ఇదేదో వివాదాస్పద టైటిల్ అనుకునేరు. అదేం కాదు.
హైదరాబాద్ లో ఉంటున్నా కదా ! లోకల్ శిష్యులందరూ వచ్చి కలుస్తున్నారు. అదేవిధంగా గుణశేఖర్ అనే శిష్యుడు మొన్న వచ్చాడు. తను NGRI దగ్గర్లో ఉంటాడు.
మాటలమధ్యలో, ఈ నెలలో అరుణాచలం పాండిచ్చేరి ట్రిప్స్ ఉన్నాయని తనతో చెప్పాను.
తనది చిత్తూరు. కనుక, ఆ ప్రాంతాలన్నీ బాగా తెలిసినవాడే. ఇలా అన్నాడు.
'పౌర్ణమికి మాత్రం అరుణాచలం వెళ్ళకండి. చాలా ఇబ్బంది పడతారు. రెండు మూడు కి.మీ. బయటే వాహనాలన్నీ ఆపేస్తారు. జనం విపరీతంగా ఉంటారు'
నవ్వాను.
'గిరిప్రదక్షిణం నాకవసరం లేదు. జనంతో నాకు పనిలేదు. కనుక, ఆ టైంలో వెళ్లన్లే. వర్రీ అవ్వకు. అంతమంది పిచ్చిజనాన్ని, ఆ దుమ్ముని నేను కూడా భరించలేను'.
'యూ ట్యూబర్స్ కొంతమంది అరుణాచలాన్ని బాగా పాపులర్ చేశారు. గత పదేళ్లనుంచి జనతాకిడి బాగా ఎక్కువైంది. ముఖ్యంగా పౌర్ణమికి గిరిప్రదక్షిణం బాగా చేస్తున్నారు' అన్నాడు.
'మంచిదే. పిచ్చిజనానికి ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఎవడి పిచ్చి వాడిది. చెయ్యనీ' అన్నాను.
'అక్కడిదాకా వెళుతున్నారు కదా. కాణిపాకం మాత్రం అస్సలు వెళ్ళకండి' అన్నాడు.
'ఏం? దానికేమైంది?' అన్నాను.
'గతంలో బాగుండేది. ఇప్పుడు పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. TTD వాళ్ళు ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అన్ని రేట్లు పెంచేశారు. అంతా వ్యాపారమయం. ఇంతకు ముందులాగా లేదు' అన్నాడు.
'దేవుడిని గుళ్ళలో చూడవలసిన పని మనకు లేదు. నీలోనే దర్శించగలగాలి. వినాయకుడు నీలోనే దర్శనమిస్తాడు. ఆయనకోసం బయట గుళ్లకు పోవలసిన పని లేదు. వెళ్ళవలసి వస్తే తప్ప, నా అంతట నేను ఏ గుడికీ పోనని నీకు తెలుసు కదా. కాణిపాకమైనా ఇంకెక్కడికైనా అంతే. కమర్షియల్ గుళ్లకు అసలే పోను. వర్రీ అవ్వకు' అన్నాను.
'సరే' అంటూ తను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.