతో ఎదుర్కొంటారు. వారు కులానికి, మతానికి, తంతులకు  ఏ మాత్రమూ ప్రాముఖ్యతనివ్వరు. దీనిని అనుసరించడానికి (ప్రస్తుతం) ఎవరూ లేకున్నప్పటికీ, ఈ క్రొత్తజీవితం  (నిరంతరం) దానంతట అదే జీవిస్తుంది'.

క్రొత్త జీవితంలో పాటించవలసిన ముఖ్యమైన అంశాలు రెండే.

అవి,

1. పూర్తిగా నిస్సహాయత (Total helplessness)
2. పూర్తిగా దిక్కులేనితనం (Total hopelessness).

'క్రొత్తజీవితం' మనదేశపు ఆత్మలో ఎప్పుడూ ఉంది. మెహర్ బాబా దానిని క్రొత్తగా ప్రారంభించలేదు.

క్రొత్తజీవితాన్ని మెహర్ బాబా కంటే ముందూ చాలామంది జీవించారు. తరువాత కూడా జీవించారు. ప్రాచీన ఋషులు, నిజమైన దైవసాధకులు  అందరూ అటువంటివారే. నవీనకాలంలో శ్రీరామకృష్ణుల ప్రత్యక్షభక్తులందరూ అలాంటివారే. మెహర్ బాబా తరువాత కూడా అలాంటివారు చాలామంది ఉన్నారు. మన దేశంలో అలాంటివారు ఎప్పుడూ ఉంటారు. అదే ఈ దేశపుమట్టి యొక్క మహత్యం.

మెహర్ బాబా ఊహించినది నిజమౌతోంది.

'పంచవటి'లో ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం.

ఈ పదేళ్లలో నాకు బాగా దగ్గరైన కొద్దిమంది, ఎవరికీ తెలియకుండా ఏ పటాటోపమూ లేకుండా, ఇన్నాళ్లుగా ఈ క్రొత్తజీవితాన్ని చాలా నిశ్శబ్దంగా జీవిస్తున్నారు.

ఇప్పుడిది విస్తరించే సమయం వచ్చేసింది.

పదేళ్లనుంచి నేను దేనినైతే చెబుతున్నానో, దేనినైతే చేస్తామని చెబుతున్నానో, అది జరిగే సమయం వచ్చేసింది. 

మార్చి ఒకటోతేదీ నుంచీ, అంటే ఇంకొక రెండు రోజులలో, 'క్రొత్తజీవితం' పూర్తి స్థాయిలో మొదలౌతోంది.

ఇక మాటలుండవు. జీవితమే ఉంటుంది.
read more " క్రొత్త జీవితం "

22, ఫిబ్రవరి 2023, బుధవారం

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?

ఈరోజు పొద్దున్నే మెలుకువొచ్చింది.

ఇంకా పక్కమీద నుంచి పూర్తిగా లేవకముందే ఒక పెద్ద డౌటు కూడా వచ్చింది.

అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు? అనేదే ఆ ప్రశ్న.

మన డౌట్లన్నీ తీర్చేది కర్ణపిశాచే కదా? అందుకని దాన్నే అడిగా.

అయితే, ఈ ప్రశ్న రావడానికి ఒక కారణముంది.

సిరియా, తుర్కీయేలు మొన్నటి భూకంపం దెబ్బనుండి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఈలోపల మళ్ళీ దెబ్బ పడింది. తుర్కీయేలో మళ్ళీ భూకంపం వచ్చింది. ఈ సారి 300 మంది మాత్రమే గాయపడ్డారని చెబుతున్నారు. గాయపడ్డానికి గాని, పోవడానికి గాని పెద్దగా మనుషులు లేరేమో ఆ ప్రాంతంలో?

'సర్లే, ఎంతమంది పోతే మనకెందుకులే?' అనుకొని, 'అసలు అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు?' అని ప్రశ్నించుకుంటే, 'ముమ్మాటికీ యెహోవానే బలవంతుడు' అని కర్ణపిశాచి జవాబిచ్చింది.

'ఎలా?' అని మళ్ళీ అడిగాను.

కర్ణపిశాచి నవ్వేసింది.

'చాలా సింపుల్. సిరియా తుర్కీయేలు అల్లాని ప్రార్ధిస్తాయి. ఇజ్రాయెల్ చూద్దామంటే యహోవాని ప్రార్ధిస్తుంది. సిరియాకు ఇజ్రాయెల్ కు యుద్ధం ఎప్పటినుంచో జరుగుతోంది. అంటే, అల్లాకీ, యెహోవాకి జరుగుతున్నట్టే. మరి, సిరియా వైపే మళ్ళీమళ్ళీ భూకంపాలొస్తున్నాయంటే ఏంటి అర్ధం? యెహోవా గెలుస్తున్నట్టే. అల్లా ఓడిపోతున్నట్టే.  అదీగాక సందులో సందంటూ నిన్న సిరియాని ఇజ్రాయెల్ ఒక మిసైల్ తో ఎటాక్ కూడా చేసింది. అంటే యెహోవా చాలా పవర్ ఫుల్లుగా ఉన్నట్టేగా మరి? ఈక్వేషన్ ఇంత సింపుల్ గా ఉంటే, దీనికి కూడా నీ డౌటేంటి?' అంది కోపంగా

