నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, మార్చి 2023, మంగళవారం

పంచవటి

కొడిగట్టిన దీపాలకు

క్రొత్త వెలుగునిచ్చి

మసిపట్టిన మానవాళికి

మళ్ళీ జీవం పోసిన

మహోన్నత దైవత్వం

పాండిత్యపు పంజరాలలో బందీ అయింది


దైవాన్ని భూమిపైకి

దించి తీసుకొద్దామని

రాక్షసత్వ పట్టునుంచి

భూమిని విడిపిద్దామని

చెయ్యబడిన మహాప్రయత్నం

కనపడకుండా కనుమరుగై పోయింది


అమేయమైన ఆత్మతత్త్వాన్ని

ఆచరణలో ప్రదర్శించి

మహోన్నత శిఖరంగా

మానవాళి ముందు నిలిచిన

వేదోపనిషత్తుల సారం

ప్రదక్షిణాల సంత అయింది


అవధిలేని మాతృత్వాన్ని

అక్షరాలా నిరూపించి

గొప్పగొప్ప సత్యాలను

గోరుముద్దలుగా తినిపించిన

రూపుదాల్చిన వాత్సల్యం

సాంప్రదాయ సంకెళ్ళలో సద్దుమణిగింది


మాటను గ్రహించలేని

మానవజాతి మొద్దునిద్రను

ఒక్కసారిగా వదిలించాలని

మట్టిమనుషులను మేల్కొల్పాలని

సంకల్పించిన మహామౌనం

ఎవరికీ గుర్తులేని ఏకాకి అయింది  


అన్నింటినీ ఆకళింపు చేసుకున్న

అమేయమైన చైతన్యం

మానవసమూహాల రొచ్చుకు

అందనంత సుదూరతీరంలో

విశ్వపుటంచులను అన్వేషిస్తూ

తనలో తానై తదేకనిష్ఠలో నిలిచింది

read more " పంచవటి "

20, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?)

అరుణాచలంలో ఉండగా ఒకరోజున ఒక సంఘటన జరిగింది.

మేమంతా కలసి ఆశ్రమం రోడ్డులో నడుస్తూ ఉండగా, ఒక స్వామీజీ కనిపించాడు. మేము రోడ్డుకు ఇవతలవైపున్నాము. అతను అవతలవైపున్నాడు.  ఒక పండ్ల బండి దగ్గర ఏదో బేరం చేస్తున్నాడు. అతని డ్రస్సు చూస్తూనే అది రామకృష్ణమఠం డ్రస్సని నేను గుర్తుపట్టాను.

'ఒక తమాషా చూడండి' అని నాతో ఉన్న శిష్యులతో చెప్పి ఆయన వైపు గబగబా నడిచాను.

'నమస్తే స్వామీజీ' అన్నాను ఆయన పక్కనే నిలబడి.

'నమస్తే' అన్నాడాయన నా వైపు చూస్తూ

'మీరు రామకృష్ణ మఠం స్వామీజీనా?' అడిగాను.

'ఒకప్పుడు' అన్నాడు.

ఇది కూడా డ్రాపౌట్ కేసేనని నాకర్ధమైంది. కొంతమంది మఠంలో బ్రహ్మచారి పీరియడ్ పూర్తి చేసుకుని, స్వామీజీలయ్యి, కొన్నాళ్లో, కొన్నేళ్లో ఉండి అప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఖర్మ !

కాషాయం కట్టుకున్నంతమాత్రాన ఖర్మ వదలదు కదా !

'మీరంతా ఏంటి?' అన్నాడు మా గ్రూపు వైపు చూస్తూ.

'మేము ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాం. అందుకని, దానికంటే ముందు అన్ని ఆశ్రమాలూ స్టడీ చేస్తున్నాం' అన్నా

'ఆశ్రమం ఆలోచన ఎవరిది?' అన్నాడు

'నాదే' అన్నాను

'మంచిదే. కానీ మీకు ధ్యానం గురించి తెలియాలి. ధ్యానం పునాది లేకపోతే, ఆశ్రమం త్వరలోనే బోరు కొడుతుంది' అన్నాడు.

అతనేంటో నాకర్ధమైపోయింది.

'అవును. మా ఉద్దేశ్యం కూడా అదే' అన్నాను

'ఊరకే ఉద్దేశ్యం ఉంటే చాలదు. ధ్యానం గురించి కొంతకాకపోతే కొంతైనా తెలుసుకోండి' అన్నాడు స్వరం పెంచి.

నేను వెంటనే చేతులు కట్టుకుని అటెన్షన్లో నిలబడుతూ 'అలాగే స్వామీజీ. తప్పకుండా తెలుసుకుంటాము. ధ్యానం గురించి  ఉపదేశించేవాళ్ల కోసమే మేమందరమూ వెతుకుతున్నాము' అన్నాను వినయంగా.

'లా రోడ్లమీద వెతికితే ధ్యానం దొరకదు. ధ్యానం మీద నేనొక బుక్కు రాశాను. అది త్వరలో ప్రింట్ అవుతున్నది. చదవండి' అన్నాడు దర్పంగా .

'తప్పకుండా స్వామీజీ. కానీ మాబోటివాళ్లకు అది అర్ధమౌతుందా?' అన్నాను భయభక్తులతో చేతులు అలాగే కట్టుకుని.

'ఇన్నేళ్లొచ్చినై. ఎందుకురా నువ్వు?' అన్నట్లు జాలిగా నావైపు చూశాడు స్వామీజీ.

'సాయంత్రం రండి. నేను ఫలానా చోట ఉంటున్నాను. ఒక్క అరగంట మాత్రం మీకు టైము కేటాయించగలను.  ధ్యానం గురించి మీకు ఫండమెంటల్స్ నేర్పిస్తాను. అంతకంటే టైం ఇవ్వలేను మీకు' అన్నాడు ఆయన సీరియస్ గా.

నాకు లోపల పొట్ట చెక్కలయ్యే నవ్వొస్తోంది. కానీ బయటకు బిగబట్టుకుని మౌనంగా చూస్తున్నా. 

'ఓకేనా?' అన్నాడు పిల్ల స్వామీజీ గదమాయిస్తున్నట్లు.

'ఓకే స్వామీజీ. ప్రస్తుతానికి ఈ డబ్బులుంచండి' అంటూ కొంత డబ్బు ఆయన చేతిలో పెట్టాను.

ఆ డబ్బులు జేబులో పెట్టుకున్న అతను, రోడ్డు క్రాస్ చేసి చాలా విసురుగా నడుస్తూ ఒక సందులోకి వెళ్లిపోయాడు.

ఆయన మాయం కావడంతోనే అందరం ఆ రోడ్డుమీదనే పగలబడి నవ్వుకున్నాం.

'అర్థమైందా స్వామీజీలు ఎలా ఉంటారో?' అడిగాను శిష్యులవైపు తిరిగి.

'బాగా అర్ధమైంది. ఛీ ఇలాంటి వాళ్ళా స్వామీజీలు?' అన్నారు శిష్యులు.

'ఈ ట్రిప్ లో ఇదే హైలైట్ సంఘటన, మీ యాక్టింగ్ మాత్రం అద్భుతం గురూజీ' అన్నాడు గణేష్.

అందరం మళ్ళీ నవ్వుకున్నాం.

'గురూజీ నాదొక సందేహం' అడిగాడు ప్రవీణ్.

'ఏంటది చెప్పు' అన్నాను

'ఒక సింహం ఇంకొక సింహాన్ని గుర్తుపడుతుందంటారు కదా? ఆ స్వామీజీ మిమ్మల్ని గుర్తుపట్టలేదెందుకు?' అడిగాడు.

నవ్వాను.

'వెరీ సింపుల్ ప్రవీణ్. దీనికి లాజికల్ గా మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అతనైనా సింహం కాదు. రెండు, నేనైనా సింహం కాదు. మూడు, ఇద్దరమూ సింహాలం కాదు. ఈ మూడు తప్ప వేరే కావడానికి ఆస్కారం లేదు. అన్నాను.

'అంతే కదా' అన్నాడు ప్రవీణ్

'నేను సింహాన్ని కాను. మామూలు మనిషినే. ఆ సంగతి నాకు తెలుసు. అతను సింహం అయ్యి ఉండవచ్చు. అందుకే మనల్ని చూచి అలా పారిపోయాడు, బహుశా గ్రామసింహం అయ్యుంటాడు' అన్నాను.

మళ్ళీ అందరం నవ్వుకున్నాం.

అరుణాచలం రోడ్లమీద నడుస్తూ శిష్యులతో ఇలా చెప్పాను.

'కాషాయవస్త్రాలు, ఆశ్రమాలు, పటాటోపాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి గుర్తులు కావు. కాషాయం చూచి మోసపోకండి. గడ్డాలు పెంచిన అందరూ ఋషులనుకోకండి. నిజమైన ఔన్నత్యం సాధనతో మాత్రమే వస్తుంది. సాధనాబలం లేనప్పుడు ఉత్తవేషం ఎందుకూ పనికిరాదని గ్రహించండి'.

ఇదంతా వింటున్న మరొక శిష్యుడు ఇలా అడిగాడు

'మరి మీరెందుకు ఆ స్వామీజీకి డబ్బులిచ్చారు?'

ఇలా వివరించాను.

'శ్రీ రామకృష్ణుల పేరుమీద అతను సన్యాసి అయ్యాడు. దానికి నేను విలువనిచ్చాను. ఈ మనిషికి నేను విలువనివ్వలేదు. శ్రీ రామకృష్ణులకు ఇచ్చాను. అతనికా డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. సంస్థను వదిలేసి వచ్చినా కూడా అతన్ని రామకృష్ణులు అలా కాపాడుతున్నారు. అది ఆయన కరుణకు నిదర్శనం. ఆ విషయం ఈ స్వామీజీ ఎన్నటికీ గ్రహించలేడు. గ్రహించే దృష్టి అతనిలో లేదు. సన్యాసిగా అయిన తరువాత అతను మఠాన్ని వదలిపెట్టి బయటకు వచ్చినట్లున్నాడు. అది అతని ఖర్మ. మనకనవసరం.

ఏదేమైనప్పటికీ అతనొక సాధువు.  పాపం వాళ్లకు ఆదాయం ఏముంటుంది? మనలాగా వాళ్లకు పొద్దున్నే కాఫీలు, టిఫిన్లు ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? మనం ఇచ్చిన డబ్బుతో ఆయనకు రెండు రోజుల భోజనం దొరికితే చాలు. ఆయన సక్రమంగా ఉంటే ఇంకా ఇచ్చి ఉండేవాడిని. అతని అహంకారమే అతన్ని పాడుచేసింది. మనల్ని గుర్తించకుండా అతనికి అడ్డుపడినది కూడా ఆ అహమే. అహంకారం వల్ల, తన జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని ఈ స్వామీజీ కోల్పోయాడు. అహాన్ని పెంచే కాషాయం కషాయం అవుతుంది. మాయాప్రభావం ఇలా ఉంటుందని గ్రహించండి'. అన్నాను

'ఇది మాకందరికీ గొప్ప పాఠం గురూజీ' అన్నారు శిష్యులు.

'అవును. ఇంతటితో అతన్ని వదిలెయ్యండి. అతని ఖర్మ అతనిది. పదండి మంచి టీ త్రాగుదాం' అన్నాను.

అందరం కలసి ఆశ్రమం ఎదురుగా ఉన్న టీ హోటల్ వైపు దారితీశాము 

read more " అరుణాచల యాత్ర - 9 (సింహాన్ని సింహం గుర్తుపట్టలేదా?) "

16, మార్చి 2023, గురువారం

జ్యోతిష్యం హోమియోపతి సలహాలు ఇకపైన అడక్కండి

నాకున్న జ్యోతిష్య, హోమియోపతి రంగాలలోని అనుభవం నలుగురికీ ఉపయోగపడాలన్న సదుద్దేశ్యంతో గత పదేళ్లనుంచీ వేలాదిమందికి ఉచిత జ్యోతిష్యసలహాలు, హోమియోపతి వైద్య సలహాలు ఇస్తూ వచ్చాను.

కానీ ఇప్పుడు న్యూ లైఫ్ లో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, జ్యోతిష్యం, హోమియోపతి సలహాలు ఇవ్వడం పూర్తిగా మానేస్తున్నాను. 

కనుక, పాఠకులెవరైనా సరే, ఈ రెండింటికి సంబంధించిన మెయిల్స్ నాకు ఇకపైన ఇవ్వకండి. ఒకవేళ మీరు అలాంటి మెయిల్స్  ఇచ్చినా, నా దగ్గరనుంచి మీకు సమాధానం మాత్రం రాదు.

గమనించండి.
read more " జ్యోతిష్యం హోమియోపతి సలహాలు ఇకపైన అడక్కండి "

అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ)




మేము అరుణాచలంలో ఉన్న మూడురోజులూ చంద్రశేఖర్ రోజూ వచ్చి కలిసేవాడు. ఒకరోజున అతని రూమ్ కి కూడా వెళ్లి వచ్చాము. రమణాశ్రమంలోనూ, రోడ్లమీద నడుస్తూనూ, పేవుమెంట్ షాపుల్లో టీ త్రాగుతూనూ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం.

తను ఇండియా అంతా బాగా తిరిగాడు. హిమాలయాలలో కూడా కొన్ని నెలలుండి సాధన చేశాడు. ఉత్తరకాశీలో చాలామంది సాధువులు అతనికి వ్యక్తిగతంగా తెలుసు.

మన ఆశ్రమం గురించి, నేను వ్రాసిన పుస్తకాల గురించి, ప్రస్తుతం పంచవటి కార్యక్రమాలగురించి తనతో చెప్పాను. 

'నాకు యోగమార్గం అంతగా తెలీదన్నగారు' అన్నాడు.

'చాలా మంచిది. పెద్ద తలనొప్పి వదిలింది నీకు. దానికంటే తంత్రం ఇంకా బురద. ఈ రెంటి జోలికి నువ్వు రాకపోవడమే మంచిది' అన్నాను.

'ఎందుకో మొదట్నుంచీ నాకీ రెండు మార్గాలతో పరిచయం లేదు' అన్నాడు.

'శుద్ధాద్వైతం తెలిసినవాడికి ఇంకేమీ అవసరంలేదు తమ్ముడూ. ఒక గ్లాసు నీటితో నీ దాహం తీరుతుంటే, నదిలోని నీళ్లన్నీ నీకెందుకు? అని రామకృష్ణులనేవారు. గుర్తుందా?' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చంద్రశేఖర్.

