మొన్నొకాయన నుంచి ఫోనొచ్చింది.
'నేను మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతాను. దుర్గామంత్రం జపిస్తుంటాను. జ్యోతిష్యం పెద్దగా రాదు, కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఈమధ్యన నేను చెప్పేవి నిజమౌతున్నాయి' అన్నాడాయన.
'సరే. ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి' అన్నాను
'మీతో పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను' అన్నాడు
'నాతో ఊరకే పరిచయం చేసుకుంటే మీకేంటి ఉపయోగం?' అడిగాను.
'ఊరకనే' అన్నాడు.
'ఊరకే పరిచయం చేసుకుంటే ఏమీ ప్రయోజనం లేదు. నేను మనుషులతో పరిచయాలు, సంబంధాలు తగ్గించుకునే పనిలో ఉన్నాను. మీరు రాంగ్ టైం లో వచ్చారు' అన్నాను.
'అంటే, జ్యోతిష్యం గురించి మీ దగ్గర కొన్ని నేర్చుకుందామని' అన్నాడు
'మీరు జ్యోతిష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటారా?' అడిగాను.
'అవును. తీసుకుంటాను. కానీ మానేద్దామని అనుకుంటున్నాను' అన్నాడు.
'సారీ. కమర్షియల్ జ్యోతిష్కులతో నేను మాట్లాడను. డబ్బులు తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నంత వరకూ మీకు అసలైన జ్యోతిశ్శాస్రం పట్టుబడదు. నాతో మీకు ఉపయోగమూ ఉండదు. పోతే, మాస్టర్ CVV మార్గం ఫాలో అవుతున్నంతసేపూ కూడా నాతో ఉపయోగం ఉండదు. ఈ రెండూ మీరు మానుకుని నా మార్గంలో నడవాలనుకుంటే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం నాతో మీకు ఉపయోగం సున్నా. ముందు నా పుస్తకాలు కొన్నైనా చదవండి. అప్పుడు నా మార్గమేంటో అర్ధమౌతుంది' అని చెప్పాను.
'సరేనండి ఉంటా' అన్నాడాయన.
'మంచిది' అంటూ ఫోన్ కట్ చేశాను.
శుద్ధంగా నా దారిలో నడిచేవారికే నా ఉపయోగం గాని, కాలక్షేపం కోసమో, కబుర్ల కోసమో, జ్యోతిష్య రహస్యాల కోసమో నాతో పరిచయం చేసుకుందామని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.
కమర్షియల్ జ్యోతిష్కులకు నాతో పనేంటి?
అదే విధంగా, వేరే గురువులను ఫాలో అయ్యేవారికి కూడా నాతో పనేంటి?
ప్రపంచపు గోల ఒద్దనుకునేవాడికి మనుషులతో పనేముంటుంది?