మర్నాడు పొద్దున్నే లేచి, మహర్షి సమాధిని దర్శించి, కొండనెక్కడం మొదలుపెట్టాం. ఆశ్రమం గేటు దాటటం తోనే గుర్తించిన విషయం ఏంటంటే, కొండ పాదం దగ్గరంతా ఇళ్లతో కబ్జా కాబడి, చెత్తా చెదారంతో నిండి ఉండటం.
అరుణాచల స్థలపురాణం ప్రకారం, ఈశ్వరుడు మూడు రూపాలలో ఇక్కడున్నాడు. ఒకటి, ఆలయంలో లింగరూపంలో, రెండు అరుణాచల పర్వతరూపంలో, మూడు కొండపైన దేహంతో. ఈ కొండే ఈశ్వరుడని శాస్త్రాలు చెబుతున్నాయి. మహర్షి కూడా అవునన్నారు. మరి అలాంటి కొండని ఏ విధంగా చూసుకోవాలి?
ఊరకే ప్రదక్షిణాలు చేస్తూ, మొక్కులు మొక్కుకుంటూ, కోరికలు కోరుకుంటూ, షాపులు కట్టి బిజినెస్ లు చేసుకుంటూ, చెత్తా చెదారంతో కొండని నింపుతూ ఉంటే అదెలాంటి భక్తి అవుతుందో నాకైతే అర్ధం కాలేదు.
అందుకే, 'కొండపైన కన్పించిన ప్లాస్టిక్ చెత్తనంతా మనకు అందినంత మేరకు ఏరి క్రిందకు తెద్దామ'ని నా శిష్యులతో చెప్పాను.
స్కందాశ్రమం, విరూపాక్షగుహ, గుహాయ నమశ్శివాయ సమాధులను దర్శించి క్రిందికి దిగి వచ్చే క్రమంలో ఒక గోతానికి పైగా ప్లాస్టిక్ చెత్తనంతా ఏరి క్రిందకు తెచ్చి పదేశాము. ఈ విధంగా అరుణాచలానికి మేము చేయగలిగిన సేవను చేశాము. గతంలో కోటప్పకొండను కూడా ఇదే విధంగా శుభ్రం చేశాము.
లక్షలాదిగా కొండను దర్శిస్తున్న తెలుగుభక్తులు కూడా ఇదే విధంగా చేస్తే, నిజమైన శివారాధనను చేసిన వాళ్లవుతారు.
అభిషేకాలు చేస్తూ అడ్డమైన కోరికలు కోరుకోవడం కాదు, ఊరకే కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు, ప్రకృతిరూపంలో ఉన్న ఈశ్వరుడిని ఆరాధించడం నేర్చుకోండి.
మీ వల్ల కాదని నాకు తెలుసు,
కనీసం ప్రయత్నించండి !