'నేను ఉత్తరకాశీలో ఉన్నపుడు ఒక సాధువు నాకు పరిచయమయ్యాడు. అక్కడంతా చాలా చలిగా ఉంటుంది. చలికాలంలో అక్కడెవరూ ఉండలేరు. అంత మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సాధువులందరూ ఖాళీచేసి హరిద్వార్ వచ్చేస్తారు. కానీ వింటర్లో కూడా ఆయనక్కడే ఉండేవాడు. భయంకరమైన  విల్ పవర్ ఉంటె తప్ప ఆ చలిని నరమానవుడు తట్టుకోలేడు. చలికాలంలో కూడా అక్కడే ఉంటూ తీవ్రమైన తపస్సు చేసేవాడు.  ఆయన కొన్ని తంత్రసాధనలు చేసేవాడు. ఆ క్రమంలో తనకు కొన్ని అద్భుతమైన శక్తులు సిద్ధించాయని నాతో అన్నాడు. ఆ శక్తులు చాలా తీవ్రమైనవి. వాటిని చూస్తే లోకం బిత్తరపోతుంది. నేటి బాబాలకు, స్వాములకు అలాంటి సిద్ధులు కనుచూపుమేరలో కూడా కనిపించవు. అలాంటివి ఆ శక్తులు. అవి ఆయనకు సిద్ధించాయి. అతనికి చాలా భయమేసిందట. ఆయన రూములో శారదామాత ఫోటో ఒకటి ఉండేది. వెంటనే అమ్మ ముందు సాగిలపడి, 'అమ్మా ఈ శక్తులు నాకొద్దు. నీవే తీసుకో' అని వేడుకున్నాడట.  వెంటనే ఆ శక్తులు అతన్ని వదలి పోయాయని నాతో అన్నాడు.

నార్త్ ఇండియాలో గొప్ప గొప్ప సిద్ధులను సంపాదించిన తాంత్రికులు తమ చివరిరోజులలో భయంకరమైన  బాధలు పడి దిక్కులేని చావు చచ్చారు. వయసులో ఉన్నపుడు, శక్తి ఉన్నపుడు, వాటిని తమ పనులకోసం వాడుకుంటారు. వీళ్ళ శక్తి క్షీణించగానే అవి రివెంజ్  తీర్చుకుంటాయి. తాంత్రికులు చాలామంది జీవితాలు విషాదాంతం అవుతాయి అన్నగారు' అన్నాడు.

'నిజమే తమ్ముడు. అందుకే తంత్రసాధన జోలికి పోవద్దని రామకృష్ణులు తమ భక్తులను హెచ్చరించారు. అవన్నీ నీకెందుకు? నీది శుద్ధాద్వైతం. అందులోనే ఉండు' అన్నాను.

రామకృష్ణా మిషన్  నుండి బయటకొచ్చి సొంతంగా బ్రతుకుతున్న నలుగురైదుగురు సన్యాసులు అరుణాచలంలో ఉన్నారని చంద్రశేఖర్ నాతో అన్నాడు. వాళ్లలో ఒకాయన IIT కాన్పూర్ ప్రోడక్ట్ అని, ప్రస్తుతం ఆయన భిక్షాటన చేస్తూ అరుణాచలంలో జీవిస్తున్నాడని నాతో అన్నాడు.

'నిజమైన బ్రాహ్మణ జీన్స్ అలాగే ఉంటాయి తమ్ముడూ. అవి లౌకిక సుఖాలను కోరుకోవు. ఎంతసేపూ తపస్సు,  ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ దారులలోకే అవి వెళతాయి. అదంతే' అన్నాను.

'రామకృష్ణా మిషన్ సాధువుల పైన మీ అభిప్రాయం?' అడిగాడు.

'మిగతావాళ్ళకంటే చాలా మెరుగు. కానీ ప్రస్తుతతరం రామకృష్ణమఠం సాధువుల పైన నాకు ఏమాత్రం మంచి అభిప్రాయం లేదు. వజ్రాల్లాంటి పాతతరం సాధువులను నేను చూశాను. వాళ్ళముందు వీళ్లంతా గులకరాళ్లే.  పైగా, మఠాన్ని వదిలేసి బయటకొచ్చారంటే వాళ్ళు వివేకానందస్వామిని ధిక్కరించినట్లే.  ఆయనకంటే గొప్ప జ్ఞానులా వీళ్ళు? అందుకే మఠాన్ని వదిలేసి బయటకొచ్చిన రామకృష్ణమఠం సాధువులంటే నాకు అస్సలు మంచి అభిప్రాయం లేదు' అన్నాను.

సంభాషణ అరుణాచలం వైపు మళ్లింది.

'ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల దేశాలవాళ్లున్నారు అన్నగారు. మొన్నొకడు ఒక రీసెర్చి చేశాడు. ఇక్కడ ఫుట్పాత్ మీద రాత్రిపూట చాలామంది సాధువులు పడుకుంటూ ఉంటారు. వాళ్లంతా బెగ్గర్లని మనం సాధారణంగా అనుకుంటాం. కానీ వాళ్లలో అద్భుతమైన నిజమైన సాధువులు కూడా ఉంటారు. అలాంటి వాళ్లలో IIT, IIM గ్రాడ్యుయేట్లు, పెద్ద MNC లలో పనిచేసి, ప్రపంచమీద విరక్తితో సాధువులుగా మారినవాళ్లు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ అడుక్కుంటూ, రోడ్లమీద పడుకుంటూ ధ్యానంలో కాలం గడుపుతూ ఉంటారు' అన్నాడు.'

'ఉంటారు తమ్ముడు. నూరుమంది నకిలీల మధ్యన ఒక వజ్రం కూడా ఉంటుంది. ఎవరి ఖర్మ వారిది. ఎవరి సాధన వారిది.  నువ్వు మాత్రం అలాంటివాడివే కదా? నువ్వుకూడా అలాంటి పొజిషన్ వదులుకుని వచ్చినవాడివే కదా. అదంతే' అన్నాను.

'ఒక భార్యాభర్తా ఇక్కడున్నారు. కావలసినంత సంపాదించుకున్నాక ఇద్దరూ ఉద్యోగాలు వదిలేశారు. పిల్లలు వద్దనుకున్నారు. ప్రస్తుతం ఇక్కడే ఉంటూ ధ్యానసాధన చేస్తున్నారు. హాల్లో విడివిడిగా ధ్యానానికి కూర్చుంటారు. కలిసి రారు. కలిసిపోరు. ఎవరి లైఫ్ వారిదే. కానీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు అంతే. అలాంటివాళ్ళు కూడా ఉన్నారిక్కడ.  అప్పుడప్పుడూ వచ్చిపోయేవాళ్లు కొందరు. ఇక్కడే స్థిరపడినవాళ్ళు కొందరు. సన్యాసులుగా ఉంటూ మఠాలను వదిలేసి ఇక్కడకొచ్చి ఉంటున్నవాళ్ళు కొందరు. సంసారులు మరికొందరు. భార్యలను ఇళ్లలో వదిలేసి ఇక్కడ ఉంటున్న భర్తలూ, భర్తలకు దూరంగా ఇక్కడే ఉంటున్న భార్యలూ - ఇలా ఎన్నో రకాల మనుషులు ఇక్కడున్నారు. ఇదొక మినీ ప్రపంచమన్నగారు' అన్నాడు.

నవ్వాను.

'అది మహర్షి ప్రభావం తమ్ముడూ. అచంచలమైన జ్ఞానజ్యోతి అది. దాని వెలుగు అలాగే ఉంటుంది' అన్నాను.

'యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమంలో సాధువులకు భిక్ష పెడతారు. తిండికి గడిచిపోతుంది. ఎక్కడో ఒక రూమ్ తీసుకుని అందులో ఉంటూ, భిక్ష తింటూ సాధనలో ఉంటారు. అలాంటివాళ్ళు చాలామంది ఇక్కడున్నారు. హరిద్వార్, రిషీకేశ్ తర్వాత సాధువులకు భిక్ష బాగా దొరికే ప్రదేశం అరుణాచలమే అని ఒక సాధువు నాతో అన్నాడు'

'ఎవరాయన? అన్నాను. 

'ఒక జైన్ సాధువన్నగారు. కానీ ఆయన అద్వైతం పట్ల ఆకర్షితుడై హిందూసన్యాసి అయ్యాడు. నాకు హిమాలయాలలో పరిచయమయ్యాడు. వాళ్ళది చాలా రిచ్ ఫెమిలీ. 

'మా పేరెంట్స్ కి నేను అరుణాచలంలో ఉన్నానని తెలిస్తే, ఒక బజారు మొత్తం కొనేసి బంగారంతో నాకు  ఆశ్రమం కట్టించి ఇస్తారు. అంత రిచ్ ఫెమిలీ మాది. అందుకని వాళ్లకు నా అడ్రసు కూడా  తెలీకుండా హిమాలయాలలో ఉంటున్నాను. అప్పుడప్పుడూ అరుణాచలం వచ్చి  సాధన చేసుకుని మళ్ళీ హిమాలయాలకు పోతాను. నేను బ్రతికున్నానో లేనో కూడా వాళ్లకు తెలీదు. మా జైన్స్ లోనే పెద్ద మఠాధిపతిని చేస్తారు నన్ను. అది నాకిష్టం లేదు. అందుకే ఇలా అజ్ఞాతంగా ఉంటున్నాను' అని నాతో అన్నాడు. అతనికి మొబైల్ కూడా లేదు. వాడడు. మంచి అందగాడు యువకుడు. ఫిల్దీ రిచ్. కానీ సాధువయ్యాడు.  అంతటి వైరాగ్యం. నమ్ముతారా అన్నగారు?' అడిగాడు చంద్రశేఖర్.

'ఎందుకు నమ్మను? గత 50 ఏళ్ల నా నడకలో ఇలాంటివాళ్లను ఎంతో మందిని చూచాను' అన్నాను నేను.

'బాలాజీగారని ఒకాయన ఇక్కడ ఉన్నారు. బయట రూమ్ తీసుకుని ఉంటుంటారు. ఫెమిలీ చెన్నైలో ఉంటుంది. వాళ్ళు అప్పుడప్పుడూ ఇక్కడికొస్తారు. కానీ ఈయన రూముకు పోరు. ఈయన కూడా వాళ్లతో ఎక్కువ కలవడు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 11, సాయంత్రం 5 నుంచి 9 వరకూ హాల్లో ధ్యానంలో ఉంటాడు. ప్రపంచంలో ఏది ఏమైనా ఈ దినచర్య మాత్రం తప్పదు. నేనూ హాల్లో కూచుని ధ్యానం చేస్తాను. అలా పరిచయమయ్యాడు.

నేను సాధారణంగా హాల్లో ఒక ప్లేస్ లో కూచుంటూ ఉంటాను. అందుకని అది నా ప్లేస్ అయిపొయింది. నేను హాల్లోకి వెళితే అక్కడ కూచున్నవాళ్ళు లేచి నాకు  ప్లేస్ ఇచ్చేవాళ్ళు, అదేదో నా సొంతమైనట్లు. కొన్నాళ్ళు గడ్డం పెంచాను. తెల్లడ్రస్ వేసేవాణ్ని. ఇక్కడే అయిదేళ్లుగా ఉంటున్నా కదా. అందరూ నన్ను గుర్తించి గౌరవించడం మొదలుపెట్టారు. రమణాశ్రమంలో అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడికొస్తే ఈ గౌరవలేంట్రా భగవంతుడా? అనుకున్నా.  ఐడెంటిటీ కోల్పోడానికి ఇక్కడికొస్తే, ఇక్కడ కొత్త ఐడెంటిటీ తయారౌతోంది. అందుకని గడ్డం తీసేసి, మామూలు డ్రస్సులు వేసుకోవడం మొదలుపెట్టా. హాల్లో నేను మామూలుగా కూచునే ప్లేస్ మార్చేసి రోజుకొక చోట కూచోవడం మొదలుపెట్టా. ఇప్పుడు నన్నెవరూ గుర్తుపట్టరు. ఆ విధంగా వీళ్ళ గౌరవమర్యాదలనుంచి నన్ను నేను కాపాడుకున్నా' అన్నాడు.

'మంచి పని చేసావ్. వెరీ గుడ్' అన్నా.

ఆ మాటా ఈ మాటా మాట్లాడాక, 'ఇక్కడ క్రైమ్ రేట్ ఎలా ఉంది?' అడిగాను.

'ఉందన్నగారు. ఫారినర్స్ అమాయకంగా అందరినీ నమ్ముతారు. ప్రమాదంలో పడతారు. ఇక్కడందరూ మంచివాళ్ళేమీ కాదు. ఒక అమెరికన్ అమ్మాయిని కొండమీద రేప్ చేసి చంపేశారు. ఇంకొక రష్యన్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కు గురైంది. మీడియాలో అదంతా వచ్చింది. చాలా గోల అయింది. కొండలలోకి వంటరిగా పోయి తిరిగితే మాత్రం డేంజరే, అందులోనూ అమ్మాయిలకు మరీ డేంజర్. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. తెల్లవారుజామున గిరిప్రదక్షిణ చేసే అమ్మాయిలను ఎటాక్ చేసేవారు ఉన్నారు. క్రైమ్ ఉంది. ఒకరోజున ఆశ్రమం ముందే నా మొబైల్ లాగుకోబోయారు.  క్షణంలో తప్పుకున్నాను ' అన్నాడు.

'ఇది జ్ఞానభూమి అన్నది నిజమే. మహర్షి మహాజ్ఞాని నిజమే. కానీ లోకల్స్ అందరూ జ్ఞానులేమీ కాదు కదా? వాళ్లలో క్రిమినల్స్ చాలామంది ఉంటారు. మహర్షి బ్రతికున్న రోజులలో దొంగలు ఆయన్నే కొట్టారు కదా.  అంతెందుకు? ఇక్కడ కనిపించే సాధువులలో చాలామంది దొంగసాధువులే.  క్రైమ్ చేసి ఈ వేషంలో తప్పించుకుని తిరిగేవాళ్లు కూడా చాలామంది ఇక్కడ ఉంటారు' అన్నాను.

'అవునన్నగారు. పైగా, యూ ట్యూబర్స్ వల్ల అరుణాచలం ఈమధ్యన చాలా చండాలం అయింది.  ఎవడెవడు ఇక్కడికి వస్తున్నాడో తెలీడం లేదు.  గిరిప్రదక్షిణం అంటూ ప్రతివాడూ ఇక్కడికి వస్తున్నాడు. కొండ చుట్టూ తెగ తిరుగుతున్నారు' అన్నాడు.

'వాళ్ళగురించి నాకు చెప్పకు తమ్ముడూ. అలాంటి నేలబారు గుంపంటే నాకు చాలా అసహ్యమని  నీకు తెలుసు కదా?' అన్నాను.

ఆ తర్వాత ఓషో, జిడ్డు, యూజీ, డోనాల్డ్ హాఫ్ మాన్, నిసర్గదత్త మహారాజ్, రమేష్ బల్సేకర్, మూఁజీ, పాపాజీ మొదలైన వాళ్ళ గురించి చర్చ నడించింది.