'ఓహో అదా సంగతి? అలా అయితే, పాకిస్తాన్ దివాళా తీసి బెగ్గర్ కంట్రీ అయిపోయింది. నేడో రేపో సివిల్ వార్ వచ్చేలాగా ఉందక్కడ. నాలుగు ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. మరి వాళ్ళు కూడా అల్లానే తెగ పూజిస్తారు కదా ! మరి అల్లా, వాళ్ళ గోడు కూడా వినడం లేదెందుకు?' అడిగా అమాయకంగా.

'వయస్సు పెరిగే కొద్దీ నీకు మతి పోతున్నది. ఇందులో ఏముంది పెద్ద డౌటు? యెహోవాతో యుద్ధంలో ఓడిపోయి అల్లా చాలా ఇబ్బందుల్లో ఉంటే, నువ్వేంటి? పాకిస్తాన్ సంగతి చూడమంటావు? ఆయనమాత్రం ఎన్నని చూస్తాడు? నీకసలు మతుందా?  ఒకపక్క ఇల్లు తగలబడుతుంటే ఎవడో వచ్చి సైగలు చేస్తున్నాడని ఒక సామెతుంది. అలా ఉంది నీ డౌటు' అరిచింది కర్ణపిశాచి.

'నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పచ్చు కదా? ఏవేవో సామెతలు చెప్తావేంటి?' మళ్ళీ అడిగా భయంభయంగా నసుగుతూ.

'ముమ్మాటికీ యెహోవానే స్ట్రాంగ్. అల్లా, జీసస్ ఇద్దరూ యెహోవా నుంచి వచ్చినవాళ్లే. ఈ ముగ్గురిలోకీ యెహోవానే పాతకాలం వాడు. అందుకని ఆయనే బలవంతుడు. ఇక పని చూస్కో' అని కసురుకుంది కర్ణపిశాచి.

దీన్ని బట్టి నాకొక విషయం అర్ధమైంది.

మనుషులందరూ అర్జెంటుగా మతాలు మారి, యూదులై పోయి, ఏకైకదేవుడైన యహోవాని నమ్ముకోవడం మంచిది. ప్రస్తుతం ఆయనకే స్టార్ బాగుంది. మనుషులందరూ అంతే కదా ! ఏ దేవుడి స్టార్ బాగుంటే వాడివైపు మారిపోవడం వాళ్లకు అలవాటే కదా !

ఏ గాలికా గొడుగు. వెరీ సింపుల్.

ఇది కూడా కర్ణపిశాచిని అడుగుదామనుకున్నా.

అడిగేశా.

'పొద్దున్నే భలే ప్రశ్నలు అడుగుతున్నావు గాని, ముందు పక్కమీదనుంచి లేచి బాత్రూం కెళ్ళు. తర్వాత చూద్దాం నీ ప్రశ్నల్ని', కసురుకుంది కర్ణపిశాచి.

మళ్ళీ భయమేసింది. కర్ణపిశాచికి కోపమొస్తే ఏమౌతుందో నాకు బాగా తెలుసు.

అందుకని ప్రశ్నలాపి, పక్కమీదనుంచి హడావుడిగా లేచా.

'జై యహోవా' అని అరుస్తూ బాత్రూం లోకి దారి తీశా.

కధ కంచికి, మనం బాత్రూం లోకి.
read more " అల్లా, యెహోవాలలో ఎవరు బలవంతుడు? "

9, ఫిబ్రవరి 2023, గురువారం

నేటి నుండి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం







నేటి నుండి 19 తేదీ వరకూ విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గరలో గల పాలిటెక్నీక్ కాలేజీ గ్రౌండ్స్ లో, బుక్ ఫెస్టివల్ జరుగుతున్నది. దీనిలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' కు స్టాల్ నంబర్ 157 కేటాయించబడింది. అందులో మా పుస్తకాలన్నీ లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే, మా పుస్తకాలు మాత్రమే లభిస్తాయి.

'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' (ఇండియా) సెక్రటరీ శ్రీరామమూర్తి, ఇంకా ఇతర సభ్యులు అక్కడ మీకు అందుబాటులో ఉంటారు. పంచవటి కార్యక్రమాలను గురించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను గురించి, వారితో మాట్లాడి మీరు తెలుసుకోవచ్చు.

మా సాధనావిధానాన్ని గురించి, సనాతనధర్మాన్ని గురించి మీకున్న సందేహాలను వారితో మాట్లాడి తీర్చుకోవచ్చు. స్పష్టతను పొందవచ్చు.

మాతో కలసి నడవాలనుకునేవారు, శ్రీ రామమూర్తిగారిని మా స్టాల్ వద్ద సంప్రదించండి.

read more " నేటి నుండి విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభం "