నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మార్చి 2023, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 50 (ఏకాదశ రుద్రాభిషేకం)

అమ్మ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

రుద్రాభిషేకాలు,  చండీ హోమాలు, లలితా పారాయణలు ప్రతిరోజూ జరుగుతున్నాయి. మరొకవైపున క్రైస్తవ మైకులు దద్దరిల్లుతున్నాయి.

అటువంటివేవీ మనకు పడవు గనుక, ఇంట్లోనే ఉంటున్నాం. బుద్ధిపుడితే నిశ్శబ్దంగా అమ్మ ఆలయానికి వెళ్లి ప్రణామం చేసి వెనక్కు వచ్చేస్తున్నాం. లేదంటే పొలాల దారులలో సైలెంట్ వాకింగ్. అంతేగాని ఎవరినీ కలవడం లేదు. 

నిన్న వాకింగ్ చేస్తుంటే ఒక లోకల్ భక్తుడు ఎదురయ్యాడు.

'ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రతిరోజూ పొద్దునపూట జరుగుతున్నాయి' అన్నాడు.

'అవును. ఇక్కడ కూడా జరుగుతున్నాయి' అన్నాను

'నేను చెబుతున్నది ఇక్కడి సంగతే' అన్నాడు కొంచం వెటకారంగా.

'అర్ధమైంది. నేను చెబుతున్నది కూడా ఇక్కడి సంగతే' అన్నాను శాంతంగా.

కొంచం అయోమయంగా చూశాడు.

'మరి చూస్తున్నారా?' అన్నాడు

'జరుగుతున్నపుడు చూడటమెందుకు?' అన్నాను.

ఆయనకు అర్ధం కాలేదు.

ఒక పిచ్చివాడిని చూసినట్టు చూసి తన దారిన తను వెళ్ళిపోయాడు.

వెళ్లిపోతున్న పిచ్చివాడిని చూచి నాలో నేను నవ్వుకున్నా.