కాగ్నిషన్ సైన్స్ గురించి చాలా చెప్పాడు. అంతా విని ఇలా అన్నాను.

'కాగ్నిషన్ సైంటిస్టులు అద్వైతాన్ని సైన్సు పరిభాషలో చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే, కాశ్మీరశైవాన్ని మక్కీకి మక్కీ దించారు. మోడ్రన్ ఫిజిక్స్ అంతా వేదాంతమే. ఈ పోకడ ఫ్రిజాఫ్ కాప్ర మొదలైనవారితో మొదలైంది. ఐన్ స్టైన్ చెప్పినది కూడా మాయావాదానికి దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ ఒదిలేసేయ్యి. ఈ సైంటిస్టులు ఎన్ని మాట్లాడినా, నువ్వు ఎంత అర్ధం చేసుకున్నా, అంతిమంగా నువ్వు నిర్వికల్పసమాధిలోకి దిగనిదే ఏమీ ప్రయోజనం లేదు. మిగతాదంతా ఉత్తవాగుడు మాత్రమే అని గ్రహించు'.

నేటి పాపులర్ టీవీ/యూట్యూబ్ గురువులగురించి తనేదో చెప్పబోతే, 'వాళ్ళ పేర్లెత్తకు తమ్ముడూ. మన నోళ్లు పాడౌతాయి. వద్దు' అంటూ వారించాను.

అదంతా వ్రాస్తే మరో నాలుగు ఎపిసోడ్లవుతాయి గనుక వ్రాయడం లేదు.

చివరగా, 'మళ్ళీ ఎప్పుడొస్తారన్నగారు?' అంటూ అడిగాడు.

'తెలీదు. ఈసారి ఇంకా తక్కువమందితో వస్తాను. లేదా ఒక్కడినే వస్తాను. అప్పుడు కొద్దిరోజులు ఇక్కడే ఉంటూ తపస్సులో కాలం గడుపుతాను, 

పుస్తకాలు ఎక్కువ చదవకు తమ్ముడూ. తపస్సు చేయి. అదే ప్రధానం, నెట్ ఎక్కువ చూడకు. మొబైల్ టైం బాగా తగ్గించు. నా మొబైల్ ప్రస్తుతం రోజంతా ఆఫ్ లోనే ఉంచుతున్నాను. సాయంత్రం ఒక గంట మాత్రం ఓపెన్ చేస్తాను. మన ఆశ్రమంలో రూల్ ఇది. నాతొ ఉండాలనుకునేవాళ్ళు మొదటగా మొబైల్ ను పక్కన పెట్టాలి. నువ్వూ అలాగే చెయ్యి. ప్రపంచంతో సంబంధాలు బాగా తగ్గించుకో. మన ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్లుండు' అని తనకు సలహా ఇచ్చాను.

'వస్తానన్నగారు' అన్నాడు.

ఆ విధంగా మూడ్రోజుల అరుణాచలం యాత్రను ముగించి, కార్లో చెన్నై చేరుకొని, అక్కడ రైలెక్కి, బాపట్లలో దిగి, రాత్రికి జిల్లెళ్ళమూడి చేరుకున్నాం.

ఆ విధంగా పాండిచ్చేరి, ఆరోవిల్, తిరువణ్ణామలై యాత్రలు ముగిశాయి.
read more " అరుణాచల యాత్ర - 8 (చంద్రశేఖర్ తో సంభాషణ) "

15, మార్చి 2023, బుధవారం

ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన

















ఆరోవిల్ లో ఉన్నపుడు ఒక రోజున సౌండ్ గార్డెన్  ను సందర్శించాం.

అక్కడ సప్తస్వరాలను పుట్టించే రకరకాల సంగీత పరికరాలను  తయారుచేసి అమ్ముతున్నారు. అక్కడున్న ఒక హాంకాంగ్ భక్తుడు మాకు వాటిని గురించి వివరించాడు. అలా వివరిస్తూ యోగచక్రాలకు సప్తస్వరాలకు సంబంధం ఉందని అతనన్నాడు. చూడబోతే ధ్యానసాధకుడిలాగే కనిపించాడు. చైనా జాతీయుడు.

అతని వివరణ అంతా అయిపోయాక పక్కకు పిలిచి ఇలా అడిగాను.

'మీరు అంతరిక నాదాన్ని విన్నారా?'

అతను ఎగాదిగా చూశాడు.

'లేదు' అన్నాడు.

నవ్వాను.

'మీరెన్నాళ్లనుంచీ ఇక్కడుంటున్నారు?'

'ఆరేళ్ళనుంచీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాధన చేస్తూ ఇక్కడే ఉంటున్నాను' అన్నాడతను.

'మీరు తైచీ, కిగాంగ్, జెన్ అభ్యాసం చేస్తారా?'

'లేదు నాకవి తెలీదు. నేను అరబిందో గారి ఇంటెగ్రల్ యోగ సాధకుడిని'అన్నాడు. 

'పోనీ ఒక విషయం చెప్పండి. ఇంటెగ్రల్ యోగా లో ఉన్నత స్థాయిలు అందుకున్న సాధకులు ఎవరైనా మీకు తెలుసా? పుస్తకాలు చదివి మాటలు చెప్పేవాళ్ళు కాదు. అనుభవజ్ఞానం ఉన్నవాళ్లు' 

ఆతను మళ్ళీ ఎగాదిగా చూశాడు.

'అనుభవం అంటే దానిని మాటల్లో చెప్పడం కష్టం కదా?' అన్నాడు.

'సరే వినండి. అరబిందో గారి యోగపరిభాషలోనే అడుగుతాను. ఓవర్ మైండ్, సూపర్ మైండ్ స్థాయిలను అనుభవంలో అందుకున్నవాళ్ళు మీకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఉన్నారా?'

అతను తల అడ్డంగా ఆడించాడు.

'మీరు ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కలుసుకున్నట్లే' అన్నాడు.

అతని నిజాయితీ నాకు నచ్చింది.

'ఉత్తమాటలు చెప్పేవాళ్ళతో లోకమంతా నిండి ఉంది. సాధనానుభవాలలో ఔన్నత్యాలను అందుకున్నవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు' అని శ్రీ విద్యారహస్యం పుస్తకంలో పదేళ్లక్రితం  నేను వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి.

'ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. థాంక్స్. నమస్తే' అని అతనితో చెప్పి 'పదండి పోదాం' అన్నాను శిష్యబృందంతో.

read more " ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన "

14, మార్చి 2023, మంగళవారం

అరుణాచల యాత్ర - 7 (కాషాయం ఒక భ్రమ)

కాషాయం కట్టినా
కషాయం వదలకపోతే
విషాదంతో ముగిసిపోవడం
వీరసన్యాసుల జీవితలక్షణం

బ్రహ్మచర్య దీక్షలూ
సన్యాసపు టెక్కులూ
అహానికి ఆనవాళ్ళైతే
ఆ జీవితం ఉభయభ్రష్టత్వం

తెల్లగోచీ కట్టుకున్న మహర్షి చుట్టూ
కాషాయాలు కట్టిన సన్యాసులు
పిల్లవాడైన దక్షిణామూర్తి చుట్టూ
వినమ్రులై కూచున్న వృద్ధఋషులు

ధ్యానంలో ఓనమాలు తెలియకుండా
దానిపై గ్రంధాలు వ్రాస్తున్న పిల్లసన్నాసులు
సన్యాస సంస్థను వదిలేసి బయటకొచ్చి
సంసారం సాగిస్తున్న పిచ్చిసన్యాసులు

సన్యాసం పుచ్చుకోవడం కాదు
సన్యాసివి కావాలని
మహర్షి చెప్పిన మాట
ఎంత సత్యం?

