“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

15, మార్చి 2023, బుధవారం

ఆరోవిల్ సౌండ్ గార్డెన్ సందర్శన

















ఆరోవిల్ లో ఉన్నపుడు ఒక రోజున సౌండ్ గార్డెన్  ను సందర్శించాం.

అక్కడ సప్తస్వరాలను పుట్టించే రకరకాల సంగీత పరికరాలను  తయారుచేసి అమ్ముతున్నారు. అక్కడున్న ఒక హాంకాంగ్ భక్తుడు మాకు వాటిని గురించి వివరించాడు. అలా వివరిస్తూ యోగచక్రాలకు సప్తస్వరాలకు సంబంధం ఉందని అతనన్నాడు. చూడబోతే ధ్యానసాధకుడిలాగే కనిపించాడు. చైనా జాతీయుడు.

అతని వివరణ అంతా అయిపోయాక పక్కకు పిలిచి ఇలా అడిగాను.

'మీరు అంతరిక నాదాన్ని విన్నారా?'

అతను ఎగాదిగా చూశాడు.

'లేదు' అన్నాడు.

నవ్వాను.

'మీరెన్నాళ్లనుంచీ ఇక్కడుంటున్నారు?'

'ఆరేళ్ళనుంచీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాధన చేస్తూ ఇక్కడే ఉంటున్నాను' అన్నాడతను.

'మీరు తైచీ, కిగాంగ్, జెన్ అభ్యాసం చేస్తారా?'

'లేదు నాకవి తెలీదు. నేను అరబిందో గారి ఇంటెగ్రల్ యోగ సాధకుడిని'అన్నాడు. 

'పోనీ ఒక విషయం చెప్పండి. ఇంటెగ్రల్ యోగా లో ఉన్నత స్థాయిలు అందుకున్న సాధకులు ఎవరైనా మీకు తెలుసా? పుస్తకాలు చదివి మాటలు చెప్పేవాళ్ళు కాదు. అనుభవజ్ఞానం ఉన్నవాళ్లు' 

ఆతను మళ్ళీ ఎగాదిగా చూశాడు.

'అనుభవం అంటే దానిని మాటల్లో చెప్పడం కష్టం కదా?' అన్నాడు.

'సరే వినండి. అరబిందో గారి యోగపరిభాషలోనే అడుగుతాను. ఓవర్ మైండ్, సూపర్ మైండ్ స్థాయిలను అనుభవంలో అందుకున్నవాళ్ళు మీకు తెలిసినవాళ్లలో ఎవరైనా ఉన్నారా?'

అతను తల అడ్డంగా ఆడించాడు.

'మీరు ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కలుసుకున్నట్లే' అన్నాడు.

అతని నిజాయితీ నాకు నచ్చింది.

'ఉత్తమాటలు చెప్పేవాళ్ళతో లోకమంతా నిండి ఉంది. సాధనానుభవాలలో ఔన్నత్యాలను అందుకున్నవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు' అని శ్రీ విద్యారహస్యం పుస్తకంలో పదేళ్లక్రితం  నేను వ్రాసిన మాటలు గుర్తొచ్చాయి.

'ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. థాంక్స్. నమస్తే' అని అతనితో చెప్పి 'పదండి పోదాం' అన్నాను శిష్యబృందంతో.