“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

14, మార్చి 2023, మంగళవారం

అరుణాచల యాత్ర - 6 (మనసుకు కాయలు)

కొండ  దిగుతూ ఉండగా కొంతమంది కొండనెక్కుతూ మనకు ఎదురౌతూ ఉంటారు. అదేవిధంగా, విరూపాక్ష గుహ వైపుగా ఒక తెలుగుశాల్తీ  ఎదురొచ్చింది. అతని వయసు 25 ఉంటుందేమో, పర్వతాకారంలో ఉన్నాడు. రొప్పుకుంటూ కొండనెక్కుతున్నాడు.  కాళ్లకు సాక్సులున్నాయి. చెమట పట్టి అవి బండలపైన జారుతున్నాయి. నా దగ్గరగా వచ్చేసరికి కాలుజారి తూలి పడబోయాడు. చెయ్యి పట్టుకుని ఆపాను. 

'థాంక్స్ అంకుల్' అన్నాడు రొప్పుతూ.

'ఇంకా చాలా ఎక్కాలి. సాక్సు తీసేసి ఎక్కు బాబు. కాళ్ళు జారుతాయి' అన్నాను.

ఫిట్నెస్ లేనివాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తూ ఉంటుంది. దేహాన్ని వాళ్ళు ఎబ్యూస్ చేస్తున్నారు. ఇక ఆధ్యాత్మికం వాళ్లకు ఎలా ఎక్కుతుంది?

అతను ఒక్క క్షణం ఆగి, 'నిన్న గిరిప్రదక్షిణం చేశాను. కాళ్ళు కాయలు కాచాయి. అందుకే సాక్సు వేసుకుని ఎక్కుతున్నాను' అన్నాడు గర్వంగా ఫీలౌతూ.

జాలేసింది.

అతని చెయ్యి వదిలేసి నా దారిన నేను దిగుతూ 'మనసుకు కాస్తే బాగుండేది' అన్నాను.

అతను పైకి నడుస్తూ, 'ఏంటంకుల్ అన్నారు?' అన్నాడు అర్ధం కాక.

'నిన్ను కాదులే బాబు. నీకు ఉపయోగపడదులే' అని నా దారిన నేను దిగడం మొదలుపెట్టాను.

చాలామంది, ఉపవాసాలు, ప్రతినెలా గిరిప్రదక్షిణాలు చేస్తూ అదేదో గొప్పగా ఫీలౌతూ ఉంటారు. వాళ్ళకొక మాట!

శ్రీ రామకృష్ణుల భక్తుడైన బ్రహ్మానంద స్వామి ఇలా అనేవారు.

'శరీరాన్ని కష్టపెట్టడం సులభం. మనసును నిగ్రహించడం కష్టం'.

శరీరం పిచ్చిది. దాన్ని ఎలాగైనా హింస పెట్టవచ్చు. అదేమీ గొప్ప విషయం కాదు. ఆధ్యాత్మికంగా దానికి ఎలాంటి విలువా లేదు. నువ్వు జీవితాంతం గిరిప్రదక్షినాలు చేసినా నా దృష్టిలో దానికి దమ్మిడీ విలువ కూడా లేదు.

కాళ్లకు కాయలు కాయడం గొప్ప కాదు. అవి మనసుకు కాయాలి.

అప్పుడే మనిషి జన్మకు సార్ధకత !