“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

4, ఏప్రిల్ 2023, మంగళవారం

ఆశ్రమవాస పర్వం ప్రారంభం

కొంచం పని ఉండటంతో 31 ఉదయాన్నే జిల్లెళ్ళమూడి నుంచి గుంటూరు వచ్చేశాము. ఒకటో తేదీ చైత్ర శుక్ల ఏకాదశి, అమ్మ పుట్టినరోజు. ఆ రోజుకు జిల్లెళ్ళమూడిలో లేము. కారణం? భరించలేనంత సౌండ్ పొల్యూషన్. ఒకేసారి పది మైకులు మోగుతున్నాయి. పండుగ అంటే, మైకులు పెట్టి గోలచెయ్యడం ఒక్కటే నేడు ఇండియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎవరికీ సివిక్ సెన్స్ గాని, కామన్ సెన్స్ గాని కనిపించడం లేదు. 

ఈ కోణంలో చూస్తే అమెరికా ఒక స్వర్గమే అని చెప్పాలి. ప్రశాంతంగా,  ఎటువంటి చప్పుళ్ళు లేకుండా ఉండాలనుకునేవారికి అక్కడున్నంత సౌకర్యం ఇండియాలో లేదు.  ఒక కారు హారన్ సౌండు కూడా వినకుండా ఆర్నెల్లు అమెరికాలో ఉన్నాను. ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణం అన్నివైపులనుంచీ ధ్వని కాలుష్యం మీదపడి దౌర్జన్యం చేస్తోంది. ఏం చేస్తాం? కొన్ని కావాలంటే కొన్ని ఒదులుకోక తప్పదు మరి !

అనకూడదు గాని, జిల్లెళ్ళమూడి నుండి బయటకు రాగానే, ఒక్కసారిగా మైకుల గోల మాయమై, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నరకం నుంచి బయటపడిన ఫీలింగ్ కలిగింది.

అమ్మ ఉన్నప్పుడూ ఆమెను ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు ఈ భక్తులు. పోయిన తర్వాత కూడా ఆమెకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ భక్తుల పైనా, ఇండియా వ్యవస్థ పైనా చాలా చీదరేసింది. స్వర్గాన్ని నరకంగా మార్చడంలో ఇండియా ప్రజలు, వ్యవస్థలు ముందుంటాయి.

గుంటూరులో రెండు రోజులుండి పనులు చూసుకుని, ఈరోజున గుంటూరుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి ఒంగోలు దగ్గర చంద్రపాడు ఆశ్రమానికి వచ్చేశాము. అయిదుగురితో ఆశ్రమం మొదలైంది. 

ప్రస్తుతం ఇక్కడ నేల తప్ప ఏమీ లేదు. అయితేనేం? జనాల గోలకు, మైకుల గోలకు, వాహనాల రణగొణధ్వనులకు, దుమ్ముకు,  సిటీ వేడికి, వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండే మరోప్రపంచం ఇది. అయితే, అన్ని సౌకర్యాలకూ అలవాటు పడినవారు ఇక్కడ ఉండటం, అడవిలో ఉన్నట్లే ఉంటుంది. కానీ, మనుషులకు, వాళ్ళ నిమ్నత్వాలకు, ప్రపంచపు గోలకు దూరంగా బ్రతకాలనుకునే మాలాంటి కొంతమందికి మాత్రం ఇది స్వర్గమే.

ఏదేమైనా, ఏ విధమైన సౌకర్యాలూ లేకపోయినా, అవసరమైతే పొలం మట్టిలోనే పడుకోవలసి వచ్చినా, రేపటినుంచి ఇక్కడే ఉంటూ, ఒక నెలా రెండు నెలల్లో ఆశ్రమానికి ఒక ఆకారం తేవాలని సంకల్పించాను.

అయిదో తేదీ నుంచి, అయిదుగురితో పంచవటి ఆశ్రమం మొదలౌతోంది 

కొన్నేళ్ల నుంచీ నేను చెబుతూ వస్తున్న ఆశ్రమవాసపర్వం ఈ విధంగా ప్రారంభం అయింది.