“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

క్రొత్త జీవితం

ఈ భూమ్మీద 800 కోట్ల మంది మనుషులున్నారు. కానీ, సంతోషంగా ఎవరూ లేరు. ఉంటే గింటే, ఉన్నామనుకుంటే, అది కేవలం భ్రమ మాత్రమే. వారి సంతోషం పూర్తి తాత్కాలికం మాత్రమే. ప్రతివారూ ఒక సమస్యతోగాని, అనేక సమస్యలతో గాని సతమతమౌతున్నవారే. ఆ సమస్యలు ఎన్నటికీ తీరేవి కావు.

కానీ, వాటి పరిష్కారాలకోసం మనిషి ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మతాలని, గురువులని, మార్గాలని, సిద్ధాంతాలని, దారులని, సులువులని, రెమెడీలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎవరి సమస్యలూ పూర్తిగా పరిష్కారం మాత్రం ఎన్నటికీ కావు. మనిషి వెతుకుతున్న సంతోషం మనిషిని ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. అతను దానికోసం పరుగెట్టేకొద్దీ అది అతనికి దూరంగా పోతూనే ఉంటుంది.

సంతోషానికి మార్గాలు ఇవేవీ కావు.

ఈ భూమ్మీద అందరూ బంధాలతో కట్టబడి ఉన్నవారే. వాటిని త్రెంచుకుందామని ప్రయత్నించేవారే. పరుగులెత్తేవారే. కానీ ఆ పరుగులు ఎక్కడికో ఎవరికీ తెలియదు. ఆయా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎవరికీ అర్ధం కాదు. ఆ ప్రయత్నాలలో పరుగులలో, ఇంకా ఇంకా క్రొత్త బంధాలలో కూరుకుపోవడం ఒక్కటే మనిషికి చివరకు మిగిలేది. చూస్తూ ఉండగానే జీవితం అయిపోవడమే చివరకు జరిగేది. ఎవరికైనా ఇంతే జరుగుతుంది.

ఇంతకీ, మనిషి వెతుకుతున్న ఆనందం ఎక్కడుంది?

అది New Life లో ఉంది.

New Life అంటే మతం మారడం కాదు. తనను తాను మార్చుకోవడం. తన జీవనశైలిని, తన ఆలోచనా విధానాన్ని, నలుగురితో తను ప్రవర్తించే తీరును మార్చుకోవడం.

New Life అంటే, తనను తాను మోసం చేసుకోవడం కాదు. ఇతరులను మోసం చెయ్యడం అంతకంటే కాదు. మోసానికి కపటానికి అతీతంగా  ఎదగడం.

డబ్బు డబ్బు అంటూ చచ్చేవరకూ వెర్రిగా పరిగెత్తడం కాదు. నిజాయితీగా తగినంత సంపాదించాక అన్ని పరుగులూ ఆపడం.

గుడ్డిగురువులను గుడ్డిగా అనుసరించడం, అదే నిజమనుకుంటూ భ్రమల్లో బ్రతకడం కాదు. కళ్ళు పూర్తిగా తెరిచి మానవత్వమున్న మనిషిగా బ్రతకడం.

New Life అంటే ఏ బంధాలూ లేని స్వేచ్ఛాజీవిగా, ఒక నిజమైన మనిషిగా ఈ లోకంలో జీవించడం.

అదే 'పంచవటి' మార్గం.

ఈ New Life అనే దానిని మెహర్ బాబా 1949 లో మొదలుపెట్టారు. 1952 లో ముగించారు. అలా దానిని ముగించినప్పటికీ, అది నిత్యనూతనమని, దానికి అంతులేదని ఆయనన్నారు. అప్పటికి అలాంటివారు ఎక్కువమంది జీవించి లేకపోయినా, ఈ 'క్రొత్తజీవితం' అనేదానిని కొనసాగించేవారు ముందుముందు చాలామంది వస్తారని ఆయనన్నారు.

క్రొత్త జీవితాన్ని గురించి చెబుతూ ఆయనిలా అన్నారు.