సంసారాన్ని నువ్వు వదలడం కాదు
సంసారం నిన్ను వదలాలని
రామకృష్ణులు చెప్పినమాట
అంతే సత్యం

కాషాయం ఒక భ్రమ
సన్యాసం అనవసరపు శ్రమ
పాండిత్యం ఒక బూటకం
పారలౌకికం పనికిరాని నాటకం
read more " అరుణాచల యాత్ర - 7 (కాషాయం ఒక భ్రమ) "

అరుణాచల యాత్ర - 6 (మనసుకు కాయలు)

కొండ  దిగుతూ ఉండగా కొంతమంది కొండనెక్కుతూ మనకు ఎదురౌతూ ఉంటారు. అదేవిధంగా, విరూపాక్ష గుహ వైపుగా ఒక తెలుగుశాల్తీ  ఎదురొచ్చింది. అతని వయసు 25 ఉంటుందేమో, పర్వతాకారంలో ఉన్నాడు. రొప్పుకుంటూ కొండనెక్కుతున్నాడు.  కాళ్లకు సాక్సులున్నాయి. చెమట పట్టి అవి బండలపైన జారుతున్నాయి. నా దగ్గరగా వచ్చేసరికి కాలుజారి తూలి పడబోయాడు. చెయ్యి పట్టుకుని ఆపాను. 

'థాంక్స్ అంకుల్' అన్నాడు రొప్పుతూ.

'ఇంకా చాలా ఎక్కాలి. సాక్సు తీసేసి ఎక్కు బాబు. కాళ్ళు జారుతాయి' అన్నాను.

ఫిట్నెస్ లేనివాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తూ ఉంటుంది. దేహాన్ని వాళ్ళు ఎబ్యూస్ చేస్తున్నారు. ఇక ఆధ్యాత్మికం వాళ్లకు ఎలా ఎక్కుతుంది?

అతను ఒక్క క్షణం ఆగి, 'నిన్న గిరిప్రదక్షిణం చేశాను. కాళ్ళు కాయలు కాచాయి. అందుకే సాక్సు వేసుకుని ఎక్కుతున్నాను' అన్నాడు గర్వంగా ఫీలౌతూ.

జాలేసింది.

అతని చెయ్యి వదిలేసి నా దారిన నేను దిగుతూ 'మనసుకు కాస్తే బాగుండేది' అన్నాను.

అతను పైకి నడుస్తూ, 'ఏంటంకుల్ అన్నారు?' అన్నాడు అర్ధం కాక.

'నిన్ను కాదులే బాబు. నీకు ఉపయోగపడదులే' అని నా దారిన నేను దిగడం మొదలుపెట్టాను.

చాలామంది, ఉపవాసాలు, ప్రతినెలా గిరిప్రదక్షిణాలు చేస్తూ అదేదో గొప్పగా ఫీలౌతూ ఉంటారు. వాళ్ళకొక మాట!

శ్రీ రామకృష్ణుల భక్తుడైన బ్రహ్మానంద స్వామి ఇలా అనేవారు.

'శరీరాన్ని కష్టపెట్టడం సులభం. మనసును నిగ్రహించడం కష్టం'.

శరీరం పిచ్చిది. దాన్ని ఎలాగైనా హింస పెట్టవచ్చు. అదేమీ గొప్ప విషయం కాదు. ఆధ్యాత్మికంగా దానికి ఎలాంటి విలువా లేదు. నువ్వు జీవితాంతం గిరిప్రదక్షినాలు చేసినా నా దృష్టిలో దానికి దమ్మిడీ విలువ కూడా లేదు.

కాళ్లకు కాయలు కాయడం గొప్ప కాదు. అవి మనసుకు కాయాలి.

అప్పుడే మనిషి జన్మకు సార్ధకత !

read more " అరుణాచల యాత్ర - 6 (మనసుకు కాయలు) "

అరుణాచల యాత్ర - 5 (కొండను శుభ్రపరచాం)






మర్నాడు పొద్దున్నే లేచి, మహర్షి సమాధిని దర్శించి, కొండనెక్కడం మొదలుపెట్టాం. ఆశ్రమం గేటు దాటటం తోనే గుర్తించిన విషయం ఏంటంటే, కొండ పాదం దగ్గరంతా ఇళ్లతో కబ్జా కాబడి, చెత్తా చెదారంతో నిండి ఉండటం.

ఉసూరుమనిపించింది.

అరుణాచల స్థలపురాణం ప్రకారం, ఈశ్వరుడు మూడు రూపాలలో ఇక్కడున్నాడు. ఒకటి, ఆలయంలో లింగరూపంలో, రెండు  అరుణాచల పర్వతరూపంలో, మూడు కొండపైన దేహంతో. ఈ కొండే ఈశ్వరుడని  శాస్త్రాలు చెబుతున్నాయి. మహర్షి కూడా అవునన్నారు. మరి అలాంటి కొండని ఏ విధంగా చూసుకోవాలి?

ఊరకే ప్రదక్షిణాలు చేస్తూ, మొక్కులు మొక్కుకుంటూ, కోరికలు కోరుకుంటూ, షాపులు కట్టి బిజినెస్ లు చేసుకుంటూ, చెత్తా చెదారంతో కొండని నింపుతూ ఉంటే అదెలాంటి భక్తి అవుతుందో నాకైతే అర్ధం కాలేదు.

అందుకే, 'కొండపైన కన్పించిన ప్లాస్టిక్ చెత్తనంతా మనకు అందినంత మేరకు ఏరి క్రిందకు తెద్దామ'ని నా శిష్యులతో చెప్పాను.

స్కందాశ్రమం, విరూపాక్షగుహ, గుహాయ నమశ్శివాయ సమాధులను దర్శించి క్రిందికి దిగి వచ్చే క్రమంలో ఒక గోతానికి పైగా ప్లాస్టిక్ చెత్తనంతా ఏరి క్రిందకు తెచ్చి పదేశాము. ఈ విధంగా అరుణాచలానికి మేము చేయగలిగిన సేవను చేశాము. గతంలో కోటప్పకొండను కూడా ఇదే విధంగా శుభ్రం చేశాము. 

లక్షలాదిగా కొండను దర్శిస్తున్న తెలుగుభక్తులు కూడా ఇదే విధంగా చేస్తే, నిజమైన శివారాధనను చేసిన వాళ్లవుతారు.

అభిషేకాలు చేస్తూ అడ్డమైన కోరికలు కోరుకోవడం కాదు, ఊరకే కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు, ప్రకృతిరూపంలో ఉన్న ఈశ్వరుడిని ఆరాధించడం నేర్చుకోండి.

మీ వల్ల కాదని నాకు తెలుసు,

కనీసం ప్రయత్నించండి !

read more " అరుణాచల యాత్ర - 5 (కొండను శుభ్రపరచాం) "

అరుణాచల యాత్ర - 4 (గిరి ప్రదక్షిణం ప్లాన్ చేశారా?)

చలంగారి సమాధి రోడ్డుపక్కన పడి ఉంది.

