లోకపు రొచ్చులకూ
శోకపు ఉచ్చులకూ
లోపలి రోతలకూ
లోకుల కోతలకూ
అందని సీమకు అడుగులేద్దాం
పద నేస్తం
సమాజపు కట్టుబాట్లకూ
సనాతన సర్దుబాట్లకూ
సరాగపు వల్లెవాట్లకూ
సహాయపు వెన్నుపోట్లకూ
చిక్కని లోకానికి చేరుకుందాం
పద నేస్తం
మనుషుల మానసాలకూ
తలపుల పానశాలకూ
వలపుల పిలుపులకూ
కొలుపుల కలుపులకూ
చెందని తీరానికి సాగిపోదాం
పద నేస్తం
ఈ భూమివైపు చూడకుండా
ఏ లేమీ మనల్ని సోకకుండా
అంతమన్నది లేని కాంతిలోకంలో
వెలుగుదేహాలలో విహరిద్దాం
పద నేస్తం
జననమరణాల పరిధులు దాటి
కర్మవలయాల అవధులు మీటి
ఇద్దరం ఒక్కటిగా మారే
ఇంద్రధనుసులో నివాసముందాం
పద నేస్తం