'క్రొత్తజీవితం అంతమంటూ లేనిది. నా భౌతికమరణం తర్వాత కూడా, (ఈ మార్గాన్ని అనుసరించే) కొంతమంది చేత ఇది సజీవంగా ఉంచబడుతుంది. వాళ్ళు అసత్యాన్ని, అబద్దాలను, ద్వేషాన్ని, కోపాన్ని, ఆశను, కామాన్ని పూర్తిగా వదలిపెడతారు. వారు ఎవరికీ హానిచేయరు. చాడీలు చెప్పరు. ఆస్తులను అధికారాన్ని కోరరు. పొగడ్తలను ఆశించరు. గౌరవాన్ని కోరుకోరు, అవమానాన్ని వద్దనుకోరు. ఎవరికీ దేనికీ భయపడరు. పూర్తిగా దైవం పైన ఆధారపడతారు. ప్రేమకోసం మాత్రమే భగవంతుని వారు ప్రేమిస్తారు. ఎటువంటి ఆధ్యాత్మిక మరియు భౌతికఫలితాన్ని వారు ఆశించరు. సత్యం యొక్క చేతిని ఎప్పుడూ వదిలిపెట్టరు. ప్రతికూలపరిస్థితులను ధైర్యంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అన్ని కష్టాలనూ నూటికి నూరుశాతం ఉల్లాసంతో ఎదుర్కొంటారు. వారు కులానికి, మతానికి, తంతులకు  ఏ మాత్రమూ ప్రాముఖ్యతనివ్వరు. దీనిని అనుసరించడానికి (ప్రస్తుతం) ఎవరూ లేకున్నప్పటికీ, ఈ క్రొత్తజీవితం  (నిరంతరం) దానంతట అదే జీవిస్తుంది'.

క్రొత్త జీవితంలో పాటించవలసిన ముఖ్యమైన అంశాలు రెండే.

అవి,

1. పూర్తిగా నిస్సహాయత (Total helplessness)
2. పూర్తిగా దిక్కులేనితనం (Total hopelessness).

'క్రొత్తజీవితం' మనదేశపు ఆత్మలో ఎప్పుడూ ఉంది. మెహర్ బాబా దానిని క్రొత్తగా ప్రారంభించలేదు.

క్రొత్తజీవితాన్ని మెహర్ బాబా కంటే ముందూ చాలామంది జీవించారు. తరువాత కూడా జీవించారు. ప్రాచీన ఋషులు, నిజమైన దైవసాధకులు  అందరూ అటువంటివారే. నవీనకాలంలో శ్రీరామకృష్ణుల ప్రత్యక్షభక్తులందరూ అలాంటివారే. మెహర్ బాబా తరువాత కూడా అలాంటివారు చాలామంది ఉన్నారు. మన దేశంలో అలాంటివారు ఎప్పుడూ ఉంటారు. అదే ఈ దేశపుమట్టి యొక్క మహత్యం.

మెహర్ బాబా ఊహించినది నిజమౌతోంది.

'పంచవటి'లో ప్రస్తుతం మేం అదే చేస్తున్నాం.

ఈ పదేళ్లలో నాకు బాగా దగ్గరైన కొద్దిమంది, ఎవరికీ తెలియకుండా ఏ పటాటోపమూ లేకుండా, ఇన్నాళ్లుగా ఈ క్రొత్తజీవితాన్ని చాలా నిశ్శబ్దంగా జీవిస్తున్నారు.

ఇప్పుడిది విస్తరించే సమయం వచ్చేసింది.

పదేళ్లనుంచి నేను దేనినైతే చెబుతున్నానో, దేనినైతే చేస్తామని చెబుతున్నానో, అది జరిగే సమయం వచ్చేసింది. 

మార్చి ఒకటోతేదీ నుంచీ, అంటే ఇంకొక రెండు రోజులలో, 'క్రొత్తజీవితం' పూర్తి స్థాయిలో మొదలౌతోంది.

ఇక మాటలుండవు. జీవితమే ఉంటుంది.