నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, ఆగస్టు 2023, గురువారం

ఆ రొచ్చు నాకొద్దు

యధావిధిగా మా ఫ్రెండ్ ఉదయాన్నే ఫోన్ చేశాడు.

నేను రిటైరయ్యాను. తనింకా సర్వీస్ లో ఉన్నాడు. ఇంకో నాలుగు నెలలలో తనూ రిటైర్ అవుతాడు.

ఆమాటా ఈ మాటా మాట్లాడాక, 'ఫలానా వాడి గురించి తెలిసిందా?' అని అడిగాడు.

ఈ ఫలానా అనే అతను కూడా నాతోబాటే రిటైరయ్యాడు.

నేను రైల్వే వదిలేసి ఏడాది దాటింది. సర్వీసులో ఉన్నప్పుడే ఆ రొచ్చు రాజకీయాలకు నేను దూరంగా ఉండేవాడిని. ఇక ఇప్పుడెందుకు? రైల్వే పక్షులతో నాకేంటి పని? పట్టించుకోవడం మానేశాను.

'ఏం పోయాడా?' అన్నాను.

'ఛీ అదేం కాదు. రిటైరయ్యాక, ఒక తెలిసినాయని పట్టుకుని ప్రెవేట్ ఉద్యోగంలో చేరాడు. హైద్రాబాద్ లో ఫ్రీ క్వార్ట్రర్స్. ఫ్రీ కారు. నెలకు లక్ష జీతం' అన్నాడు.

'మంచిదే' అన్నాను.

'నువ్వూ ట్రై చెయ్యచ్చుగా' అన్నాడు.

'నాకంత  పరిగెత్తాలని లేదు. నన్నిలా బ్రతకనీ' అన్నాను.

'అలాకాదు. ఊరకే కూచునే బదులు కాసేపు ఆఫీసుకి పోయి వస్తే లక్ష వస్తుంది కదా? ఎందుకు పోగొట్టుకోవడం?' అన్నాడు.

తను చెప్పేది వాస్తవమే. అలా చేస్తున్న వాళ్ళు మా కొలీగ్స్ లో చాలామంది ఉన్నారు.

'జీవితంలో అతని గోల్స్ వేరు. నా గోల్ వేరు. నేనేమీ ఊరకే కూచుని లేను. చేయవలసిన  సాధన ఎంతో ఉంది. జీవితమనేది ఒక్క డబ్బు కోసమే కాదు. చచ్చేదాకా డబ్బుకోసం నేను బ్రతకలేను. ఆ వెట్టిచాకిరీ నాకొద్దు. నీకు ఆశ ఉంటే నాలుగు నెలల తర్వాత నువ్వు ట్రై చెయ్యి' అన్నాను.

'ఊరకే చెప్పాను. నాకూ అంత అవసరం ఏమీ లేదులే' అన్నాడు.

'మంచిది. ఎవరి జీవితం వారిది. ఎవరి గోల్స్ వారివి. అందరూ  ఒకేలాగా ఎలా ఉంటారు? డబ్బుకు మితం ఎక్కడుంది? ఎక్కడో ఒకచోట 'ఇకచాలు' అంటూ నువ్వు గీత  గీసుకోక తప్పదు. లేకపోతే, ఆ పరుగులో ఏదో ఒకరోజున ఆఫీస్ టేబుల్ ముందే హార్ట్ ఎటాక్ తో పోవలసి వస్తుంది. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాం కదా మన సర్వీసులో. అలాంటి జీవితం నాకొద్దు. ఎందుకా బ్రతుకు?' అన్నాను.

'సర్లే నీ భావాలు అందరికీ నచ్చవు' అన్నాడు ఫ్రెండ్.

'నచ్చాలని నేనేమీ చెప్పడం లేదు. అలా ఆశించడమూ లేదు. కాస్త కళ్ళు తెరిచి జీవితాన్ని విశాలంగా చూడమని మాత్రమే అంటున్నాను. బావిలో కప్పలాగా చివరిక్షణం వరకూ డబ్బు, సుఖాలు అంటూ బ్రతకవద్దని మాత్రమే అంటున్నాను. అంతే' అన్నాను.

'ఉంటామరి' అని ఫోన్ పెట్టేశాడు ఫ్రెండ్.

నవ్వుకుంటూ నా పనిలో పడ్డాను.