ఒకనాడు ఆంధ్రదేశాన్ని గగ్గోలు పెట్టించిన గొప్ప రచయిత, స్త్రీల స్వేచ్ఛ కోసం తపించిన గొప్ప మానవతా వాది, సౌందర్యపిపాసి అయిన గుడిపాటి వెంకటాచలం నేడు పరాయి రాష్ట్రంలో రోడ్డుపక్కన దుమ్ములో దిక్కులేకుండా పడి ఉన్నాడు.

చలం విలువను తెలుగుప్రజలు గుర్తించలేదు. నేటి తరానికి చలమెవరో తెలీను కూడా తెలీదు. ఇది తెలుగుప్రజల దురదృష్టం.

తెలుగుప్రజలు డబ్బుకు, ఆస్తులకు ఇచ్చిన విలువ ఆదర్శాలకు ఆధ్యాత్మికతకు ఇవ్వరు. అది వాళ్ళ జీన్స్ లోనే లేదని నా అనుమానం.

చలంగారి జీవితాన్ని చదివితే, సాంప్రదాయ బ్రాహ్మణబాలుడిగా మొదలై, బ్రహ్మసమాజపు ఆదర్శాలతో పెరిగి, స్త్రీవాదిగా, మానవతావాదిగా, సౌందర్యారాధకుడిగా ఎదిగి, ప్రపంచంలోని అసమానతలు, దుర్మార్గాలు ఎందుకున్నాయి? అవి అంతం కావా? అంటూ తపించి, సమాధానాలు దొరకక, చివరకు రమణమహర్షి నీడలో సేదతీరిన ఒక గొప్ప మనిషి దర్శనమిస్తాడు. సౌరిస్ వంటి యోగినికి తండ్రి అయ్యే అర్హతను బట్టి చలం జీన్స్ ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. చలంగారిని చూడటానికి జిల్లెళ్ళమూడి అమ్మగారు వచ్చారు. UG గారు తరచుగా తిరువన్నామలై వచ్చేవారు. చలంలో ఏమీ లేకపోతే అలాంటి మహనీయులు ఇంతదూరం ఎందుకొస్తారు?

అలాంటి చలంగారి సమాధి తమిళనాడులో ఇలా పడి ఉంది. కనీసం బెంగాలీలను చూసైనా తెలుగువాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి. టాగోర్ ని గాని, జతీంద్రమోహన్ని గాని, సత్యేంద్రనాథ్ ని గాని, కాజీ నజరుల్ ఇస్లాంని గాని వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారు? మన రచయితలను మనం ఎలా గౌరవిస్తున్నాం?

అభిరుచి లేని చవకబారు మనస్తత్వాలలో తెలుగుజాతి ముందుంటుందని నా ఇంకొక పెద్ద అనుమానం. వాళ్లకు తెలిసిన 'కళ', కుప్పిగంతులు, కప్పగెంతులు వేసే సినిమాలేగా మరి ! అంతకంటే గొప్ప అభిరుచి వాళ్లకెక్కడేడిసింది గనుక?

పెనమలూరు రోడ్డు పక్కన దుమ్ములో కూర్చుని ఉండే మాల పిచ్చమ్మగారిని చలం తన విజయవాడ రోజులలో తరచుగా సందర్శించేవాడు. ఆమె సమాధి విజయవాడలో రోడ్డుపక్కన ఉంది. చలం సమాధి అరుణాచలంలో రోడ్డు పక్కన ఉంది. ఏంటీ పోలిక?

మాలపిచ్చమ్మ గారి సమాధిని యూ ట్యూబర్లు ఇంకా సొమ్ము చేసుకోలేదా? అదామె అదృష్టం !

కొద్దిసేపు మౌనంగా అక్కడున్న తర్వాత వెనక్కు బయల్దేరాం.

'గిరిప్రదక్షిణం ప్లాన్ చేశారా?' అడిగాడు చంద్రశేఖర్.

'ఇప్పుడు చేస్తున్నది అది కాదా?' అన్నాను.

'అలాకాదు, అందరూ చేసేటట్లు' అన్నాడు.

'అందరూ చేసేదానిలో ఔన్నత్యం కనిపిస్తే అలాగే చేసేవాణ్ణి' అన్నాను.

చంద్రశేఖర్ తన రూమ్ కి వెళ్ళిపోయాడు. మేము ఆంధ్రాశ్రమం దారి పట్టాము.

read more " అరుణాచల యాత్ర - 4 (గిరి ప్రదక్షిణం ప్లాన్ చేశారా?) "

13, మార్చి 2023, సోమవారం

అరుణాచల యాత్ర - 3 (దుర్భరంగా మారిన టోపీ అమ్మ బ్రతుకు)

నడుస్తుండగా మాట్లాడటం సాగించాడు చంద్రశేఖర్.

'అరుణాచలం పాడైపోయింది అన్నగారు. 2017 లో నేనొచ్చినపుడు కూడా ప్రశాంతంగా ఉండేది. గత నాలుగేళ్లనుంచి తెలుగుజనాల దాడి మొదలైంది. ప్రశాంతత మాయమైంది. యూ ట్యూబు గురువులు కొంతమంది అరుణాచలాన్ని బాగా పాపులర్ చేశారు. ఇలా తయారైంది' అన్నాడు.

1983 లో మొదటిసారి నేనిక్కడికి వచ్చినపుడు అరుణాచలం ఎలా ఉండేదో గుర్తొచ్చింది. నవ్వుకున్నా.

చంద్రశేఖర్ కంటిన్యూ చేశాడు.

'పౌర్ణమి వచ్చిందంటే చాలు. లక్షలాది జనం బస్సుల్లో కార్లలో  పోలోమంటూ వచ్చేస్తున్నారు. ఆ రెండురోజులు, లోకల్స్ బయటికిరావాలంటే భయపడి చస్తున్నారు. అంత దారుణంగా ఉంటోంది. రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ మధ్య ఎవడో యూ ట్యూబరుడు, 'టోపీ అమ్మ' అని ఒకామెని బాగా పాపులర్ చేశాడు. ఆమె ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె బ్రతుకు బస్టాండ్ ఐపాయింది. ఎప్పుడు చూసినా కనీసం ఒక ఇరవైమంది ఆమె వెంట తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఆమె జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. మొన్నీ మధ్య ఏం జరిగిందో తెలుసా అన్నగారు? ఆమె పాసు పోసుకుంటుంటే చుట్టూ పదిమంది తెలుగుభక్తులు నిలబడి చూస్తున్నారట.యూట్యూబ్ గురువుల వల్ల అంత దరిద్రం అయిపొయింది ఆమె లైఫ్' అన్నాడు బాధగా.

నవ్వొచ్చింది.

'ఇంకా నయం వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టలేదు సంతోషించు. పిచ్చిజనం పిచ్చిలోకం. ఎవరి ఖర్మ వారిది. మంచి చెబితే ఎవడూ వినడు. టైం వచ్చినపుడు, వాత పడినపుడు మాత్రమే వీళ్లకు అర్ధమౌతుంది అదంతే' అన్నా. 

'టోపీ అమ్మ అవధూత అయితే వీళ్ళకెందుకు? కాకపోతే వీళ్ళకెందుకు? ఎటుచూచినా లోకంతో ఆమెకు పనిలేదు. ఆమెతో లోకానికి కూడా ఉపయోగం లేదు. వెరసి యూట్యూబు వల్ల ఆమె జీవితం మాత్రం దుర్భరం అయిపోయింది' అన్నాడు.

'ఎంతమంది అమ్మలొచ్చినా జనానికి బుద్ధి మాత్రం రాదు తమ్ముడూ. ప్రజల అజ్ఞానం  కూడా ఎంతమాత్రమూ పోదు, ఈ లోకం ఇలా సాగవలసిందే' అన్నా నవ్వుతూ.

మాటల్లోనే చలంగారి సమాధి వచ్చేసింది.

read more " అరుణాచల యాత్ర - 3 (దుర్భరంగా మారిన టోపీ అమ్మ బ్రతుకు) "

అరుణాచల యాత్ర - 2 (లోపలికెళ్ళొచ్చారా?)

పదకొండుకు ఆరోవిల్ లో బయల్దేరి మధ్యాన్నం రెండుగంటల ప్రాంతంలో తిరువణ్ణామలై చేరుకున్నాం. ఆంధ్రాశ్రమంలో లగేజి పడేసి, శేషాద్రిస్వామి ఆశ్రమ హోటల్లో భోజనం అయిందనిపించి, బసకెళ్లి విశ్రాంతి తీసుకున్నాం.

సాయంత్రం లేచి  ఆశ్రమానికెళ్లి చూస్తే బాగా జనం ఉన్నారు. పిచ్చిజనాన్ని మనం భరించలేం గనుక, పౌర్ణమిని తప్పించి, మరుసటిరోజున అరుణాచలం చేరుకున్నాం.  కానీ  ఆరోజు కూడా పౌర్ణమి ఘడియలున్నాయి. అందుకని తెలుగోళ్ల సంతలాగా ఉంది ఆశ్రమం. ఆ నేలబారు భక్తులని చూస్తే చీదరేసింది.

హాల్లోకెళ్ళకుండా ఆశ్రమం అంతా తిరిగి చూస్తుంటే ఒకచోట తమ్ముడు చంద్రశేఖర్ కనిపించాడు. పదేళ్ల క్రితం తను LIC లో ఆఫీసర్ గా చేస్తూ రిజైన్ చేసి, ఇన్ఫోసిస్ CSC లో మేనేజర్ గా చేరాడు. అక్కడ రెండేళ్లు చేసి చిన్న వయసులోనే ఉద్యోగానికి రిజైన్ చేసి 2017 నుంచి అరుణాచలంలోనే ఉంటున్నాడు. వైరాగ్య సంపన్నుడు. స్వామి తత్వవిదానందగారి దగ్గర ఉపనిషత్తులను శాస్త్రాలను అధ్యయనం చేశాడు. పెళ్ళి అనే పదాన్ని తన జీవితంలో నుంచి తీసేశాడు. ప్రస్తుతం అరుణాచల నివాసి. మా పరిచయం 1995 నాటిది. తనగురించి గతంలో కూడా వ్రాశాను.

'చాలాఏళ్లయింది అన్నగారు మనం కలుసుకుని. నేను 2019 లో గుంటూరులో మనింటికి వచ్చాను. మీరు హైద్రాబాద్ మారారని తెలిసింది, మళ్ళీ ఇన్నేళ్లకు ఇక్కడ కలుసుకున్నాం' అన్నాడు సంతోషంగా.

'అవును. హైద్రాబాద్ లో ఉద్యోగపర్వం ఆఖరయింది. ఇప్పుడు ఆశ్రమవాసపర్వం మొదలైంది' అన్నాను.

అక్కడే మెట్లమీద కూర్చుని పాత విషయాలు చాలా కలబోసుకున్నాం.

'లోపలికెళ్ళొచ్చారా?' అడిగాడు. 'లోపలికి' అంటే 'మహర్షి సమాధి ఉన్న హాల్లోకి' అని తనర్ధం. 

'లోపలే ఉన్నా' అన్నాను.

చీకటి పడటం మొదలైంది.

'చలంగారి సమాధి దగ్గరకు పోయొద్దాం పద' అన్నాను.

'హాల్లోకి వెళ్ళరా? ఆర్యూ ష్యూర్?' అన్నాడు,

'కాక్ ష్యూర్' అంటూ మెట్లమీదనుంచి లేచాను.

హాల్లోకెళ్ళకుండా చలంగారి సమాధి దగ్గరకు దారితీశాము.

read more " అరుణాచల యాత్ర - 2 (లోపలికెళ్ళొచ్చారా?) "

అరుణాచల యాత్ర - 1 (అంగళ్ల మేళం)

మహర్షి పోయాడు

సమాధి మిగిలింది

అద్వైతం అల్లరైంది

అంగళ్ల మేళమైంది


వేషగాళ్ళు మోసగాళ్ళు

మెట్టవేదాంతులు

పొట్టసిద్ధాంతులు

గట్టిగా పాతుకుపోయారు 


చవకబారు భక్తులతో

నేలబారు శక్తులతో

కాఫీ హోటళ్లతో

మాఫీ హాస్టళ్లతో

జ్ఞానభూమి జాతరైంది


యూ ట్యూబరులు - క్యూ బాబరులు

వై ఫైబరులు - ఫ్రీ రోమరులు

ప్రేమపక్షులు - కామపిశాచులు

బైరాగికొంగలు - టూరిష్టు కాకులు


యాచకులు - కీచకులు

బోధకులు - బోరుకులు

సందుసందుకీ కనిపించే

సాధనా విదూషకులు


పండితులు - ఖండితులు

బాధితులు - చోదితులు

విందుభోజనాలు చేసే

వేదాంత విషకీటకులు


గిరివాలం చేసే వాలాయుధులు

మడిమేలం చూపే మాలాయుధులు

సన్యాసాన్ని వదిలేసిన నల్లసన్యాసులు

విన్యాసాలు చూపించే తెల్లసన్నాసులు 


తెలుగు నేల నుంచి వాలిన

రియల్ ఎస్టేట్ షార్కులు

వెలుగు నేలకు తగ్గిన 

ఆధ్యాత్మిక మార్కులు


జ్ఞానం మాయమైంది

ప్రదక్షిణం మిగిలింది

తెలివిలేని తెలుగు గొర్రెలతో

అరుణాచలం అలమటిస్తోంది

read more " అరుణాచల యాత్ర - 1 (అంగళ్ల మేళం) "

12, మార్చి 2023, ఆదివారం

తిరువణ్ణామలై ఫోటోలు

 


తమ్ముడు చంద్రశేఖర్ తో టీస్టాల్ దగ్గర వేదాంతచర్చ   


రమణాశ్రమ ద్వారం దగ్గర




స్కందాశ్రమంలో


స్కందాశ్రమం నుంచి ఆలయదృశ్యం


తమ్ముడు చంద్రశేఖర్ తో రమణాశ్రమంలో



చలంగారి సమాధిదగ్గర రాత్రిపూట


స్కందాశ్రమానికి పోయే దారిలో


స్కందాశ్రమంలో 


విరూపాక్షగుహ వైపు కొండ దిగుతూ


కొండ దిగే దారిలో


తిరువణ్ణామలై రోడ్లపైన వేదాంతచర్చ


కొండ దిగుతూ



రమణాశ్రమంలో



తిరువణ్ణామలై లో ఒక శిష్యురాలి ఇంటిలో 





ఆశ్రమం ఎదురు టీ స్టాల్ దగ్గర



పాతాళ లింగం దగ్గర


అరుణాచలేశ్వర ఆలయంలో




ఆలయం బయట




చలంగారి సమాధి


 చలంగారి సమాధి నుంచి కొండశిఖరం


చలంగారి సమాధి దగ్గర




కాళీమాత మందిరం దగ్గర

read more " తిరువణ్ణామలై ఫోటోలు "